మార్కెట్ పంచాంగం
అమెరికాలో జూన్ నెలలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు ఇటీవల ఊపందుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి మార్కెట్లో లాభాల స్వీకరణకు శ్రీకారం చుట్టినట్లు కన్పిస్తున్నది. దేశీయ మార్కెట్‌కు సంబంధించి, రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడం, పార్లమెంటులో బీమా బిల్లు ఆమోదం పొందడం వంటి రెండు సానుకూల వార్తలు ఈ నెలలోనే వెలువడ్డాయి. ఈ వార్తలు వచ్చిన రెండు సందర్భాల్లోనూ స్టాక్ సూచీలు గరిష్టస్థాయి నుంచి పతనమయ్యాయి.
అనుకూల సమయాల్లో జరుగుతున్న అమ్మకాలను లాభాల స్వీకరణగా పరిగణించవచ్చు. ఇన్వెస్టర్ల పెట్టుబడి శైలికి సంబంధించి ఇది సహజ పరిణామమే. ఆందోళనకారకం కాదు.
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...,
మార్చి 13తో ముగిసిన వారం తొలిరోజున 29,321 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరిరోజున 28,448 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 946 పాయింట్ల భారీనష్టంతో 28,503 పాయింట్ల వద్ద ముగిసింది. కొద్దివారాల నుంచి ఈ కాలమ్స్‌లో ప్రస్తావిస్తున్న 28,880-28,690 పాయింట్ల కీలక మద్దతుశ్రేణిని సెన్సెక్స్ కోల్పోయినందున, వెనువెంటనే ఈ శ్రేణిపైకి పెరగలేకపోతే, అమ్మకాల ఒత్తిడి కొనసాగే ప్రమాదం వుంటుంది. ఈ వారం 28,690 పాయింట్ల దిగువనే సూచీ స్థిరపడితే, వచ్చే కొద్దిరోజుల్లో క్రమేపీ 27,827 పాయింట్ల వరకూ తగ్గవచ్చు.
డిసెంబర్ 17 నాటి కనిష్టస్థాయి 26,469 పాయింట్ల నుంచి మార్చి 4నాటి రికార్డుస్థాయి 30,025 వరకూ జరిగిన ర్యాలీలో 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 27,827 పాయింట్లు. అమెరికా మార్కెట్ శుక్రవారం బలహీనంగా ముగిసిన ప్రభావంతో ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో భారత్ మార్కెట్ మొదలైతే 28,250 పాయింట్ల సమీపంలో తాత్కాలిక మద్దతు పొందవచ్చు. ఆ దిగువన 28,040 స్థాయివరకూ పతనం కావొచ్చు. ఆ లోపున క్రమేపీ పైన ప్రస్తావించిన 27,827 స్థాయికి తగ్గవచ్చు. తొలిస్థాయి వద్ద మద్దతు పొందగలిగితే 28,690 స్థాయివకరూ తొలుత పెరగవచ్చు. తదుపరి నిరోధస్థాయిలు 28,840, 28,970 పాయింట్లు. మార్కెట్లో తిరిగి అప్‌ట్రెండ్ నెలకొనాలంటే 29,184 స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటి ముగియాల్సివుంటుంది.
నిఫ్టీ తక్షణ మద్దతు 8,540
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,891 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 8,632 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమై చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 290 పాయింట్ల నష్టంతో 8,648 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం గ్యాప్‌డౌన్‌తో నిఫ్టీ ప్రారంభమైతే 8,540 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 8,470 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున క్రమేపీ 8,403 పాయింట్ల స్థాయికి (7,961 నుంచి 9,119 వరకూ జరిగిన ర్యాలీలో ఇది 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి) కొద్దిరోజుల్లో క్షీణించవచ్చు. ఈ వారం తొలిస్థాయి వద్ద మద్దతు పొందితే 8,670 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 8,755 స్థాయికి పెరగవచ్చు. అటుపైన 8,790 పాయింట్ల అవరోధస్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ తిరిగి అప్‌ట్రెండ్‌లోకి ప్రవేశించాలంటే 8,850 స్థాయిని అధిగమించి, స్థిరపడాల్సివుంటుంది.
28,690 దిగువన అమ్మకాల ఒత్తిడి
Published Mon, Mar 16 2015 1:27 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
Advertisement
Advertisement