సాక్షి, హైదరాబాద్ : గ్రూప్–2 పరీక్షలకు సంబంధించి జవాబుపత్రాల్లోని పార్ట్–ఏలో పొరపాట్లు దిద్దడం, వైట్‌నర్ వినియోగించడం వంటివి ఉన్నాయని.. పార్ట్–బిలో అలాంటివేవీ కనిపించలేదని హైకోర్టు నియమించిన ముగ్గురు సీనియర్ న్యాయవాదుల కమిటీ గుర్తించింది. ఈ మేరకు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. పార్ట్–ఏలో పొరపాట్లు చేసిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాల్సి ఉందని, కానీ వారి జవాబు పత్రాల మూల్యాంకనానికి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అనుమతి ఇచ్చిందని పేర్కొంది. 3,147 మంది అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసి పరిశీలించగా.. ఓఎంఆర్ షీట్లలోని పార్ట్–ఏలో 120 మంది పొరపాటు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ తేల్చిందని, వారంతా సర్టిఫికెట్ల ధ్రువీకరణకు ఎంపికయ్యారని వివరించింది. ఇలా పొరపాట్లు చేసినవారి సంఖ్య 120 మంది కంటే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది.
హడావుడిలో పొరపాట్లలా ఉన్నాయి..
పార్ట్–ఏలో బుక్‌లెట్, ప్రశ్నపత్రం, టెస్ట్‌బుక్ సిరీస్, రోల్ నంబర్లు తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని.. ఇందులో బబ్లింగ్ రెండు సార్లు చేయడం, అసలు బబ్లింగ్ చేయకపోవడం వంటి తప్పిదాల్ని గుర్తించామని కమిటీ తెలిపింది. అభ్యర్థులు హడావుడిలో పొరపాట్లు చేశారని అనిపిస్తోందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేశారా, ఎందుకు చేశారన్నదానిపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. ‘‘టాప్‌లో ఉన్న ఐదువేల మంది అభ్యర్థుల్లో ఇలాంటి పొరపాట్లు చేసినవారెవరైనా వివక్ష లేకుండా ఎంపిక చేశారు. ఆ తప్పులు అభ్యర్థి శక్తి సామర్థ్యాలను ప్రభావితం చేసేవిగా అనిపించడం లేదు. స్కానింగ్ ఏజెన్సీ గుర్తించేలా ఓఎంఆర్ జవాబు పత్రాలున్నాయి. అభ్యర్థుల పత్రాలు తారుమారు కాలేదు. ఓఎంఆర్ షీట్లలో టీఎస్‌పీఎస్సీ జోక్యం ఉన్నట్లు కనిపించలేదు. కొట్టివేతలు, దిద్దుబాట్లు సరిచేయాలంటే.. షార్ట్ లిస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల పత్రాలను నేరుగా పరిశీలన చేయాల్సిన అవసరముంది. కానీ అలా చేయలేదు..’’అని కమిటీ పేర్కొంది.
వైట్‌నర్ వివాదంతో..
గ్రూప్–2 పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓఎంఆర్ షీట్లలో వైట్‌నర్ వినియోగించారని, తప్పులు చేసిన అభ్యర్థులను కూడా ఎంపిక చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డి, ఇతరులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు.. ఆ జవాబు పత్రాల పరిశీలన కోసం ముగ్గురు సీనియర్ న్యాయవాదులు పి.శ్రీరఘురాం, ఆర్.రఘునందన్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డిలతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అభ్యర్థుల పత్రాలను పరిశీలించి హైకోర్టుకు నివేదిక అందజేసింది. దీనిపై శుక్రవారం విచారించిన న్యాయమూర్తి.. పిటిషనర్లు వాదనలు తెలియజేసేందుకు విచారణను 28వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment