2016 నుంచి సీఏ కొత్త సిలబస్
ఐసీఏఐ ప్రెసిడెంట్ కె.రఘు
* అంతర్జాతీయ ప్రమాణాలతో కరికులమ్
* మహిళా సీఏల కోసం ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్..
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి టాస్క్‌ఫోర్స్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుతున్న అకౌంటింగ్ నిబంధనలు, పన్ను చట్టాలకు అనుగుణంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ సిలబస్‌ను రూపొందిస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. 2016 కల్లా కొత్త కరికులమ్‌ను ప్రవేశపెడుతున్నామని, దీనికి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ కె.రఘు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త సిలబస్ ఉంటుందన్నారు. శనివారం ఐసీఏఐ ‘కంపెనీల చట్టం, ప్రత్యక్ష పన్నులు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన రఘు విలేకరులతో మాట్లాడారు.అంతర్జాతీయంగా చార్టర్డ్ అకౌంటెంట్స్‌కి అధిక డిమాండ్ ఉందని, ఇక్కడ కోర్సు పూర్తి చేసిన వాళ్లకి విదేశాల్లో అధిక జీతాలకు ఉద్యోగాలు లభిస్తున్నయన్నారు.
గతేడాది పరీక్ష రాసిన వాళ్లలో కేవలం ఏడు శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారంటే ఈ కోర్సు ఎంత కఠినమైనదో అర్థం చేసుకోవచ్చని, అందుకే ఇక్కడ ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రారంభ వేతనంగా ఏడు లక్షల నుంచి గరిష్టంగా రూ. 21 లక్షల వరకు పొందుతున్నారన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా 20 కేంద్రాల్లో క్యాంపస్ నియామకాలు జరిపామని, బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఐటీ, ఈకామర్స్ రంగాల నుంచి డిమాండ్ బాగుందన్నారు. విద్యార్థులకు మెరుగైన సేవలను అందించే విధంగా క్లౌడ్ క్యాంపస్, 120 రీడింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రఘు తెలిపారు.
ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్
ప్రాక్టీసులో ఉన్న మహిళా సభ్యులు కుటుంబ బాధ్యతల వల్ల వృత్తికి దూరమవుతున్నారని, వీరు ఇంటి దగ్గర నుంచే సేవలను అందించే విధంగా ‘ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 40,000 మంది మహిళా సీఏలు ఉండగా ఈ పోర్టల్ ఇప్పటి వరకు రెండు వేల మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వీరి సేవలను ఉపయోగించుకోవడానికి 150 కంపెనీలు ముందుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు.
త్వరలో కంపెనీల చట్టంలో సవరణలు
కొత్త కంపెనీల చట్టంలో సీఏలకు ప్రతికూలంగా ఉన్న కొన్ని నిబంధనలను మార్చడానికి కేంద్రం అంగీకరించిందని, దీనికి సంబంధించి వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సవరణలు జరగొచ్చన్నారు. ముఖ్యంగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ 20కి మించి కంపెనీల్లో పనిచేయకూడదన్న నిబంధనలో ప్రైవేటు కంపెనీలకు మినహాయించడానికి ప్రభుత్వం అంగీకరించిందని, అలాగే ఆడిట్ రొటేషన్, ఫ్రాడ్ రిపోర్టింగ్ నిబంధనలను కూడా సవరించడానికి అంగీకరించినట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రీ బడ్జెట్ మెమొరాండం తుది దశలో ఉందని, ఈ నెలాఖరుకి కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి ఇవ్వనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఏపీ కోసం టాస్క్ ఫోర్స్
కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సూచనలు సలహాలను ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రఘు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, జనధన యోజన పథకాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.