మరో 109 పాయింట్లు అప్
వరుసగా ఆరో నెలలోనూ పెరిగిన మార్కెట్
ముంబై: విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడంతో బుధవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ మరో 109 పాయింట్లు ర్యాలీ జరిపి 28,452 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో నిఫ్టీ 42 పాయింట్ల పెరుగుదలతో 8,786 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ రెండు సూచీలు వరుసగా ఆరో నెలలోనూ పెరగడం విశేషం. ఆగస్టు నెలలో సెన్సెక్స్ 401 పాయింట్లు, నిఫ్టీ 148 పాయింట్ల చొప్పున ర్యాలీ జరిపాయి. కీలకమైన జీడీపీ డేటా వెలువడనున్న నేపథ్యంలో కూడా భారీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో బుధవారం మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగిందని విశ్లేషకులు తెలిపారు.
వెలుగులో ఆటో షేర్లు: ఆగస్టు నెలకు అమ్మకాల డేటా గురువారం వెల్లడికానున్న సందర్భంగా ఆటోమొబైల్ షేర్లు వెలుగులో నిలిచాయి. హీరో మోటో కార్ప్ 2.13 శాతం, టాటా మోటార్స్ 1.73 శాతం చొప్పున ఎగిసాయి. బ్యాంకింగ్ షేర్లు సైతం మార్కెట్‌కు ఊతమిచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1 శాతంపైగా పెరిగి రికార్డు గరిష్టస్థాయి రూ. 1,291 వద్ద ముగి సింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐలు స్వల్పంగా ర్యాలీ జరిపాయి.
ఫెడ్ రేట్లు పెంచినా.. మా సెన్సెక్స్ లక్ష్యం 28,800: సిటి గ్రూప్
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచినా, ఈ సంవత్సరాంతానికి తమ సెన్సెక్స్ లక్ష్యమైన 28,800 స్థాయిని కొనసాగిస్తున్నట్లు సిటిగ్రూప్ ప్రకటించింది. ఫెడ్ వడ్డీ రేట్లు డిసెంబర్‌లో పెరగవచ్చని, అయితే భారత్ ఫండమెంటల్స్ మార్కెట్‌ను ముందుకు నడిపిస్తాయని విశ్లేషించింది.
20 శాతం పెరిగిన నిర్మాణ రంగ స్టాక్స్
నిర్మాణ రంగానికి చెందిన కంపెనీల స్టాక్స్ ధరలు బుధవారం 20 శాతం వరకూ పెరిగాయి. పరిశ్రమలోని మొండిబకాయిలు, ద్రవ్య లభ్యతకు సంబంధించిన పలు అంశాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం వల్ల స్టాక్ ధరలు ఎగశాయి. బీఎస్‌ఈలో హిందుస్తాన్ కన్‌స్ట్రక్షన్ షేరు 19.83 శాతం, గామన్ ఇండియా షేరు 16.55 శాతం, పుంజ్ లాయిడ్ షేరు 12 శాతం, యూనిటీ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ షేరు 11.14 శాతం, గామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరు 6.3 శాతం, కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ షేరు 2.86 శాతం ఎగశాయి.