అడుగు జాడలు | Interest Merchant murder in Hyderabad | Sakshi
Sakshi News home page

అడుగు జాడలు

Published Sun, Jan 13 2019 12:05 AM | Last Updated on Sun, Jan 13 2019 12:05 AM

Interest Merchant murder in Hyderabad - Sakshi

బాలానగర్‌ పోలీసు స్టేషన్‌.మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది. అప్పుడే స్టేషన్లో అడుగు పెడ్తున్న ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌ కుమార్‌కు తన టేబుల్‌ మీదున్న ఫోన్‌ రింగవడం వినబడింది. గబగబా వెళ్ళి ఫోన్‌ ఎత్తాడు. ‘‘హల్లో.. అయాం ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌’’  అన్నాడు కుర్చీలో  కూర్చుంటూ..‘‘హల్లో సార్‌.. నేను పంకజ్‌ సేఠ్‌గారి వంట మనిషిని మాట్లాడుతున్నాను. మా అయ్యగారు నేల మీద పడి ఉన్నారు సార్‌.  పిలిస్తే పలకడం లేదు. చనిపోయినట్టు అనుమానంగా ఉంది సార్‌’’ అంటూ భయం భయంగా చెప్పాడు అవతలి వ్యక్తి.పంకజ్‌ సేఠ్‌ అంటే బాలానగర్‌ పరిసరాల్లో తెలియని వారు అరుదు. అతడు లైసెన్స్‌ కలిగిన వడ్డీ వ్యాపారి. నగలు తాకట్టు పెట్టుకుని డబ్బులు వడ్డీకిస్తూ ఉంటాడు. ‘‘నీ పేరు’’ అడిగాడు రంజిత్‌కుమార్‌.   ‘‘మస్తాన్‌ సార్‌..’’ ‘‘పదినిముషాల్లో అక్కడ ఉంటాను. ఎవరూ శవాన్ని గాని, అక్కడి వస్తువులు గాని ముట్టుకోవద్దు..’’ అంటూ హెచ్చరికలు చేస్తూ..  ఫోన్‌ పెట్టేశాడు.వెంటనే తనవాళ్లతో హుటాహుటిన పంకజ్‌ సేఠ్‌ ఇంటికి పోలీసు వ్యానులో బయలుదేరాడు.

క్లూస్‌ టీమ్‌ తమకు కావలసిన ఫోటోలు వేలిముద్రలు సేకరించసాగింది. ఇంతలో ప్రైవేటు డిటెక్టివ్‌ శ్రీకర్‌ తన అసిస్టెంట్‌ హరితో ‘పిలవని పేరంటానికి వచ్చినట్టు’ రావడం చూసి కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు ముఖం పెట్టాడు రంజిత్‌కుమార్‌.  బహుశః మస్తానే ఫోన్‌ చేసి ఉంటాడనుకున్నాడు. ‘‘హల్లో .. గుడీవినింగ్‌ రంజిత్‌..’’ అంటూ శ్రీకర్‌ కరచాలనం చేశాడు. శ్రీకర్‌ వెనకాలే నిలబడ్డ హరి కూడా అభివాదం చేశాడు. ఎవరి సాయం లేకుండా కేసు పరిశోధించి నేరస్తుణ్ణి పట్టుకోవాలనుకున్న రంజిత్‌కుమార్‌... స్పందించక తప్పలేదు.పంకజ్‌ సేఠ్‌ శవాన్ని పరిశీలనగా చూడసాగాడు శ్రీకర్‌. లాకర్‌ పక్కనే వెల్లకిలా పడి ఉంది శవం.. తల కింద రక్తపు మడుగు. లాకర్‌ కీస్‌ దానికే ఉన్నాయి. క్లూస్‌ టీమ్‌కు మరికొన్ని సూచనలిచ్చి వారిని మేడ పైకి పంపాడు. రంజిత్‌కుమార్‌తో కాసేపు చర్చించాడు. ఇంట్లో మస్తాన్‌ తప్ప ఎవరూ లేనట్లుగా వుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ.. హాల్లోకొచ్చి సోఫాలో కూర్చుంటూ.. మస్తాన్‌ను పిలిచారు.మస్తాన్‌ రెండు చేతులా దండం పెట్టుకుంటూ.. వచ్చి వారి ముందు నిలబడ్డాడు.

 ‘‘ఇంట్లో ఎవరెవరుంటారు’’ అడిగాడు రంజిత్‌కుమార్‌. ‘‘సేఠ్‌గారితో బాటు చిన్నమ్మగారు శైలజ, చిన్న సేఠ్‌ ప్రవీణ్, వాచ్‌మన్‌ శీను, నేను...’’ ‘‘చిన్నమ్మ అంటున్నావు.. పెద్దమ్మ లేదా..? ’’‘‘లేదు సార్‌. ఆమె కొడుకే ప్రవీణ్‌ చిన్న సేఠ్‌. ప్రవీణ్‌ తల్లి గారు చనిపోతే సేఠ్‌ గారు శైలజమ్మ గారిని రెండవ పెండ్లి చేసుకున్నాడు’’ ‘‘ప్రవీణ్‌ సేఠ్‌ ఎక్కడికెళ్లాడు?’’ అడిగాడు శ్రీకర్‌. ‘‘డబ్బులు కలెక్ట్‌ చెయ్యడానికై ఊర్లు తిరుగుతూ ఉంటాడు సార్‌. ఏ ఊరెళ్ళాడో తెలీదు. అతని సెల్లుకు ఫోన్‌ చేసి చెప్పాను. వస్తున్నా..’’ అన్నాడు. ‘‘మరి చిన్నమ్మగారు’’ ‘‘అమ్మగారు పుట్టింటికి ఉప్పల్‌ వెళ్లారు సార్‌. వాళ్ళు కూడా  కారులో బయల్దేరామన్నారు’’  ‘‘మరి శీను..!’’ అడిగాడు రంజిత్‌కుమార్‌. ‘‘నేను కూరగాయలకని వెళ్ళాను సార్‌. వచ్చేసరికి అయ్యగారు అలా పడి ఉన్నారు. శీను కనిపించడం లేదు సార్‌’’ ‘‘అయితే వాడే హత్య చేసి ఉంటాడు’’ ఠక్కున అన్నాడు అసిస్టెంట్‌ హరి తన బాస్‌ను చూసుకుంటూ.. నోరు మూసుకో అన్నట్టు కళ్ళు పెద్దవిగా చేసుకొని హరి వంక ఉరిమి చూశాడు శ్రీకర్‌.

హరి తల వంచుకుని నేల చూపులు చూడసాగాడు.‘‘ఇంటిగుట్టు తెలిసినవాని పనే ఇది’’ అన్నాడు రంజిత్‌కుమార్‌.  కావచ్చు అన్నట్టుగా తలాడించాడు  శ్రీకర్‌. మరో గంటలో.. అంతా వచ్చారు.శైలజ, వాళ్ల తమ్ముడు అమ్మానాన్నలతో కారు దిగుతూనే.. గుండెలు బాదుకుంటూ.. పరుగెత్తుకొచ్చింది. శవమున్న గదికి రెడ్‌ టేప్‌ వేసి ఎవరూ దగ్గరికి వెళ్ళకుండా పోలీసు కాపలా ఉండే సరికి గది బయటనే నిలబడి తల కొట్టుకోసాగింది.‘ఎంత ఘోరం జరిగిపోయిందీ’ అన్నట్టుగా ఆమె వెంట వచ్చిన ఆమె తల్లిదండ్రులు.. ఆమె తమ్ముడు నిశ్చేష్టులై కంట నీరు పెట్టుకుంటూ శైలజను ఊరడించసాగారు.. ప్రవీణ్‌ తన తండ్రి శవాన్ని చూస్తూనే రెండు చేతులా తల పట్టుకుని కుప్పలా కూలిపోయాడు.. ‘‘చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సాధ్యమైనంత త్వరలో హంతకుణ్ణి పట్టుకుంటాను’’ అంటూ రంజిత్‌కుమార్‌ ఉపశమన వాక్యాలు పలుకుతూ.. శవాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించే ప్రయత్నాలలో మునిగాడు.  శ్రీకర్, హరి సహకరించసాగారు.

శ్రీకర్‌ను చూడగానే ప్రవీణ్‌కు భరోసా కలిగింది. ఆయనకు పోలీసుల మీద కంటే ప్రైవేటు డిటెక్టివ్‌ల మీద నమ్మకం ఎక్కువ.  మర్నాడు హాల్లో  అందరినీ  సమావేశ పర్చాడు శ్రీకర్‌. పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ వచ్చిందని చెప్పాడు. తలకు బలమైన గాయంతో బాటు  విషవాయువు పీల్చడం మూలాన పంకజ్‌ సేఠ్‌ ప్రాణాలు పోయాయని వివరించాడు. అంతా ఒక్క సారిగా కొయ్యబారి పోయారు.‘‘మీనాన్నకు శత్రువులెవరైనా ఉన్నారా?’’ అంటూ ముందుగా ప్రవీణ్‌ను అడిగాడు శ్రీకర్‌.‘‘నాకు తెలిసినంతవరకు ఎవరూ లేరు సార్‌ ’’ ‘‘శీను మీద ఏమైనా అనుమానముందా.. ?’’ ‘‘శీను చాలా మంచివాడు సార్‌.. సున్నితపు మనస్తత్వం కూడానూ..’’ శైలజ గారితో ఏకాంతంగా మాట్లాడుతానని శ్రీకర్‌ అనగానే.. అంతా హాలు ఖాళీ చేశారు. ‘‘శైలజ గారూ.. మీరంతా నాకు సహకరిస్తేనే నేను హంతకుణ్ణి పట్టుకోగలను. నాకు కొన్ని నిజాలు తెలియాలి’’ అంటూ శైలజ ముఖ కవళికలు చదవసాగాడు. శైలజ నిజమే అన్నట్లుగా తలూపింది.

‘‘పంకజ్‌ సేఠ్‌ గారితో వివాహం మీ ఇష్టప్రకారమే జరిగిందా?’’ ‘‘మా పేదరికం నా తల వంచుకుని తాళి కట్టించుకునేలా చేసింది సార్‌’’ అటుంటే ఆమె కళ్లలో నీళ్లు సుళ్లు తిరగాయి. కడకొంగుతో కన్నీరు ఒత్తుకుంటూ.. ‘‘మా నాన్న ప్రభుత్వ సంస్థలో గుమాస్తా.. చాలీ చాలని జీతం. మా అక్కయ్య పెళ్లితో మా నాన్న సంపాదనంతా తుడిచిపెట్టుకు పోయింది. ఇంటి మీద అప్పులు మిగిలాయి. నాకొక తమ్ముడు.. వాడికి చదువు అబ్బలేదు.  పదో తరగతి తప్పాడు.మాకందరికీ అండగా ఉంటానని భరోసా కలిగించి సేఠ్‌ నన్ను పెళ్ళి చేసుకున్నాడు’’ అంటూ మౌనంగా ఉండిపోయింది.ఇంతలో శ్రీకర్‌ అసిస్టెంటు హరి వచ్చాడు. చెప్పిన పని ఏమైంది?.. అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీకర్‌. ‘‘సర్‌.. శీను భువనగిరిలో తన అక్కయ్య వద్ద వున్నాడని తెలిసింది. ఎస్సై రంజిత్‌కుమార్‌ గారికి చెప్పాను. వెంటనే పోలీసులను పంపారు. పోలీసులకు శీను దొరికాడట, నేరుగా పోలీసు స్టేషన్‌కు తీసుకు వస్తున్నారట. మనల్ని కూడా అక్కడికే రమ్మన్నారు’’ చెప్పాడు హరి. ‘‘వెరీ గుడ్‌..’’ అంటూ హరిని మెచ్చుకున్నాడు శ్రీకర్‌. హరి ముఖం వెలిగిపోయింది.ఆ ముఖాన్ని మరింత వెలిగించాలని.. హరికి మరో పని అప్పగించాడు శ్రీకర్‌.

బాసుకు తన మీద నమ్మకం పెరుగుతూండటంతో తబ్బిబ్బయ్యాడు హరి. వెటనే శ్రీకర్‌ పురమాయించిన పనిని చక్కబెట్టాలని సెలవు తీసుకున్నాడు. శ్రీకర్‌ పోలీసు స్టేషన్‌కు బయలుదేరాడు.అప్పుడే రంజిత్‌కుమార్‌ శీనుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు.శీను చెప్పసాగాడు.‘‘సార్‌! ఆరోజు మా అబ్బాయికి ఫీజు కట్టడానికని.. నేను అయ్యగారిని పదివేల రూపాయలు అడిగి తీసుకుంటూండగా.. రమేష్‌ అనే అతను వచ్చాడు.  తాను గోల్డ్‌ మెడలిస్టునని, తనకు ఉద్యోగం వచ్చిందని వాళ్ళు డిపాజిట్‌ కింద పాతికవేలు కావాలంటున్నారని, అందువల్ల తన మెడల్‌ను తాకట్టు పెడుతున్నానని అన్నాడు. అయ్యగారు దానిని చూసి పరీక్షించి పదిహేనువేల కంటే ఎక్కువ రాదన్నారు. రమేష్‌ కాళ్లా వేళ్లా పడ్డాడు తన జీవితానికి సంబంధించిన  సమస్య అని, మొదటి జీతంతోనే మొత్తం బాకీ తీరుస్తానని కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతలో నన్ను వెళ్లిపొమ్మన్నట్లుగా అయ్యగారు చేతితో సైగ జేశారు.

నేను మా ఊరికి వెళ్ళి పోయాను. ఆ తరువాత ఏమైందో.. నాకు తెలియదు సార్‌..’’ అంటూ బిక్కమొహం వేశాడు శీను.‘‘రంజిత్‌.. నేను వస్తూ.. వస్తూ.. రమేష్‌ను తీసుకొని వచ్చాను’’ అన్నాడు శ్రీకర్‌. ఎలా.. అన్నట్టుగా చూశాడు రంజిత్‌కుమార్‌. ఆశ్చర్యపోతూ..‘‘ఇంతకుముందు పంకజ్‌ సేఠ్‌ ఇంటికి వెళ్ళినప్పుడు.. తాకట్టు పెట్టుకునే రిజిస్టర్‌ నుండి రమేష్‌ చిరునామా తీసుకున్నాను. చివరిసారిగా డబ్బు తీసుకున్నది అతనే..’’ అంటూ రమేష్‌ను లోనికి రమ్మని పిలిచాడు.‘‘రమేష్‌.. పంకజ్‌ సేఠ్‌ను చివరిసారిగా కలుసుకున్నది నువ్వే.. ఆ రోజు ఏం జరిగింది?’’ అంటూ ప్రశ్నించాడు శ్రీకర్‌.    ‘‘సార్‌ నాకు డబ్బు చాలా అవసరం. సేఠ్‌ బీరువాలోంచి డబ్బుకట్ట తీసి, పదిహేనువేలిచ్చి, మిగతాది లోపల పెట్టబోతుంటే.. సేఠ్‌ చేతిలోంచి డబ్బు లాక్కొని పోయాను. సేఠ్‌ వెల్లకిలా పడిపోవడం గమనించాను. నేను వెనకా ముందు ఆలోచించకుండా బయటకు పరుగెత్తాను. ఆ తరువాత ఏమైందో నాకు తెలియదు సార్‌..’’ అంటూ కన్నీరు పెట్టుకోసాగాడు. ‘‘ఆ.. అన్నట్టు గుర్తొచ్చింది సార్‌.. ఎవరో ఒకతను నాకెదురయ్యాడు.. సార్‌ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. నా మీద కేసు లేకుండా చూడండి’’ అంటూ రంజిత్‌కుమార్‌ కాళ్లు పట్టుకున్నాడు రమేశ్‌.. ‘‘సరే.. సరే.. గాని అతన్ని చూస్తే గుర్తుపట్టగలవా..’’ అంటూ అడిగాడు రంజిత్‌కుమార్‌. 

రమేష్‌ తల అడ్డంగా ఊపాడు గుర్తుపట్టలేను అన్నట్లుగా..‘‘రంజిత్‌... శీనును, రమేష్‌ను మీ కస్టడీలోనే ఉంచండి.. సాయంత్రానికల్లా మరింత సమాచారం లభిస్తుంది.. రేపటికల్లా కేసు తేలిపోతుంది’’ అంటూ భరోసా ఇచ్చి వెళ్ళిపోయాడు శ్రీకర్‌. రంజిత్‌కుమార్‌  దీర్ఘాలోచనలో పడ్డాడు.మరుసటి రోజు శ్రీకర్, రంజిత్‌కుమార్‌ల సూచనల మేరకు హరి మీడియాను ఆహ్వానించాడు. అంతా పంకజ్‌ సేఠ్‌ ఇంట్లో సమావేశమయ్యారు. శ్రీకర్‌ తన అసిస్టెంటు హరి సాయంతో కేసు పరిశోధనాంశాలని వివరించసాగాడు. ప్రతి మనిషికీ డబ్బు అవసరమే.. కాని కొందరు దొడ్డి దారిలో మానవత్వాన్ని మరిచి డబ్బు సంపాదిస్తూంటారు. అవసరమైతే ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడరు. ఆ రోజు అదే జరిగింది. రమేష్‌ ఒక నిరుద్యోగి. డబ్బు అవసరం. కాని అనుకున్నంత డబ్బు తన వస్తువుకు రాలేదు. ఎలాగైనా జీవితంలో స్థిరపడాలని.. ఆవేశంగా డబ్బు లాక్కొని పారిపోయాడు. అప్పుడు అతనికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. అతనొక వీడియో గ్రాఫర్‌గా ఒక షాపులో పార్ట్‌ టైంజాబ్‌ చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిస. తన బావ బలహీనతను ఆసరాగా తీసుకొని, అతని  ప్రైవేట్‌ ఫోటోలు మార్ఫింగ్‌ చేసి చూపిస్తూ.. డబ్బు కోసం బ్లాక్‌ మెయిల్‌ చేసేవాడు.

ఆరోజు కూడా అతను అలాగే వచ్చాడు. పంకజ్‌ సేఠ్‌ పడిపోవడం చూశాడు. అప్పటికి సేఠ్‌ స్పృహ మాత్రమే కోల్పోయాడు. ఇప్పుడు తనేం చేసినా ఆ నేరం అప్పుడు పరుగెత్తే రమేష్‌ పైన పడుతుందని దుర్భుధ్ధి పుట్టింది. వెంటనే పక్కన వున్న దోమలమందును పంకజ్‌ సేఠ్‌ ముక్కులో స్ప్రే చేశాడు. పంకజ్‌ సేఠ్‌ ప్రాణాలు క్షణాల్లోనే గాల్లో కలిసిపోయాయి. నిందితుడు చేతి ముద్రలు పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎంత ఆరితేరిన నేరస్తుడైనా ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికి పోతుంటాడు. ఇక్కడా అదే జరిగింది. అనే సరికి అంతా శ్వాస బిగబట్టి వినసాగారు. శ్రీకర్‌ తిరిగి చెప్పసాగాడు. ‘‘డబ్బు తీసుకొని పరుగెత్త బోయిన నిందితునికి గేటు తీసిన చప్పుడు వినబడింది. ఎవరో వస్తున్నారని  గబగబా మెట్లెక్కి మొదటి అంతస్తుకు వెళ్ళాడు. అప్పుడు వచ్చిన వ్యక్తి మస్తాన్‌.ఈ ఇంటికి మరో మార్గం మేడపై నుంచి వుంది. ఇంటి వాళ్ళ రాక పోకల కోసం. గేటు చప్పుడు కాగానే ఆగంతకుడు శబ్దం రాకుండా ఉండాలని చెప్పులు విప్పి మేడ పైకి వెళ్ళాడు. అతనికి తెలిసిన మార్గమే కాబట్టి మెల్లగా జారుకున్నాడు. అతని అడుగు జాడలే అతణ్ణి పట్టించాయి. ‘‘ఇంతకూ ఆగంతకుడెవరు సార్‌..’’ అంటూ మీడియా ఆతృతగా అడిగింది.

‘‘అతను మన మధ్యలోనూ ఉన్నాడు’’ అనగానే అంతా అవాక్కయ్యారు. ఇంతలో శైలజ తమ్ముడు కిశోర్‌ లేచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే రంజిత్‌కుమార్‌ వెళ్ళి అదుపులోకి తీసుకున్నాడు. ‘‘కిశోర్‌ అని ఎలా తెలిసింది సార్‌’’ అంటూ మరింత ఆశ్చర్యంగా అడిగాడు రంజిత్‌కుమార్‌ కిశోర్‌ చేతికి బేడీలు వేయిస్తూ..‘‘రంజిత్‌.. మనం ముందే అనుకున్నాం. ఇది తెలిసిన వారి పనే అని. నేను రాగానే ఇంటికి రెండుదారులు ఉండడం.. అనుమానించాను. క్లూస్‌ టీమ్‌ను మేడ మీది పాద ముద్రలను కూడా ఫోటో తీయాలని కోరాను. ఇక హరిని ఉప్పల్‌ పంపించాను. కిశోర్‌ ప్రవర్తన అతని స్నేహితులతో.. తెలుసుకున్నాను. దాంతో సగం నమ్మకం కలిగింది. కిశోర్‌ అడుగులు.. మేడ మీది అడుగు జాడలతో సరిపోయే సరికి నిర్థారించుకున్నాను.   ఏమంటావ్‌ కిశోర్‌..?’’ అంటూ తీక్షణంగా చూశాడు శ్రీకర్‌. కిశోర్‌ తల దించుకున్నాడు. ఇంత సులువుగా హత్య కేసు పరిష్కారమైనందుకు.. తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు రంజిత్‌కుమార్‌. శ్రీకర్‌ను, హరిని అభినందించాడు. 
యు.విజయశేఖర రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement