సంజయుడు | Great Indian characters | Sakshi
Sakshi News home page

సంజయుడు

Published Sun, Mar 20 2016 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM

సంజయుడు

సంజయుడు

ఐదోవేదం
మహాభారత పాత్రలు - 38

 
 సంజయుడు మహాభారతమంతటా వ్యాపించి ఉంటాడు. యుద్ధాన్ని ఆమూ లాగ్రమూ చూసి యోద్ధల మనోభావాల్ని వర్ణించినవాడే సంజయుడు. అతడు సూత పుత్రుడు. కర్ణుడూ కీచకుడూ కూడా సూత పుత్రులే. కానీ వీళ్లకూ సంజయుడికీ ఎంతో తేడా. సూతులంటే రథాలను నడిపేవాళ్లు, సూతుల ఇంట్లో పుట్టబట్టి సంజయుడు సూతపుత్రుడయ్యాడు. ఇతను ధృత రాష్ట్రుడి రథసారథి. రథాన్ని ఒక తీర్చిన తీరులో నడపవలసినవాడికి తేటనైన తెలివి ఉండాలి. కలతలూ కలవరాలూ ఉండకూడదు. అంటే, ఈ ‘సారథి’ కలతలను పూర్తిగా జయించినవాడు. లోచూపుతోనే ఈ విజయం సాధ్యమవు తుంది. నిష్పక్ష పాతంగా, తేటనైన సహజావబోధంతో, అంటే, ఆగమశక్తితో తనను తాను సాక్షిభూతమై పరీక్షించు కొంటూ ఉండడమనేదే సంజయత్వం.

 భగవద్గీతలో మనం ‘సంజయ ఉవాచ’ అనే మాటల్ని చూసి ‘ఇతగాడెవ డబ్బా ఆకాశం నుంచి ఊడిపడ్డాడ’ని విస్తుపోతూ ఉంటాం. వివరంగా చదివితే అర్థమవుతుంది ఇతను విదురుడితో పోల్చ దగిన తెలివితేటలున్నవాడని. విదురుణ్ని మనం ధర్మాధర్మ వివేచనగానూ మనస్సాక్షిగానూ చెప్పుకొన్నాం. అతను కురువంశంలోని వాడయ్యుండి కూడా ఏవిధంగా అన్ని కావేషాలకూ లోభాలకూ దూరంగా ఉన్నాడో, అలాగే సంజ యుడు ధృతరాష్ర్టుడి సేవకు డయ్యుండి కూడా నిష్పక్ష పాతంగానే స్వామికి కూడా తప్పు చేస్తున్నావని సూటిగా చెప్పగలిగే నైతిక ధైర్యం ఉన్నవాడు. యుద్ధాన్ని ఒక ప్రేక్షకుడి మాదిరిగా చూస్తూ, యుద్ధం చేసేవాళ్ల మనో భావాల్ని కూడా తెలుసుకొంటూ, ఏ భావానికీ లొంగ కుండా ఉండగలడు కనకనే, సంజయుడికి ఆ మొత్తం యుద్ధ సంఘట నలను ధృతరాష్ట్రుడికి పూసగుచ్చినట్టు చెప్పగలిగే ఆధ్యాత్మిక శక్తిని వ్యాసమహర్షి, తన తపశ్శక్తితో ప్రసాదిం చాడు. సంజయుడు రణ రంగంలో తిరిగినా అతన్ని ఏ ఆయుధమూ ఏ బాణమూ ఏ అస్త్రమూ ఏ శస్త్రమూ తాకకుండా ఉండేలా వరం ఇవ్వడంలోనే అతని నిస్సంగత్వమూ నిష్పక్షపాతమూ మనకు ప్రకాశిస్తాయి. వరమనే మాటతో సంజయ త్వాన్ని బహిరంగపరిచాడు వ్యాసుడు.

సంజయుడు ముందస్తుగా రాయ బారిగా అవుపిస్తాడు. ధృతరాష్ట్రుడు ఇతన్ని ధర్మరాజుకు ఏ వాగ్దానమూ చేయకుండానే యుద్ధానికి విముఖుడయ్యేలాగ చేయమని రాయబారానికి పంపాడు. ‘నేను అర్జును డన్నా వాసుదేవుడన్నా భీముడన్నా నకుల సహదేవులన్నా భయపడటం లేదు. క్రోధ దీప్తుడైన ధర్మరాజు కోపం నుంచి చాలా భయపడుతున్నాను. అతని మనస్సం కల్పం సిద్ధించి తీరుతుంది. అంత తపస్సంపన్నుడతను; అంతటి జితేంద్రి యుడతను. నువ్వు ఉపప్లావ్యానికి వెళ్లి, రాజులందరి మధ్యా నా మాటలను చెబుతూ ధర్మరాజుకు కోపం వచ్చే మాట మాత్రం అనకుండా నెట్టుకురావాలి. ధర్మ రాజుకు కోపం రాకపోతే యుద్ధం ఆగు తుంది’ అంటూ సంజయుణ్ని తర్ఫీదు చేసి ధృతరాష్ట్రుడు పంపాడు.

సంజయుడు ధృతరాష్ట్రుడు నేర్పినట్టే అటు కర్ర విరగకుండా ఇటు పాము చావకుండా ధర్మరాజుతో చాకచక్యంగా మాట్లాడాడు: ‘శాంతి కోసమే ధృతరాష్ట్ర మహారాజు నన్ను నీ దగ్గరికి పంపాడు. మీ అందరిలో ఎంతగా సత్త్వ గుణం నిండి ఉందంటే, మీరు పిసరంత తప్పుచేసినా అది, తెల్లగుడ్డ మీద కాటుక చుక్క పడ్డట్టు కొట్టొచ్చినట్టు అవుపిస్తుంది. యుద్ధమం టేనే సర్వనాశనం; పాపానికి తెర ఎత్తి నట్టవుతుంది. మీకు శ్రీకృష్ణుడూ చేకితా నుడూ సాత్యకీ సహాయకులు; మీ మామ గారైన ద్రుపదుడి బాహు బలచ్ఛాయలో మీరు సురక్షితులై ఉన్నారు. అటువంటి మిమ్మల్ని ఇంద్రుడితో సహా దేవతలం దరూ దండెత్తి వచ్చినా గెలిచే ఆశలెక్క డుంటాయి? అలాగే, భీష్మ ద్రోణకర్ణ శల్య కృపాశ్వత్థామల చేతుల్లో అభిగుప్తమైన కౌరవ సేనను మాత్రం ఎవరు గెలవగల మని సాహసం చేయగలరు చెప్పు? ఈ యుద్ధమే జరిగితే, జయం ఎవర్ని వరి స్తుందో ఇదమిత్థంగా చెప్పలేం. లోకంలో పాండవులు ధర్మపరులని ప్రఖ్యాతికెక్కిన వాళ్లు. మీరు చేసిన ప్రతి పనీ ఎప్పుడూ ధర్మానుసారంగానే ఉంటుంది. ఆ మీ కీర్తిని ఇప్పుడు అనర్థాలన్నిటికీ హేతు వయ్యే యుద్ధానికి ఒడిగట్టి పాడుచేసుకో వద్దు. మీకు ఆ కౌరవులు భాగం ఇవ్వమని ఎంత మొండికేసుకొని కూర్చున్నా, అజాత శత్రువని పేరుకెక్కిన నువ్వు, అంధకవృష్టి వంశజుల రాజ్యవీధుల్లో బిచ్చమెత్తు కొనైనా జీవ నిర్వాహం చేసుకోవడం మెరుగు తప్ప, యుద్ధం చేసి రక్త సిక్తమైన రాజ్యాన్ని తీసుకోవడం మంచిది కాదు. యుద్ధానికి నీకిది అనుకూల సమయం కూడా కాదు. నువ్వు పదమూడేళ్లు రాజ్యానికి దూరంగా ఉండి నీ శత్రుబలం పెరిగేలా చేసుకోడమే కాదు, నీ సహాయకుల్ని కూడా దుర్బలంగా చేసు కున్నావు. అంచేత ఇది నీకు హీనకాలం’... ఇలా యుద్ధం నుంచి వెను దిరిగేలాగ చేయడానికి శాయశక్తులా ఉపన్యసించాడు సంజయుడు.

ధర్మరాజు ధృతరాష్ట్రుడి విషమ ప్రవర్తనను గుర్తుకు తెచ్చాడు. తమరు ఏమని సలహా ఇస్తున్నారో దాన్ని తామే పాటించకుండా ఉండడం సబబు కాదు గదా అని హితవు చెప్పాడు. ‘నేను వాసు దేవుడి మాటను జవదాటను. అతను ఏమంటాడో విన’మంటూ సంజయుడితో అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ‘నేను కోరేదీ శాంతేనయ్యా! కానీ ఇక్కడ శాంతి అతి దుష్కరమనిపిస్తోంది. కొడుకు వలలో పడి ధృతరాష్ట్రుడు కలహాన్ని పెంచు తున్నాడే తప్ప తక్కువయ్యేలాగ చేయటం లేదు. నావల్ల గానీ ధర్మరాజు బావ వల్ల గానీ ధర్మలోపం జరగదని నీకు తెలిసినా, నీవల్ల అధర్మం జరగకుండా చూసుకోమని ఎలాగ అంటున్నావో నాకు బోధపడటం లేదు. నువ్వు జ్ఞానుల్లోకల్లా శ్రేష్ఠుడివి. అయినా కౌరవుల స్వార్థం సిద్ధించాలని ఎందుకు వల పన్నుతున్నావు? దొంగ దాక్కొని డబ్బును దొంగిలించినా, ఎదురుగా బాహాటంగా అందరూ చూస్తూండగా కొల్లగొట్టినా రెండు పనులూ నిందించదగినవే గదా. ఈ దొంగలకూ ఆ దుర్యోధనుడికీ మధ్య ఎక్కడైనా తేడా ఉందంటావా చెప్పు? దుర్యోధనుడు అతికక్కుర్తితో అన్నదమ్ముల భాగాన్ని మొత్తాన్నీ హరిద్దామని గుంటనక్కలాగ చూస్తున్నాడు. కానీ అతను అదే ధర్మమనుకుంటున్నాడు. ఆ భాగం నిజానికి వాళ్ల దగ్గర ఇల్లడగా మాత్రమే ఉంది. మోసమే కానీ మోసం కాకపోనీ, జూదంనాడు అనుకొన్న ప్రకారం నియమాన్ని పాలించి తిరిగి వచ్చినవాళ్లకు ఏ వివాదమూ లేకుండా వాళ్లది వాళ్లకు ఇచ్చెయ్యడమే ధర్మం. ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం మేము యుద్ధంలో చనిపోయినా విశిష్టమని అంటున్నామని నువ్వు వెళ్లి కౌరవ రాజుల మండలిలో చెప్పు. ధృతరాష్ట్రుడు తన కొడుకులతో సహా ఒక అడవిలాంటివాడు; పాండుపుత్రులేమో ఆ అడవిలోని సింహాలు. సింహాలు రక్షిస్తూ ఉంటే వనం నశించదు; అలాగే వనంలో ఉండి రక్షితాలవుతాయి సింహాలు కూడాను. అడవిలో లేకుండా ఉంటే, సింహాలను చావే వరిస్తుంది; సింహాల్లేకపోతే వనాన్ని వంటచెరక్కోసం కొట్టేస్తారు. అందుకనే సింహం వనాన్ని రక్షించాలి; వనం సింహాన్ని తన కడుపులో పెట్టుకోవాలి. లతల్లాంటి వాళ్లు ధృతరాష్ట్రుడి కొడుకులు; పెద్ద పెద్ద మద్దిచెట్లల్లాంటివాళ్లు పాండవులు. ఆ పెద్దచెట్లను ఆశ్రయించకపోతే లతలు పెరగవు సరికదా, బాటసారుల కాళ్లకింద నలిగో జంతువులకు గ్రాసమయ్యో నశిస్తాయి కూడాను’ అంటూ సంజయుడికి పాండవుల విశిష్టతను చెబుతూ ధర్మరాజు పనిచేశాడు వాసుదేవుడు. ‘నేను శాంతిని నిలపడానికీ సమర్థుణ్నే; యుద్ధం చేయడానికీ సమర్థుణ్నే. ధర్మార్థజ్ఞానం నాకు పూర్తిగా ఉంది. నేను సమయానికి తగినట్టుగా మెత్తగానూ ఉండగలను కఠోరంగానూ ఉండగలను’ అంటూ ధర్మరాజు ‘మెత్తని పులి’లాగ సంజయుడి ఏకపక్షపు మాటలకు సమాధానం చెప్పాడు.

హస్తినాపురానికి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుడికి కనువిప్పు కలిగించాలని ప్రయత్నించాడు సంజయుడు: ‘అజాతశత్రుడైన ధర్మరాజు, పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు, పాపాన్ని వదిలి, అతని సదాచారంతో విరాజిల్లుతూ ఉన్నాడు. నువ్వు మాత్రం కొడుకు వశంలో చిక్కుకొని అధర్మానికే కొమ్ము కాస్తున్నావు. నిన్నే ఈ విరోధానికి మూలకారణంగా చివరికి అందరూ అంటారు. మీరు నమ్మరానివాళ్లూ చేరనీయకూడనివాళ్లూ అయిన శకుని కర్ణాదుల్ని మీలో కలుపుకున్నారు. కానీ నమ్మదగిన పాండవుల్ని శిక్షిద్దామని అనుకుంటున్నారు. ఈ మీ మానసిక దౌర్బల్యం వల్ల అనంత సమృద్ధి శాలిని అయిన ఈ భూమిని రక్షించడం అసాధ్యం’ అంటూ సంజయుడు తప్పంతా నీ నెత్తినే ఉందంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.

 ఇంత చెప్పినా ధృతరాష్ట్రుడు కౌరవ పాండవుల సారాన్ని బేరీజు వేసి చెప్పమని సంజయుణ్ని అడిగినప్పుడు అతను, విదురుడు నిజం చెబితే సహించలేక పొమ్మన్నాడని తెలిసినవాడు గనక, ‘ఏకాంతంలో చెబితే మీ గుండెలో దోష భావనే పుడుతుంది. మీ నాన్ననూ మీ భార్యనూ ఇక్కడికి రమ్మనమనండి, అప్పుడు చెబుతాను మీరడిగినదానికి జవాబు’ అని వాళ్లు వచ్చిన తరవాతనే ఇలాగ చెప్పాడు:
 ‘‘నేను మాయను సేవించను. ధర్మంగా ఉన్నానని చూపించుకోవడానికి ధర్మాన్ని ఆచరించేవాణ్నిగాను. భక్తితో శుద్ధ భావాన్ని పొందినవాణ్ని గనకనే శాస్త్ర వచనాల ద్వారా నేను జనార్దనుడి రూపాన్ని ఎరుగుదును. జగత్తంతా ఒకవైపున్నా రెండోవైపు శ్రీకృష్ణుడొక్కడే ఉన్నా సారం దృష్ట్యా అతనే మిన్న. మనస్సులో అనుకుంటే చాలు అతను జగత్తునంతనీ భస్మం చేయగలడు. జగత్తంతా కలిసి ఏకమైనా అతన్ని భస్మం చేయలేదు. ‘యతః సత్యం యతో ధర్మో యతో హ్రీరార్జవం యతః తతో భవతి గోవిన్దో యతః కృష్ణస్తతో జయః॥(ఉద్యోగ పర్వం 68-9) సత్యమూ ధర్మమూ ‘నేను ఎంతటివాణ్ని కాబట్టి’ అనే సిగ్గుతో కూడిన వినయమూ సరళత్వమూ ఉన్నవైపే శ్రీకృష్ణుడుంటాడు; అతనున్నవైపే జయిస్తుంది.

 అతను పాండవుల రాజ్యభాగాన్ని మిషగా చేసుకొని అధర్మపరులైన నీ కొడుకుల్ని భస్మం చేయడానికి సమకట్టాడు. మహాయోగి అయిన అతను అంతా తెలిసినవాడయ్యుండీ కృషీవలుడి మాదిరి కొత్త కొత్త పనులు మొదలుపెడుతూ ఉంటాడు. తన మాయతో లోకాన్ని మోహంలో పడేసే అతన్ని ఆశ్రయిస్తేనే మానవులు మోహాన్ని తప్పించుకోగలుగుతారు. దానికి ఇంద్రియ నిగ్రహం తప్పకుండా ఉండాలి’’ అంటూ ముగించాడు.

 ‘ఇప్పుడైనా మాట వినరా బుచ్చిబాబూ’ అని ధృతరాష్ర్టుడంటే దుర్యోధనుడు ‘లోకం మొత్తాన్ని సంహరిస్తాడని తెలిసినా అర్జునుడు తన మిత్రుడని చెప్పేవాడి శరణు నేను కోరను’ అంటూ కరాఖండిగా చెప్పాడు. అప్పుడు వ్యాసుడు ధృతరాష్ట్రుడితో, ‘దుర్యోధనుడి కర్మను మనం మార్చలేం. నువ్వు మాత్రం శ్రీకృష్ణుడికి ప్రియుడివి. అందుకనే నీకు సంజయుడి లాంటి దూత దొరికాడు. అతను నిన్ను శ్రేయో మార్గంలోకి తీసుకొని రాగలడు’ అంటూ నిష్ర్కమించాడు.    

ఏ భావానికీ లొంగ కుండా ఉండగలడు కనకనే, సంజయుడికి ఆ మొత్తం యుద్ధ సంఘటనలను ధృతరాష్ట్రుడికి పూసగుచ్చినట్టు చెప్పగలిగే ఆధ్యాత్మిక శక్తిని వ్యాసమహర్షి, తన తపశ్శక్తితో ప్రసాదించాడు.
 

   
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement