న్యూఢిల్లీ: భారత్‌లో విదేశీ సీఏలను ప్రాక్టీస్‌కు అనుమతించే అంశం భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉండాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. యూకే, కెనడా దేశాలు తమ దగ్గర భారత సీఏలు ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతిస్తేనే ఆయా దేశాల సీఏలు కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు (రెసిప్రొకల్) అనుమతించవచ్చని పేర్కొంది.
యునైటెడ్ కింగ్‌డం (యూకే), కెనడాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (ఎఫ్‌టీఏ) జరుగుతున్న చర్చల్లో ఈ అంశం కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ ఇది సాకారమైతే తొలిసారిగా భారత్‌లో విదేశీ చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ప్రాక్టీసు చేసేందుకు వీలవుతుంది. ఆస్ట్రేలియాతో కూడా ఈ తరహా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. రెసిప్రోకల్ సిస్టమ్ అమల్లోకి వచ్చాక విదేశీ సీఏలు భారత్‌లో కార్యకలాపాల నిర్వహణ కోసం ఐసీఏఐలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
యూకే, కెనడా, ఆ్రస్టేలియా మొదలైనవి అభివృద్ధి చెందిన దేశాలని, అక్కడి వారిని ఇక్కడ అనుమతిస్తే, ఇక్కడి సీఏలు కూడా అక్కడికి వెళ్లడానికి వీలుంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. వర్ధమాన దేశమైన భారత్ సీఏలు అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లే అవకాశం లభించడం వల్ల మనవారికి ప్రయోజనకరంగా ఉండగలదని చెప్పా రు. సామర్థ్యాలు, అనుభవం కారణంగా భారతీయ సీఏలకు విదేశాల్లో గణనీయంగా డిమాండ్ ఉందన్నారు.
మరోవైపు, స్థూల దేశీయోత్పత్తిలో పన్ను వాటాల నిష్పత్తిని మెరుగుపర్చేందుకు కేంద్రానికి సిఫార్సులు చేయనున్నట్లు అగర్వాల్ తెలిపారు. అటు కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సీఏలకు గణనీయంగా సమయం ఆదా కాగలదని చెప్పారు. ప్రస్తుతం 42,000 మంది పైచిలుకు భారతీయ సీఏలు విదేశాల్లో పని చేస్తున్నారు. ఐసీఏఐ అంచనా ప్రకారం వచ్చే 20–25 ఏళ్లలో 30 లక్షల మంది పైగా చార్టర్డ్ అకౌంటెంట్లు అవసరమవుతారు. ఐసీఏఐలో ప్రస్తుతం 4 లక్షల మంది సభ్యులు, 8.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment