ఏఐ రేసును గెలిచే మార్గం | Sakshi Guest Column On Artificial Intelligence | Sakshi
Sakshi News home page

ఏఐ రేసును గెలిచే మార్గం

Published Tue, Nov 19 2024 4:16 AM | Last Updated on Tue, Nov 19 2024 4:16 AM

Sakshi Guest Column On Artificial Intelligence

విశ్లేషణ

భారతదేశం కృత్రిమ మేధా శక్తి కేంద్రంగా అవతరించాలంటే మౌలిక సదుపాయాలు ఒక్కటే చాలవు, పరిశోధనా ప్రతిభ కూడా అవసరం. ఇటీవల ఇండియాలో పర్యటించిన మెటా చీఫ్‌ ఏఐ సైంటిస్ట్‌ యాన్‌ లెకూన్‌ దీన్నే నొక్కిచెప్పారు. అమెరికా సిలికాన్‌ వ్యాలీలోని అత్యుత్తమ ప్రతిభావంతుల్లో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే. కనీసం వారిలో కొందరినైనా వెనక్కు తేవాలి. వారు ఇక్కడ అభివృద్ధి చెందడానికి అవసరమైన వ్యవస్థను కల్పించాలి. ఇప్పుడు ఏఐలో ఫ్రాన్స్‌ కీలకంగా మారిందంటే దానికి కారణం, ఎక్కడెక్కడో పని చేస్తున్న ఫ్రెంచ్‌ ప్రతిభావంతులను తిరిగి ఫ్రాన్స్‌ వైపు ఆకర్షించేలా చేసిన వారి ఏఐ వ్యూహం. ఇది మనకు ప్రేరణ కావాలి.

ఎన్విడియా సంస్థకు చెందిన జెన్సన్‌ హువాంగ్, మెటా సంస్థకు చెందిన యాన్‌ లెకూన్‌ ఇటీవలి భారత్‌ సందర్శనలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)కు భారతీయ మార్కెట్‌ ప్రాముఖ్యాన్ని గురించి మాత్రమే నొక్కి చెప్పడంలేదు; భారతదేశం కృత్రిమ మేధా శక్తి కేంద్రంగా అవతరించాలన్నా, జాతీయ ఏఐ మిషన్  విజయవంతం కావాలన్నా ఏఐ మౌలిక సదుపాయాలు మాత్రమే సరిపోవు; అగ్రశ్రేణి కృత్రిమ మేధ పరిశోధనా ప్రతిభ అవసరం. 

మెటా సంస్థకు చెందిన చీఫ్‌ ఏఐ సైంటిస్ట్‌ యాన్‌ లెకూన్‌ తన పర్యటనలో భాగంగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ చెన్నై సహా పలు విద్యాసంస్థలలో ప్రసంగించారు. 2018లో ట్యూరింగ్‌ ప్రైజ్‌ విజేత అయిన లెకూన్, కృత్రిమ మేధ ఉత్పత్తి అభివృద్ధిపై మాత్రమే భారత్‌ దృష్టి పెట్టకుండా, ప్రపంచ కృత్రిమ మేధా పరిశోధనలో తన భాగస్వా మ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఏఐలో అత్యాధునిక పరిశోధన అవకాశాల కొరత, ‘బ్రెయిన్‌ డ్రెయిన్‌’ (పరిశోధకులు వేరే దేశాలకు వెళ్లిపోవడం) భారత్‌ తన సొంత ఏఐ నైపుణ్యాన్ని పెంపొందించు కోవడానికి ఉన్న ప్రాథమిక సవాళ్లని ఆయన ఎత్తి చూపారు.

ప్రతిభ అవసరం!
దీనికి విరుద్ధంగా, గత నెలలో జరిగిన ఎన్విడియా ఏఐ సదస్సులో రిలయెన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీతో వేదికను పంచు కున్న జెన్సన్‌ హువాంగ్‌ భారత్‌ సరసమైన కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను నిర్మించాలని నొక్కి చెప్పారు. అయితే, ఇండియా లోని అత్యున్నత స్థాయి పరిశోధనా ప్రతిభ గురించి ఆయన దాదాపుగా ప్రస్తావించలేదు. ఏఐ మౌలిక సదుపాయాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, భారత్‌ తన ‘నేషనల్‌ ఏఐ మిషన్‌’ (ఎన్‌ఏఐఎమ్‌)లో కంప్యూటర్‌ మౌలిక సదుపాయాలకు ఇచ్చిన ప్రాధాన్యతకు అనుగుణంగానే ఉంది. మిషన్‌ నిధులలో సగం వరకు దీనికే కేటాయించారు.

అర్థవంతమైన ఏఐ పరిశోధనకు కంప్యూటర్‌ కనీస అవసరం అని అంగీకరించాలి. జాతీయ ఏఐ మిషన్ లో భాగంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై దృష్టి సారించిన మూడు ఏఐ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఈఓ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియా ఇటీవల ప్రకటించింది. అలాగే ‘ఏఐ ఫర్‌ ఆల్‌’(అందరికీ కృత్రిమ మేధ) భావనపై దృష్టిని కేంద్రీకరించింది. అయితే, 10,000 జీపీయూ కంప్యూటర్‌ మౌలిక సదుపాయాలు, 3 సెక్టోరల్‌ సీఓఈలు మాత్రమే దేశంలో అత్యాధునిక ఏఐ పరిశోధనను సొంతంగా ప్రారంభించలేవు. రాబోయే నెలల్లో భారత్‌ జీపీయూలను పొందడంపై దృష్టి పెట్టినప్పటికీ, ఏఐలో పోటీ తత్వాన్ని పెంచే కీలకమైన అంశం నిర్లక్ష్యానికి గురవుతోంది.

జాతీయ ఏఐ మిషన్‌ తన మూలస్తంభాలుగా ప్రతిభ, నైపుణ్యా లను కలిగివుందనడంలో సందేహం లేదు. కానీ అగ్రశ్రేణి పరిశోధనా ప్రతిభను ఆకర్షించడం, ఉన్నదాన్ని నిలుపుకోవడం, శిక్షణ ఇవ్వడంపై భారతదేశ అవసరాన్ని ఇది నొక్కి చెప్పడం లేదు. బదులుగా, ఇది గ్రాడ్యుయేట్, పోస్ట్‌–గ్రాడ్యుయేట్‌ స్థాయిలలో కృత్రిమ మేధ పాఠ్యాంశాల సంఖ్యను, ప్రాప్యతను పెంచడంపై దృష్టి పెట్టే ఏఐ ఫ్యూచర్‌  స్కిల్స్‌ ప్రోగ్రామ్‌ను ఊహిస్తోంది.

ఫ్యూచర్‌స్కిల్స్‌ ప్రోగ్రామ్‌ ఏఐ పట్ల అవగాహనను, విద్యను పెంపొందించడంలో సహాయపడుతుంది. కానీ రాబోయే రెండు మూడేళ్లలో భారత్‌లో అత్యాధునిక ప్రతిభావంతుల సమూహాన్ని నిర్మించడంలో ఇది తోడ్పడదు. లెకూన్‌ ఎత్తి చూపినట్లుగా, ప్రస్తుతం ఏఐలో అత్యాధునిక ప్రతిభ లేకపోతే ఈ ఆటలో భారత్‌ విజయం సాధించలేదు.

ఫ్రాన్స్‌ విజయగాథ
ఉదాహరణకు లెకూన్‌ స్వదేశమైన ఫ్రాన్స్‌ను చూడండి. అమెరికా, చైనాలకు పోటీగా ఉన్న తమదైన ఏఐ శక్తిని ఫ్రాన్స్‌ కోల్పోతున్నట్లు అక్కడి నాయకులు గ్రహించారు. అందుకే తాజా ఏఐ టెక్‌ వేవ్‌ కార్య క్రమాన్ని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఫ్రెంచ్‌ ఏఐ వ్యూహం, ఎక్కడెక్కడో పని చేస్తున్న ఫ్రెంచ్‌ ప్రతిభా వంతులను తిరిగి ఫ్రాన్స్‌ వైపు ఆకర్షించడం చుట్టూ తిరుగుతుంది. 

గూగుల్‌ డీప్‌మైండ్, మెటాలో ఫండమెంటల్‌ ఏఐ రీసెర్చ్‌ (ఫెయిర్‌) బృందంతో కలిసి పనిచేసిన ఫ్రెంచ్‌ వ్యవస్థాపకులు కేవలం ఏడాది క్రితమే ఫ్రెంచ్‌ స్టార్టప్‌ అయిన మిస్ట్రాల్‌ను ప్రారంభించారు. ఇది ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ వేదికకు అగ్ర పోటీదారులలో ఒకటిగా నిలవడమే కాక, ఏఐ ప్రపంచంలో ఫ్రాన్స్‌ స్థానాన్ని ప్రధాన స్థాయికి తీసుకొచ్చింది.

ప్రపంచ వేదికపై ఫ్రాన్స్‌ ఈ విజయం వెనుక ఉన్న మరొక కారణాన్ని కూడా లెకూన్‌ ఎత్తి చూపారు. పదేళ్ల క్రితం ఫ్రాన్స్‌లో మెటా సంస్థకు చెందిన ఫెయిర్‌ జట్టును ఏర్పాటు చేశారు. ఇది చాలా మంది ఫ్రెంచ్‌ పరిశోధకులకు ఏఐ పరిశోధనను వృత్తిగా మలుచుకునేలా ప్రేరేపించింది. ఇదే మిస్ట్రాల్‌ వంటి ఫ్రెంచ్‌ ఏఐ స్టార్టప్‌ల విజయానికి దోహదపడిందని చెప్పారు.

నిలుపుకోవాల్సిన ప్రతిభ భారత్‌ కూడా ఇలాగే చేయాలి. సిలికాన్‌ వ్యాలీలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధనా ప్రతిభలో ఎక్కువ మంది భారతీయ మూలాలకు చెంది నవారే అన్నది సత్యం. ఒకట్రెండు ఉదాహరణలను చూద్దాం.  చాట్‌జీపీటీకి చెందిన ప్రధాన భాగమైన ట్రాన్స్‌ఫార్మర్‌లు వాస్తవానికి ‘అటెన్షన్‌ ఈజ్‌ ఆల్‌ యు నీడ్‌’ అనే గూగుల్‌ రీసెర్చ్‌ పేపర్‌లో భాగం.  

ఆ పేపర్‌ సహ రచయితలలో ఆశిష్‌ వాశ్వానీ, నికీ పర్మార్‌ ఇద్దరూ భారతీయ సంతతికి చెందినవారు. బిర్లా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నా లజీలో వాశ్వానీ బీటెక్‌ చేయగా, పుణె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ టెక్నాలజీలో పర్మార్‌ చదివారు. మద్రాస్‌ ఐఐటీ పూర్వ విద్యార్థి అరవింద్‌ శ్రీనివాస్‌ గతంలో ఓపెన్‌ఏఐలో పరిశోధకుడు. పెర్‌ప్లెక్సిటీ. ఏఐని ప్రారంభించారు. ఇది ప్రస్తుతం సిలివాన్‌ వ్యాలీలోని హాటెస్ట్‌ ఏఐ స్టార్టప్‌లలో ఒకటిగా పరిగణించబడుతోంది.

ఇలాంటి ప్రతిభను తిరిగి భారత్‌కు తేవాలి, లేదా ప్రతిభావంతులను నిలుపుకోవాలి. బెంగళూరు, గురుగ్రామ్, హైదరాబాద్, చెన్నై, ముంబై లేదా భారతదేశంలో ఎక్కడైనా అభివృద్ధి చెందడానికి అవస రమైన పరిశోధనా వ్యవస్థను కల్పించాలి. ఐఐటీ మద్రాస్‌ రీసెర్చ్‌ పార్క్‌లో చేసినట్లుగా, చిన్న ప్రదేశాల్లో కూడా అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థ ఈ రంగంలో అద్భుతమైన పురోగతికి, అనేక విజయ గాథలకు దారి తీస్తుంది. ఏఐకి కూడా అదే వ్యూహాన్ని వర్తింప జేస్తే అది ఇండియాను ప్రధాన ఏఐ కేంద్రంగా మలచగలదు.

అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్ కు ఏఐ ఒక మూలస్తంభంగా ఉండాలి. ప్రధాన భారతీయ కార్పొరేట్‌లతో పాటు, ప్రాథమిక పరిశోధన చేయడానికి, ఈ ప్రతిభను ఆహ్వానించగల కనీసం మూడు, నాలుగు ఏఐ ల్యాబ్‌లకు నిధులు సమకూర్చాలి. ఈ ల్యాబ్‌లకు జాతీయ ఏఐ మిషన్  కింద కొనుగోలు చేయడానికి ప్రతిపాదించిన కంప్యూట్‌–ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అధునాతన ఏఐ చిప్‌లతో సహా క్లిష్టమైన ఏఐ మౌలిక సదుపాయాలను అందించవచ్చు.

అయితే, ఏఐలో పరిశోధనా ప్రతిభ ఇప్పటికే భారతదేశంలో లేదని చెప్పడం లేదు. మన విశ్వవిద్యాలయాలు ఏఐ, సంబంధిత రంగాలలో గొప్ప పరిశోధకులను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. ఎన్వీడి యాతో సహా అనేక ప్రపంచ కంపెనీలు ఇక్కడున్న తమ ఏఐ ల్యాబ్‌ లలో వేలాది మంది భారతీయులను కలిగి ఉన్నాయి. ఈ పునాది, అత్యుత్తమ అగ్రశ్రేణి ఏఐ ప్రతిభను ఆకర్షించడం, దాన్ని నిలుపుకోవ డంతో సహా జాతీయ ఏఐ మిషన్  విజయంలో సహాయపడుతుంది. చాలా మంది అంచనాల ప్రకారం, కృత్రిమ మేధలో విజయ ఫలాలు చాలా మధురంగా ఉండగలవు.

అనిరుధ్‌ సూరి 
వ్యాసకర్త ‘ద గ్రేట్‌ టెక్‌ గేమ్‌’ రచయిత; ‘కార్నెగీ ఇండియా’ నాన్‌ రెసిడెంట్‌ స్కాలర్‌ (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement