ముంబై: ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు బలపడ్డాయి. సెన్సెక్స్ 345 పాయింట్లు జంప్‌చేసి 62,846 వద్ద ముగిసింది. నిఫ్టీ 99 పాయింట్లు ఎగసి 18,599 వద్ద నిలిచింది. యూఎస్ మార్కెట్లు పుంజుకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రభావంతో ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకే ఆసక్తి చూపారు. దీంతో మార్కెట్లు ఊగిసలాడినప్పటికీ లాభాల మధ్యే కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 524 పాయింట్లు పురోగమించి 63,026కు చేరింది.
వెరసి 63,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ సైతం 18,641 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సానుకూల సెంటిమెంటు నేపథ్యంలో మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,072 పాయింట్లు జమ చేసుకోగా.. నిఫ్టీ 313 పాయింట్లు లాభపడింది. దీంతో మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాల సమీపానికి చేరాయి. యూఎస్ రుణ పరిమితిపెంపునకు ఆదివారం సూత్రప్రాయ అనుమతి లభించడంతో ఇన్వెస్టర్లకు జోష్ వచ్చినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు.
ఎంఅండ్‌ఎం జూమ్
ఎన్‌ఎస్‌ఈలో కన్సూ్యమర్ డ్యురబుల్స్, మెటల్, బ్యాంకింగ్, ఆటో, రియల్టీ 0.6 శాతం స్థాయిలో బలపడితే.. ఆయిల్–గ్యాస్, ఐటీ 0.4 శాతం స్థాయిలో డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో క్యూ4 ఫలితాల అండతో ఎంఅండ్‌ఎం 3.4 శాతం ఎగసింది. ఇతర బ్లూచిప్స్‌లో టైటాన్, కోల్ ఇండియా, టాటా స్టీల్, అల్ట్రాటెక్, ఎస్‌బీఐ లైఫ్, గ్రాసిమ్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, ఇండస్‌ఇండ్, ఐటీసీ 2.6–1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఓఎన్‌జీసీ 3 శాతం పతనంకాగా.. దివీస్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, బీపీసీఎల్, బ్రిటానియా, అదానీ ఎంటర్, విప్రో 1.2–0.4 శాతం మధ్య క్షీణించాయి.
చిన్న షేర్లు..: బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,921 లాభపడగా.. 1,715 నష్టపోయాయి. ఇటీవల దేశీ స్టాక్స్‌పట్ల ఆసక్తి చూపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా నగదు విభాగంలో రూ. 1,758 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్ సైతం రూ. 854 కోట్ల విలువైన స్టాక్స్ సొంతం చేసుకున్నాయి. కాగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.2 శాతం నీరసించి 76.82 డాలర్లకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి స్వల్పంగా 4 పైసలు తగ్గి 82.63కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment