‘కరోనా’కు మందు! మార్కెట్‌ ముందుకు... | World stock markets soar on coronavirus treatment hopes | Sakshi
Sakshi News home page

‘కరోనా’కు మందు! మార్కెట్‌ ముందుకు...

Published Fri, May 1 2020 5:36 AM | Last Updated on Fri, May 1 2020 5:36 AM

World stock markets soar on coronavirus treatment hopes - Sakshi

కరోనా వైరస్‌ చికిత్సలో అమెరికా గిలీడ్‌ ఔషధం సత్ఫలితాలు ఇస్తుండటంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. ఏప్రిల్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జోరుగా సాగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 57 పైసలు పుంజుకోవడం, పారిశ్రామిక రంగానికి మరో ప్యాకేజీని కేంద్రం ఇవ్వనున్నదన్న అంచనాలు  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను దశలవారీగా తొలగించనుండటం... ఈ అంశాలన్నీ సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్‌ 33,500 పాయింట్లపైకి, నిఫ్టీ 9,850 పాయింట్లపైకి ఎగబాకాయి. స్టాక్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 997 పాయింట్ల లాభంతో 33,718 పాయింట్ల వద్ద, నిఫ్టీ 307 పాయింట్లు ఎగసి 9,860 పాయింట్ల వద్ద ముగిశాయి.  

వారంలో నిఫ్టీ 8 శాతం అప్‌...
ఈ వారంలో సెన్సెక్స్‌ 2,390 పాయింట్లు, నిఫ్టీ 706 పాయింట్ల మేర లాభపడ్డాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 7.6 శాతం, నిఫ్టీ 7.7 శాతం చొప్పున ఎగిశాయి.  గత తొమ్మిదేళ్లలో ఈ రెండు సూచీలకు ఇది రెండో అత్యధిక వార లాభం. ఏప్రిల్‌ నెలలో సెన్సెక్స్‌ 13 శాతం, నిఫ్టీ 14 శాతానికి పైగా లాభపడ్డాయి. ఒక నెలలో నిఫ్టీ ఇంతగా లాభపడటం గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.   వాహన, చమురు, గ్యాస్, లోహ,  ఐటీ షేర్లు కూడా జోరుగా పెరిగాయి.  

► ఓఎన్‌జీసీ షేర్‌ 13.4 శాతం లాభంతో రూ.80 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
► ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు చెరో 3 శాతం ఎగిశాయి.  
► 30 సెన్సెక్స్‌ షేర్లలో నాలుగు–సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఏషియన్‌ పెయింట్స్, హెచ్‌యూఎల్‌లు మాత్రమే
నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లు లాభాల్లో ముగిశాయి.  
► దాదాపు 250కు పైగా షేర్లు అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్‌ కన్సూమర్, రిలయన్స్‌ క్యాపిటల్, ఐనాక్స్‌ విండ్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
► టాటా మోటార్స్‌కు చెందిన చైనా ప్లాంట్లలో 70 శాతం మేర ఉత్పత్తి మొదలైందని, రిటైల్‌ షోరూమ్‌లు కార్యకలాపాలు ప్రారంభించాయన్న వార్తలతో టాటా మోటార్స్‌ షేర్‌ 19 శాతం లాభంతో రూ.93 వద్ద ముగిసింది. ఈ షేర్‌తో పాటు ఇతర వాహన షేర్లు కూడా మంచి లాభాలు సాధించాయి.


4 రోజులు...రూ.7.68 లక్షల కోట్లు
గత 4 రోజుల లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.7.7 లక్షల కోట్ల మేర ఎగసింది. బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ. 7,68,168 కోట్లు ఎగసి రూ.129.41 లక్షల కోట్లకు చేరింది.

మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ట్రేడింగ్‌ జరగదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement