ramadasu
-
సంపద.. సమృద్ధి
సన్యసించిన వ్యక్తులు, పరమహంసలు, మఠాధిపతులు, పీఠాధిపతులు... వీరు సర్వసాధారణంగా ఆత్మోద్ధరణకు సంబంధించిన విషయాలమీద అనుగ్రహభాషణలు చేస్తుంటారనీ, వారు తాము తరించి, ఇతరులు తరించడానికి సంబంధించిన మార్గాలను బోధచేయడం వరకే పరిమితం అవుతారని లోకంలో భావన చేస్తుంటారు. కానీ ఈ భావనలకు భిన్నంగా వెళ్ళిన గురువు ఒకరున్నారు. ఆయన సమర్ధ రామదాసు. ఈ దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సనాతన ధర్మానికి పూర్వ వైభవం తీసుకురావడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. దేశంలో సమకాలీన పరిస్థితులను బాగా అధ్యయనం చేసారు. ఆ కాలంలో ఉన్న పాలనా వ్యవస్థ, అప్పుడున్న సామాజిక అలజడులు, ప్రజలలో అప్పుడున్న అభద్రతా భావాన్ని దష్టిలో పెట్టుకుని ప్రజలకు మౌలికంగా ఏవి అవసరమో వాటిని బోధించి, ఆచరణలో కూడా మార్గదర్శనం చేసిన గురువు ఆయన. ప్రజలు తమ శారీరక ఆరోగ్యంతోపాటూ, ఆత్మరక్షణకు అవసరమయిన దృఢత్వాన్ని పొందడానికి ఆయన పర్యటించిన ప్రదేశాల్లో వ్యాయామశాలలు నెలకొల్పారు. ఆరోగ్యంతోపాటూ మానసిక పరిణతికి చదువు అవసరమని పాఠశాలలు ఏర్పాటు చేసారు. ఆధ్యాత్మిక క్రమశిక్షణకు, ధర్మంపట్ల అనురక్తి కలగడానికి భక్తి అవసరమని హనుమాన్ మందిర్ లు నిర్మించారు. ప్రజలందరిలో దేశభక్తి నూరిపోసారు. ఆయన ప్రజలకు తరచుగా ఆరు సూత్రాలు బోధిస్తుండేవారు...అవి ఎప్పటికీ ఆచరణ యోగ్యాలే. వాటిలో మొదటిది సంపద, సమృద్ధి. అంటే అందరివద్దా సంపద ఉండాలి, అది కూడా సమృద్ధిగా ఉండాలి. లేకపోతే తను వ్యక్తిగతంగా అనుకున్నది కూడా సాధించలేరు, జీవితంలో అభ్యున్నతిని పొందలేరు. ఒక వయసు వచ్చిన తరువాత, మనిషి కష్టపడి స్వయంగా సంపాదించుకోవడం అవసరం. దీని ప్రాధాన్యతను మన సుభాషితాలు కూడా చక్కగా వివరించాయి. మాతానిందతి/ న అభినందతి పితా / భ్రాతా న సంభాషతే! భృత్యః కృప్యతి/ న అనుగచ్ఛతి సుతః/ కాంతాచ న ఆలింగతే/ అర్థప్రార్థన్ శంకయా న కురుతే స్వాలాపమాత్రం సుహృత్ / తస్మాత్ అర్థముపాశ్రయ శ్రుణు సర్వేహి అర్థేన సర్వే వశాః... అంటాయి. అంటే – నీకంటూ సంపాదన లేకపోతే ఎప్పుడూ నిందించని అమ్మ కూడా నిందిస్తుంది. తండ్రి సంతోషంతో భుజం మీద చెయ్యివేసి ఆప్యాయంగా అభినందించడు. తోడపుట్టినవారు కూడా చులకన చేస్తారు. పలకరించరు.సేవకుడికి ఏదయినా పని చెబితే... పైసా విదల్చడు కానీ పనులు మాత్రం చెబుతుంటాడని ఆగ్రహిస్తాడు. పిల్లల అభ్యున్నతికి ఖర్చుపెట్టనప్పుడు కన్న కుమారుడు సేవలందించడు. ఇల్లు గడవడానికి అవసరమయిన సొమ్ము తీసుకురానప్పుడు కట్టుకున్న భార్య ప్రేమగా కౌగిలించుకోదు. ఎంత మంచి స్నేహితుడయినా ఎదురుపడితే అప్పు అడుగుతాడేమోనని ముఖం చాటేస్తాడు. అందువల్ల ఓ స్నేహితుడా! నీతి తప్పకుండా సంపాదించు. దానితో సమస్తమూ నీకు వశపడుతుంది... అంటారు. ఒక తోటలో అరవిరిసిన పువ్వుల వాసనలకన్నా.... కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ద్రవ్యం ఎంత తక్కువయినా దాని సువాసన ఎక్కువగానే ఉంటుందని కూడా అంటారు. అలా సక్రమ మార్గంలో కష్టపడి మనిషి సంపాదించి బతకగలగాలి. అది ఆత్మగౌరవం. అది మనిషికి సంపూర్ణతను ఇస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శ్రీరామ నీ నామమెంతో రుచిరా..
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం భక్త రామదాసు 389వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం, చక్ర సిమెంట్స్, నేండ్రగంటి అలివేలు మంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో వివిధ నగరాల నుంచి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసులు రామయ్యతో పాటు భక్తరామదాసుకు నవరత్న ఘోష్టితో ‘స్వరార్చన’ జరిపారు. తొలుత రామదాసు ప్రతిమతో భద్రగిరి ప్రదక్షిణ, నగర సంకీర్తన, రామదాసుకు అభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా మూడు రోజుల పాటు నిర్వహించే రామదాసు జయంతి ఉత్సవాలను కరోనా ఆంక్షల నేపథ్యాన ఈసారి ఒకేరోజుకు పరిమితం చేశారు. -
నటి కరాటే కళ్యాణికి పితృ వియోగం
విజయనగరం : మృదంగ విద్వాన్, హరికథా సామ్రాట్‌గా పేరుపొందిన పడాల రామదాసు (70) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి హైదరాబాద్‌లో మృతిచెందారన్న వార్త జిల్లా సాంస్కృతిక, సాహితీ వేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన 17వ ఏట భారత రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా వెండి వీణ అందుకున్నారు. మహా రాజా సంగీత కళాశాలలో మృదంగంలో శిక్షణ పొంది, అనతికాలంలోనే పలు సంగీత కచేరీల్లో పాల్గొని పేరు తెచ్చుకున్నారు. ఆల్ ఇండియా రేడియోలో హరికథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు అందుకున్నాడు. దాసన్నపేటలో 1951 జూలై 1న పైడితల్లి దానయ్యలకు రామదాసు జని్మంచారు. ఆయనకు భార్య విజయలక్షి్మ, కుమార్తె కళ్యాణి, కుమారులు తారక రామారావు, ధీరజ్ చంద్రలు ఉన్నారు. ఆయన ప్రోత్సాహంతోనే కుమార్తె కరాటే కళ్యాణిగా, సినీనటిగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన మృతికి కళారంగం తీవ్ర సంతాపం తెలిపింది. కరాటే కళ్యాణి తండ్రి మృతిపై స్పందిస్తూ ఆదివారం ఫేస్బుక్ వేదికగా ఓ భావోద్వేగ ఫోస్ట్ పెట్టారు. -
ఆపాత మధురం
మనకు వాగ్గేయకారులున్నారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, శ్యామశాస్త్రి ...వీళ్లందరూ సంగీతాన్ని నాదోపాసనగా స్వీకరించి వాగ్గేయకారులైనారు. ఒకచోట స్థిరంగా కూర్చుని, కాగితం, కలం పట్టుకుని కృతులు రాసినవారు కాదు, వారికి ఎప్పుడెప్పుడు ఏ సందర్భాలలో ఏది చెప్పుకోవాల్సి వచ్చినా పరమాత్మకు చెప్పుకున్నారు. బాధకలిగితే, సంతోషం కలిగితే, దుఃఖం పొంగుకొస్తే... ఇంట్లో పెళ్ళి ప్రస్తావన వస్తే... అలా మనసు పొరల్లో ఏ మాత్రం అలికిడి అయినా వారి నిత్యసంబంధం పరమాత్మతోనే. ఆ కృతులలో భావార్థాలతో కూడిన గంభీరమైన చరణాలు ఎన్నో ఉండవు. కానీ ఆర్తితో పరమాత్మను గొంతెత్తి పిలిచారు. అది విన్నవారు పరవశించిపోయారు. ఆ తరువాత ఎంతమంది గురువులు, శిష్యులొచ్చినా పరంపరాను గతంగా ఆ కీర్తనలు చెప్పుకున్నారు. పాడుకున్నారు. అవి కాలగతికి అలా నిలబడిపోయాయి. ఈనాటికీ వాటికి శిరస్సువంచి నమస్కారం చేస్తున్నాం.ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన జీవితం. వీరిలో కొంతమంది సంసారంలో ఉండి సన్యాసులుగా జీవించారు. మరికొందరు అపారమైన ఐశ్వర్యం ఉండి దానితో సంబంధం లేకుండా జీవించారు. మరికొందరు సంసారంలో ఉండి జ్ఞానంలో జీవించారు. ఏ స్థితిలో ఉన్నా నిరంతరం లోపల ఉండే నాదాన్ని ఉపాసనచేసి దాని ద్వారా పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యస్థితిని పొందడానికి వారు సోపానాలు నిర్మించుకున్నారు. వారు చేసిన ఒక్కొక్క కీర్తనను... చివరకు ఆ పరమేశ్వరుడు కూడా చెవి ఒగ్గి వింటాడట. ‘‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః’’. పాముని కూడా పడగవిప్పి ఆడేటట్లు చేయగల శక్తి సంగీతానికి ఉంది. ‘‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం, ఏకమాపాత మధురం అన్యమాలోచనామృతం’’. అంటే... సంగీతం, సాహిత్యం రెండూ సరస్వతీదేవి రెండు స్తనాలు. ఒకటి ఆపాత మధురం. ఒకదానిలో క్షీరాన్ని గ్రోలడానికి ఏ విధమైన అర్హతా అక్కర్లేదు. ఆ పాలు తాగితే చాలు తేనె. రెండవ స్తన్యంలో ఉన్న పాలని స్వీకరించడానికి మాత్రం కొంత అర్హత కావాలి. దానికి వివేచన కావాలి. ఆలోచించగలిగిన సమర్ధత ఉండాలి. దాన్ని అర్థం చేసుకునే శక్తి భగవద్దత్తంగా లభించాలి. అటువంటి అర్థగాంభీర్యంతో ఆయా వాగ్గేయకారుల చేసిన కృతులలో కొన్నింటిని ఎంచుకుని వాటిని గురించి తెలుసుకుందాం. ఆ కీర్తనలలోని ఆర్తిని, అర్థాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. చెప్పగలిగినవాడు సమర్ధుడా కాడా అని చూడకుండా భగవత్ శబ్దం ప్రతిపాదింపబడితే చాలనుకుని, పాఠకులు పరవశించే హృదయం కలవారు కనుక సాహసం చేస్తున్నా. ఇందులో తప్పొప్పులుండవచ్చు. కానీ వెనక ఉన్న ఉద్దేశాన్ని మాత్రం గ్రహించండి. అమ్మ ఆర్తితో పెట్టే అన్నంలో ఒకరోజు పప్పులో ఉప్పు మరిచిపోవచ్చు. అంతమాత్రం చేత ఉప్పులేని పప్పు పెట్టాలన్నది అమ్మ ఉద్దేశం అనలేం కదా. పిల్లాడికి అన్నం పెట్టి ఆకలి తీర్చాలన్నదే అమ్మ ఉద్దేశం... అలా సమర్థత ఉందా లేదా అన్నది చూడకుండా ఆ మహానుభావుల కీర్తనలకు భాష్యం చెప్పడంలోని ఉద్దేశాన్ని సదుద్దేశంతో స్వీకరించండి. మొట్టమొదటగా త్యాగరాజ కృతి ‘నగుమోము కనలేని నాదు జాలీ తెలిసీ...’ వ్యాఖ్యానం వచ్చేవారం.‘సంగీత సాహిత్యం’ వాగ్గేయకారుల కీర్తనలకు వ్యాఖ్యానాలు, వారి జీవితచిత్రాల ఆవిష్కరణ లతో కొత్తసీరీస్ ప్రారంభం. మీకు తెలుసా? భగవంతుడికి నివేదించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు. తెలిసి చెసినా, తెలియక చేసినా తప్పు తప్పే కనుక... దేవునికి నైవేద్యంగా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు. పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదించరాదు. చల్లారాకనే నివేదించాలి. నివేదనలో మంచినీటిని కూడా తప్పనిసరిగా పెట్టాలి. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి. -
వృద్ధ దంపతుల ఆత్మహత్య
సాక్షి, కృష్ణా : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకుడులు పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెంది వృద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా మండల కేంద్రమైన ముసునూరుకి చెందిన రామదాసు(90), అచ్చమాంబ(80) దంపతులు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయోభారం వల్ల తమ పనులు తాము చేసుకోలేకపోయారు. కాగా వారి అలనా పాలనా చూసుకోవాల్సిన కుమారులు వారిని పట్టించుకోలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన వృద్ధ దంపతులు మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దంపతులను స్థానికులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం ఆ వృద్ధ దంపతులు మృతి చెందారు. మృత దేహాలను పోస్ట్‌మార్టంకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
కరువు ప్రాంతానికి ‘భక్తరామదాసు’ వరం
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరుమలాయపాలెం: కరువుతోపాటు పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న తిరుమలాయపాలెం మండలానికి భక్తరామదాసు సాగునీటి ప్రాజెక్టు ఒక వరమని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని తిరుమలాయపాలెం, చంద్రుతండా, బచ్చోడు గ్రామాల్లో రూ.9 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా తిరుమలాయపాలెంలో సొసైటీ డైరెక్టర్ కొండబాల వెంకటేశ్వర్లు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు ప్రాంతంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో వహిస్తున్నారని, త్వరలోనే భక్తరామదాసు ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. తెలంగాణలో గోదావరి జలాలు వృథాగా పోతున్నాయని, ఆ నీటిని తెలంగాణలోని భూముల్లో పారించే సంకల్పంతో కేసీఆర్ ఉన్నారని తెలిపారు. ఇటీవల మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని, రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం విమర్శలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకుల విమర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన రాజీనామా సవాల్ ఆయన చిత్తశుద్ధికి నిదర్శన మన్నారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో వ్యవసాయ గోదాముల నిర్మాణంపై స్థానికులు ఎంపీ దృష్టికి తేగా త్వరలోనే గోదాము నిర్మాణం జరిగే విధంగా కృషి చేస్తానని హామి ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పుల అశోక్ , తహసీల్దార్ వెంకటరెడ్డి, ఎంపీడీఓ సన్యాసయ్య, ఎంపీటీసీ సభ్యురాలు కొలిచలం అనసూర్య, చంద్రుతండా సర్పంచ్ బోడ మారు, బచ్చోడు సర్పంచ్ పుట్టబంతి రేణుక, ఎంపీటీసీ సభ్యుడు ఎన్నెబోయిన రమేష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు రామసహాయం నరేష్‌రెడ్డి, బోడ మంచానాయక్, మాజీ సర్పంచ్ కొప్పుల చెన్నకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు