ప్రపంచ మార్కెట్లు పతనమైనా, మన మార్కెట్ మాత్రం గురువారం లాభపడింది. దీంతో మూడు రోజుల సెన్సెక్స్, నాలుగు రోజుల నిఫ్టీ నష్టాలకు బ్రేక్ పడింది. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు లాభపడటం కలసివచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసల (ఇంట్రాడేలో)మేర పతనమైనా, ముడి చమురు ధరలు 1 శాతం మేర(ఏడు వారాల కనిష్ట స్థాయికి) పతనం కావడం, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్‌ల క్యూ3 ఫలితాలు బాగా ఉండటం.... సానుకూల ప్రభావం చూపించాయి.
నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కారణంగా స్టాక్ సూచీల్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో 299 పాయింట్ల మేర లాభపడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 271 పాయింట్లు పెరిగి 41,386 పాయింట్ల వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 12,180 పాయింట్ల వద్ద ముగిశాయి.
ఆసియా మార్కెట్లకు ‘కరోనా’ దెబ్బ..
కరోనా వైరస్ చైనాలో మరింత ప్రబలడం, ఇతర దేశాల్లో కూడా ఈ వైరస్ సంబంధిత కేసులు వెలుగులోకి రావడంతో ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ సూచీలు 2.75% నష్టపోయాయి.
నేటి నుంచి ఐటీఐ ఎఫ్‌పీఓ
►ప్రభుత్వ రంగ ఐటీఐ కంపెనీ ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 28న పూర్తయ్యే ఈ ఎఫ్‌పీఓ ద్వారా రూ.1,400 కోట్లు సమీకరించనున్నది. ఈ ఇష్యూకు ప్రైస్‌బాండ్‌గా రూ.72–77ను కంపెనీ నిర్ణయించింది.
►ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్లలో (డెట్) విదేశీ పోర్టిఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ)ల పెట్టుబడుల పరిమితిని పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి మరిన్ని విదేశీ నిధులు రాబట్టడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment