Restraint
-
చిన్న మాటలే.. ఛిన్నాభిన్నం చేసేస్తాయి
శ్రీరామాయణంలో... దశరథ మహారాజు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికీ వివాహాలు చేయాలని సంకల్పించాడు. సభతీర్చి వారికి తగిన వధువులను వెతకవలసిందిగా కోరుతూ మంత్రులతో, పురోహితులతో సమాలోచనలు జరుపుతున్నాడు. అదే సమయానికి విశ్వామిత్రుడు వచ్చాడు. సాక్షాత్ బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు వచ్చేసరికి మహారాజు కంగారు పడిపోయి గబాగబా వెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదు లిచ్చి ఆహ్వానించాడు. బ్రహ్మర్షి కాకముందు విశ్వామిత్రుడు కోపధారి కనుక తొందరపాటులో ఏ శాపమిస్తాడో అని భయపడిపోయి... ఒకటికి పదిమార్లు ... ఆయన ఏమీ అడగకపోయినా... మీరు రావడం వల్ల మా వంశం తరించింది, నేను తరించాను, నా ఇల్లు పావనమయింది, మీకు ఏం కావాలో చెప్పండి, ఏవయినా చేసేస్తాను, ఏదయినా ఇచ్చేస్తాను.. అని అదేపనిగా చెప్పాడు. అన్నీ విన్న మహర్షి చివరన మాట్లాడుతూ.. ‘‘రాజా! నేనొక యజ్ఞాన్ని తలపెట్టాను. మారీచ సుబాహులనే రాక్షసులు వచ్చి నా యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఆ యజ్ఞ సంరక్షణ కొరకు మీ కుమారులయిన రామలక్ష్మణులను ఇద్దరినీ నాతో పంపించండి’’ అన్నాడు. అది విని దశరథుడు హతాశుడయ్యాడు. తన కుమారులకు రాక్షసుల చేతిలో ఎక్కడ ఏ ఆపద కలుగుతుందో అని అనేక సాకులు చూపిస్తూ నేను పంపను... నేను పంపను... అనడం మొదలు పెట్టాడు. దానికి విశ్వామిత్రుడు ..‘‘ఒకసారి మాటిచ్చి తప్పే లక్షణం ఉన్నవాడా! దీర్ఘకాలంలో శోకించెదవుగాక!’’ అన్నాడు. విశ్వామిత్రుడు అడగకముందే తొందరపడిపోయి చేసేస్తాను అనడం వల్ల .. తీరా అడిగేసరికి చేయలేని పరిస్థితి కొనితెచ్చుకున్నందువల్ల దశరథ మహారాజు అంతటివాడు సంకటపరిస్థితిలో పడ్డాడు. ఏదయినా ఒకమాట ఇచ్చేముందు మనకున్న పరిమితుల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఇది నేను చేయగలనా? నాకు ఆ సామర్థ్యం ఉందా? నాకు సాధ్యమవుతుందా? ఆలోచించి... చెయ్యగలిగితే చేయగలను.. అని చెప్పాలి. చేయలేనప్పుడు అదే చెప్పాలి. గణిత శాస్త్ర మేథావి, సంగీత శాస్త్రంలో, రాజకీయంలో, మతవిశ్వాసాలను సిద్ధాంతీకరించడంలో దిట్ట అయిన పైథాగరస్ ఒక మాట అంటాడు.. ‘‘అత్యంత ప్రాచీనమైన మాటలు, చాలా చిన్న చిన్న మాటలు ఏవి! అంటే... ‘‘యస్’’, ‘‘నో’’. అని – వీటిని వాడేటప్పుడు ఎంతో విచక్షణతో, సంయమనంతో వాడాలనేది ఆయన ఉద్దేశం. అలాగే గొప్ప అవకాశం వచ్చినప్పుడు... ముందూ వెనకలు ఆలోచించకుండా తిరస్కరించడం, తమను తాము నిరూపించుకునే అవకాశాన్ని, జీవితంలో వృద్ధిలోకి వచ్చే అవకాశాన్ని. అపరిపక్వ అపోహలతో, లేనిపోని భయాలతో చేజేతులా వదులుకోవడం తరువాత మెలికలు తిరిగిపోవడం కంటే.. అవును అని కానీ, కాదు అని కానీ చెప్పేముందు తొందరపడకుండా, ఆవేశాలకు లోను కాకుండా పదిసార్లు విజ్ఞతతో ఆలోచించి ఆ పదాలను వాడుతూ ఉండాలి. ఒక వ్యక్తి గౌరవం, మర్యాద, అభ్యున్నతి, ప్రతిష్ఠ, విశ్వసనీయత... వంటివన్నీ దీనితో ముడిపడి ఉన్నాయి. యస్ లేదా నో... అవును లేదా కాదు... చిన్న పదాలే కానీ జీవితాలను మలుపు తిప్పేస్తాయి... జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించడం ఉత్తమం. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నిరాడంబరత అంటే..?
విజ్ఞానం... సాంకేతికాభివృద్ధి వల్ల మన భౌతికమైన సుఖాన్ని పెంచే వస్తువులు ఇబ్బడిముబ్బడి గా మనకి అందుబాటులోకి వచ్చాయి. మన అవసరాలు పెరుగుతున్నాయి. పెరిగిన కొద్దీ వాటిని సమకూర్చుకోగలిగే స్థాయిలో మన ఆదాయాన్ని పెంచుకోవలసి వస్తోంది. సాంకేతిక–రంగ నిపుణులు అందించే ఫలాలను తప్పనిసరిగా పొందాల్సిందే. ఇక్కడే మన ఔచితి వ్యక్తమవ్వాలి. ప్రాధాన్యతలను తెలుసుకోవాలి. అసలు అవసరముందో లేదో వివేచన చెయ్యాలి. ఇది పరిశీలించి అప్రమత్తులమైతే నిరాడంబరతకు దగ్గరగా ఉన్నట్టే. అసాధారణ ప్రతిభ చూపిన తరువాత వచ్చే ప్రశంసలకు చిరునవ్వుతో స్పందించటం నిరాడంబరత. అద్భుతమైన ప్రతిభను ఓ కవి తన గీతంలో గాని, గాయకుడు పాటలో గాని, నర్తకి తన నాట్యంలోగాని లేదా ఏ ఇతర లలిత కళల్లో గాని చూపినపుడు ప్రజలు హర్షధ్వానాలు చేసిన క్షణాన ఎగిరెగిరి పడకుండా ఉండటం నిరాడంబరుల లక్షణం. నిరాడంబరతలో ఉన్న అనేక కోణాలలో ఇక్కడ మనకు స్ఫురించవలసింది నిగర్వం. అసామాన్యులైనా సామాన్యులవలే వర్తించటం, అందరితో కలుపుగోలుగా ఉంటూ అరమరికలు లేకుండా మాట్లాడటం నిరాడంబరుల వ్యక్తిత్వంలోని ఒక పార్శ్వమే. వారి లోని విద్వత్తు గాని, అద్వితీయమైన కళానైపుణ్యాన్ని గాని, విశేషమైన ప్రజ్ఞను గాని ఎక్కడా అసందర్భంగా.. అనుచితంగా ప్రదర్శన చేయరు. వారి వైఖరి నిండుకుండే. అట్టహాసం.. హడావిడి. వెంపర్లాట లేకుండా ఉండటమే వీరి విశిష్టత. ఆడంబరం లేకపోవటమే నిరాడంబరం. నిరాడంబరత ఇహ ప్రపంచానికే కాక ఆంతరంగిక జగత్తుకు అవసరం. నిజానికి అత్యంత ఆవశ్యకం. ఎందుకు..? నిరాడంబరత్వాన్ని మాటల్లో.. చేతల్లో చూపించే వారెందరో ఉన్నారు. అది నిస్సందేహంగా మెచ్చుకోదగ్గ విషయమే. వీరికి మనస్సు లో కూడ అదే భావన ఉండాలి. మనస్సు ఆడంబరపుటూయలలూగరాదు. ఐహిక సుఖాల వైపు మొగ్గు చూపకూడదు. నిగ్రహశక్తి కావాలి. అపుడే అద్భుత సుఖజగత్తును త్రోసిరాజనగలం. దానిని గురించి ఎవరు మాట్లాడినా.. ఎన్ని ఆకర్షణలు చూపినా అణుమాత్రమైన చలించం. ఇవి సుఖాన్ని మాత్రమే ఇస్తాయి. వీటి ప్రభావం తాత్కాలికం. శాశ్వతమైన.. అలౌకిక ఆనందాన్నిచ్చే ఉన్నతమైన ఆలోచనాసీమలో మీ మనస్సు విహరిస్తున్న వేళ ఈ బాహ్యప్రపంచపు సుఖం గురించి చింతన ఉండనే ఉండదు. అవి పొందలేకపోతున్నామనే స్పృహే ఉండదు. ఈ స్థితిలో మాట.. చేత.. మనస్సు ఏకమై నిరాడంబరత గంభీర ప్రవాహమవుతుంది. ఆ స్థితికి చేరుకున్నవాళ్లు నిస్సందేహం గా మహానుభావులే. అందుకే నిరాడంబరత అలవడటం.. వ్యక్తిత్వంలో ఓ భాగమవ్వటం చాలా కష్టమైనదని పెద్దలంటారు. అయితే, అసాధ్యం కాదు. కాని ఎంతో సాధన చేస్తేగానీ పట్టుబడని విద్య. నిరాడంబర జీవితం.. ఉన్నత ఆలోచన అనే సిద్ధాంతాన్ని పథంగా తమ జీవితాన్ని పయనింపచేసుకున్నవారు అత్యంత నిరాడంబరులు. ఆదర్శప్రాయులు.. ప్రాతః స్మరణీయులు. నిరాడంబరత కొందరికి స్వాభావికం. కానికొందరికి అభ్యాసం వల్ల అలవడుతుంది. ఈ ప్రపంచంలో ప్రతిభావ్యుత్పత్తులు.. ప్రజ్ఞ... చాలామందిలో ఉండచ్చు. మనకన్నా ప్రతిభావంతులు ఉండచ్చు. జ్ఞానంలో.. నైపుణ్యంలో అత్యద్భుత శక్తి సామర్థ్యాలున్నవారు అనేకులు ఉండవచ్చు. ఇది మదిలో పెట్టుకోవాలి. ఈ నిరంతర స్ఫురణ మనల్ని నిరాడంబరులుగానే ఉంచుతుంది. అతిశయం.. ఆవేశ కావేశాలు.. అతి విశ్వాసం మనల్ని నిరాడంబరతకు దూరం చేస్తాయి. నిరాడంబరత్వం మన ఆహార్యానికీ వర్తిస్తుంది. మనం వేసుకునే దుస్తులు మన ఆలోచనా తీరును చెపుతాయి. సమయానికి.. సందర్భానికి ఏ రకమైన ఉడుపులు వేసుకోవాలో నేర్పుతాయి. ఎంత విలువైన దుస్తులు ధరిస్తే మనకంతటి విలువ అనుకునే వారందరూ ఆడంబరులే. శుభ్రమైన... సాధారణమైన దుస్తులు ధరించి కూడ గొప్ప వ్యక్తిత్వం, ప్రజ్ఞ కలవారు లోకంలో మన్నన పొందుతారు. గొప్ప విద్యావేత్త... మేధావి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ సాధారణ దుస్తులు ధరించి తను ప్రసంగించవలసిన సభకు విచ్చేసినపుడు ఆయనకు జరిగిన అనుభవం... ఆయన దానికి స్పందించిన తీరు మనకందరకు తెలుసు. మనిషికి జ్ఞానం... ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రధానం. వాటికే విలువివ్వాలి. నిరాడంబరులను చూస్తే కొంతమందికి చిన్న చూపు. ఒక రకమైన ఏవగింపు. వారు పిసినారులని, జీవితాన్ని, దానిలోని సుఖాన్ని అనుభవించటం తెలియదని ఆలోచన.. మితిమీరిన పొదుపు తో ఈ దేహాన్ని కష్టపెడతారని వారి భావన. నిజానికి వీరే నిరాడంబరతలోని అందాన్ని.. ఆనందాన్ని చూడలేక అలా విమర్శ చేస్తుంటారు. ఐహిక సుఖం అశాశ్వతమైనది. అస్థిరమైనది. చంచలమైనది. నిరాడంబరత ఇచ్చేది ఆనందం. ఇదే శాశ్వతమైనది.. నిజమైనది. మనకవసరమైన వాటినే ఉంచుకోవాలి. మనం ఉపయోగించని వస్తువులను అవసరార్థులకు ఇచ్చే అలవాటు చేసుకోవాలి. అనవసరంగా కొనే అలవాటు మానుకోవాలి. ఈ పొదుపరితనమే ఒకరకమైన నిరాడంబరత్వం. నిరాడంబరత అలవరచుకోవటం వల్ల మనం సమయాన్ని వృధా కానీయం. మనకెంతో సమయం మిగులుతుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన జీవనగమనాన్ని పరిశీలించి లోపాలను సరిదిద్దుకోవచ్చు. చేయతగ్గ మంచిపనులను చేసేందుకు సమయం కేటాయించవచ్చు. చావు పుట్టుకల చట్రం నుండి బయటపడే మార్గాన్ని అన్వేషించవచ్చు. మనలోని మానవీయతను మన జీవనం లో చూపి ఈ సృష్టిలో మనిషి సర్వోన్నతుడన్న గొప్పవారి మాటలను రుజువు చేయచ్చు. మానవుడు మహనీయుడు కాగలడని వెల్లడి చేయవచ్చు. లేనివారికి.. యోగ్యులైనవారికి మన శక్తిమేరకు దానం చేయవచ్చు. ఆపన్నులకు చేయూతనివ్వవచ్చు. నిరాడంబరతను అలవరచుకుంటే దానిలో నిబిడీకృతమైన ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఏమిటా ఐశ్వర్యం..!? పొదుపరితనం.. నిర్మలత్వం... పవిత్రత..« దార్మికత...అద్భుతమైన ఆత్మసంతృప్తి...ఉన్నత ఆలోచన... సాధన... సత్యశోధన ఇలా ఎన్నో ఎన్నెన్నో. పారమార్థిక దృష్టిలో మనమెంత నిరాడంబరులమైతే అంతటి ఐశ్వర్యవంతులం. ఎవరికి తృప్తి ఉంటుందో వారే ధనవంతులు. ఈ తృప్తికి.. అంతులేని సంపద కలిగి ఉండటానికి సంబంధమే లేదు. ఈ తృప్తి ఎలా వస్తుంది.. ఎవరికి ఉంటుంది? నిరాడంబరత వల్ల... ఆ విధమైన జీవితం గడపగలిగే వారికుంటుంది. అంటే సాదాసీదా జీవన శైలి. దీనివల్ల తృప్తి వస్తుంది. ఇదే మానసిక ప్రశాంతతనిస్తుంది. ఇది గొప్ప ఆనందస్థితి. దీన్ని సాధించటానికే యోగుల దగ్గర నుండి సామాన్యుల వరకూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు... వారి వారి జీవిత నేపథ్యం.. ఆలోచనా విధానం... వారికి తోచిన మార్గాలననుసరించి. గమ్యాలు వేరు, కాని లక్ష్యం ఒకటే. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
ముఖేష్ అంబానీకి షాక్!
ప్రపంచ చమురు రంగంలో పాగా వేయాలనుకుంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానికి షాక్ తగలనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్ వ్యాపారంలో 25 శాతం వాటా కొనుగోలు చేయాలని భావించిన ప్రపంచంలోనే అతి పెద్ద చమురు సంస్థ, సౌదీ ఆరామ్కోకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రిలయన్స్ వ్యాపారంలోని 25 శాతం వాటాను ఆరామ్కో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో దాన్ని భారత ప్రభుత్వం అడ్డుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వార్తను ప్రచురించింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ గ్యాస్‌పై కొనసాగుతున్న కోర్టు కేసులో భాగంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. తమ కంపెనీ ఆస్తులను వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రిలయన్స్ డైరెక్టర్లను ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 6న విచారణ చేపట్టనున్నట్టు ఆ పత్రిక పేర్కొంది. గతంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్స్ వ్యాపారంలో మైనారిటీ (25 శాతం)వాటా కోసం సౌదీ ఆరామ్కో కంపెనీ 1,000–1,500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాకరించింది. మార్కెట్ ఊహాగానాలపై స్పందించడం తమ విధానం కాదని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
సంజయుడు
ఐదోవేదం మహాభారత పాత్రలు - 38 సంజయుడు మహాభారతమంతటా వ్యాపించి ఉంటాడు. యుద్ధాన్ని ఆమూ లాగ్రమూ చూసి యోద్ధల మనోభావాల్ని వర్ణించినవాడే సంజయుడు. అతడు సూత పుత్రుడు. కర్ణుడూ కీచకుడూ కూడా సూత పుత్రులే. కానీ వీళ్లకూ సంజయుడికీ ఎంతో తేడా. సూతులంటే రథాలను నడిపేవాళ్లు, సూతుల ఇంట్లో పుట్టబట్టి సంజయుడు సూతపుత్రుడయ్యాడు. ఇతను ధృత రాష్ట్రుడి రథసారథి. రథాన్ని ఒక తీర్చిన తీరులో నడపవలసినవాడికి తేటనైన తెలివి ఉండాలి. కలతలూ కలవరాలూ ఉండకూడదు. అంటే, ఈ ‘సారథి’ కలతలను పూర్తిగా జయించినవాడు. లోచూపుతోనే ఈ విజయం సాధ్యమవు తుంది. నిష్పక్ష పాతంగా, తేటనైన సహజావబోధంతో, అంటే, ఆగమశక్తితో తనను తాను సాక్షిభూతమై పరీక్షించు కొంటూ ఉండడమనేదే సంజయత్వం. భగవద్గీతలో మనం ‘సంజయ ఉవాచ’ అనే మాటల్ని చూసి ‘ఇతగాడెవ డబ్బా ఆకాశం నుంచి ఊడిపడ్డాడ’ని విస్తుపోతూ ఉంటాం. వివరంగా చదివితే అర్థమవుతుంది ఇతను విదురుడితో పోల్చ దగిన తెలివితేటలున్నవాడని. విదురుణ్ని మనం ధర్మాధర్మ వివేచనగానూ మనస్సాక్షిగానూ చెప్పుకొన్నాం. అతను కురువంశంలోని వాడయ్యుండి కూడా ఏవిధంగా అన్ని కావేషాలకూ లోభాలకూ దూరంగా ఉన్నాడో, అలాగే సంజ యుడు ధృతరాష్ర్టుడి సేవకు డయ్యుండి కూడా నిష్పక్ష పాతంగానే స్వామికి కూడా తప్పు చేస్తున్నావని సూటిగా చెప్పగలిగే నైతిక ధైర్యం ఉన్నవాడు. యుద్ధాన్ని ఒక ప్రేక్షకుడి మాదిరిగా చూస్తూ, యుద్ధం చేసేవాళ్ల మనో భావాల్ని కూడా తెలుసుకొంటూ, ఏ భావానికీ లొంగ కుండా ఉండగలడు కనకనే, సంజయుడికి ఆ మొత్తం యుద్ధ సంఘట నలను ధృతరాష్ట్రుడికి పూసగుచ్చినట్టు చెప్పగలిగే ఆధ్యాత్మిక శక్తిని వ్యాసమహర్షి, తన తపశ్శక్తితో ప్రసాదిం చాడు. సంజయుడు రణ రంగంలో తిరిగినా అతన్ని ఏ ఆయుధమూ ఏ బాణమూ ఏ అస్త్రమూ ఏ శస్త్రమూ తాకకుండా ఉండేలా వరం ఇవ్వడంలోనే అతని నిస్సంగత్వమూ నిష్పక్షపాతమూ మనకు ప్రకాశిస్తాయి. వరమనే మాటతో సంజయ త్వాన్ని బహిరంగపరిచాడు వ్యాసుడు. సంజయుడు ముందస్తుగా రాయ బారిగా అవుపిస్తాడు. ధృతరాష్ట్రుడు ఇతన్ని ధర్మరాజుకు ఏ వాగ్దానమూ చేయకుండానే యుద్ధానికి విముఖుడయ్యేలాగ చేయమని రాయబారానికి పంపాడు. ‘నేను అర్జును డన్నా వాసుదేవుడన్నా భీముడన్నా నకుల సహదేవులన్నా భయపడటం లేదు. క్రోధ దీప్తుడైన ధర్మరాజు కోపం నుంచి చాలా భయపడుతున్నాను. అతని మనస్సం కల్పం సిద్ధించి తీరుతుంది. అంత తపస్సంపన్నుడతను; అంతటి జితేంద్రి యుడతను. నువ్వు ఉపప్లావ్యానికి వెళ్లి, రాజులందరి మధ్యా నా మాటలను చెబుతూ ధర్మరాజుకు కోపం వచ్చే మాట మాత్రం అనకుండా నెట్టుకురావాలి. ధర్మ రాజుకు కోపం రాకపోతే యుద్ధం ఆగు తుంది’ అంటూ సంజయుణ్ని తర్ఫీదు చేసి ధృతరాష్ట్రుడు పంపాడు. సంజయుడు ధృతరాష్ట్రుడు నేర్పినట్టే అటు కర్ర విరగకుండా ఇటు పాము చావకుండా ధర్మరాజుతో చాకచక్యంగా మాట్లాడాడు: ‘శాంతి కోసమే ధృతరాష్ట్ర మహారాజు నన్ను నీ దగ్గరికి పంపాడు. మీ అందరిలో ఎంతగా సత్త్వ గుణం నిండి ఉందంటే, మీరు పిసరంత తప్పుచేసినా అది, తెల్లగుడ్డ మీద కాటుక చుక్క పడ్డట్టు కొట్టొచ్చినట్టు అవుపిస్తుంది. యుద్ధమం టేనే సర్వనాశనం; పాపానికి తెర ఎత్తి నట్టవుతుంది. మీకు శ్రీకృష్ణుడూ చేకితా నుడూ సాత్యకీ సహాయకులు; మీ మామ గారైన ద్రుపదుడి బాహు బలచ్ఛాయలో మీరు సురక్షితులై ఉన్నారు. అటువంటి మిమ్మల్ని ఇంద్రుడితో సహా దేవతలం దరూ దండెత్తి వచ్చినా గెలిచే ఆశలెక్క డుంటాయి? అలాగే, భీష్మ ద్రోణకర్ణ శల్య కృపాశ్వత్థామల చేతుల్లో అభిగుప్తమైన కౌరవ సేనను మాత్రం ఎవరు గెలవగల మని సాహసం చేయగలరు చెప్పు? ఈ యుద్ధమే జరిగితే, జయం ఎవర్ని వరి స్తుందో ఇదమిత్థంగా చెప్పలేం. లోకంలో పాండవులు ధర్మపరులని ప్రఖ్యాతికెక్కిన వాళ్లు. మీరు చేసిన ప్రతి పనీ ఎప్పుడూ ధర్మానుసారంగానే ఉంటుంది. ఆ మీ కీర్తిని ఇప్పుడు అనర్థాలన్నిటికీ హేతు వయ్యే యుద్ధానికి ఒడిగట్టి పాడుచేసుకో వద్దు. మీకు ఆ కౌరవులు భాగం ఇవ్వమని ఎంత మొండికేసుకొని కూర్చున్నా, అజాత శత్రువని పేరుకెక్కిన నువ్వు, అంధకవృష్టి వంశజుల రాజ్యవీధుల్లో బిచ్చమెత్తు కొనైనా జీవ నిర్వాహం చేసుకోవడం మెరుగు తప్ప, యుద్ధం చేసి రక్త సిక్తమైన రాజ్యాన్ని తీసుకోవడం మంచిది కాదు. యుద్ధానికి నీకిది అనుకూల సమయం కూడా కాదు. నువ్వు పదమూడేళ్లు రాజ్యానికి దూరంగా ఉండి నీ శత్రుబలం పెరిగేలా చేసుకోడమే కాదు, నీ సహాయకుల్ని కూడా దుర్బలంగా చేసు కున్నావు. అంచేత ఇది నీకు హీనకాలం’... ఇలా యుద్ధం నుంచి వెను దిరిగేలాగ చేయడానికి శాయశక్తులా ఉపన్యసించాడు సంజయుడు. ధర్మరాజు ధృతరాష్ట్రుడి విషమ ప్రవర్తనను గుర్తుకు తెచ్చాడు. తమరు ఏమని సలహా ఇస్తున్నారో దాన్ని తామే పాటించకుండా ఉండడం సబబు కాదు గదా అని హితవు చెప్పాడు. ‘నేను వాసు దేవుడి మాటను జవదాటను. అతను ఏమంటాడో విన’మంటూ సంజయుడితో అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ‘నేను కోరేదీ శాంతేనయ్యా! కానీ ఇక్కడ శాంతి అతి దుష్కరమనిపిస్తోంది. కొడుకు వలలో పడి ధృతరాష్ట్రుడు కలహాన్ని పెంచు తున్నాడే తప్ప తక్కువయ్యేలాగ చేయటం లేదు. నావల్ల గానీ ధర్మరాజు బావ వల్ల గానీ ధర్మలోపం జరగదని నీకు తెలిసినా, నీవల్ల అధర్మం జరగకుండా చూసుకోమని ఎలాగ అంటున్నావో నాకు బోధపడటం లేదు. నువ్వు జ్ఞానుల్లోకల్లా శ్రేష్ఠుడివి. అయినా కౌరవుల స్వార్థం సిద్ధించాలని ఎందుకు వల పన్నుతున్నావు? దొంగ దాక్కొని డబ్బును దొంగిలించినా, ఎదురుగా బాహాటంగా అందరూ చూస్తూండగా కొల్లగొట్టినా రెండు పనులూ నిందించదగినవే గదా. ఈ దొంగలకూ ఆ దుర్యోధనుడికీ మధ్య ఎక్కడైనా తేడా ఉందంటావా చెప్పు? దుర్యోధనుడు అతికక్కుర్తితో అన్నదమ్ముల భాగాన్ని మొత్తాన్నీ హరిద్దామని గుంటనక్కలాగ చూస్తున్నాడు. కానీ అతను అదే ధర్మమనుకుంటున్నాడు. ఆ భాగం నిజానికి వాళ్ల దగ్గర ఇల్లడగా మాత్రమే ఉంది. మోసమే కానీ మోసం కాకపోనీ, జూదంనాడు అనుకొన్న ప్రకారం నియమాన్ని పాలించి తిరిగి వచ్చినవాళ్లకు ఏ వివాదమూ లేకుండా వాళ్లది వాళ్లకు ఇచ్చెయ్యడమే ధర్మం. ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం మేము యుద్ధంలో చనిపోయినా విశిష్టమని అంటున్నామని నువ్వు వెళ్లి కౌరవ రాజుల మండలిలో చెప్పు. ధృతరాష్ట్రుడు తన కొడుకులతో సహా ఒక అడవిలాంటివాడు; పాండుపుత్రులేమో ఆ అడవిలోని సింహాలు. సింహాలు రక్షిస్తూ ఉంటే వనం నశించదు; అలాగే వనంలో ఉండి రక్షితాలవుతాయి సింహాలు కూడాను. అడవిలో లేకుండా ఉంటే, సింహాలను చావే వరిస్తుంది; సింహాల్లేకపోతే వనాన్ని వంటచెరక్కోసం కొట్టేస్తారు. అందుకనే సింహం వనాన్ని రక్షించాలి; వనం సింహాన్ని తన కడుపులో పెట్టుకోవాలి. లతల్లాంటి వాళ్లు ధృతరాష్ట్రుడి కొడుకులు; పెద్ద పెద్ద మద్దిచెట్లల్లాంటివాళ్లు పాండవులు. ఆ పెద్దచెట్లను ఆశ్రయించకపోతే లతలు పెరగవు సరికదా, బాటసారుల కాళ్లకింద నలిగో జంతువులకు గ్రాసమయ్యో నశిస్తాయి కూడాను’ అంటూ సంజయుడికి పాండవుల విశిష్టతను చెబుతూ ధర్మరాజు పనిచేశాడు వాసుదేవుడు. ‘నేను శాంతిని నిలపడానికీ సమర్థుణ్నే; యుద్ధం చేయడానికీ సమర్థుణ్నే. ధర్మార్థజ్ఞానం నాకు పూర్తిగా ఉంది. నేను సమయానికి తగినట్టుగా మెత్తగానూ ఉండగలను కఠోరంగానూ ఉండగలను’ అంటూ ధర్మరాజు ‘మెత్తని పులి’లాగ సంజయుడి ఏకపక్షపు మాటలకు సమాధానం చెప్పాడు. హస్తినాపురానికి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుడికి కనువిప్పు కలిగించాలని ప్రయత్నించాడు సంజయుడు: ‘అజాతశత్రుడైన ధర్మరాజు, పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు, పాపాన్ని వదిలి, అతని సదాచారంతో విరాజిల్లుతూ ఉన్నాడు. నువ్వు మాత్రం కొడుకు వశంలో చిక్కుకొని అధర్మానికే కొమ్ము కాస్తున్నావు. నిన్నే ఈ విరోధానికి మూలకారణంగా చివరికి అందరూ అంటారు. మీరు నమ్మరానివాళ్లూ చేరనీయకూడనివాళ్లూ అయిన శకుని కర్ణాదుల్ని మీలో కలుపుకున్నారు. కానీ నమ్మదగిన పాండవుల్ని శిక్షిద్దామని అనుకుంటున్నారు. ఈ మీ మానసిక దౌర్బల్యం వల్ల అనంత సమృద్ధి శాలిని అయిన ఈ భూమిని రక్షించడం అసాధ్యం’ అంటూ సంజయుడు తప్పంతా నీ నెత్తినే ఉందంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇంత చెప్పినా ధృతరాష్ట్రుడు కౌరవ పాండవుల సారాన్ని బేరీజు వేసి చెప్పమని సంజయుణ్ని అడిగినప్పుడు అతను, విదురుడు నిజం చెబితే సహించలేక పొమ్మన్నాడని తెలిసినవాడు గనక, ‘ఏకాంతంలో చెబితే మీ గుండెలో దోష భావనే పుడుతుంది. మీ నాన్ననూ మీ భార్యనూ ఇక్కడికి రమ్మనమనండి, అప్పుడు చెబుతాను మీరడిగినదానికి జవాబు’ అని వాళ్లు వచ్చిన తరవాతనే ఇలాగ చెప్పాడు: ‘‘నేను మాయను సేవించను. ధర్మంగా ఉన్నానని చూపించుకోవడానికి ధర్మాన్ని ఆచరించేవాణ్నిగాను. భక్తితో శుద్ధ భావాన్ని పొందినవాణ్ని గనకనే శాస్త్ర వచనాల ద్వారా నేను జనార్దనుడి రూపాన్ని ఎరుగుదును. జగత్తంతా ఒకవైపున్నా రెండోవైపు శ్రీకృష్ణుడొక్కడే ఉన్నా సారం దృష్ట్యా అతనే మిన్న. మనస్సులో అనుకుంటే చాలు అతను జగత్తునంతనీ భస్మం చేయగలడు. జగత్తంతా కలిసి ఏకమైనా అతన్ని భస్మం చేయలేదు. ‘యతః సత్యం యతో ధర్మో యతో హ్రీరార్జవం యతః తతో భవతి గోవిన్దో యతః కృష్ణస్తతో జయః॥(ఉద్యోగ పర్వం 68-9) సత్యమూ ధర్మమూ ‘నేను ఎంతటివాణ్ని కాబట్టి’ అనే సిగ్గుతో కూడిన వినయమూ సరళత్వమూ ఉన్నవైపే శ్రీకృష్ణుడుంటాడు; అతనున్నవైపే జయిస్తుంది. అతను పాండవుల రాజ్యభాగాన్ని మిషగా చేసుకొని అధర్మపరులైన నీ కొడుకుల్ని భస్మం చేయడానికి సమకట్టాడు. మహాయోగి అయిన అతను అంతా తెలిసినవాడయ్యుండీ కృషీవలుడి మాదిరి కొత్త కొత్త పనులు మొదలుపెడుతూ ఉంటాడు. తన మాయతో లోకాన్ని మోహంలో పడేసే అతన్ని ఆశ్రయిస్తేనే మానవులు మోహాన్ని తప్పించుకోగలుగుతారు. దానికి ఇంద్రియ నిగ్రహం తప్పకుండా ఉండాలి’’ అంటూ ముగించాడు. ‘ఇప్పుడైనా మాట వినరా బుచ్చిబాబూ’ అని ధృతరాష్ర్టుడంటే దుర్యోధనుడు ‘లోకం మొత్తాన్ని సంహరిస్తాడని తెలిసినా అర్జునుడు తన మిత్రుడని చెప్పేవాడి శరణు నేను కోరను’ అంటూ కరాఖండిగా చెప్పాడు. అప్పుడు వ్యాసుడు ధృతరాష్ట్రుడితో, ‘దుర్యోధనుడి కర్మను మనం మార్చలేం. నువ్వు మాత్రం శ్రీకృష్ణుడికి ప్రియుడివి. అందుకనే నీకు సంజయుడి లాంటి దూత దొరికాడు. అతను నిన్ను శ్రేయో మార్గంలోకి తీసుకొని రాగలడు’ అంటూ నిష్ర్కమించాడు. ఏ భావానికీ లొంగ కుండా ఉండగలడు కనకనే, సంజయుడికి ఆ మొత్తం యుద్ధ సంఘటనలను ధృతరాష్ట్రుడికి పూసగుచ్చినట్టు చెప్పగలిగే ఆధ్యాత్మిక శక్తిని వ్యాసమహర్షి, తన తపశ్శక్తితో ప్రసాదించాడు.