వాలంటీనేజర్ | today is volunteers day | Sakshi
Sakshi News home page

వాలంటీనేజర్

Published Thu, Dec 4 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

వాలంటీనేజర్

వాలంటీనేజర్

పొద్దున్నుంచి పొద్దు పోయేదాకా పనులు చేస్తాం. ప్రతి పని నుంచి రకరకాల ప్రతిఫలాలు ఆశిస్తాం. ఆశ తీరితే ఉత్సాహంగా, తీరకపోతే మరింత ఆశగా మరుసటి రోజు పనులు మళ్లీ మొదలు పెడతాం. కాని ఒక్క రోజు లేదంటే ఒక్క గంట.. ఏమీ ఆశించకుండా పనిచేస్తే ఊహించనంత ఆనందం అందుతుంది. రేపటి భయాన్ని దూరం చేసేంత ఆత్మవిశ్వాసం ఆవహిస్తుంది. ఇది శ్రీకర్ లాంటి స్వచ్ఛంద సేవకుల మాట. సీనియర్లే  కాదు శ్రీకర్ లాంటి ‘సిటీ’నేజర్లు సైతం ఎంచుకుంటున్న సరికొత్త బాట. సేవామార్గం వైపు మళ్లాలంటే వయసు మళ్లినవారో, ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నవారో మరీ తప్పకపోతే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కోసం చేసేవారో అయి ఉంటారు. దీనికి భిన్నం కుందన్‌బాగ్‌లో నివసించే ఈ కుర్రాడు.                - ఎస్.సత్యబాబు
 
సముద్రపు ఒడ్డున పడి ఉన్న స్టార్‌ఫిష్‌లను ఓ కుర్రాడు ఒకటొకటిగా తిరిగి సముద్రంలోకి విసిరేస్తూ ఉంటాడు.  ఆ పని చూస్తూ ‘పిచ్చా’అంటూ కొందరి ఎద్దేవా, ‘అలా ఎన్నని వేస్తావ్?’ అంటూ కొందరి జాలి చూపులు. అయితే ఆ కుర్రాడు అవేవీ లక్ష్యపెట్టడు. చేసే పని ఆపడు. ‘నేనేం చేయగలనో చేస్తున్నా. చేతనైతే మీరూ చేయండి’అనేది ఆ కుర్రాడి మౌనంలోని భావం.

శ్రీకర్ ఆధ్వర్యంలోని వాలంటరీ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన వెంటనే పడే స్ఫూర్తి దాయక ప్రభావం. ‘మా ఎన్‌జీవోను స్థాపించినప్పుడు నా వయసు 15 ఏళ్లే’ అని చెప్పాడు కూచిభట్ల శ్రీకర్ శ్రీరామ్. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న ఈ సిటీ కుర్రాడు రెండేళ్ల క్రితం స్థాపించిన క్విడ్ ఫేసియమ్ (ఈ లాటిన్ పదానికి వాట్ ఐ కెన్ డు అని అర్థం) సంస్థ.. బహుశా దేశంలోనే తొలిసారి
 ఒక టీనేజర్ సీఈవోగా ఏర్పడిన వాలంటరీ ఆర్గనైజేషన్.
 
గిటార్ టు చారిటీ...
‘చిన్నవయసు నుంచే గిటార్ ప్లే చేయడం అంటే ఇష్టం. ఆరేళ్ల పాటు గిటార్‌ను నేర్చుకుని లండన్ ట్రినిటీ మ్యూజిక్‌లో 6 గ్రేడ్స్ పూర్తి చేశాను. ఈ కోర్సులో అత్యుత్తమంగా చెప్పే గ్రేడ్ 7 పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నా. ఓక్రిడ్జ్ స్కూల్‌లో నా మ్యూజిక్‌కు ఫ్రెండ్స్, క్లాస్‌మేట్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూశాక, స్కూల్లో ఉన్నప్పుడు పలు వాలంటరీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాక.. మ్యూజిక్ ద్వారా సర్వీస్ అనే ఆలోచన వచ్చింది’ అంటూ వివరించాడు శ్రీకర్.  

అయితే ‘ఈ వయసులో వాలంటరీ ఆర్గనైజేషన్ ఏమిటి? చదువు దెబ్బతింటుంది’ అంటూ పేరెంట్స్‌తో పాటు సన్నిహితులూ వారించారు. కాని స్కూల్ స్థాయి నుంచే ఎడ్యుకేషన్‌లో ఏటా టాపర్‌గా నిలిచే శ్రీకర్‌కు తన మీద తనకు నమ్మకం ఉంది. అయితే 15 ఏళ్ల వయసులో సంస్థ నిర్వహణ మన చట్టాల ప్రకారం సాధ్యం కాదు. దీంతో తను ఫౌండర్‌గా ఉండి,  సీనియర్ ఆర్కిటెక్ట్ కడియాల తులసీరాం, బయోటెక్నాలజిస్ట్ దేబాంజన దత్తా,టెక్నోక్రాట్ శివరామ్ రాథోడ్, సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ మాగంటి వెంకట్, సీనియర్ ఎడ్యుకేషనిస్ట్ లలితాకుమారి.. వంటి విభిన్న రంగాల ప్రముఖులను, కార్పొరేట్ లీడర్స్‌ను, ప్రొఫెసర్స్‌ని, డాక్టర్స్‌ని  తన సంస్థకు బోర్డ్ మెంబర్స్‌గా చేసుకున్నాడు. ‘క్విడ్ ఫేసియమ్- స్కిల్ బేస్డ్ వాలంటీరిజం’ను స్థాపించాడు.
 
వాలంటీర్ల వెల్లువ...
‘నాకు మీరు డబ్బులు ఇవ్వొద్దు. విరాళాలో, వస్తువులో వద్దు. మీకు వచ్చిన విద్య పాటలైనా, ఆటలైనా, సేద్యమైనా, వైద్యమైనా.. దానిని పంచుకోండి చాలు’ అంటాడు శ్రీకర్. అదే తమ స్కిల్ బేస్డ్ వాలంటీరిజం అని నిర్వచిస్తాడు. ఇది ఎందరినో ఆకర్షించింది. వయసుకు మించిన పరిణితితో ఓ కుర్రాడు చేసిన విజ్ఞప్తికి వాలంటీర్ల వెల్లువే సమాధానమైంది. ‘ప్రస్తుతం మా ఫేస్‌బుక్ పేజ్‌కు 2,500 మంది మద్దతు ఉంది.

దాదాపు 350 మంది రిజిస్టర్డ్ వాలంటీర్లున్నారు. ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి మన సిటీల నుంచే కాకుండా అమెరికా, యూకే వంటి విదేశాల నుంచి సైతం వాలంటీర్లు ఉన్నారు’ అంటూ స్వల్పకాలంలో తాము సాధించిన విజయాన్ని వివరిస్తాడీ కుర్రాడు. రెండేళ్లుగా దాదాపు 50 వరకూ వాలంటరీ యాక్టివిటీస్ నిర్వహించింది శ్రీకర్ సంస్థ. ఇప్పటిదాకా దాదాపు ఆరువేల మంది విద్యార్థులను మేం కవర్ చేయగలిగాం అని చెప్పాడు శ్రీకర్ ఆనందంగా.

‘ఫైవ్’తో ఫైన్...
నిరుపేద, అవసరార్థులైన విద్యార్థుల కోసం అనాథాశ్రమాలు, అంధ విద్యార్థుల కోసం గిటార్ ప్లే చేయడం.. వంటి మ్యూజిక్ బేస్డ్ కార్యక్రమాలతో పుట్టింగ్ బ్యాక్ స్మైల్, చదువుకు సంబంధం లేని జీవితానికి ఉపకరించే అనేక అంశాలను వివరించే బియాండ్ ది బెల్ట్స్, విద్యానంతర కెరీర్‌కు దిక్సూచిగా పనికివచ్చే కెరియర్ క్యాంపస్, లీడర్ షిప్ క్వాలిటీస్‌ను పెంచే యంగ్‌లీడర్స్, ఎన్విరాన్మెంట్‌పై బాధ్యతను, దాని ప్రాధాన్యాన్ని వివరించే గ్రినోవేషన్ ఇలా తమ యాక్టివిటీస్‌ను 5 రకాలుగా విభజించి సిటీలోని పలు పాఠశాలల్లో, ఆర్ఫనేజ్ హోమ్స్‌లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది  క్విడ్ ఫేసియమ్.  

వీరి ప్రోగ్రామ్స్‌లో అత్యధిక భాగం మ్యూజిక్ బేస్డ్ కావడంతో సంగీత నైపుణ్యం ఉన్న వాలంటీర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. ‘మ్యూజిక్ డెరైక్టర్ సాల్మన్‌రాజు సహా మా వాలంటీర్లలో వీజే సందీప్, సింగర్స్.. ఉన్నారు. మేం చేస్తున్న కార్యక్రమాన్నివివరించి, మా రిక్వెస్ట్ పోస్ట్ చేస్తే ఇంట్రస్ట్ ఉన్న వారు స్పందిస్తున్నారు’ అని చెప్పాడు శ్రీకర్. ఎదుగుతున్న వయసులోనే చారిటీ వర్క్‌లోకి ఒదిగిపోతున్న ఈ కుర్రాడికి మరింత మంది తోడు కావాలని ఆశిద్దాం. నిస్వార్థంగా సమాజసేవకు సై అంటున్న సిటీలోని శ్రీకర్ లాంటి యువ వాలంటీర్ల ఉజ్వల భవితకు ‘హ్యాపీ వాలంటీర్స్ డే’ చెప్పేద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement