జూన్ నెలలో దేశ ఎగుమతులు 22 శాతం తగ్గిపోయినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. గూడ్స్ మార్కెట్లో భారత్ వాటా 2 శాతమే. ఐర్లాండ్ లాంటి చిన్న దేశాల కంటే ఇది తక్కువ. చైనా వాటా ఏకంగా 12.5 శాతం. ప్రపంచంలోని ఏ దేశానికైనా ఇది అత్యధికం. దేశంలోని చాలా పరిశ్రమలు స్థానిక అవసరాలు తీరి వస్తువులు అదనంగా ఉన్నప్పుడు మాత్రమే ఎగుమతుల గురించి ఆలోచిస్తున్నాయి. సహజ సిద్ధంగా ఎగుమతులకు మొగ్గు చూపడం లేదు. దేశం ఏదో ఒక భారీ ప్రాంతీయ వ్యాపార గ్రూపులో భాగంగా లేకపోవడం ఎగుమతులు పెరగకపోవడానికి మరో కారణం. అయితే ఐటీ, వ్యాపార సేవల విషయంలో మాత్రం చాలా మెరుగ్గా ఉన్నాం. ఇది సానుకూలాంశం.
విదేశాలతో వ్యాపారం చేయడం భారత్‌కు చాలా పాతవిద్య. ఆర్థిక వ్యవస్థ గణనీయంగా, వేగంగా క్షీణించిన వలస పాలకుల ఏలుబడిలోనూ చైనా సహా ఇతర ఇరుగు పొరుగు దేశాలతో విదేశీ వ్యాపారాన్ని కొనసాగించిన ఘనత మనది. అయితే శతాబ్దాల విదేశీ వ్యాపార అనుభవమున్నప్పటికీ పలు దశాబ్దాలుగా విదేశీ వ్యాపారం దేశ ఆర్థిక వ్యవస్థలో అతి బలహీనమైన లంకెలా మిగిలిపోయింది.
2022–23లో వర్తకపు సరుకుల ఎగు మతులు 45,000 కోట్ల డాలర్లకు చేరడంతో విదేశీ వ్యాపారం పరిస్థితి కొంత మెరుగైనట్లు కనిపించింది. కానీ ఈ రికార్డు స్థాయి వ్యాపారం కోవిడ్ తదనంతరం అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్లనే అని తేలింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వ్యాపారం మళ్లీ తగ్గి పోయింది. జూన్ నెలలో ఎగుమతులు 22 శాతం తగ్గిపోయినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మంద గమనానికి, అధిక ద్రవ్యోల్బణం, కఠినమైన ద్రవ్య విధానాలకు ఇది నిదర్శనం.
అయితే ఇక్కడ ఓ సానుకూల అంశం లేకపోలేదు. సేవల ఎగు మతులు ఇప్పటికీ పెరుగుతున్నాయి. ఈ విషయంలో భారత వాణిజ్యం ప్రతికూల పరిస్థితులను కాదని ముందుకు సాగుతున్నది. సమీప భవిష్యత్తులోనే కాకుండా దీర్ఘకాలంలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. సేవల రంగంలో భారత్ భాగస్వామ్యం రికార్డు స్థాయిలో 4.9 శాతానికి చేరుకున్నట్లు మోర్గన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక తెలియజేయడం చెప్పుకోవాల్సిన అంశం. ఇది ప్రధానంగా ఐటీ సేవల (46 శాతం) వల్లనే. దీంతోపాటు వ్యాపార సేవలు కూడా 24 శాతంతో తమదైన ముద్ర వేశాయి.
సేవల విషయంలో పరిస్థితి ఇలా ఉంటే, వస్తువుల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. వస్తువుల ఎగుమతులు అమెరికా, యూరప్ వంటి మార్కెట్ల డిమాండ్లపై అధికంగా ఆధారపడి ఉన్నాయి. గూడ్స్ మార్కెట్లో భారత్ వాటా కేవలం రెండు శాతం మాత్రమే. ఐర్లాండ్ లాంటి చిన్న దేశాల కంటే ఇది తక్కువ. మన పొరుగునే ఉన్న చైనా వాటా ఏకంగా 12.5 శాతం. ఒక దేశానికి సంబంధించి ప్రపంచంలోనే ఇది ఎక్కువ.
శేష ప్రశ్నలు ఎన్నో...
దేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశ్రమలు ఉన్నాయి. అంటే అంతర్జాతీయ వాణిజ్యంలో మన పాత్ర పెంచుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఎగుమతుల విషయంలో వెనుకబడి ఉండేందుకు కారణాలేమిటి? మొదటిది... దేశీ మార్కెట్ ఒకటి లేకపోవడం. దేశీ మార్కెట్ ఒకటి ఉండి ఉంటే స్థానిక చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు ఇక్కడే వ్యాపారం చేసుకునేందుకు వీలు ఏర్పడుతుంది. వ్యయ ప్రయాసలకు ఓర్చి విదేశీ మార్కెట్లను వెతుక్కునే శ్రమ తగ్గుతుంది. దేశంలో కొన్ని పరిశ్రమలు కేవలం ఎగుమతులపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాయి. వీటిల్లో కొన్ని సంప్రదాయ రంగాలకు చెందినవీ ఉన్నాయి. రెడీమేడ్ గార్మెంట్స్, హస్తకళలు, జ్యువెలరీ, రంగురాళ్లు వంటివి. వీటితోపాటు ఫార్మా, ఇంజినీరింగ్ వస్తువులు, రిఫైన్డ్ నూనె ఉత్పత్తులు కూడా పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే.
అయినప్పటికీ చాలా పరిశ్రమలు స్థానికంగా మార్కెట్ అవస రాలు తీరి వస్తువులు అదనంగా ఉన్నప్పుడు మాత్రమే ఎగుమతుల గురించి ఆలోచిస్తున్నాయి. ఇంకోలా చెప్పాలంటే స్థానిక పరిశ్రమలు సహజ సిద్ధంగా ఎగుమతులకు మొగ్గు చూపడం లేదన్నమాట. ఎగుమతులు పెరగకపోవడానికి రెండో లోపం... దేశం ఏదో ఒక భారీ ప్రాంతీయ వ్యాపార గ్రూపులో భాగంగా లేకపోవడం. ప్రపంచ వాణిజ్య సంస్థపై మనం చాలాకాలం ఆశలు పెట్టుకున్నాం. ఎదుగు తున్న మార్కెట్లకు కొన్ని లాభాలు అందిస్తుందని ఆశపడ్డాం. ఈ క్రమంలో ప్రాంతీయ లేదా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకునే సమయం కాస్తా మాయమైపోయింది.
ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగ స్వామ్యం (రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్ట్‌నర్షిప్–ఆర్సీఈపీ) నుంచి వైదొలగాలన్న నిర్ణయం కూడా ఆచితూచి తీసుకున్నదే. ఏదో ఒక దేశం ద్వారా చైనా తన చౌక వస్తువులను దేశంపై గుమ్మరిస్తుందన్న ఆందోళన కూడా ఉండింది. అయినా కూడా... ఇతర ప్రాంతీయ వాణిజ్య గ్రూపుల్లోకి చేరే దిశగా చాలాకాలం క్రితమే ప్రయత్నాలు చేసి ఉండాల్సింది.
ఉదాహరణకు... పదకొండు మంది సభ్యులున్న ‘కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్‌నర్షిప్’ (సీపీటీపీపీ). ఈ వ్యాపార వర్గంలో చేరి ఉంటే దేశ విదేశీ వ్యాపారం, ఎగుమతులు పెరిగేందుకు తగిన సహకారం లభించి ఉండేది. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఆస్ట్రేలియా, జపాన్, మలేసియాలు భాగస్వాములుగా ఉండి... అతి జాగ్రత్తగా చైనా లేకుండా చేసుకున్న వ్యాపార వర్గంలో చేరేందుకు భారత్ ప్రయత్నించాలి.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల విషయానికి వస్తే... యూరోపి యన్ యూనియన్‌తో చేసుకున్న ఒప్పందం పదేళ్లుగా అమల్లో లేకుండా పోయింది. భారత్‌కున్న అతి పెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైన ఈ ప్రాంతంతోనూ వాణిజ్య ఒప్పందం విషయమై ఇటీవలే చర్చలు మొదలయ్యాయి. అదృష్టవశాత్తూ దేశంలోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భాగం కావడం దేశ హితం కోసమే అన్న భావన ప్రబలుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియాలతో ఇలాంటి ఒప్పందాలు ఇటీవలే కుదరడం గమనార్హం. గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్, యునైటెడ్ కింగ్‌డమ్‌లతోనూ ఇదే తరహా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి.
మళ్లీ వెనక్కి?
యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ఏడేళ్లుగా స్తబ్ధుగా ఉంది. ఒప్పందం చేసు కోవడంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు చర్చలు ఒక్కటే మార్గమని ఇటీవలే గుర్తించి ఆ దిశగా ముందుకు కదులుతూండటం హర్షించదగ్గ విషయం. పర్యావరణం, లేబర్, డిజిటల్ వాణిజ్యం వంటి వాణిజ్యేతర అంశాలను కూడా ఇప్పుడు చర్చి స్తున్నారు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదిరితే చాలా లాభాలుంటాయి. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్ వంటి హైటెక్ దేశాల్లో మన దేశానికి చెందిన నిపుణులు పనిచేయడం సులువు అవుతుంది.
చివరగా... ఎగుమతులు మరింత జోరు అందుకునేందుకు ఉన్న ఇంకో అవరోధం ఇటీవలి కాలంలో పెరిగిపోయిన రక్షణాత్మక ధోరణులు. దిగుమతులకు సంబంధించి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. విదేశీ తయారీదారుల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు భారతీయులు ఇప్పుడు సిద్ధంగానే ఉన్నారు. స్థానికంగా పారిశ్రామిక రంగానికి సహాయం అవసరమని అనుకుంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల వంటివి ఉండనే ఉన్నాయి. దిగుమతి చేసుకునే వస్తువులు మరింత ఖరీదు చేయడం కంటే దేశీ తయారీ రంగం ఊపందుకునేందుకు ఈ ప్రోత్సాహకాలు సరిపోతాయి.
ఆత్మ నిర్భర్ భారత్ విధానం కూడా గతంలోని ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్(దిగుమతికి ప్రత్యామ్నాయం) విధానాన్ని గుర్తు చేస్తోంది. లైసెన్స్ రాజ్ కాలంలో ఇది చాలా ప్రధానమైందన్నది తెలిసిందే. దేశంలో ఇప్పటికే దిగుమతి సుంకాలు క్రమేపీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అవి చైనా, ఆగ్నేయాసియా దేశాల సుంకాలకు రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. ఈ పరిస్థితి మారితేనే భారత్ అంతర్జాతీయ వాణిజ్య విపణిలో కీలక పాత్ర పోషించగలుగుతుంది.
వ్యాసకర్త: సుష్మా రామచంద్రన్
ఆర్థిక వ్యవహారాల సీనియర్ జర్నలిస్ట్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment