srikar
-
అడుగు జాడలు
బాలానగర్ పోలీసు స్టేషన్.మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది. అప్పుడే స్టేషన్లో అడుగు పెడ్తున్న ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్‌కు తన టేబుల్ మీదున్న ఫోన్ రింగవడం వినబడింది. గబగబా వెళ్ళి ఫోన్ ఎత్తాడు. ‘‘హల్లో.. అయాం ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్’’ అన్నాడు కుర్చీలో కూర్చుంటూ..‘‘హల్లో సార్.. నేను పంకజ్ సేఠ్‌గారి వంట మనిషిని మాట్లాడుతున్నాను. మా అయ్యగారు నేల మీద పడి ఉన్నారు సార్. పిలిస్తే పలకడం లేదు. చనిపోయినట్టు అనుమానంగా ఉంది సార్’’ అంటూ భయం భయంగా చెప్పాడు అవతలి వ్యక్తి.పంకజ్ సేఠ్ అంటే బాలానగర్ పరిసరాల్లో తెలియని వారు అరుదు. అతడు లైసెన్స్ కలిగిన వడ్డీ వ్యాపారి. నగలు తాకట్టు పెట్టుకుని డబ్బులు వడ్డీకిస్తూ ఉంటాడు. ‘‘నీ పేరు’’ అడిగాడు రంజిత్‌కుమార్. ‘‘మస్తాన్ సార్..’’ ‘‘పదినిముషాల్లో అక్కడ ఉంటాను. ఎవరూ శవాన్ని గాని, అక్కడి వస్తువులు గాని ముట్టుకోవద్దు..’’ అంటూ హెచ్చరికలు చేస్తూ.. ఫోన్ పెట్టేశాడు.వెంటనే తనవాళ్లతో హుటాహుటిన పంకజ్ సేఠ్ ఇంటికి పోలీసు వ్యానులో బయలుదేరాడు. క్లూస్ టీమ్ తమకు కావలసిన ఫోటోలు వేలిముద్రలు సేకరించసాగింది. ఇంతలో ప్రైవేటు డిటెక్టివ్ శ్రీకర్ తన అసిస్టెంట్ హరితో ‘పిలవని పేరంటానికి వచ్చినట్టు’ రావడం చూసి కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు ముఖం పెట్టాడు రంజిత్‌కుమార్. బహుశః మస్తానే ఫోన్ చేసి ఉంటాడనుకున్నాడు. ‘‘హల్లో .. గుడీవినింగ్ రంజిత్..’’ అంటూ శ్రీకర్ కరచాలనం చేశాడు. శ్రీకర్ వెనకాలే నిలబడ్డ హరి కూడా అభివాదం చేశాడు. ఎవరి సాయం లేకుండా కేసు పరిశోధించి నేరస్తుణ్ణి పట్టుకోవాలనుకున్న రంజిత్‌కుమార్... స్పందించక తప్పలేదు.పంకజ్ సేఠ్ శవాన్ని పరిశీలనగా చూడసాగాడు శ్రీకర్. లాకర్ పక్కనే వెల్లకిలా పడి ఉంది శవం.. తల కింద రక్తపు మడుగు. లాకర్ కీస్ దానికే ఉన్నాయి. క్లూస్ టీమ్‌కు మరికొన్ని సూచనలిచ్చి వారిని మేడ పైకి పంపాడు. రంజిత్కుమార్తో కాసేపు చర్చించాడు. ఇంట్లో మస్తాన్ తప్ప ఎవరూ లేనట్లుగా వుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ.. హాల్లోకొచ్చి సోఫాలో కూర్చుంటూ.. మస్తాన్‌ను పిలిచారు.మస్తాన్ రెండు చేతులా దండం పెట్టుకుంటూ.. వచ్చి వారి ముందు నిలబడ్డాడు. ‘‘ఇంట్లో ఎవరెవరుంటారు’’ అడిగాడు రంజిత్‌కుమార్. ‘‘సేఠ్‌గారితో బాటు చిన్నమ్మగారు శైలజ, చిన్న సేఠ్ ప్రవీణ్, వాచ్‌మన్ శీను, నేను...’’ ‘‘చిన్నమ్మ అంటున్నావు.. పెద్దమ్మ లేదా..? ’’‘‘లేదు సార్. ఆమె కొడుకే ప్రవీణ్ చిన్న సేఠ్. ప్రవీణ్ తల్లి గారు చనిపోతే సేఠ్ గారు శైలజమ్మ గారిని రెండవ పెండ్లి చేసుకున్నాడు’’ ‘‘ప్రవీణ్ సేఠ్ ఎక్కడికెళ్లాడు?’’ అడిగాడు శ్రీకర్. ‘‘డబ్బులు కలెక్ట్ చెయ్యడానికై ఊర్లు తిరుగుతూ ఉంటాడు సార్. ఏ ఊరెళ్ళాడో తెలీదు. అతని సెల్లుకు ఫోన్ చేసి చెప్పాను. వస్తున్నా..’’ అన్నాడు. ‘‘మరి చిన్నమ్మగారు’’ ‘‘అమ్మగారు పుట్టింటికి ఉప్పల్ వెళ్లారు సార్. వాళ్ళు కూడా కారులో బయల్దేరామన్నారు’’ ‘‘మరి శీను..!’’ అడిగాడు రంజిత్‌కుమార్. ‘‘నేను కూరగాయలకని వెళ్ళాను సార్. వచ్చేసరికి అయ్యగారు అలా పడి ఉన్నారు. శీను కనిపించడం లేదు సార్’’ ‘‘అయితే వాడే హత్య చేసి ఉంటాడు’’ ఠక్కున అన్నాడు అసిస్టెంట్ హరి తన బాస్‌ను చూసుకుంటూ.. నోరు మూసుకో అన్నట్టు కళ్ళు పెద్దవిగా చేసుకొని హరి వంక ఉరిమి చూశాడు శ్రీకర్. హరి తల వంచుకుని నేల చూపులు చూడసాగాడు.‘‘ఇంటిగుట్టు తెలిసినవాని పనే ఇది’’ అన్నాడు రంజిత్‌కుమార్. కావచ్చు అన్నట్టుగా తలాడించాడు శ్రీకర్. మరో గంటలో.. అంతా వచ్చారు.శైలజ, వాళ్ల తమ్ముడు అమ్మానాన్నలతో కారు దిగుతూనే.. గుండెలు బాదుకుంటూ.. పరుగెత్తుకొచ్చింది. శవమున్న గదికి రెడ్ టేప్ వేసి ఎవరూ దగ్గరికి వెళ్ళకుండా పోలీసు కాపలా ఉండే సరికి గది బయటనే నిలబడి తల కొట్టుకోసాగింది.‘ఎంత ఘోరం జరిగిపోయిందీ’ అన్నట్టుగా ఆమె వెంట వచ్చిన ఆమె తల్లిదండ్రులు.. ఆమె తమ్ముడు నిశ్చేష్టులై కంట నీరు పెట్టుకుంటూ శైలజను ఊరడించసాగారు.. ప్రవీణ్ తన తండ్రి శవాన్ని చూస్తూనే రెండు చేతులా తల పట్టుకుని కుప్పలా కూలిపోయాడు.. ‘‘చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సాధ్యమైనంత త్వరలో హంతకుణ్ణి పట్టుకుంటాను’’ అంటూ రంజిత్‌కుమార్ ఉపశమన వాక్యాలు పలుకుతూ.. శవాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించే ప్రయత్నాలలో మునిగాడు. శ్రీకర్, హరి సహకరించసాగారు. శ్రీకర్‌ను చూడగానే ప్రవీణ్‌కు భరోసా కలిగింది. ఆయనకు పోలీసుల మీద కంటే ప్రైవేటు డిటెక్టివ్‌ల మీద నమ్మకం ఎక్కువ. మర్నాడు హాల్లో అందరినీ సమావేశ పర్చాడు శ్రీకర్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని చెప్పాడు. తలకు బలమైన గాయంతో బాటు విషవాయువు పీల్చడం మూలాన పంకజ్ సేఠ్ ప్రాణాలు పోయాయని వివరించాడు. అంతా ఒక్క సారిగా కొయ్యబారి పోయారు.‘‘మీనాన్నకు శత్రువులెవరైనా ఉన్నారా?’’ అంటూ ముందుగా ప్రవీణ్‌ను అడిగాడు శ్రీకర్.‘‘నాకు తెలిసినంతవరకు ఎవరూ లేరు సార్ ’’ ‘‘శీను మీద ఏమైనా అనుమానముందా.. ?’’ ‘‘శీను చాలా మంచివాడు సార్.. సున్నితపు మనస్తత్వం కూడానూ..’’ శైలజ గారితో ఏకాంతంగా మాట్లాడుతానని శ్రీకర్ అనగానే.. అంతా హాలు ఖాళీ చేశారు. ‘‘శైలజ గారూ.. మీరంతా నాకు సహకరిస్తేనే నేను హంతకుణ్ణి పట్టుకోగలను. నాకు కొన్ని నిజాలు తెలియాలి’’ అంటూ శైలజ ముఖ కవళికలు చదవసాగాడు. శైలజ నిజమే అన్నట్లుగా తలూపింది. ‘‘పంకజ్ సేఠ్ గారితో వివాహం మీ ఇష్టప్రకారమే జరిగిందా?’’ ‘‘మా పేదరికం నా తల వంచుకుని తాళి కట్టించుకునేలా చేసింది సార్’’ అటుంటే ఆమె కళ్లలో నీళ్లు సుళ్లు తిరగాయి. కడకొంగుతో కన్నీరు ఒత్తుకుంటూ.. ‘‘మా నాన్న ప్రభుత్వ సంస్థలో గుమాస్తా.. చాలీ చాలని జీతం. మా అక్కయ్య పెళ్లితో మా నాన్న సంపాదనంతా తుడిచిపెట్టుకు పోయింది. ఇంటి మీద అప్పులు మిగిలాయి. నాకొక తమ్ముడు.. వాడికి చదువు అబ్బలేదు. పదో తరగతి తప్పాడు.మాకందరికీ అండగా ఉంటానని భరోసా కలిగించి సేఠ్ నన్ను పెళ్ళి చేసుకున్నాడు’’ అంటూ మౌనంగా ఉండిపోయింది.ఇంతలో శ్రీకర్ అసిస్టెంటు హరి వచ్చాడు. చెప్పిన పని ఏమైంది?.. అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీకర్. ‘‘సర్.. శీను భువనగిరిలో తన అక్కయ్య వద్ద వున్నాడని తెలిసింది. ఎస్సై రంజిత్‌కుమార్ గారికి చెప్పాను. వెంటనే పోలీసులను పంపారు. పోలీసులకు శీను దొరికాడట, నేరుగా పోలీసు స్టేషన్‌కు తీసుకు వస్తున్నారట. మనల్ని కూడా అక్కడికే రమ్మన్నారు’’ చెప్పాడు హరి. ‘‘వెరీ గుడ్..’’ అంటూ హరిని మెచ్చుకున్నాడు శ్రీకర్. హరి ముఖం వెలిగిపోయింది.ఆ ముఖాన్ని మరింత వెలిగించాలని.. హరికి మరో పని అప్పగించాడు శ్రీకర్. బాసుకు తన మీద నమ్మకం పెరుగుతూండటంతో తబ్బిబ్బయ్యాడు హరి. వెటనే శ్రీకర్ పురమాయించిన పనిని చక్కబెట్టాలని సెలవు తీసుకున్నాడు. శ్రీకర్ పోలీసు స్టేషన్‌కు బయలుదేరాడు.అప్పుడే రంజిత్‌కుమార్ శీనుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు.శీను చెప్పసాగాడు.‘‘సార్! ఆరోజు మా అబ్బాయికి ఫీజు కట్టడానికని.. నేను అయ్యగారిని పదివేల రూపాయలు అడిగి తీసుకుంటూండగా.. రమేష్ అనే అతను వచ్చాడు. తాను గోల్డ్ మెడలిస్టునని, తనకు ఉద్యోగం వచ్చిందని వాళ్ళు డిపాజిట్ కింద పాతికవేలు కావాలంటున్నారని, అందువల్ల తన మెడల్‌ను తాకట్టు పెడుతున్నానని అన్నాడు. అయ్యగారు దానిని చూసి పరీక్షించి పదిహేనువేల కంటే ఎక్కువ రాదన్నారు. రమేష్ కాళ్లా వేళ్లా పడ్డాడు తన జీవితానికి సంబంధించిన సమస్య అని, మొదటి జీతంతోనే మొత్తం బాకీ తీరుస్తానని కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతలో నన్ను వెళ్లిపొమ్మన్నట్లుగా అయ్యగారు చేతితో సైగ జేశారు. నేను మా ఊరికి వెళ్ళి పోయాను. ఆ తరువాత ఏమైందో.. నాకు తెలియదు సార్..’’ అంటూ బిక్కమొహం వేశాడు శీను.‘‘రంజిత్.. నేను వస్తూ.. వస్తూ.. రమేష్‌ను తీసుకొని వచ్చాను’’ అన్నాడు శ్రీకర్. ఎలా.. అన్నట్టుగా చూశాడు రంజిత్‌కుమార్. ఆశ్చర్యపోతూ..‘‘ఇంతకుముందు పంకజ్ సేఠ్ ఇంటికి వెళ్ళినప్పుడు.. తాకట్టు పెట్టుకునే రిజిస్టర్ నుండి రమేష్ చిరునామా తీసుకున్నాను. చివరిసారిగా డబ్బు తీసుకున్నది అతనే..’’ అంటూ రమేష్‌ను లోనికి రమ్మని పిలిచాడు.‘‘రమేష్.. పంకజ్ సేఠ్‌ను చివరిసారిగా కలుసుకున్నది నువ్వే.. ఆ రోజు ఏం జరిగింది?’’ అంటూ ప్రశ్నించాడు శ్రీకర్. ‘‘సార్ నాకు డబ్బు చాలా అవసరం. సేఠ్ బీరువాలోంచి డబ్బుకట్ట తీసి, పదిహేనువేలిచ్చి, మిగతాది లోపల పెట్టబోతుంటే.. సేఠ్ చేతిలోంచి డబ్బు లాక్కొని పోయాను. సేఠ్ వెల్లకిలా పడిపోవడం గమనించాను. నేను వెనకా ముందు ఆలోచించకుండా బయటకు పరుగెత్తాను. ఆ తరువాత ఏమైందో నాకు తెలియదు సార్..’’ అంటూ కన్నీరు పెట్టుకోసాగాడు. ‘‘ఆ.. అన్నట్టు గుర్తొచ్చింది సార్.. ఎవరో ఒకతను నాకెదురయ్యాడు.. సార్ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. నా మీద కేసు లేకుండా చూడండి’’ అంటూ రంజిత్‌కుమార్ కాళ్లు పట్టుకున్నాడు రమేశ్.. ‘‘సరే.. సరే.. గాని అతన్ని చూస్తే గుర్తుపట్టగలవా..’’ అంటూ అడిగాడు రంజిత్‌కుమార్. రమేష్ తల అడ్డంగా ఊపాడు గుర్తుపట్టలేను అన్నట్లుగా..‘‘రంజిత్... శీనును, రమేష్‌ను మీ కస్టడీలోనే ఉంచండి.. సాయంత్రానికల్లా మరింత సమాచారం లభిస్తుంది.. రేపటికల్లా కేసు తేలిపోతుంది’’ అంటూ భరోసా ఇచ్చి వెళ్ళిపోయాడు శ్రీకర్. రంజిత్‌కుమార్ దీర్ఘాలోచనలో పడ్డాడు.మరుసటి రోజు శ్రీకర్, రంజిత్‌కుమార్‌ల సూచనల మేరకు హరి మీడియాను ఆహ్వానించాడు. అంతా పంకజ్ సేఠ్ ఇంట్లో సమావేశమయ్యారు. శ్రీకర్ తన అసిస్టెంటు హరి సాయంతో కేసు పరిశోధనాంశాలని వివరించసాగాడు. ప్రతి మనిషికీ డబ్బు అవసరమే.. కాని కొందరు దొడ్డి దారిలో మానవత్వాన్ని మరిచి డబ్బు సంపాదిస్తూంటారు. అవసరమైతే ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడరు. ఆ రోజు అదే జరిగింది. రమేష్ ఒక నిరుద్యోగి. డబ్బు అవసరం. కాని అనుకున్నంత డబ్బు తన వస్తువుకు రాలేదు. ఎలాగైనా జీవితంలో స్థిరపడాలని.. ఆవేశంగా డబ్బు లాక్కొని పారిపోయాడు. అప్పుడు అతనికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. అతనొక వీడియో గ్రాఫర్‌గా ఒక షాపులో పార్ట్ టైంజాబ్ చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిస. తన బావ బలహీనతను ఆసరాగా తీసుకొని, అతని ప్రైవేట్ ఫోటోలు మార్ఫింగ్ చేసి చూపిస్తూ.. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఆరోజు కూడా అతను అలాగే వచ్చాడు. పంకజ్ సేఠ్ పడిపోవడం చూశాడు. అప్పటికి సేఠ్ స్పృహ మాత్రమే కోల్పోయాడు. ఇప్పుడు తనేం చేసినా ఆ నేరం అప్పుడు పరుగెత్తే రమేష్ పైన పడుతుందని దుర్భుధ్ధి పుట్టింది. వెంటనే పక్కన వున్న దోమలమందును పంకజ్ సేఠ్ ముక్కులో స్ప్రే చేశాడు. పంకజ్ సేఠ్ ప్రాణాలు క్షణాల్లోనే గాల్లో కలిసిపోయాయి. నిందితుడు చేతి ముద్రలు పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎంత ఆరితేరిన నేరస్తుడైనా ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికి పోతుంటాడు. ఇక్కడా అదే జరిగింది. అనే సరికి అంతా శ్వాస బిగబట్టి వినసాగారు. శ్రీకర్ తిరిగి చెప్పసాగాడు. ‘‘డబ్బు తీసుకొని పరుగెత్త బోయిన నిందితునికి గేటు తీసిన చప్పుడు వినబడింది. ఎవరో వస్తున్నారని గబగబా మెట్లెక్కి మొదటి అంతస్తుకు వెళ్ళాడు. అప్పుడు వచ్చిన వ్యక్తి మస్తాన్.ఈ ఇంటికి మరో మార్గం మేడపై నుంచి వుంది. ఇంటి వాళ్ళ రాక పోకల కోసం. గేటు చప్పుడు కాగానే ఆగంతకుడు శబ్దం రాకుండా ఉండాలని చెప్పులు విప్పి మేడ పైకి వెళ్ళాడు. అతనికి తెలిసిన మార్గమే కాబట్టి మెల్లగా జారుకున్నాడు. అతని అడుగు జాడలే అతణ్ణి పట్టించాయి. ‘‘ఇంతకూ ఆగంతకుడెవరు సార్..’’ అంటూ మీడియా ఆతృతగా అడిగింది. ‘‘అతను మన మధ్యలోనూ ఉన్నాడు’’ అనగానే అంతా అవాక్కయ్యారు. ఇంతలో శైలజ తమ్ముడు కిశోర్ లేచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే రంజిత్‌కుమార్ వెళ్ళి అదుపులోకి తీసుకున్నాడు. ‘‘కిశోర్ అని ఎలా తెలిసింది సార్’’ అంటూ మరింత ఆశ్చర్యంగా అడిగాడు రంజిత్‌కుమార్ కిశోర్ చేతికి బేడీలు వేయిస్తూ..‘‘రంజిత్.. మనం ముందే అనుకున్నాం. ఇది తెలిసిన వారి పనే అని. నేను రాగానే ఇంటికి రెండుదారులు ఉండడం.. అనుమానించాను. క్లూస్ టీమ్‌ను మేడ మీది పాద ముద్రలను కూడా ఫోటో తీయాలని కోరాను. ఇక హరిని ఉప్పల్ పంపించాను. కిశోర్ ప్రవర్తన అతని స్నేహితులతో.. తెలుసుకున్నాను. దాంతో సగం నమ్మకం కలిగింది. కిశోర్ అడుగులు.. మేడ మీది అడుగు జాడలతో సరిపోయే సరికి నిర్థారించుకున్నాను. ఏమంటావ్ కిశోర్..?’’ అంటూ తీక్షణంగా చూశాడు శ్రీకర్. కిశోర్ తల దించుకున్నాడు. ఇంత సులువుగా హత్య కేసు పరిష్కారమైనందుకు.. తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు రంజిత్‌కుమార్. శ్రీకర్‌ను, హరిని అభినందించాడు. యు.విజయశేఖర రెడ్డి -
పన్నుల పని మొదలెట్టారా?
శ్రీకర్‌కు జీతం నెలకు 70వేల పైనే. కాకపోతే గత నెల జీతం... అంటే మార్చిది కేవలం 30వేలే వచ్చింది చేతికి. ఎందుకంటే ప్లానింగ్ లోపం. ఆదాయపు పన్ను మినహాయింపులకు ఏమేం చేస్తున్నారో చెప్పాలని వాళ్ల ఆఫీసు ఫైనాన్స్ విభాగం ముందు నుంచీ అడుగుతున్నా... రకరకాల కారణాలు చెబుతూ వచ్చాడు శ్రీకర్. రకరకాల ప్రతిపాదనలు ముందు చెప్పినా... చివరికొచ్చేసరికి అవేమీ చెయ్యలేకపోయాడు. ఫలితం... మార్చి జీతంలో భారీగా కోతపడింది. ఒక్క మార్చి మాత్రమే కాదు. అంతకు ముందు మూడు నెలల నుంచీ... అంటే డిసెంబర్ నుంచీ అలా కోతలు పడుతూనే వచ్చాయి. ఇక లాభం లేదు!! వచ్చే ఏడాదైనా ముందు నుంచీ ప్రణాళిక వేసుకుని పన్ను మినహాయింపుల కోసం ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా అనుకున్నాడు. అలా అనుకుంటూ ఉండగానే ఏప్రిల్ నెలాఖరు వచ్చేసింది. శ్రీకర్‌కు భయం పట్టుకుంది. నిజానికి ఒక్క శ్రీకర్ మాత్రమే కాదు. చాలామంది పరిస్థితి ఇదే. ఆర్థిక సంవత్సరం మొదలైన దగ్గర్నుంచీ పన్ను ప్లానింగ్ చెయ్యాలని అనుకుంటారు. కానీ సమయం గడిచిపోతూ ఉంటుంది. అందుకే... అలాంటి వారికోసమే ఈ ప్లానింగ్ పాఠం... నిజం చెప్పాలంటే... హడావుడిలోనే ఎక్కువ తప్పులు జరుగుతాయి. ఆర్థిక ప్రణాళికైనా అంతే. ఆఖరు నిమిషం నిర్ణయాలకు తావులేకుండా గరిష్టంగా పన్ను లాభాలు పొందటానికి ప్రణాళిక కావాలి. ఇప్పటి నుంచీ మొదలుపెడితే అందుకు బోలెడంత సమయం లభిస్తుంది. అవసరమైతే మధ్యలో తగు మార్పులు కూడా చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆదాయ పన్ను చట్టంలో పెద్దగా మార్పులు జరగలేదు కాబట్టి గతేడాదిలాగే ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చు. కానీ గతేడాదితో పోలిస్తే కొన్ని పెట్టుబడి సాధనాల పనితీరులో చాలా మార్పు వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఏడాది ఆరంభం నుంచే ప్లానింగ్ తప్పనిసరి * అలాగైతే జేబుకు భారం లేకుండా మినహాయింపులు * ఆఖరి క్షణం నిర్ణయాల్లో తప్పులు కూడా జరగొచ్చు * మధ్యలో నిర్ణయాలు మార్చుకోవటానికీ తగినంత సమయం * వడ్డీరేట్లు తగ్గుతున్నాయి కనుక ఇపుడే డిపాజిట్లు చేయటం బెటర్ * ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల పనితీరు కూడా ఆశావహమే షేర్లు కొన్నా పన్ను లాభమే... గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు స్వల్ప నష్టాలను అందించినా... ఈ ఏడాది ప్రారంభం నుంచి సానుకూల సంకేతాలనే ఇస్తున్నాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మంచి రాబడినిచ్చే అవకాశం ఉంటుంది కనుక కొద్దిగా రిస్క్ చేయగలిగే సామర్థ్యం ఉన్నవారు వీటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వివిధ మార్గాల్లో పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకోసం ఆదాయ పన్ను చట్టంలో 80సీ, 80సీసీజీ అని రెండు సెక్షన్లు ఉన్నాయి. తొలిసారిగా డీమ్యాట్ ఖాతా తెరిచి షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ కొన్న వారు సెక్షన్ 80సీసీజీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. దీన్నే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీం (ఆర్జీఈఎస్ఎస్)గా పిలుస్తున్నారు. ఈ పథకం కింద గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లలో సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఇలా వరుసగా మూడేళ్ళు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఈ మినహాయింపు పొందవచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఎంపిక చేసిన కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందొచ్చు. వీటిని ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లు లేదా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌గా పిలుస్తారు. దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. వీటి రాబడులు మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి. వీటికి లాకిన్ పిరియడ్ మూడేళ్లు. ఆరోగ్యంతో పాటు పన్ను లాభం... ప్రస్తుత పరిస్థితుల్లో దురదృష్టవశాత్తూ ఆసుపత్రి పాలైతే అంతే!! ఎందుకంటే ఆసుపత్రి ఖర్చులు మామూలు జీతగాళ్లు తట్టుకునే స్థాయిలో లేవు. అందుకని ప్రతి ఒక్కరికీ ఇపుడు జీవితబీమా మాదిరే ఆరోగ్య బీమా కూడా అత్యవసరం. కాకపోతే ఈ ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. - గతేడాది నుంచి సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై లభించే పన్ను మినహాయింపు పరిధిని పెంచారు. 60 ఏళ్ళలోపు వయస్సున్న వారైతే ఆరోగ్య బీమాకు చెల్లించే మొత్తంలో రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అదే సీనియర్ సిటిజన్స్‌కైతే ఈ పరిమితి రూ. 30,000. ముందస్తు వైద్య పరీక్షలకు చేసే వ్యయంపై గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ ఈ మొత్తం రూ.25,000 పరిధిలోకే వస్తుంది. భారా ్యభర్తలు, పిల్లలు, తల్లిదండ్రుల వైద్య పరీక్షలకోసం చేసే ఖర్చులు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. ఇది కాకుండా తల్లిదండ్రులకు చెల్లించే వైద్య బీమా ప్రీమియంపై కూడా మినహాయింపు ఉంటుంది. తల్లిదండ్రులు 60 ఏళ్ళలోపు వారైతే రూ. 25,000, అదే సీని యర్ సిటిజన్స్ అయితే రూ.30,000 అదనంగా పొందొచ్చు. అంటే ఈ సెక్షన్ ద్వారా గరిష్టంగా రూ. 50 వేల నుంచి రూ. 60 వేలవరకు ప్రయోజనం పొందవచ్చు. ఇవి కాకుండా బీమా, పీపీఎఫ్, హోమ్లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, పిల్లల ట్యూషన్ ఫీజులు వంటి అనేక పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చక్కగా వినియోగించుకోవడం ద్వారా సాధ్యమైనంత వరకు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. పైన పేర్కొన్న వాటిలో మీకు అనువైన పథకాలను ఎంచుకొని వాటిలో క్రమ శిక్షణతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను లాభాలతో పాటు దీర్ఘకాలంలో తగినంత సంపదను వృద్ధి చేసుకోవచ్చు. డిపాజిట్లు... వడ్డీ తగ్గుతోంది ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరాదాయం పొందాలనుకునే వారికి ఈ ఏడాది కాస్త నిరాశే మిగిలింది. గడిచిన ఏడాది కాలంగా డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండటమే కాకుండా... మరింత తగ్గే అవకాశాలున్నాయంటూ బలమైన సంకేతాలు వస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇంచుమించు రెండు శాతం వరకు తగ్గాయి. మున్ముందు మరింత తగ్గొచ్చు కూడా. అందుకని పన్ను మినహాయింపు కోసం బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి కాస్తంత ఇబ్బందే. పెపైచ్చు ఇకపై పోస్టాఫీసుకు సంబంధించిన చిన్న మొత్తాల పొదుపు రేట్లను ప్రతి మూడు నెలలకోసారి సమీక్షించనున్నారు కూడా. * ప్రస్తుతం పోస్టాఫీసు ఐదేళ్ల డిపాజిట్‌పై 7.9 శాతం వడ్డీని అందిస్తుండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదేళ్ల కాలానికి 7 శాతం వడ్డీరేటు మాత్రమే అందిస్తోంది. * అమ్మాయిల పెళ్లిళ్లకు అక్కరకొచ్చేలా సుకన్య-సమృద్ధి పేరుతో మరో ప్రత్యేక సేవింగ్స్ పథకం ఉంది. 10 ఏళ్లలోపు అమ్మాయిల పేరిట ఈ * ఖాతా ప్రారంభించొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 8.6 శాతం వడ్డీ వస్తోంది. ఈ పథకం పోస్టాఫీసు, కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. * మున్ముందు వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది కనుక ఇన్వెస్ట్ చేసే ముందు ఎక్కడ అధిక వడ్డీ వస్తోందో పరిశీలించుకోండి. ప్రస్తుతానికి బ్యాంకుల కన్నా పోస్టాఫీసులే అధిక వడ్డీ అందిస్తున్నాయి. * పన్ను ప్రయోజనాల కోసం ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీరేట్లు మరింత తగ్గే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి. ఎన్పీఎస్... ఆకర్షణ పెరిగింది ఈ రోజుల్లో ప్రభుత్వోద్యోగాలంటే అతి కొద్ది మందికే పరిమితం. ప్రైవేటు ఉద్యోగాల్లో ఎక్కువ జీతంతో ఉండి రకరకాల పథకాల్లో ఇన్వెస్ట్ చేసేవారికైతే ఇబ్బంది ఉండదు. కానీ చిన్న జీతాలుండి... రిటైరైనవారు ఆ తరవాత ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే పెన్షన్ ప్లాన్లు. అందులో ప్రభుత్వ నియంత్రణలో నడిచే న్యూ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ప్రధానమైంది. ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ అందించే ఈ ఎన్పీఎస్ పథకానికి ప్రతి ఏడాదీ కొన్ని అదనపు ఆకర్షణలు చేరుస్తున్నారు. ఈ సారి కూడా ఎన్పీఎస్ విత్డ్రాయల్స్పై చేసిన సవరణలు ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. మొన్నటి వరకు ఎన్పీఎస్ నుంచి వెనక్కి తీసుకునే ప్రతి పైసానూ పన్ను ఆదాయంగా పరిగణించి దానిపై పన్ను చెల్లించమని అడిగేవారు. కానీ మొన్నటి బడ్జెట్లో ఎన్పీఎస్ నుంచి వెనక్కి తీసుకునే 40 శాతం మొత్తంపై ఎలాంటి పన్నూ విధించకూడదని ప్రతిపాదన చేశారు. అంతేకాక ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై సెక్షన్ 80సీసీడీ కింద గరిష్టంగా రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. -
వాలంటీనేజర్
పొద్దున్నుంచి పొద్దు పోయేదాకా పనులు చేస్తాం. ప్రతి పని నుంచి రకరకాల ప్రతిఫలాలు ఆశిస్తాం. ఆశ తీరితే ఉత్సాహంగా, తీరకపోతే మరింత ఆశగా మరుసటి రోజు పనులు మళ్లీ మొదలు పెడతాం. కాని ఒక్క రోజు లేదంటే ఒక్క గంట.. ఏమీ ఆశించకుండా పనిచేస్తే ఊహించనంత ఆనందం అందుతుంది. రేపటి భయాన్ని దూరం చేసేంత ఆత్మవిశ్వాసం ఆవహిస్తుంది. ఇది శ్రీకర్ లాంటి స్వచ్ఛంద సేవకుల మాట. సీనియర్లే కాదు శ్రీకర్ లాంటి ‘సిటీ’నేజర్లు సైతం ఎంచుకుంటున్న సరికొత్త బాట. సేవామార్గం వైపు మళ్లాలంటే వయసు మళ్లినవారో, ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నవారో మరీ తప్పకపోతే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కోసం చేసేవారో అయి ఉంటారు. దీనికి భిన్నం కుందన్‌బాగ్‌లో నివసించే ఈ కుర్రాడు. - ఎస్.సత్యబాబు సముద్రపు ఒడ్డున పడి ఉన్న స్టార్ఫిష్లను ఓ కుర్రాడు ఒకటొకటిగా తిరిగి సముద్రంలోకి విసిరేస్తూ ఉంటాడు. ఆ పని చూస్తూ ‘పిచ్చా’అంటూ కొందరి ఎద్దేవా, ‘అలా ఎన్నని వేస్తావ్?’ అంటూ కొందరి జాలి చూపులు. అయితే ఆ కుర్రాడు అవేవీ లక్ష్యపెట్టడు. చేసే పని ఆపడు. ‘నేనేం చేయగలనో చేస్తున్నా. చేతనైతే మీరూ చేయండి’అనేది ఆ కుర్రాడి మౌనంలోని భావం. శ్రీకర్ ఆధ్వర్యంలోని వాలంటరీ ఆర్గనైజేషన్ వెబ్సైట్లోకి వెళ్లిన వెంటనే పడే స్ఫూర్తి దాయక ప్రభావం. ‘మా ఎన్జీవోను స్థాపించినప్పుడు నా వయసు 15 ఏళ్లే’ అని చెప్పాడు కూచిభట్ల శ్రీకర్ శ్రీరామ్. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న ఈ సిటీ కుర్రాడు రెండేళ్ల క్రితం స్థాపించిన క్విడ్ ఫేసియమ్ (ఈ లాటిన్ పదానికి వాట్ ఐ కెన్ డు అని అర్థం) సంస్థ.. బహుశా దేశంలోనే తొలిసారి ఒక టీనేజర్ సీఈవోగా ఏర్పడిన వాలంటరీ ఆర్గనైజేషన్. గిటార్ టు చారిటీ... ‘చిన్నవయసు నుంచే గిటార్ ప్లే చేయడం అంటే ఇష్టం. ఆరేళ్ల పాటు గిటార్‌ను నేర్చుకుని లండన్ ట్రినిటీ మ్యూజిక్‌లో 6 గ్రేడ్స్ పూర్తి చేశాను. ఈ కోర్సులో అత్యుత్తమంగా చెప్పే గ్రేడ్ 7 పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నా. ఓక్రిడ్జ్ స్కూల్లో నా మ్యూజిక్కు ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూశాక, స్కూల్లో ఉన్నప్పుడు పలు వాలంటరీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాక.. మ్యూజిక్ ద్వారా సర్వీస్ అనే ఆలోచన వచ్చింది’ అంటూ వివరించాడు శ్రీకర్. అయితే ‘ఈ వయసులో వాలంటరీ ఆర్గనైజేషన్ ఏమిటి? చదువు దెబ్బతింటుంది’ అంటూ పేరెంట్స్‌తో పాటు సన్నిహితులూ వారించారు. కాని స్కూల్ స్థాయి నుంచే ఎడ్యుకేషన్‌లో ఏటా టాపర్‌గా నిలిచే శ్రీకర్‌కు తన మీద తనకు నమ్మకం ఉంది. అయితే 15 ఏళ్ల వయసులో సంస్థ నిర్వహణ మన చట్టాల ప్రకారం సాధ్యం కాదు. దీంతో తను ఫౌండర్‌గా ఉండి, సీనియర్ ఆర్కిటెక్ట్ కడియాల తులసీరాం, బయోటెక్నాలజిస్ట్ దేబాంజన దత్తా,టెక్నోక్రాట్ శివరామ్ రాథోడ్, సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ మాగంటి వెంకట్, సీనియర్ ఎడ్యుకేషనిస్ట్ లలితాకుమారి.. వంటి విభిన్న రంగాల ప్రముఖులను, కార్పొరేట్ లీడర్స్‌ను, ప్రొఫెసర్స్‌ని, డాక్టర్స్‌ని తన సంస్థకు బోర్డ్ మెంబర్స్‌గా చేసుకున్నాడు. ‘క్విడ్ ఫేసియమ్- స్కిల్ బేస్డ్ వాలంటీరిజం’ను స్థాపించాడు. వాలంటీర్ల వెల్లువ... ‘నాకు మీరు డబ్బులు ఇవ్వొద్దు. విరాళాలో, వస్తువులో వద్దు. మీకు వచ్చిన విద్య పాటలైనా, ఆటలైనా, సేద్యమైనా, వైద్యమైనా.. దానిని పంచుకోండి చాలు’ అంటాడు శ్రీకర్. అదే తమ స్కిల్ బేస్డ్ వాలంటీరిజం అని నిర్వచిస్తాడు. ఇది ఎందరినో ఆకర్షించింది. వయసుకు మించిన పరిణితితో ఓ కుర్రాడు చేసిన విజ్ఞప్తికి వాలంటీర్ల వెల్లువే సమాధానమైంది. ‘ప్రస్తుతం మా ఫేస్బుక్ పేజ్‌కు 2,500 మంది మద్దతు ఉంది. దాదాపు 350 మంది రిజిస్టర్డ్ వాలంటీర్లున్నారు. ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి మన సిటీల నుంచే కాకుండా అమెరికా, యూకే వంటి విదేశాల నుంచి సైతం వాలంటీర్లు ఉన్నారు’ అంటూ స్వల్పకాలంలో తాము సాధించిన విజయాన్ని వివరిస్తాడీ కుర్రాడు. రెండేళ్లుగా దాదాపు 50 వరకూ వాలంటరీ యాక్టివిటీస్ నిర్వహించింది శ్రీకర్ సంస్థ. ఇప్పటిదాకా దాదాపు ఆరువేల మంది విద్యార్థులను మేం కవర్ చేయగలిగాం అని చెప్పాడు శ్రీకర్ ఆనందంగా. ‘ఫైవ్’తో ఫైన్... నిరుపేద, అవసరార్థులైన విద్యార్థుల కోసం అనాథాశ్రమాలు, అంధ విద్యార్థుల కోసం గిటార్ ప్లే చేయడం.. వంటి మ్యూజిక్ బేస్డ్ కార్యక్రమాలతో పుట్టింగ్ బ్యాక్ స్మైల్, చదువుకు సంబంధం లేని జీవితానికి ఉపకరించే అనేక అంశాలను వివరించే బియాండ్ ది బెల్ట్స్, విద్యానంతర కెరీర్‌కు దిక్సూచిగా పనికివచ్చే కెరియర్ క్యాంపస్, లీడర్ షిప్ క్వాలిటీస్‌ను పెంచే యంగ్లీడర్స్, ఎన్విరాన్మెంట్పై బాధ్యతను, దాని ప్రాధాన్యాన్ని వివరించే గ్రినోవేషన్ ఇలా తమ యాక్టివిటీస్‌ను 5 రకాలుగా విభజించి సిటీలోని పలు పాఠశాలల్లో, ఆర్ఫనేజ్ హోమ్స్‌లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది క్విడ్ ఫేసియమ్. వీరి ప్రోగ్రామ్స్‌లో అత్యధిక భాగం మ్యూజిక్ బేస్డ్ కావడంతో సంగీత నైపుణ్యం ఉన్న వాలంటీర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. ‘మ్యూజిక్ డెరైక్టర్ సాల్మన్‌రాజు సహా మా వాలంటీర్లలో వీజే సందీప్, సింగర్స్.. ఉన్నారు. మేం చేస్తున్న కార్యక్రమాన్నివివరించి, మా రిక్వెస్ట్ పోస్ట్ చేస్తే ఇంట్రస్ట్ ఉన్న వారు స్పందిస్తున్నారు’ అని చెప్పాడు శ్రీకర్. ఎదుగుతున్న వయసులోనే చారిటీ వర్క్‌లోకి ఒదిగిపోతున్న ఈ కుర్రాడికి మరింత మంది తోడు కావాలని ఆశిద్దాం. నిస్వార్థంగా సమాజసేవకు సై అంటున్న సిటీలోని శ్రీకర్ లాంటి యువ వాలంటీర్ల ఉజ్వల భవితకు ‘హ్యాపీ వాలంటీర్స్ డే’ చెప్పేద్దాం. -
ప్రాణభిక్ష పెట్టరూ..
క్యాన్సర్ బారిన కొడుకు చికిత్స చేయించలేని స్థితిలో తల్లిదండ్రులు దాతలు ఆదుకోవాలని వేడుకోలు మామడ మండలం పోతారం గ్రామానికి చెందిన చిరువ్యాపారి పబ్బవార్ లక్ష్మణ్, శ్రీదేవి దంపతుల ఏకైక కుమారుడు శ్రీకర్(20). అతడు మొదటినుంచీ చదువులో ప్రతిభ కనబర్చేవాడు. ఇంటర్మీడియెట్ అనంతరం సీఏ కోర్సు చదువుతానంటే రెండేళ్ల క్రితం విజయవాడలోని కళాశాలలో చేర్పించారు. కుమారుడు సీఏ పూర్తిచేసి తమ కుటుంబానికి అండగా ఉంటాడని తల్లిదండ్రులు ఆశించారు. వారి అంచనాల మేరకు సీఏ మొదటి సంవత్సరంలో శ్రీకర్ మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. సెకండియర్ చదువుతుండగా ఓ రోజు అతడికి కడుపునొప్పి రావడంతో స్నేహితులు ఆస్పత్రిలో చూపించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు చేరుకొని కొడుకును ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యపరీక్షల అనంతరం శ్రీకర్ లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు ఏడు నెలల క్రితం ధ్రువీకరించారు. ఇది తెలిసిన తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. కుమారుడిని విజయవాడ, హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చూపించారు. అప్పులు తెచ్చి ఇప్పటి వరకు సుమారు రూ.5 లక్షల వరకు చికిత్సకు వెచ్చించారు. ప్రస్తుతం కిమోథెరపీ చికిత్స చేయిస్తున్నారు. శ్రీకర్‌కు 15 రోజులకు ఒకసారి వైద్యులు రూ.30 వేల విలువైన ఇంజెక్షన్లు, మందులు ఇస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. చికిత్స మరికొంత కాలం కొనసాగించాలని వైద్యులు చెప్పారని, వైద్యం చేయించడానికి తమవద్ద డబ్బుల్లేవని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఖరీదైన వైద్యం చేయించే స్థోమతలేక కొడుకును ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. కళ్ల ముందే కుమారుడు మంచానికే పరిమితం కావడం.. రోజురోజుకు అతడి ఆరోగ్యం క్షీణించడం చూసి తట్టుకోలేకపోతున్నారు. మరికొంతకాలం చికిత్స చేయిస్తే కుమారుడి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు స్పందించి ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటున్నారు. తద్వారా తన కొడుక్కి ప్రాణభిక్ష పెట్టాలని కోరుతున్నారు.