పీ-నోట్స్ భయాలతో అమ్మకాలు
♦ మరో 98 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
♦ నిఫ్టీ 34 పాయింట్లు డౌన్
ముంబై: విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి మార్కెట్లో పెట్టుబడులకు ఉపయోగించే పార్టిసిపేటరీ నోట్స్ (పీ-నోట్స్) నిబంధనల్ని మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి కఠినతరం చేసిన నేపథ్యంలో శుక్రవారం అమ్మకాలు కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 98 పాయింట్ల క్షీణతతో 25,302 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 34 పాయింట్ల తగ్గుదలతో 7,750 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెబి వద్ద రిజిష్టరైన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐలు) ద్వారా మార్కెట్లో పెట్టుబడి చేయడానికి ఇతర ఇన్వెస్టర్లు ఈ పీ-నోట్స్‌ను ఉపయోగించుకుంటుంటారు.
ఈ క్లయింట్ల వివరాల్ని ఎఫ్‌ఐఐలు తప్పనిసరిగా తెలియచేయాలని, వారు ఇక్కడి యాంటీ-మనీలాండరింగ్ చట్టానికి కట్టుబడి వుండాలనే తదితర నిబంధనల్ని తాజాగా సెబి విధించింది. ఈ కారణంగా దేశీయ మార్కెట్ నుంచి నిధులు తరలివెళతాయన్న భయాలతో మార్కెట్లో అమ్మకాలు జరిగాయి. డాలరుతో రూపాయి మారకపు విలువ 67.44 స్థాయికి తగ్గడం, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ జూన్ నెలలో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు వంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపర్చిందని విశ్లేషకులు చెప్పారు.
లుపిన్ 9 శాతం పతనం...
ఫార్మా కంపెనీ లుపిన్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ, లాభాల స్వీకరణ కారణంగా ఈ షేరు 9 శాతం క్షీణించి రూ. 1,506 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30 షేర్లలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. తగ్గిన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహింద్రా, సిప్లాలు వున్నాయి.
బీహెచ్‌ఈఎల్ స్థానంలోకి పవర్‌గ్రిడ్...
బీఎస్‌ఈ సెన్సెక్స్-30 షేర్ల జాబితా నుంచి ప్రభుత్వ రంగ పవర్ ఎక్విప్‌మెంట్ కంపెనీ బీహెచ్‌ఈఎల్‌ను తప్పించి, మరో పీఎస్‌యూ పవర్‌గ్రిడ్‌ను చేరుస్తున్నారు. ఈ మార్పు జూన్ 20 నుంచి అమల్లోకి వస్తుంది.