
శ్రీరామాయణంలో... దశరథ మహారాజు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికీ వివాహాలు చేయాలని సంకల్పించాడు. సభతీర్చి వారికి తగిన వధువులను వెతకవలసిందిగా కోరుతూ మంత్రులతో, పురోహితులతో సమాలోచనలు జరుపుతున్నాడు. అదే సమయానికి విశ్వామిత్రుడు వచ్చాడు. సాక్షాత్ బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు వచ్చేసరికి మహారాజు కంగారు పడిపోయి గబాగబా వెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదు లిచ్చి ఆహ్వానించాడు.
బ్రహ్మర్షి కాకముందు విశ్వామిత్రుడు కోపధారి కనుక తొందరపాటులో ఏ శాపమిస్తాడో అని భయపడిపోయి... ఒకటికి పదిమార్లు ... ఆయన ఏమీ అడగకపోయినా... మీరు రావడం వల్ల మా వంశం తరించింది, నేను తరించాను, నా ఇల్లు పావనమయింది, మీకు ఏం కావాలో చెప్పండి, ఏవయినా చేసేస్తాను, ఏదయినా ఇచ్చేస్తాను.. అని అదేపనిగా చెప్పాడు.
అన్నీ విన్న మహర్షి చివరన మాట్లాడుతూ.. ‘‘రాజా! నేనొక యజ్ఞాన్ని తలపెట్టాను. మారీచ సుబాహులనే రాక్షసులు వచ్చి నా యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఆ యజ్ఞ సంరక్షణ కొరకు మీ కుమారులయిన రామలక్ష్మణులను ఇద్దరినీ నాతో పంపించండి’’ అన్నాడు. అది విని దశరథుడు హతాశుడయ్యాడు. తన కుమారులకు రాక్షసుల చేతిలో ఎక్కడ ఏ ఆపద కలుగుతుందో అని అనేక సాకులు చూపిస్తూ నేను పంపను... నేను పంపను... అనడం మొదలు పెట్టాడు. దానికి విశ్వామిత్రుడు ..‘‘ఒకసారి మాటిచ్చి తప్పే లక్షణం ఉన్నవాడా! దీర్ఘకాలంలో శోకించెదవుగాక!’’ అన్నాడు. విశ్వామిత్రుడు అడగకముందే తొందరపడిపోయి చేసేస్తాను అనడం వల్ల .. తీరా అడిగేసరికి చేయలేని పరిస్థితి కొనితెచ్చుకున్నందువల్ల దశరథ మహారాజు అంతటివాడు సంకటపరిస్థితిలో పడ్డాడు.
ఏదయినా ఒకమాట ఇచ్చేముందు మనకున్న పరిమితుల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఇది నేను చేయగలనా? నాకు ఆ సామర్థ్యం ఉందా? నాకు సాధ్యమవుతుందా? ఆలోచించి... చెయ్యగలిగితే చేయగలను.. అని చెప్పాలి. చేయలేనప్పుడు అదే చెప్పాలి. గణిత శాస్త్ర మేథావి, సంగీత శాస్త్రంలో, రాజకీయంలో, మతవిశ్వాసాలను సిద్ధాంతీకరించడంలో దిట్ట అయిన పైథాగరస్ ఒక మాట అంటాడు.. ‘‘అత్యంత ప్రాచీనమైన మాటలు, చాలా చిన్న చిన్న మాటలు ఏవి! అంటే... ‘‘యస్’’, ‘‘నో’’. అని – వీటిని వాడేటప్పుడు ఎంతో విచక్షణతో, సంయమనంతో వాడాలనేది ఆయన ఉద్దేశం.
అలాగే గొప్ప అవకాశం వచ్చినప్పుడు... ముందూ వెనకలు ఆలోచించకుండా తిరస్కరించడం, తమను తాము నిరూపించుకునే అవకాశాన్ని, జీవితంలో వృద్ధిలోకి వచ్చే అవకాశాన్ని. అపరిపక్వ అపోహలతో, లేనిపోని భయాలతో చేజేతులా వదులుకోవడం తరువాత మెలికలు తిరిగిపోవడం కంటే.. అవును అని కానీ, కాదు అని కానీ చెప్పేముందు తొందరపడకుండా, ఆవేశాలకు లోను కాకుండా పదిసార్లు విజ్ఞతతో ఆలోచించి ఆ పదాలను వాడుతూ ఉండాలి.
ఒక వ్యక్తి గౌరవం, మర్యాద, అభ్యున్నతి, ప్రతిష్ఠ, విశ్వసనీయత... వంటివన్నీ దీనితో ముడిపడి ఉన్నాయి. యస్ లేదా నో... అవును లేదా కాదు... చిన్న పదాలే కానీ జీవితాలను మలుపు తిప్పేస్తాయి... జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించడం ఉత్తమం.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు