ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్‌తో పాటు ఇంధన షేర్లు పతనంతో స్టాక్ సూచీలు మూడోరోజూ (శుక్రవారం) నష్టాలను మూటగట్టుకున్నాయి. జూన్‌లో తయారీ రంగం తొమ్మిది నెలల కనిష్టానికి చేరుకోవడం కూడా సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచింది. ట్రేడింగ్‌లో భారీ నష్టాల్లో కదలాడిన సూచీలు చివరకు ఓ మోస్తారు నష్టాలతో ముగిశాయి.
ఇంట్రాడేలో 925 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 111 పాయింట్ల నష్టంతో 52,907 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 269 పాయింట్ల పతనం నుంచి కోలుకోని 28 పాయింట్ల నష్టంతో 15,752 వద్ద నిలిచింది. ఒక్క ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు వరుసగా 0.74%, అర శాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,138 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,378కోట్ల షేర్లను కొన్నారు.
విండ్‌ఫాల్ ట్యాక్స్ ఎఫెక్ట్
విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై ఎగుమతి పన్ను, విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఆయిల్‌అండ్ గ్యాస్ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ఆయిల్ ఇండియా, ఓఎన్‌జీసీ, రిలయన్స్, గెయిల్ షేర్లు 15 శాతం నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో ఇంధన షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ నాలుగు శాతం నష్టపోయింది.
రిలయన్స్‌కు రూ.1.25 లక్షల కోట్ల నష్టం
కేంద్ర విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌తో దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్రేడింగ్‌లో రెండేళ్ల అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. ఇంట్రాడేలో తొమ్మిది శాతం నష్టపోయి రూ.2365 వద్ద స్థాయిని తాకింది. చివరికి ఏడుశాతం నష్టంతో రూ.2409 వద్ద నిలిచింది. షేరు భారీ పతనంతో రూ.1.25 లక్షల కోట్ల కంపెనీ సంపద ఆవిరైంది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
♦ఏజీఆర్ బకాయిల చెల్లింపుల వాయిదాతో ఎయిర్‌టెల్ 2% క్షీణించి రూ. 673 వద్ద నిలిచింది.
♦బలహీన మార్కెట్లోనూ ఐటీసీ షేరు రాణించింది. ఎఫ్‌ఎంసీజీ షేర్ల ర్యాలీలో భాగంగా 4% లాభపడి రూ. 284 వద్ద స్థిరపడింది.
♦బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడంతో టైటాన్ షేరు ఇంట్రాడేలో 7% నష్టపోయింది. చివరికి 0.20 శాతం లాభంతో రూ.1,946 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment