సెన్సెక్స్ 241 పాయింట్లు జూమ్
* ఎఫ్‌డీఐ సంస్కరణలు, ప్రపంచ మార్కెట్ల ప్రభావం
* రెగ్జిట్ ప్రభావాన్ని తొలగించిన బ్రెగ్జిట్
ముంబై: రిజర్వుబ్యాంక్ గవర్నర్ పదవికి ఈ సెప్టెంబర్ నుంచి గుడ్‌బై చెప్పనున్నట్లు రఘురామ్ రాజన్ ప్రకటించడంతో (రాజన్ ఎగ్జిట్-రెగ్జిట్) సోమవారం ఉదయం మార్కెట్ క్షీణించినప్పటికీ, వెనువెంటనే అంతర్జాతీయ మార్కెట్లతో కలసికట్టుగా ర్యాలీ జరిపాయి. 26,438 పాయింట్ల కనిష్టస్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్, ఆ స్థాయి నుంచి 400 పాయింట్లకుపైగా ఎగిసింది.
చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 241 పాయింట్ల పెరుగుదలతో 26,867 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 8,107 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి జోరుగా పెరిగి 8,238 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ సూచీ 68 పాయింట్లు లాభపడింది.
బ్రిటన్‌పై అనుకూల సర్వేల ఎఫెక్ట్..: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే (బ్రిటన్ ఎగ్జిట్-బ్రెగ్జిట్)ై అవకాశాలు సన్నగిల్లినట్లు తాజా సర్వేలు వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు జరిపిన రిలీఫ్ ర్యాలీ ప్రభావం మన మార్కెట్లపై పడిందని, దాంతో రాజన్ ఎగ్జిట్ ఆందోళనను ఇన్వెస్టర్లు తాత్కాలికంగా పక్కనపెట్టారని విశ్లేషకులు చెప్పారు. ఆసియాలో జపాన్,హాంకాంగ్, కొరియా, సింగపూర్, తైవాన్ సూచీలు 1-2% మధ్య పెరగ్గా, యూరప్‌లోని బ్రిటన్,జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు 3%పెగా ఎగిసాయి.
రేటింగ్ ఏజెన్సీల అభయం..: కొన్ని ప్రధాన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని సడలించడంతో మన మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిందని విశ్లేషకులు వివరించారు. ట్రేడింగ్ ప్రారంభంలో కనిష్టస్థాయి వద్ద దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా కొనుగోలు చేసినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. రాజన్ ఎగ్జిట్ కారణంగా ఇండియా సార్వభౌమ రేటింగ్‌కు ఇబ్బంది ఏదీ లేదంటూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ప్రకటించడం కూడా ఇన్వెస్టర్లను స్వాంతనపర్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఏవియేషన్ రంగంలో నూరుశాతం ఎఫ్‌డీఐకి అనుమతించడంతో జెట్ ఎయిర్‌వేస్, ఇంటర్‌గ్లోబ్ షేర్లు 7.36% వరకూ పెరిగాయి.