
శాన్ ఫ్రాన్సిస్కో: ’బ్రాండ్ ఇండియా’కు ప్రచారకర్తలుగా వ్యవహరించాలని భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు (సీఏ) కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. దేశంలోకి పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని, దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం 3.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్ వచ్చే 30 ఏళ్లలో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని గోయల్ చెప్పారు.
‘భారత్‌లో పెట్టుబడుల అవకాశాల గురించి మీరు అంతర్జాతీయ క్లయింట్లకు వివరించండి. ఆ విధంగా అమెరికాలోను ఇతర ప్రాంతాల్లోను ఉన్న భారతీయ సీఏలు ఆయా దేశాలకు, భారత్‌కు మధ్య వారధిగా నిల్చినవారవుతారు‘ అని ఆయన పేర్కొన్నారు. అలాగే అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు, సేవలను భారత్ అందుబాటు ధరల్లోనే అందిస్తున్న విషయాన్ని కూడా ఇతర దేశాలకు తెలియజేయాలని గోయల్ సూచించారు. ఐసీఏఐ సభ్యులు పండుగలు మొదలైన సందర్భాల్లో బహుమతులు ఇచ్చేందుకు మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. దేశీ సీఏ సంస్థలు అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలుగా ఎదిగే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment