అందరి చూపూ కొత్త ఐఫోన్ మీదే!
వాషింగ్టన్: ప్రపంచ మార్కెట్లో ఇప్పుడు అందరి చూపూ.. యాపిల్ సంస్థ కొత్తగా లాంచ్ చేయనున్న ఐఫోన్ మీదే ఉంది. కొన్ని నెలలుగా యాపిల్ అమ్మకాలు ఆశించిన మేర వృద్ధి సాధించకపోవడంతో ఈ కొత్త ఐఫోన్ యాపిల్ అమ్మకాలకు పునరుత్తేజాన్నిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
గత కొంత కాలంగా యాపిల్ ఐఫోన్ అమ్మకాలు క్రమంగా క్షీణిస్తున్న ఈ నేపథ్యంలో యాపిల్ స్టాక్స్ విలువ ఐబీఎమ్కు దగ్గరగా రావడం వాల్స్ట్రీట్ మార్కెట్ వర్గాలను నిరాశ పరిచింది. అయితే గత రెండు వారాలుగా యాపిల్ యాపిల్ షేర్ల విలువ 5 శాతం మేర పెరిగింది. యాపిల్ ఈ నెలలో లాంచ్ చేయనున్న కొత్త ఐఫోన్ను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మార్కెట్ను ఆకర్షించేలా తక్కువ కాస్ట్కు అందించనుందన్న వార్తలు ఈ షేర్ల విలువ పెరగటానికి దోహదం చేశాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ప్రజల అంచనాలకు అందనంత ఉత్తమమైన ఉత్పత్తులను యాపిల్ సంస్థ తీసుకొచ్చిన సందర్భాలున్నాయని, ఈ సారి కూడా అలాంటి ఆశ్చర్యం తప్పదని ఆపిల్ సంస్థలో 1 మిలియన్కు పైగా షేర్లు ఉన్న సైనోవాస్ ట్రస్ట్ కంపెనీ సీనియర్ పోర్ట్ ఫోలియో మేనేజర్ డేనియల్ మోర్గాన్ అన్నారు. మరి మార్కెట్ వర్గాల అంచనాలను యాపిల్ తన కొత్త ఐఫోన్తో అందుకుంటుందా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.