మార్కెట్ పంచాంగం
రుతుపవనాల బలహీనత, సంస్కరణల బిల్లుల స్తంభన వంటి ప్రతికూల అంశాల్ని ఎదుర్కొంటూ గరిష్టస్థాయిలో మన మార్కెట్ స్థిరపడినా, నాటకీయంగా చైనా తన కరెన్సీని డీవాల్యూ చేయడంతో అన్ని ప్రపంచ సూచీలతో పాటు సెన్సెక్స్, నిఫ్టీలు కూడా పడిపోయాయి. అయితే వారాంతంలో ఒక్క భారత్ మార్కెట్ మాత్రమే పటిష్టంగా కోలుకోవడం విశేషం. కానీ చాలా వారాల తర్వాత క్రితం వారం విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకాలు జరపడం ఆందోళనకరం. వీరు తిరిగి నికర కొనుగోళ్లకు ఉపక్రమిస్తేనే మార్కెట్ మరింత పెరిగే అవకాశం వుంటుంది. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
గత మార్కెట్ పంచాంగంలో సూచించిన 28,130 పాయింట్ల స్థాయిని దిగువవైపుగా ఛేదించిన బీఎస్‌ఈ సెన్సెక్స్ అంచనాలకు అనుగుణంగా 27,480 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరిరోజైన శుక్రవారం పెద్ద ర్యాలీ జరపడంతో వారంలో నష్టాలను చాలావరకూ పూడ్చుకున్న సెన్సెక్స్ తుదకు 28,067 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగితే 28,420 పాయింట్ల వద్ద తొలి అవరోధం ఏర్పడవచ్చు. అటుపైన ముగిస్తే వేగంగా 28,580 వద్దకు చేరవచ్చు. గతవారం సెన్సెక్స్‌ను నిరోధించిన 28,420 పాయింట్లు, కొద్ది నెలలుగా అవరోధిస్తున్న 28,580 పాయింట్ల మధ్య శ్రేణిని బలంగా ఛేదిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఆపైన స్థిరపడితే కొద్ది రోజుల్లో 29,095 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. ఈ వారం ప్రస్తుత స్థాయి నుంచి లేదా పైన పేర్కొన్న నిరోధ శ్రేణి నుంచి వెనుదిరిగితే వెనువెంటనే 27,790 పాయింట్ల మద్దతుస్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున తిరిగి 27,400 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.
నిఫ్టీ నిరోధశ్రేణి 8,620-8,655
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,338 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమై, అటుతర్వాత వేగంగా 8,500 స్థాయిపైకి కోలుకోగలిగింది. చివరకు 46 పాయింట్ల నష్టంతో 8,519 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు నెలలుగా 8,300 పాయింట్ల సమీపంలో పలుదఫాలు మద్దతును 8,620-8,655 పాయింట్ల శ్రేణి వద్ద పదే పదే నిరోధాన్ని చవిచూస్తున్నందున, రానున్న వారాల్లో ఈ స్థాయిలు నిఫ్టీ దీర్ఘకాలిక ట్రెండ్‌కు ముఖ్యమైనవి. ఈ వారం ప్రస్తుత స్థాయి వద్ద నిఫ్టీ నిలదొక్కుకుంటే 8,620 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. అటుపైన 8,655 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. సమీప భవిష్యత్తులో ఈ స్థాయిని అధిగమిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ స్థాయిని దాటితే 8,760 పాయింట్ల స్థాయికి వేగంగా పెరగవచ్చు. అటుపైన స్థిరపడితే ఏప్రిల్ 15నాటి గరిష్టస్థాయి 8,845 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ప్రస్తుత స్థాయి వద్ద నిఫ్టీ స్థిరపడలేకపోతే 8,430 పాయింట్ల వద్దకు ఈ వారం క్షీణించవచ్చు. ఆ లోపున తిరిగి 8,320-8,370 పాయింట్ల మద్దతు శ్రేణి వద్దకు పతనం కావొచ్చు. ఆ లోపున 8,195 స్థాయికి క్షీణించే ప్రమాదం వుంది.
నిరోధ శ్రేణి 28,420-28,580
Published Mon, Aug 17 2015 12:54 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
Advertisement