సెన్సెక్స్.. క్రాష్ | Sensex plunges 556, Nifty 158 on earnings fears, sulky FIIs | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్.. క్రాష్

Published Tue, Apr 21 2015 12:44 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

సెన్సెక్స్.. క్రాష్ - Sakshi

సెన్సెక్స్.. క్రాష్

556 పాయింట్లు పతనం; 28 వేల దిగువన ముగింపు
నిఫ్టీ 158 పాయింట్లు డౌన్; 8448 వద్ద క్లోజ్
వెంటాడిన పన్ను భయాలు.. అమ్మకాల బాటలో ఎఫ్‌ఐఐలు
ఎగుమతుల్లో తీవ్ర క్షీణత ప్రభావం కూడా...
భారీగా పడిన రిలయన్స్, ఇన్ఫోసిస్ తదితర బ్లూచిప్స్

ఇన్నాళ్లూ దేశీ స్టాక్ మార్కెట్లకు వెన్నుదన్నుగా నిలుస్తున్న విదేశీ ఇన్వెస్టర్లకు కోపం వచ్చింది.

ఐటీ శాఖ జారీ చేసిన భారీ పన్ను నోటీసులతో ఆందోళన చెందుతున్న విదేశీ ఫండ్స్ ఎడాపెడా అమ్మకాలకు దిగడంతో సెన్సెక్స్ కుప్పకూలింది. ఏకంగా 556 పాయింట్లు దిగజారి... ‘బ్లాక్ మండే’గా మారింది. అంతేకాదు సెన్సెక్స్ మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోవడం మరో ప్రధానాంశం. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 158 పాయింట్లు క్షీణించింది. ప్రధానంగా రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి బ్లూచిప్స్ తీవ్రంగా నష్టపోవడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనత కూడా దేశీ సూచీలు దిగజారడానికి కారణాల్లో కొన్ని.
 
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు/ఎఫ్‌పీఐలు)కు పన్ను నోటీసుల భయాలు మార్కెట్‌ను వెంటాడాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 95 పాయింట్లకు పైగా లాభంతో ఆరంభమైన సూచీ... ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారిపోయింది. ఒకానొక దశలో 640 పాయింట్లు ఆవిరై.. 27,802 పాయింట్ల కనిష్ట స్థాయికి కూడా పడిపోయింది. చివరకు క్రితం ముగింపు 28,442తో పోలిస్తే 556 పాయింట్లు(దాదాపు 2 శాతం) క్షీణతతో 27,886 వద్ద సెన్సెక్స్ ముగిసింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనూ వరుసగా నష్టాల్లోనే కొనసాగుతున్న సూచీ.. మొత్తం 1,160 పాయింట్లు దిగజారడం గమనార్హం.

ఇక నిఫ్టీ కూడా భారీగా 1.83 శాతం(158 పాయింట్లు) నష్టపోయి 8,448 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 8,620-8,423 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిలను నమోదు చేసింది. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ షేర్లలో పెద్దయెత్తున లాభాల స్వీకరణ జరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
 
ట్రేడింగ్ ప్రధానాంశాలు...
బీఎస్‌ఈలో రియల్టీ సూచీ అత్యధికంగా 2.78 శాతం కుప్పకూలింది. ఆ తర్వాత భారీగా దిగజారిన వాటిలో ఎఫ్‌ఎంసీజీ(2.71%), క్యాపిటల్ గూడ్స్(2.17%), ఐటీ(2.08%), విద్యుత్(2.04%), చమురు-గ్యాస్(1.91%) రంగాలు ప్రధానంగా ఉన్నాయి.
బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచీ 2.17%, మిడ్‌క్యాప్ సూచీ 2.02 చొప్పున నష్టపోయాయి.
సెన్సెక్స్ జాబితాలోని 30 స్టాక్స్‌లో 28 నష్టాలతో ముగిశాయి. సన్ ఫార్మా(0.66%), ఐసీఐసీఐ బ్యాంక్(0.31%) స్వల్ప లాభాలను చవిచూశాయి.
గత శుక్రవారం ఫలితాలను ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు అత్యధికంగా 4.46 శాతం కుప్పకూలింది.
ఇక భారీగా నష్టపోయిన ఇతర షేర్లలో హీరో మోటోకార్ప్(3.96%), సిప్లా(3.03%), ఎంఅండ్‌ఎం(2.96%), యాక్సిస్ బ్యాంక్(2.94%), ఐటీసీ(2.97%), హెచ్‌డీఎఫ్‌సీ(2.69%), ఎల్‌అండ్‌టీ(2.51%), ఓఎన్‌జీసీ(2.47%), డాక్టర్ రెడ్డీస్(2.44%),  హెచ్‌యూఎల్ (2.43%) ఇన్ఫో సిస్(2.23%),  ఉన్నాయి.
బీఎస్‌ఈ నగదు విభాగంలో టర్నోవర్‌కూడా గత శుక్రవారంతో పోలిస్తే(రూ.3,457 కోట్లు).. భారీగా రూ.5,004 కోట్లకు ఎగబాకింది. ఇక ఎన్‌ఎస్‌ఈ క్యాష్ సెగ్మెంట్‌లో రూ.17,678 కోట్లు, డెరివేటివ్స్(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) విభాగంలో రూ,3,27,420 కోట్ల చొప్పున టర్నోవర్ జరిగింది.
 
రూ.1.59 లక్షల కోట్ల సంపద ఆవిరి
మార్కెట్ తీవ్ర పతనంతో ఇన్వెస్టర్ల సంపద కూడా భారీగా కరిగిపోయింది. సోమవారం ఒక్కరోజే స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(మొత్తం షేర్ల విలువ)లో రూ.1.59 లక్షల కోట్లు ఆవిరైంది. దీంతో బీఎస్‌ఈ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.102.64 లక్షల కోట్లకు తగ్గిపోయింది.
 
రూపాయి భారీ క్షీణత..
దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ కొనసాగడంతో దేశీ కరెన్సీ మారకం విలువ సోమవారం భారీగా క్షీణించింది. 55 పైసలు తగ్గి నెల రోజుల కనిష్టమైన 62.91 స్థాయికి పతనమైంది. ఒక్క రోజులో రూపాయి విలువ ఇంతగా క్షీణించడం 2015లో ఇదే మొదటిసారి. అటు అంతర్జాతీయంగా డాలరు బలపడుతున్న నేపథ్యంలో ఎగుమతిదారులు షార్ట్‌కవరింగ్‌కు దిగడం, ఇటు దేశం నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతుండటం తదితర అంశాలతో రూపాయిపై గణనీయంగా ఒత్తిడి పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. చివరిసారిగా మార్చి 13న డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 62.97 వద్ద క్లోజయ్యింది.
 
కారణాలేంటి...
ఎఫ్‌ఐఐలు తమ మూలధన లాభాలపై 20 శాతం కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) చెల్లించాల్సిందేనంటూ ఇటీవలే ఆదాయపు పన్ను శాఖ డిమాండ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. దీనిపై తామేమీ కల్పించుకోలేమంటూ మోదీ సర్కారు తేల్చిచెప్పడంతో విదేశీ ఇన్వెస్టర్లలో భయాందోళనలు తీవ్రమయ్యాయి. ఎఫ్‌ఐఐలు చెల్లించాల్సిన పన్ను బకాయిల మొత్తం రూ.40,000 కోట్లుగా అంచనా. మరోపక్క, కెయిర్న్, క్యాడ్‌బరీ వంటి కేసుల్లో రెట్రోస్పెక్టివ్ పన్ను(పాత కేసులు, లావాదేవీలకూ పన్ను విధింపు) నోటీసులు కూడా విదేశీ ఇన్వెస్టర్లలో ప్రతికూల సెంటిమెంట్‌కు కారణమవుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

సోమవారం ఎఫ్‌ఐఐలు నికరంగా రూ.1,500 కోట్లకుపైగా విలువైన షేర్లను అమ్మేసినట్లు ప్రాథమిక గణాంకాల్లో వెల్లడైంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఎఫ్‌ఐఐలు స్టాక్స్, బాండ్ మార్కెట్లలో రూ.83,000 కోట్లకు పైగానే నికరంగా పెట్టుబడులు పెట్టారు. దెబ్బతీసిన ఎగుమతుల డేటా: ఇదిలాఉంటే.. మార్చి నెలలో దేశీ ఎగుమతులు భారీగా 21 శాతం క్షీణించడం..

2014-15 ఏడాది ఎగుమతుల లక్ష్యానికి ఆమడదూరంలోనే(లక్ష్యం 340 బిలియన్ డాలర్లు.. సాకారమైంది 311 బిలియన్ డాలర్లే. 2013-14లో ఎగుమతులు 314 బిలియన్ డాలర్లు) నిలిచిపోవడం కూడా మార్కెట్లకు షాకిచ్చిందని ట్రేడర్లు పేర్కొంటున్నారు. దాదాపు ఆసియా ప్రధాన మార్కెట్లన్నీ నష్టాలతో ముగియడం.. నాలుగో త్రైమాసికంలో కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న ఆందోళనలు కూడా సెంటిమెంట్‌ను దిగజార్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం.
 
యూబీఎస్.. నిఫ్టీ అంచనాలు కట్
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ డిసెంబర్ కల్లా 9,600 పాయింట్లకు చేరుతుందన్న అంచనాలను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ 9,200 పాయింట్లకు తగ్గిం చింది.  వృద్ధి రికవరీ ఆశించిన దానికన్నా నెమ్మదిగా ఉండడమే దీనికి కారణమని వివరించింది. ఆర్‌బీఐ కీలర రేట్ల కోత, ముడి చమురు ధరలు తక్కువగా ఉండడం, సంస్కరణల వార్తలతో గత ఏడాది కాలంలో భారత మార్కెట్లు వృద్ధి పధంలో కొనసాగాయని యూబీఎస్ హెడ్(ఇండియా రీసెర్చ్) గౌతమ్ చౌహరియా పేర్కొన్నారు.

ఇక ఇప్పటి నుంచి కంపెనీల వాస్తవిక ఫలితాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలు ప్రభావం చూపుతాయన్నారు. వృద్ధి రికవరీ అంచనా వేసిన దానికంటే నెమ్మదిగా ఉండడం వల్లే నిఫ్టీ లక్ష్యాన్ని తగ్గించామని, ప్రస్తుతం వెలువడుతున్న కంపెనీల ఫలితాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement