పన్నుల పని మొదలెట్టారా?
శ్రీకర్‌కు జీతం నెలకు 70వేల పైనే. కాకపోతే గత నెల జీతం... అంటే మార్చిది కేవలం 30వేలే వచ్చింది చేతికి. ఎందుకంటే ప్లానింగ్ లోపం. ఆదాయపు పన్ను మినహాయింపులకు ఏమేం చేస్తున్నారో చెప్పాలని వాళ్ల ఆఫీసు ఫైనాన్స్ విభాగం ముందు నుంచీ అడుగుతున్నా... రకరకాల కారణాలు చెబుతూ వచ్చాడు శ్రీకర్. రకరకాల ప్రతిపాదనలు ముందు చెప్పినా... చివరికొచ్చేసరికి అవేమీ చెయ్యలేకపోయాడు. ఫలితం... మార్చి జీతంలో భారీగా కోతపడింది. ఒక్క మార్చి మాత్రమే కాదు. అంతకు ముందు మూడు నెలల నుంచీ... అంటే డిసెంబర్ నుంచీ అలా కోతలు పడుతూనే వచ్చాయి.
ఇక లాభం లేదు!! వచ్చే ఏడాదైనా ముందు నుంచీ ప్రణాళిక వేసుకుని పన్ను మినహాయింపుల కోసం ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా అనుకున్నాడు. అలా అనుకుంటూ ఉండగానే ఏప్రిల్ నెలాఖరు వచ్చేసింది. శ్రీకర్‌కు భయం పట్టుకుంది. నిజానికి ఒక్క శ్రీకర్ మాత్రమే కాదు. చాలామంది పరిస్థితి ఇదే. ఆర్థిక సంవత్సరం మొదలైన దగ్గర్నుంచీ పన్ను ప్లానింగ్ చెయ్యాలని అనుకుంటారు. కానీ సమయం గడిచిపోతూ ఉంటుంది. అందుకే... అలాంటి వారికోసమే ఈ ప్లానింగ్ పాఠం... నిజం చెప్పాలంటే... హడావుడిలోనే ఎక్కువ తప్పులు జరుగుతాయి. ఆర్థిక ప్రణాళికైనా అంతే.
ఆఖరు నిమిషం నిర్ణయాలకు తావులేకుండా గరిష్టంగా పన్ను లాభాలు పొందటానికి ప్రణాళిక కావాలి. ఇప్పటి నుంచీ మొదలుపెడితే అందుకు బోలెడంత సమయం లభిస్తుంది. అవసరమైతే మధ్యలో తగు మార్పులు కూడా చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆదాయ పన్ను చట్టంలో పెద్దగా మార్పులు జరగలేదు కాబట్టి గతేడాదిలాగే ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చు. కానీ గతేడాదితో పోలిస్తే కొన్ని పెట్టుబడి సాధనాల పనితీరులో చాలా మార్పు వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు.
- సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
ఏడాది ఆరంభం నుంచే ప్లానింగ్ తప్పనిసరి
* అలాగైతే జేబుకు భారం లేకుండా మినహాయింపులు
* ఆఖరి క్షణం నిర్ణయాల్లో తప్పులు కూడా జరగొచ్చు
* మధ్యలో నిర్ణయాలు మార్చుకోవటానికీ తగినంత సమయం
* వడ్డీరేట్లు తగ్గుతున్నాయి కనుక ఇపుడే డిపాజిట్లు చేయటం బెటర్
* ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల పనితీరు కూడా ఆశావహమే
షేర్లు కొన్నా పన్ను లాభమే...
గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు స్వల్ప నష్టాలను అందించినా... ఈ ఏడాది ప్రారంభం నుంచి సానుకూల సంకేతాలనే ఇస్తున్నాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మంచి రాబడినిచ్చే అవకాశం ఉంటుంది కనుక కొద్దిగా రిస్క్ చేయగలిగే సామర్థ్యం ఉన్నవారు వీటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వివిధ మార్గాల్లో పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకోసం ఆదాయ పన్ను చట్టంలో 80సీ, 80సీసీజీ అని రెండు సెక్షన్లు ఉన్నాయి.
తొలిసారిగా డీమ్యాట్ ఖాతా తెరిచి షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ కొన్న వారు సెక్షన్ 80సీసీజీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. దీన్నే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీం (ఆర్‌జీఈఎస్‌ఎస్)గా పిలుస్తున్నారు. ఈ పథకం కింద గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లలో సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఇలా వరుసగా మూడేళ్ళు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఈ మినహాయింపు పొందవచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
ఎంపిక చేసిన కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందొచ్చు. వీటిని ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లు లేదా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌గా పిలుస్తారు. దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. వీటి రాబడులు మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి. వీటికి లాకిన్ పిరియడ్ మూడేళ్లు.
ఆరోగ్యంతో పాటు పన్ను లాభం...
ప్రస్తుత పరిస్థితుల్లో దురదృష్టవశాత్తూ ఆసుపత్రి పాలైతే అంతే!! ఎందుకంటే ఆసుపత్రి ఖర్చులు మామూలు జీతగాళ్లు తట్టుకునే స్థాయిలో లేవు. అందుకని ప్రతి ఒక్కరికీ ఇపుడు జీవితబీమా మాదిరే ఆరోగ్య బీమా కూడా అత్యవసరం. కాకపోతే ఈ ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. - గతేడాది నుంచి సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై లభించే పన్ను మినహాయింపు పరిధిని పెంచారు. 60 ఏళ్ళలోపు వయస్సున్న వారైతే ఆరోగ్య బీమాకు చెల్లించే మొత్తంలో రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అదే సీనియర్ సిటిజన్స్‌కైతే ఈ పరిమితి రూ. 30,000.
ముందస్తు వైద్య పరీక్షలకు చేసే వ్యయంపై గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ ఈ మొత్తం రూ.25,000 పరిధిలోకే వస్తుంది. భారా ్యభర్తలు, పిల్లలు, తల్లిదండ్రుల వైద్య పరీక్షలకోసం చేసే ఖర్చులు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. ఇది కాకుండా తల్లిదండ్రులకు చెల్లించే వైద్య బీమా ప్రీమియంపై కూడా మినహాయింపు ఉంటుంది. తల్లిదండ్రులు 60 ఏళ్ళలోపు వారైతే రూ. 25,000, అదే సీని యర్ సిటిజన్స్ అయితే రూ.30,000 అదనంగా పొందొచ్చు. అంటే ఈ సెక్షన్ ద్వారా గరిష్టంగా రూ. 50 వేల నుంచి రూ. 60 వేలవరకు ప్రయోజనం పొందవచ్చు.
ఇవి కాకుండా బీమా, పీపీఎఫ్, హోమ్‌లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, పిల్లల ట్యూషన్ ఫీజులు వంటి అనేక పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చక్కగా వినియోగించుకోవడం ద్వారా సాధ్యమైనంత వరకు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. పైన పేర్కొన్న వాటిలో మీకు అనువైన పథకాలను ఎంచుకొని వాటిలో క్రమ శిక్షణతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను లాభాలతో పాటు దీర్ఘకాలంలో తగినంత సంపదను వృద్ధి చేసుకోవచ్చు.
డిపాజిట్లు... వడ్డీ తగ్గుతోంది
ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరాదాయం పొందాలనుకునే వారికి ఈ ఏడాది కాస్త నిరాశే మిగిలింది. గడిచిన ఏడాది కాలంగా డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండటమే కాకుండా... మరింత తగ్గే అవకాశాలున్నాయంటూ బలమైన సంకేతాలు వస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇంచుమించు రెండు శాతం వరకు తగ్గాయి. మున్ముందు మరింత తగ్గొచ్చు కూడా. అందుకని పన్ను మినహాయింపు కోసం బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారికి కాస్తంత ఇబ్బందే. పెపైచ్చు ఇకపై పోస్టాఫీసుకు సంబంధించిన చిన్న మొత్తాల పొదుపు రేట్లను ప్రతి మూడు నెలలకోసారి సమీక్షించనున్నారు కూడా.
* ప్రస్తుతం పోస్టాఫీసు ఐదేళ్ల డిపాజిట్‌పై 7.9 శాతం వడ్డీని అందిస్తుండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదేళ్ల కాలానికి 7 శాతం వడ్డీరేటు మాత్రమే అందిస్తోంది.
* అమ్మాయిల పెళ్లిళ్లకు అక్కరకొచ్చేలా సుకన్య-సమృద్ధి పేరుతో మరో ప్రత్యేక సేవింగ్స్ పథకం ఉంది. 10 ఏళ్లలోపు అమ్మాయిల పేరిట ఈ * ఖాతా ప్రారంభించొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 8.6 శాతం వడ్డీ వస్తోంది. ఈ పథకం పోస్టాఫీసు, కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల్లో అందుబాటులో ఉంది.
* మున్ముందు వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది కనుక ఇన్వెస్ట్ చేసే ముందు ఎక్కడ అధిక వడ్డీ వస్తోందో పరిశీలించుకోండి. ప్రస్తుతానికి బ్యాంకుల కన్నా పోస్టాఫీసులే అధిక వడ్డీ అందిస్తున్నాయి.
* పన్ను ప్రయోజనాల కోసం ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీరేట్లు మరింత తగ్గే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి.
ఎన్‌పీఎస్... ఆకర్షణ పెరిగింది
ఈ రోజుల్లో ప్రభుత్వోద్యోగాలంటే అతి కొద్ది మందికే పరిమితం. ప్రైవేటు ఉద్యోగాల్లో ఎక్కువ జీతంతో ఉండి రకరకాల పథకాల్లో ఇన్వెస్ట్ చేసేవారికైతే ఇబ్బంది ఉండదు. కానీ చిన్న జీతాలుండి... రిటైరైనవారు ఆ తరవాత ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే పెన్షన్ ప్లాన్‌లు. అందులో ప్రభుత్వ నియంత్రణలో నడిచే న్యూ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ప్రధానమైంది.
ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ అందించే ఈ ఎన్‌పీఎస్ పథకానికి ప్రతి ఏడాదీ కొన్ని అదనపు ఆకర్షణలు చేరుస్తున్నారు. ఈ సారి కూడా ఎన్‌పీఎస్ విత్‌డ్రాయల్స్‌పై చేసిన సవరణలు ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. మొన్నటి వరకు ఎన్‌పీఎస్ నుంచి వెనక్కి తీసుకునే ప్రతి పైసానూ పన్ను ఆదాయంగా పరిగణించి దానిపై పన్ను చెల్లించమని అడిగేవారు. కానీ మొన్నటి బడ్జెట్‌లో ఎన్‌పీఎస్ నుంచి వెనక్కి తీసుకునే 40 శాతం మొత్తంపై ఎలాంటి పన్నూ విధించకూడదని ప్రతిపాదన చేశారు. అంతేకాక ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై సెక్షన్ 80సీసీడీ కింద గరిష్టంగా రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.