సన్యసించిన వ్యక్తులు, పరమహంసలు, మఠాధిపతులు, పీఠాధిపతులు... వీరు సర్వసాధారణంగా ఆత్మోద్ధరణకు సంబంధించిన విషయాలమీద అనుగ్రహభాషణలు చేస్తుంటారనీ, వారు తాము తరించి, ఇతరులు తరించడానికి సంబంధించిన మార్గాలను బోధచేయడం వరకే పరిమితం అవుతారని లోకంలో భావన చేస్తుంటారు. కానీ ఈ భావనలకు భిన్నంగా వెళ్ళిన గురువు ఒకరున్నారు. ఆయన సమర్ధ రామదాసు. ఈ దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సనాతన ధర్మానికి పూర్వ వైభవం తీసుకురావడంలో ఆయన ఎనలేని కృషి చేశారు.
దేశంలో సమకాలీన పరిస్థితులను బాగా అధ్యయనం చేసారు. ఆ కాలంలో ఉన్న పాలనా వ్యవస్థ, అప్పుడున్న సామాజిక అలజడులు, ప్రజలలో అప్పుడున్న అభద్రతా భావాన్ని దష్టిలో పెట్టుకుని ప్రజలకు మౌలికంగా ఏవి అవసరమో వాటిని బోధించి, ఆచరణలో కూడా మార్గదర్శనం చేసిన గురువు ఆయన. ప్రజలు తమ శారీరక ఆరోగ్యంతోపాటూ, ఆత్మరక్షణకు అవసరమయిన దృఢత్వాన్ని పొందడానికి ఆయన పర్యటించిన ప్రదేశాల్లో వ్యాయామశాలలు నెలకొల్పారు. ఆరోగ్యంతోపాటూ మానసిక పరిణతికి చదువు అవసరమని పాఠశాలలు ఏర్పాటు చేసారు. ఆధ్యాత్మిక క్రమశిక్షణకు, ధర్మంపట్ల అనురక్తి కలగడానికి భక్తి అవసరమని హనుమాన్ మందిర్ లు నిర్మించారు. ప్రజలందరిలో దేశభక్తి నూరిపోసారు. ఆయన ప్రజలకు తరచుగా ఆరు సూత్రాలు బోధిస్తుండేవారు...అవి ఎప్పటికీ ఆచరణ యోగ్యాలే.
వాటిలో మొదటిది సంపద, సమృద్ధి. అంటే అందరివద్దా సంపద ఉండాలి, అది కూడా సమృద్ధిగా ఉండాలి. లేకపోతే తను వ్యక్తిగతంగా అనుకున్నది కూడా సాధించలేరు, జీవితంలో అభ్యున్నతిని పొందలేరు. ఒక వయసు వచ్చిన తరువాత, మనిషి కష్టపడి స్వయంగా సంపాదించుకోవడం అవసరం.
దీని ప్రాధాన్యతను మన సుభాషితాలు కూడా చక్కగా వివరించాయి. మాతానిందతి/ న అభినందతి పితా / భ్రాతా న సంభాషతే! భృత్యః కృప్యతి/ న అనుగచ్ఛతి సుతః/ కాంతాచ న ఆలింగతే/ అర్థప్రార్థన్
శంకయా న కురుతే స్వాలాపమాత్రం సుహృత్ / తస్మాత్ అర్థముపాశ్రయ శ్రుణు సర్వేహి అర్థేన సర్వే వశాః... అంటాయి. అంటే – నీకంటూ సంపాదన లేకపోతే ఎప్పుడూ నిందించని అమ్మ కూడా నిందిస్తుంది. తండ్రి సంతోషంతో భుజం మీద చెయ్యివేసి ఆప్యాయంగా అభినందించడు. తోడపుట్టినవారు కూడా చులకన చేస్తారు. పలకరించరు.సేవకుడికి ఏదయినా పని చెబితే... పైసా విదల్చడు కానీ పనులు మాత్రం చెబుతుంటాడని ఆగ్రహిస్తాడు.
పిల్లల అభ్యున్నతికి ఖర్చుపెట్టనప్పుడు కన్న కుమారుడు సేవలందించడు. ఇల్లు గడవడానికి అవసరమయిన సొమ్ము తీసుకురానప్పుడు కట్టుకున్న భార్య ప్రేమగా కౌగిలించుకోదు. ఎంత మంచి స్నేహితుడయినా ఎదురుపడితే అప్పు అడుగుతాడేమోనని ముఖం చాటేస్తాడు. అందువల్ల ఓ స్నేహితుడా! నీతి తప్పకుండా సంపాదించు. దానితో సమస్తమూ నీకు వశపడుతుంది... అంటారు.
ఒక తోటలో అరవిరిసిన పువ్వుల వాసనలకన్నా.... కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ద్రవ్యం ఎంత తక్కువయినా దాని సువాసన ఎక్కువగానే ఉంటుందని కూడా అంటారు. అలా సక్రమ మార్గంలో కష్టపడి మనిషి సంపాదించి బతకగలగాలి. అది ఆత్మగౌరవం. అది మనిషికి సంపూర్ణతను ఇస్తుంది.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment