రాజైనా తల్లికి నమస్కరించవలసిందే! | every one Obeisance to Mother | Sakshi
Sakshi News home page

రాజైనా తల్లికి నమస్కరించవలసిందే!

Published Sun, Jan 29 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

రాజైనా తల్లికి నమస్కరించవలసిందే!

రాజైనా తల్లికి నమస్కరించవలసిందే!

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ...ఈ మూడు అంశలూ ప్రచోదనమయి ఉంటాయి. జీవితాంతం నిలబడి ఉంటాయి.  కాబట్టే అమ్మ తన కన్నబిడ్డలకు పరదేవతే... పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే.

అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను ఏమీ చేసుకోలేకపోయినా.. దీపం పెట్టుకోలేక పోయినా, స్తోత్రం చెప్పుకోలేక పోయినా.. తనలో తానే ఏవో సంధిమాటలు మాట్లాడుకుంటున్నా... తన బిడ్డలకు మాత్రం ఉద్ధారకురాలే. ఎలా ?

అమ్మ అంటూ ఒక ఆకారం అక్కడ ఉంటే కదూ, కొడుకుకానీ, కూతురు కానీ వెళ్ళి ప్రదక్షిణం చేసుకుని ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకోగలిగేది. ఒక వ్యక్తి అలా తన అమ్మకి ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణం, పదివేల మార్లు కాశీయాత్ర చేసిన పుణ్యఫలం దక్కుతుందంటుంది శాస్త్రం. బిడ్డలకు ఇంత పుణ్యం ఇవ్వగలిగిన అమ్మ మాత్రం తనకంటూ తాను ఇలా చేసుకోలేదు. అమ్మ ఉన్నది కాబట్టి నీకా పుణ్యం వస్తున్నది. అమ్మకు నమస్కారం చేయడం అంత గొప్ప ఫలితాన్నిస్తుంది. బాహ్యంలో ఎన్ని యజ్ఞాలుచేసినా, యాగాలు చేసినా, ఎన్నో చండీ హోమాలు చేసినా, దేవాలయాలు కట్టిచ్చినా, అన్నదానాలు చేసినా తల్లికి నమస్కారం చేస్తే వచ్చిన ఫలితంతో సమానమా.. అంటే చెప్పడం కష్టం. అమ్మ–త్రిమూర్త్యాత్మక స్వరూపమై తనంతటతానుగా అంత పుణ్యాన్ని ఇవ్వగలదు. అందుకే మాతదేవోభవ. అందుకే అమ్మ దేవత. అమ్మ పరబ్రహ్మం.

తల్లిని గౌరవించని వాళ్ళు లేరు. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళూ, బ్రహ్మచారులూ, వానప్రస్థులూ అందరూ సన్యాసికి నమస్కరిస్తారు. మరి సన్యాసి ఎవరికి నమస్కరిస్తారు? చాతుర్మాస్య దీక్షలు ఎక్కువ చేసినవారెవరున్నారో వారికి మిగిలిన వారు నమస్కరిస్తారు. ఎక్కువ దీక్షలు చేసినవారు, తక్కువ చాతుర్మాస్యాలు చేసిన వారికి నమస్కరించరు. అది సంప్రదాయం. కంచి కామకోటి మఠంవంటి పీఠాలలో కూడ ఇప్పటికీ ఒక నియమం ఉంది. ఒకసారి పిల్లవాడు మఠాధిపత్యం వహించాడనుకోండి. అప్పుడు సందర్శకుల వరుసలో వస్తున్న తండ్రిగారికి కూడా ప్రత్యేకతేం ఉండదు. కడుపునబుట్టిన కొడుకయినా సరే, తండ్రికూడా వచ్చి పీఠాధిపతుల పాదాలకు అందరిలాగే నమస్కారం చేసుకోవలసిందే. కానీ తల్లిగారు వరుసక్రమంలో వస్తున్నారనుకోండి. వెంటనే పీఠాధిపతయినా కూడా లేచి నిలబడి అమ్మగారికే నమస్కారం చేయాలి. అది సంప్రదాయం, అది నియమం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement