తెలంగాణ గ్రూప్-2 ఆగింది..
- మూడు వారాలపాటు స్టే విధించిన హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రూప్-2 నియామక ప్రక్రియపై హైకోర్టు మూడువారాల పాటు స్టే ఇచ్చింది. ఈ మూడువారాల్లో ఎలాంటి ప్రక్రియ చేపట్టవద్దని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీచేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రూప్-2 రాతపరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన నేపథ్యంలో 1032 పోస్టులతో ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ జారీచేసింది. గత నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్-2 రాతపరీక్షకు 5.65 లక్షల మంది హాజరయ్యారు. ఇటీవల ఫలితాలు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ మూడువేల మందికిపైగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచింది. ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను చేపట్టింది. అయితే, గ్రూప్-2 పరీక్షల్లో పలు అక్రమాలు జరిగాయని, డబుల్ బబ్లింగ్ చేసిన అభ్యర్థులను, వైట్‌నర్ ఉపయోగించిన వారు సైతం ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారని ఆరోపణలు వచ్చాయి. కొన్ని ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలన నిలిపివేయాలని, ఎలాంటి ప్రక్రియ చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది.