Ranjith Kumar
-
భారత్‌లో యూకే, కెనడా సీఏల ప్రాక్టీస్
న్యూఢిల్లీ: భారత్‌లో విదేశీ సీఏలను ప్రాక్టీస్‌కు అనుమతించే అంశం భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉండాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. యూకే, కెనడా దేశాలు తమ దగ్గర భారత సీఏలు ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతిస్తేనే ఆయా దేశాల సీఏలు కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు (రెసిప్రొకల్) అనుమతించవచ్చని పేర్కొంది. యునైటెడ్ కింగ్డం (యూకే), కెనడాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (ఎఫ్‌టీఏ) జరుగుతున్న చర్చల్లో ఈ అంశం కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ ఇది సాకారమైతే తొలిసారిగా భారత్‌లో విదేశీ చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ప్రాక్టీసు చేసేందుకు వీలవుతుంది. ఆస్ట్రేలియాతో కూడా ఈ తరహా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. రెసిప్రోకల్ సిస్టమ్ అమల్లోకి వచ్చాక విదేశీ సీఏలు భారత్‌లో కార్యకలాపాల నిర్వహణ కోసం ఐసీఏఐలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. యూకే, కెనడా, ఆ్రస్టేలియా మొదలైనవి అభివృద్ధి చెందిన దేశాలని, అక్కడి వారిని ఇక్కడ అనుమతిస్తే, ఇక్కడి సీఏలు కూడా అక్కడికి వెళ్లడానికి వీలుంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. వర్ధమాన దేశమైన భారత్ సీఏలు అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లే అవకాశం లభించడం వల్ల మనవారికి ప్రయోజనకరంగా ఉండగలదని చెప్పా రు. సామర్థ్యాలు, అనుభవం కారణంగా భారతీయ సీఏలకు విదేశాల్లో గణనీయంగా డిమాండ్ ఉందన్నారు. మరోవైపు, స్థూల దేశీయోత్పత్తిలో పన్ను వాటాల నిష్పత్తిని మెరుగుపర్చేందుకు కేంద్రానికి సిఫార్సులు చేయనున్నట్లు అగర్వాల్ తెలిపారు. అటు కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సీఏలకు గణనీయంగా సమయం ఆదా కాగలదని చెప్పారు. ప్రస్తుతం 42,000 మంది పైచిలుకు భారతీయ సీఏలు విదేశాల్లో పని చేస్తున్నారు. ఐసీఏఐ అంచనా ప్రకారం వచ్చే 20–25 ఏళ్లలో 30 లక్షల మంది పైగా చార్టర్డ్ అకౌంటెంట్లు అవసరమవుతారు. ఐసీఏఐలో ప్రస్తుతం 4 లక్షల మంది సభ్యులు, 8.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. -
సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు..
సాక్షి, ఢిల్లీ: స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై వాదనలను మంగళవారానికి ధర్మాసనం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఏదో ఒక బెంచ్ ఈ పిటిషన్‌పై విచారిస్తుందని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. వాడీ-వేడి వాదనలు.. కాగా, చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా.. క్వాష్ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని సీజేను కోరారు. ఈ సమయంలో క్వాష్ పిటిషన్‌ను అనుమతించవద్దని సీఐడీ లాయర్లు సీజేను కోరారు. ఈ కేసులో లోతైన విచారణ జరగాలని సీఐడీ తరఫున రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. చంద్రబాబు లాయర్ లాథ్రా వాదనలు వినిపిస్తూ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారించకుండా అడ్డుకోవాలని కోరారు. ఈ సందర్బంగా సీజేఐ.. ఏసీబీ కోర్టు విచారణ, పోలీసు కస్టడీ విచారణను తాము అడ్డుకోలేమన్నారు. ఈ పిటిషన్‌పై ఏదో ఒక బెంచ్ మంగళవారం విచారిస్తుందని స్పష్టం చేశారు. అంతకుముందు.. చంద్రబాబు సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు.. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : మీకు ఏం కావాలి? సిద్ధార్థ్ లూథ్రా : చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరపాలి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబుకు రిలీఫ్ కావాలంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి సిద్ధార్థ్ లూథ్రా : FIRలో పేరు లేకుండా అరెస్ట్ చేశారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : అక్టోబర్ 3న ఈ కేసును ఏదో ఒక బెంచ్ కు కేటాయిస్తాం సిద్ధార్థ్ లూథ్రా : 17A సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : ACB కోర్టు విచారణ జరుపుతున్న ఇలాంటి కీలక సమయంలో మేం దర్యాప్తును అడ్డుకోలేం. సిద్ధార్థ్ లూథ్రా : కనీసం CIDకి కస్టడీ ఇవ్వకుండా ఆదేశాలివ్వండి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబు నాయుడిని పోలీస్ కస్టడీ ఇవ్వొద్దన్న ఆదేశాలను ఈ సమయంలో ఇవ్వలేం. ఈ కేసును అక్టోబర్ 3, 2023, మంగళవారానికి వాయిదా వేస్తున్నాం సుప్రీంకోర్టులో CID వాదనలు ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున లాయర్ రంజిత్ కుమార్ వాదనలు ► స్కిల్ స్కాం కుట్ర, కుంభకోణం పరిధి చాలా పెద్దవి ► రూ.3300 కోట్ల ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు ► దీంట్లో 90% గ్రాంటు కింద సీమెన్స్ ఇస్తుందని చెప్పారు ► ప్రభుత్వం కేవలం 10% పెడితే చాలంటూ నిధులు విడుదల చేశారు ► ఇక్కడ కథ మలుపు తిరిగింది, 90% మాయమయింది ► ఈ 10% నిధులు మాత్రం ముందుకెళ్లిపోయాయి ► 17A చట్టం సవరణ కంటే ముందే నేరం జరిగింది ► ప్రస్తుత పరిస్థితుల్లో దర్యాప్తును సజావుగా సాగనివ్వాలి ► చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కు విజ్ఞప్తి చేసిన లాయర్ రంజిత్ "నాట్ బిఫోర్ మీ" ఎందుకంటే.. చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాగానే.. న్యాయమూర్తి భట్టి ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు. నాట్ బిఫోర్ మీ అంటూ నిరాసక్తత వ్యక్తం చేసారు. దీంతో, చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని కోరారు. కానీ, మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకొని తన సహచర న్యాయమూర్తి భట్టి సుముఖంగా లేకపోవటంతో ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. ► జస్టిస్ SVN భట్టి పూర్తి పేరు సరస వెంకట నారాయణ భట్టి ► 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా సేవలందించిన జస్టిస్ భట్టి ► 14 జులై 2023 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తోన్న జస్టిస్ భట్టి ► ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మ్యాటర్ కాబట్టి ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని ప్రకటించిన జస్టిస్ భట్టి ► జస్టిస్ భట్టి నిర్ణయాన్ని గౌరవించాలని సూచించిన జస్టిస్ ఖన్నా. చంద్రబాబు పిటిషన్ వాయిదా ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వాయిదా ► పిటిషన్‌పై వాదనల కంటే ముందే ప్రకటన చేసిన జస్టిస్ ఖన్నా జస్టిస్ ఖన్నా : మా సహచరుడు జస్టిస్ SVN భట్టి ఈ కేసుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు హరీష్ సాల్వే : వీలయినంత తొందరగా విచారణకు వచ్చేలా చూడగలరు జస్టిస్ ఖన్నా : వచ్చే వారం చూద్దాం సిద్ధార్థ లూథ్రా ఒక సారి చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్తాను జస్టిస్ ఖన్నా : మీరు కలవొచ్చు. ప్రస్తుతానికి ఈ కేసు వాయిదా వేస్తున్నాను హరీష్ సాల్వే : వాయిదా వేయడం ఒక్కటే మార్గం కాదు జస్టిస్ ఖన్నా : చీఫ్ జస్టిస్‌ను కలిసి మరో బెంచ్ ముందు వాదనలు వినిపిస్తానని లూథ్రా అంటున్నారు హరీష్ సాల్వే : సోమవారం వాదనలకు అవకాశం ఇవ్వండి జస్టిస్ ఖన్నా : సోమవారం అవకాశం లేదు. వచ్చే వారం తప్పకుండా వింటాం సిద్ధార్థ లూథ్రా : ఒక అయిదు నిమిషాలు నాకు సమయం ఇవ్వండి జస్టిస్ ఖన్నా : సరే, నేను ఆర్డర్ పాస్ చేస్తున్నాను. జస్టిస్ ఖన్నా : "ప్రస్తుతం బెంచ్ ముందు ఉన్న ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వచ్చే వారం విచారణకు స్వీకరిస్తాం. ఆ బెంచ్‌లో మా సహచరుడు SVN భట్టి ఉండేందుకు సుముఖంగా లేరు కాబట్టి మరో జడ్జితో కలిసి ఈ కేసును విచారిస్తాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తుది ఆదేశాలకు లోబడి ఈ ఆర్డర్ వర్తిస్తుంది". ► రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు. ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. -
అడుగు జాడలు
బాలానగర్ పోలీసు స్టేషన్.మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది. అప్పుడే స్టేషన్లో అడుగు పెడ్తున్న ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్‌కు తన టేబుల్ మీదున్న ఫోన్ రింగవడం వినబడింది. గబగబా వెళ్ళి ఫోన్ ఎత్తాడు. ‘‘హల్లో.. అయాం ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్’’ అన్నాడు కుర్చీలో కూర్చుంటూ..‘‘హల్లో సార్.. నేను పంకజ్ సేఠ్‌గారి వంట మనిషిని మాట్లాడుతున్నాను. మా అయ్యగారు నేల మీద పడి ఉన్నారు సార్. పిలిస్తే పలకడం లేదు. చనిపోయినట్టు అనుమానంగా ఉంది సార్’’ అంటూ భయం భయంగా చెప్పాడు అవతలి వ్యక్తి.పంకజ్ సేఠ్ అంటే బాలానగర్ పరిసరాల్లో తెలియని వారు అరుదు. అతడు లైసెన్స్ కలిగిన వడ్డీ వ్యాపారి. నగలు తాకట్టు పెట్టుకుని డబ్బులు వడ్డీకిస్తూ ఉంటాడు. ‘‘నీ పేరు’’ అడిగాడు రంజిత్‌కుమార్. ‘‘మస్తాన్ సార్..’’ ‘‘పదినిముషాల్లో అక్కడ ఉంటాను. ఎవరూ శవాన్ని గాని, అక్కడి వస్తువులు గాని ముట్టుకోవద్దు..’’ అంటూ హెచ్చరికలు చేస్తూ.. ఫోన్ పెట్టేశాడు.వెంటనే తనవాళ్లతో హుటాహుటిన పంకజ్ సేఠ్ ఇంటికి పోలీసు వ్యానులో బయలుదేరాడు. క్లూస్ టీమ్ తమకు కావలసిన ఫోటోలు వేలిముద్రలు సేకరించసాగింది. ఇంతలో ప్రైవేటు డిటెక్టివ్ శ్రీకర్ తన అసిస్టెంట్ హరితో ‘పిలవని పేరంటానికి వచ్చినట్టు’ రావడం చూసి కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు ముఖం పెట్టాడు రంజిత్‌కుమార్. బహుశః మస్తానే ఫోన్ చేసి ఉంటాడనుకున్నాడు. ‘‘హల్లో .. గుడీవినింగ్ రంజిత్..’’ అంటూ శ్రీకర్ కరచాలనం చేశాడు. శ్రీకర్ వెనకాలే నిలబడ్డ హరి కూడా అభివాదం చేశాడు. ఎవరి సాయం లేకుండా కేసు పరిశోధించి నేరస్తుణ్ణి పట్టుకోవాలనుకున్న రంజిత్‌కుమార్... స్పందించక తప్పలేదు.పంకజ్ సేఠ్ శవాన్ని పరిశీలనగా చూడసాగాడు శ్రీకర్. లాకర్ పక్కనే వెల్లకిలా పడి ఉంది శవం.. తల కింద రక్తపు మడుగు. లాకర్ కీస్ దానికే ఉన్నాయి. క్లూస్ టీమ్‌కు మరికొన్ని సూచనలిచ్చి వారిని మేడ పైకి పంపాడు. రంజిత్కుమార్తో కాసేపు చర్చించాడు. ఇంట్లో మస్తాన్ తప్ప ఎవరూ లేనట్లుగా వుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ.. హాల్లోకొచ్చి సోఫాలో కూర్చుంటూ.. మస్తాన్‌ను పిలిచారు.మస్తాన్ రెండు చేతులా దండం పెట్టుకుంటూ.. వచ్చి వారి ముందు నిలబడ్డాడు. ‘‘ఇంట్లో ఎవరెవరుంటారు’’ అడిగాడు రంజిత్‌కుమార్. ‘‘సేఠ్‌గారితో బాటు చిన్నమ్మగారు శైలజ, చిన్న సేఠ్ ప్రవీణ్, వాచ్‌మన్ శీను, నేను...’’ ‘‘చిన్నమ్మ అంటున్నావు.. పెద్దమ్మ లేదా..? ’’‘‘లేదు సార్. ఆమె కొడుకే ప్రవీణ్ చిన్న సేఠ్. ప్రవీణ్ తల్లి గారు చనిపోతే సేఠ్ గారు శైలజమ్మ గారిని రెండవ పెండ్లి చేసుకున్నాడు’’ ‘‘ప్రవీణ్ సేఠ్ ఎక్కడికెళ్లాడు?’’ అడిగాడు శ్రీకర్. ‘‘డబ్బులు కలెక్ట్ చెయ్యడానికై ఊర్లు తిరుగుతూ ఉంటాడు సార్. ఏ ఊరెళ్ళాడో తెలీదు. అతని సెల్లుకు ఫోన్ చేసి చెప్పాను. వస్తున్నా..’’ అన్నాడు. ‘‘మరి చిన్నమ్మగారు’’ ‘‘అమ్మగారు పుట్టింటికి ఉప్పల్ వెళ్లారు సార్. వాళ్ళు కూడా కారులో బయల్దేరామన్నారు’’ ‘‘మరి శీను..!’’ అడిగాడు రంజిత్‌కుమార్. ‘‘నేను కూరగాయలకని వెళ్ళాను సార్. వచ్చేసరికి అయ్యగారు అలా పడి ఉన్నారు. శీను కనిపించడం లేదు సార్’’ ‘‘అయితే వాడే హత్య చేసి ఉంటాడు’’ ఠక్కున అన్నాడు అసిస్టెంట్ హరి తన బాస్‌ను చూసుకుంటూ.. నోరు మూసుకో అన్నట్టు కళ్ళు పెద్దవిగా చేసుకొని హరి వంక ఉరిమి చూశాడు శ్రీకర్. హరి తల వంచుకుని నేల చూపులు చూడసాగాడు.‘‘ఇంటిగుట్టు తెలిసినవాని పనే ఇది’’ అన్నాడు రంజిత్‌కుమార్. కావచ్చు అన్నట్టుగా తలాడించాడు శ్రీకర్. మరో గంటలో.. అంతా వచ్చారు.శైలజ, వాళ్ల తమ్ముడు అమ్మానాన్నలతో కారు దిగుతూనే.. గుండెలు బాదుకుంటూ.. పరుగెత్తుకొచ్చింది. శవమున్న గదికి రెడ్ టేప్ వేసి ఎవరూ దగ్గరికి వెళ్ళకుండా పోలీసు కాపలా ఉండే సరికి గది బయటనే నిలబడి తల కొట్టుకోసాగింది.‘ఎంత ఘోరం జరిగిపోయిందీ’ అన్నట్టుగా ఆమె వెంట వచ్చిన ఆమె తల్లిదండ్రులు.. ఆమె తమ్ముడు నిశ్చేష్టులై కంట నీరు పెట్టుకుంటూ శైలజను ఊరడించసాగారు.. ప్రవీణ్ తన తండ్రి శవాన్ని చూస్తూనే రెండు చేతులా తల పట్టుకుని కుప్పలా కూలిపోయాడు.. ‘‘చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సాధ్యమైనంత త్వరలో హంతకుణ్ణి పట్టుకుంటాను’’ అంటూ రంజిత్‌కుమార్ ఉపశమన వాక్యాలు పలుకుతూ.. శవాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించే ప్రయత్నాలలో మునిగాడు. శ్రీకర్, హరి సహకరించసాగారు. శ్రీకర్‌ను చూడగానే ప్రవీణ్‌కు భరోసా కలిగింది. ఆయనకు పోలీసుల మీద కంటే ప్రైవేటు డిటెక్టివ్‌ల మీద నమ్మకం ఎక్కువ. మర్నాడు హాల్లో అందరినీ సమావేశ పర్చాడు శ్రీకర్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని చెప్పాడు. తలకు బలమైన గాయంతో బాటు విషవాయువు పీల్చడం మూలాన పంకజ్ సేఠ్ ప్రాణాలు పోయాయని వివరించాడు. అంతా ఒక్క సారిగా కొయ్యబారి పోయారు.‘‘మీనాన్నకు శత్రువులెవరైనా ఉన్నారా?’’ అంటూ ముందుగా ప్రవీణ్‌ను అడిగాడు శ్రీకర్.‘‘నాకు తెలిసినంతవరకు ఎవరూ లేరు సార్ ’’ ‘‘శీను మీద ఏమైనా అనుమానముందా.. ?’’ ‘‘శీను చాలా మంచివాడు సార్.. సున్నితపు మనస్తత్వం కూడానూ..’’ శైలజ గారితో ఏకాంతంగా మాట్లాడుతానని శ్రీకర్ అనగానే.. అంతా హాలు ఖాళీ చేశారు. ‘‘శైలజ గారూ.. మీరంతా నాకు సహకరిస్తేనే నేను హంతకుణ్ణి పట్టుకోగలను. నాకు కొన్ని నిజాలు తెలియాలి’’ అంటూ శైలజ ముఖ కవళికలు చదవసాగాడు. శైలజ నిజమే అన్నట్లుగా తలూపింది. ‘‘పంకజ్ సేఠ్ గారితో వివాహం మీ ఇష్టప్రకారమే జరిగిందా?’’ ‘‘మా పేదరికం నా తల వంచుకుని తాళి కట్టించుకునేలా చేసింది సార్’’ అటుంటే ఆమె కళ్లలో నీళ్లు సుళ్లు తిరగాయి. కడకొంగుతో కన్నీరు ఒత్తుకుంటూ.. ‘‘మా నాన్న ప్రభుత్వ సంస్థలో గుమాస్తా.. చాలీ చాలని జీతం. మా అక్కయ్య పెళ్లితో మా నాన్న సంపాదనంతా తుడిచిపెట్టుకు పోయింది. ఇంటి మీద అప్పులు మిగిలాయి. నాకొక తమ్ముడు.. వాడికి చదువు అబ్బలేదు. పదో తరగతి తప్పాడు.మాకందరికీ అండగా ఉంటానని భరోసా కలిగించి సేఠ్ నన్ను పెళ్ళి చేసుకున్నాడు’’ అంటూ మౌనంగా ఉండిపోయింది.ఇంతలో శ్రీకర్ అసిస్టెంటు హరి వచ్చాడు. చెప్పిన పని ఏమైంది?.. అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీకర్. ‘‘సర్.. శీను భువనగిరిలో తన అక్కయ్య వద్ద వున్నాడని తెలిసింది. ఎస్సై రంజిత్‌కుమార్ గారికి చెప్పాను. వెంటనే పోలీసులను పంపారు. పోలీసులకు శీను దొరికాడట, నేరుగా పోలీసు స్టేషన్‌కు తీసుకు వస్తున్నారట. మనల్ని కూడా అక్కడికే రమ్మన్నారు’’ చెప్పాడు హరి. ‘‘వెరీ గుడ్..’’ అంటూ హరిని మెచ్చుకున్నాడు శ్రీకర్. హరి ముఖం వెలిగిపోయింది.ఆ ముఖాన్ని మరింత వెలిగించాలని.. హరికి మరో పని అప్పగించాడు శ్రీకర్. బాసుకు తన మీద నమ్మకం పెరుగుతూండటంతో తబ్బిబ్బయ్యాడు హరి. వెటనే శ్రీకర్ పురమాయించిన పనిని చక్కబెట్టాలని సెలవు తీసుకున్నాడు. శ్రీకర్ పోలీసు స్టేషన్‌కు బయలుదేరాడు.అప్పుడే రంజిత్‌కుమార్ శీనుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు.శీను చెప్పసాగాడు.‘‘సార్! ఆరోజు మా అబ్బాయికి ఫీజు కట్టడానికని.. నేను అయ్యగారిని పదివేల రూపాయలు అడిగి తీసుకుంటూండగా.. రమేష్ అనే అతను వచ్చాడు. తాను గోల్డ్ మెడలిస్టునని, తనకు ఉద్యోగం వచ్చిందని వాళ్ళు డిపాజిట్ కింద పాతికవేలు కావాలంటున్నారని, అందువల్ల తన మెడల్‌ను తాకట్టు పెడుతున్నానని అన్నాడు. అయ్యగారు దానిని చూసి పరీక్షించి పదిహేనువేల కంటే ఎక్కువ రాదన్నారు. రమేష్ కాళ్లా వేళ్లా పడ్డాడు తన జీవితానికి సంబంధించిన సమస్య అని, మొదటి జీతంతోనే మొత్తం బాకీ తీరుస్తానని కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతలో నన్ను వెళ్లిపొమ్మన్నట్లుగా అయ్యగారు చేతితో సైగ జేశారు. నేను మా ఊరికి వెళ్ళి పోయాను. ఆ తరువాత ఏమైందో.. నాకు తెలియదు సార్..’’ అంటూ బిక్కమొహం వేశాడు శీను.‘‘రంజిత్.. నేను వస్తూ.. వస్తూ.. రమేష్‌ను తీసుకొని వచ్చాను’’ అన్నాడు శ్రీకర్. ఎలా.. అన్నట్టుగా చూశాడు రంజిత్‌కుమార్. ఆశ్చర్యపోతూ..‘‘ఇంతకుముందు పంకజ్ సేఠ్ ఇంటికి వెళ్ళినప్పుడు.. తాకట్టు పెట్టుకునే రిజిస్టర్ నుండి రమేష్ చిరునామా తీసుకున్నాను. చివరిసారిగా డబ్బు తీసుకున్నది అతనే..’’ అంటూ రమేష్‌ను లోనికి రమ్మని పిలిచాడు.‘‘రమేష్.. పంకజ్ సేఠ్‌ను చివరిసారిగా కలుసుకున్నది నువ్వే.. ఆ రోజు ఏం జరిగింది?’’ అంటూ ప్రశ్నించాడు శ్రీకర్. ‘‘సార్ నాకు డబ్బు చాలా అవసరం. సేఠ్ బీరువాలోంచి డబ్బుకట్ట తీసి, పదిహేనువేలిచ్చి, మిగతాది లోపల పెట్టబోతుంటే.. సేఠ్ చేతిలోంచి డబ్బు లాక్కొని పోయాను. సేఠ్ వెల్లకిలా పడిపోవడం గమనించాను. నేను వెనకా ముందు ఆలోచించకుండా బయటకు పరుగెత్తాను. ఆ తరువాత ఏమైందో నాకు తెలియదు సార్..’’ అంటూ కన్నీరు పెట్టుకోసాగాడు. ‘‘ఆ.. అన్నట్టు గుర్తొచ్చింది సార్.. ఎవరో ఒకతను నాకెదురయ్యాడు.. సార్ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. నా మీద కేసు లేకుండా చూడండి’’ అంటూ రంజిత్‌కుమార్ కాళ్లు పట్టుకున్నాడు రమేశ్.. ‘‘సరే.. సరే.. గాని అతన్ని చూస్తే గుర్తుపట్టగలవా..’’ అంటూ అడిగాడు రంజిత్‌కుమార్. రమేష్ తల అడ్డంగా ఊపాడు గుర్తుపట్టలేను అన్నట్లుగా..‘‘రంజిత్... శీనును, రమేష్‌ను మీ కస్టడీలోనే ఉంచండి.. సాయంత్రానికల్లా మరింత సమాచారం లభిస్తుంది.. రేపటికల్లా కేసు తేలిపోతుంది’’ అంటూ భరోసా ఇచ్చి వెళ్ళిపోయాడు శ్రీకర్. రంజిత్‌కుమార్ దీర్ఘాలోచనలో పడ్డాడు.మరుసటి రోజు శ్రీకర్, రంజిత్‌కుమార్‌ల సూచనల మేరకు హరి మీడియాను ఆహ్వానించాడు. అంతా పంకజ్ సేఠ్ ఇంట్లో సమావేశమయ్యారు. శ్రీకర్ తన అసిస్టెంటు హరి సాయంతో కేసు పరిశోధనాంశాలని వివరించసాగాడు. ప్రతి మనిషికీ డబ్బు అవసరమే.. కాని కొందరు దొడ్డి దారిలో మానవత్వాన్ని మరిచి డబ్బు సంపాదిస్తూంటారు. అవసరమైతే ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడరు. ఆ రోజు అదే జరిగింది. రమేష్ ఒక నిరుద్యోగి. డబ్బు అవసరం. కాని అనుకున్నంత డబ్బు తన వస్తువుకు రాలేదు. ఎలాగైనా జీవితంలో స్థిరపడాలని.. ఆవేశంగా డబ్బు లాక్కొని పారిపోయాడు. అప్పుడు అతనికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. అతనొక వీడియో గ్రాఫర్‌గా ఒక షాపులో పార్ట్ టైంజాబ్ చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిస. తన బావ బలహీనతను ఆసరాగా తీసుకొని, అతని ప్రైవేట్ ఫోటోలు మార్ఫింగ్ చేసి చూపిస్తూ.. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఆరోజు కూడా అతను అలాగే వచ్చాడు. పంకజ్ సేఠ్ పడిపోవడం చూశాడు. అప్పటికి సేఠ్ స్పృహ మాత్రమే కోల్పోయాడు. ఇప్పుడు తనేం చేసినా ఆ నేరం అప్పుడు పరుగెత్తే రమేష్ పైన పడుతుందని దుర్భుధ్ధి పుట్టింది. వెంటనే పక్కన వున్న దోమలమందును పంకజ్ సేఠ్ ముక్కులో స్ప్రే చేశాడు. పంకజ్ సేఠ్ ప్రాణాలు క్షణాల్లోనే గాల్లో కలిసిపోయాయి. నిందితుడు చేతి ముద్రలు పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎంత ఆరితేరిన నేరస్తుడైనా ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికి పోతుంటాడు. ఇక్కడా అదే జరిగింది. అనే సరికి అంతా శ్వాస బిగబట్టి వినసాగారు. శ్రీకర్ తిరిగి చెప్పసాగాడు. ‘‘డబ్బు తీసుకొని పరుగెత్త బోయిన నిందితునికి గేటు తీసిన చప్పుడు వినబడింది. ఎవరో వస్తున్నారని గబగబా మెట్లెక్కి మొదటి అంతస్తుకు వెళ్ళాడు. అప్పుడు వచ్చిన వ్యక్తి మస్తాన్.ఈ ఇంటికి మరో మార్గం మేడపై నుంచి వుంది. ఇంటి వాళ్ళ రాక పోకల కోసం. గేటు చప్పుడు కాగానే ఆగంతకుడు శబ్దం రాకుండా ఉండాలని చెప్పులు విప్పి మేడ పైకి వెళ్ళాడు. అతనికి తెలిసిన మార్గమే కాబట్టి మెల్లగా జారుకున్నాడు. అతని అడుగు జాడలే అతణ్ణి పట్టించాయి. ‘‘ఇంతకూ ఆగంతకుడెవరు సార్..’’ అంటూ మీడియా ఆతృతగా అడిగింది. ‘‘అతను మన మధ్యలోనూ ఉన్నాడు’’ అనగానే అంతా అవాక్కయ్యారు. ఇంతలో శైలజ తమ్ముడు కిశోర్ లేచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే రంజిత్‌కుమార్ వెళ్ళి అదుపులోకి తీసుకున్నాడు. ‘‘కిశోర్ అని ఎలా తెలిసింది సార్’’ అంటూ మరింత ఆశ్చర్యంగా అడిగాడు రంజిత్‌కుమార్ కిశోర్ చేతికి బేడీలు వేయిస్తూ..‘‘రంజిత్.. మనం ముందే అనుకున్నాం. ఇది తెలిసిన వారి పనే అని. నేను రాగానే ఇంటికి రెండుదారులు ఉండడం.. అనుమానించాను. క్లూస్ టీమ్‌ను మేడ మీది పాద ముద్రలను కూడా ఫోటో తీయాలని కోరాను. ఇక హరిని ఉప్పల్ పంపించాను. కిశోర్ ప్రవర్తన అతని స్నేహితులతో.. తెలుసుకున్నాను. దాంతో సగం నమ్మకం కలిగింది. కిశోర్ అడుగులు.. మేడ మీది అడుగు జాడలతో సరిపోయే సరికి నిర్థారించుకున్నాను. ఏమంటావ్ కిశోర్..?’’ అంటూ తీక్షణంగా చూశాడు శ్రీకర్. కిశోర్ తల దించుకున్నాడు. ఇంత సులువుగా హత్య కేసు పరిష్కారమైనందుకు.. తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు రంజిత్‌కుమార్. శ్రీకర్‌ను, హరిని అభినందించాడు. యు.విజయశేఖర రెడ్డి -
ఆఇంట్లో దెయ్యం ఉందా? లేదా?
సాక్షి, చెన్నై: దెయ్యం అంటే ఏమిటి? అసలు దెయ్యం ఉందా? లేదా? ఇలాంటి సందేహాలు ఇప్పటికీ చాలా మందికి కలిగేవే. అలాంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే 'పేయ్ ఇరుక్కా ఇల్లైయా' చిత్రం చూడాలంటున్నారు చిత్ర దర్శక, నిర్మాత పా.రంజిత్‌కుమార్. స్వయంగా కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ఇది. అమర్ హీరోగానూ, జ్యోతిషా హీరోయిన్‌గానూ నటిస్తున్న ఇందులో విజయకుమార్, లీవింగ్స్టర్లతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలను పోషించారు. నలుగురు పనిలేని కుర్రాళ్లు, క్రైం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రంజిత్‌కుమార్ తెలిపారు. అసలు దెయ్యాలు ఉన్నాయా? ఉంటే అవి దుష్ట శక్తులా? లేక మనిషి మరణించిన తరువాత ఆత్మలుగా మారతారా? ఇలాంటి ప్రశ్నలకు బదులిచ్చేలా ఈచిత్రం ఉంటుందన్నారు. చిత్రాన్ని చెన్నై, అలంగనల్లూర్, తూత్తుకుడి తదితర ప్రాంతాలలో చిత్రీకరించినట్లు దర్శకుడు తెలిపారు. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈచిత్రానికి టీ.మహీబాలన్ ఫొటోగ్రఫీ, ఆర్ సంపత్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. -
సొలిసిటర్ జనరల్ రంజిత్ రాజీనామా
న్యూఢిల్లీ: సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంచేశారు. రంజిత్ తన రాజీనామా లేఖను న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కార్యాలయానికి పంపారు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదవి చేపట్టిన రంజిత్ మూడేళ్ల పాటు పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించారు. వాటిలో నోట్లరద్దు, కాలుష్యం పెరుగుదలకు సంబంధించిన కేసులున్నాయి. కేంద్రంలో అత్యంత కీలక న్యాయ పదవిలో ఉంటూ రాజీనామా చేసిన వారిలో రంజిత్ రెండోవారు. -
మా ఉత్తర్వులు అమలవ్వాల్సిందే
ఎస్‌వైఎల్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ: పంజాబ్, హరియాణా రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన సట్లెజ్–యమునా అనుసంధాన కాలువ(ఎస్‌వైఎల్)పై తమ ఆదేశాలను ఉల్లంఘించరాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తమ ఉత్తర్వులను ఎలా అమలుచేయాలనేది ఆ రెండు రాష్ట్రాలపైనే ఆధారపడి ఉంటుందని జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని కోరుతూ హరియాణా దాఖలుచేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కేంద్రం, పంజాబ్‌లను బెంచ్ కోరింది. కాలువ నిర్మాణంపై యథాతథస్థితి కొనసాగేలా జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను అమలుచేయాలని స్పష్టంచేసింది. కాలువ ఆస్తులు, భూముల స్వీకర్తలుగా కోర్టు నియమించిన కేంద్ర హోం శాఖ కార్యదర్శి, పంజాబ్ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ డీజీపీలు సమర్పించిన నివేదికలు అక్కడ యథాతథస్థితి కొనసాగుతోందని సూచిస్తున్నట్లు పేర్కొంది. హరియాణా తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జగదీప్ ధన్కర్ హోంశాఖ కార్యదర్శి నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలువ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించిన కమిటీ అక్కడ ఎలాంటి ‘ఉద్దేశపూర్వక’ ధ్వంసం జరగలేదని పేర్కొందని, నివేదికలోని ‘ఉద్దేశపూర్వక’ పదంపై సందేహాలున్నాయని తెలిపారు. కేంద్ర హోం శాఖ తరఫున కోర్టు విచారణలో పాల్గొన్న సొలసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ మట్లాడుతూ.. దీనికి వారంలో బదులిస్తామని తెలిపారు. పంజాబ్ ఒప్పంద రద్దు చట్టం–2004ను హరియాణా సవాలుచేయలేదని, అందువల్ల దాన్ని పక్కనపెట్టలేదని కూడా వెల్లడించారు. ఈ చట్టం రద్దయ్యే వరకూ సుప్రీంకోర్టు ఆదేశాలు అమలుకాలేవని కుండబద్దలు కొట్టారు. ఈ వివాదంలో కేంద్రం జోక్యం చేసుకుని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని పంజాబ్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ అన్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి విద్యార్థి మృతి
టేకులపల్లి : పొలం దున్నేందుకు వెళ్ళిన ఐటీఐ విద్యార్ధి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా లో జరిగింది. టేకులపల్లి మండల పరిధిలోని రాజుతండాలో జరిగింది. కొత్తగూడెం మండలం కారుకొండ రామారానికి చెందిన గుండ్ల రంజిత్ కుమార్ (19) ఐటీఐ చదువుతున్నాడు. బుధవారం ఉదయం తన పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్‌పై వెళ్లాడు. మండల పరిధిలోని రాజుతండా సమీపంలో వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ట్రాక్టర్‌తో సహా రంజిత్ లోయలో పడిపోయాడు. తీవ్ర గాయాలైన రంజిత్ అక్కడి కక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. కోలకతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మంజుల, సోలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివ కీర్తిసింగ్, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ప్రముఖులకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.