‘గ్రూప్–2’పై హైకోర్టు స్టే
3 వారాలపాటు నియామకాలు నిలిపేయాలని టీఎస్‌పీఎస్‌సీకి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ)గ్రూప్–2 నియామకపు ప్రక్రియపై ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది. మూడు వారాలపాటు నియామకపు ప్రక్రియ చేపట్టొద్దని టీఎస్‌పీఎస్‌సీని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అనర్హులకు మెరిట్ జాబితాలో స్థానం కల్పించారని, నియామకపు ప్రక్రియలో లోపాలున్నాయని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన వి.రామచంద్రారెడ్డి, పి.శ్రీచరణదాస్ మరో 34 మంది వేర్వేరుగా రెండు వ్యాజ్యాలను హైకోర్టులో దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వి.సురేందర్‌రావు, న్యాయవాది బి.రచనారెడ్డిలు వాదనలు వినిపించారు. ఓఎంఆర్ షీట్‌లో రెండుసార్లు దిద్దడం (డబుల్ బబ్లింగ్), వైట్‌నర్ వాడటానికి వీల్లేదని, ఈ విషయంలో టీఎస్‌పీఎస్‌సీ స్పష్టమైన నిబంధనలు జారీ చేసిందని వారు కోర్టుకు నివేదించారు. ఈ నిబంధనల ప్రకారం కొందరి జవాబుపత్రాలను మూల్యాంకనం చేయలేదని, దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. డబుల్ బబ్లింగ్, వైట్‌నర్ వాడినవారిలో 10 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 24న కొట్టేసిందని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం వీరంతా అనర్హులని, అయినా కూడా వీరి పేర్లు మెరిట్ జాబితాలో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీని వల్ల అర్హులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు నివేదించారు. పరీక్షలకు జబ్లింగ్ పద్ధతిని కూడా అనుసరించలేదని అన్నారు. దీనిని బట్టి ఈ నియామకపు ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగినట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మూడు వారాలపాటు నియామకపు ప్రక్రియను ఆపేయాలని టీఎస్‌పీఎస్‌సీని ఆదేశించారు.
గ్రూపు–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా
గ్రూపు–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినందునా ఈ నెల 13 నుంచి 24వ తేదీ వరకు జరగాల్సిన వెరిఫికేషన్‌ను వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 1,032 పోస్టుల భర్తీకి గత నవంబర్‌లో నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ ఈ నెల 1న ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో 1:3 చొప్పున అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపిక చేసింది. మొత్తంగా 3,147 మందిని ఈ వెరిఫికేషన్‌కు పిలిచింది. ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్ చాపల్‌రోడ్డులోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు షెడ్యూలు జారీ చేసింది. ఈ క్రమంలో సోమవారం వెరిఫికేషన్ నిర్వహించింది. అయితే, వెరిఫికేషన్‌కు ఎంపిక కాని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.