మనకు వాగ్గేయకారులున్నారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, శ్యామశాస్త్రి ...వీళ్లందరూ సంగీతాన్ని నాదోపాసనగా స్వీకరించి వాగ్గేయకారులైనారు. ఒకచోట స్థిరంగా కూర్చుని, కాగితం, కలం పట్టుకుని కృతులు రాసినవారు కాదు, వారికి ఎప్పుడెప్పుడు ఏ సందర్భాలలో ఏది చెప్పుకోవాల్సి వచ్చినా పరమాత్మకు చెప్పుకున్నారు. బాధకలిగితే, సంతోషం కలిగితే, దుఃఖం పొంగుకొస్తే... ఇంట్లో పెళ్ళి ప్రస్తావన వస్తే... అలా మనసు పొరల్లో ఏ మాత్రం అలికిడి అయినా వారి నిత్యసంబంధం పరమాత్మతోనే. ఆ కృతులలో భావార్థాలతో కూడిన గంభీరమైన చరణాలు ఎన్నో ఉండవు. కానీ ఆర్తితో పరమాత్మను గొంతెత్తి పిలిచారు. అది విన్నవారు పరవశించిపోయారు.
ఆ తరువాత ఎంతమంది గురువులు, శిష్యులొచ్చినా పరంపరాను గతంగా ఆ కీర్తనలు చెప్పుకున్నారు. పాడుకున్నారు. అవి కాలగతికి అలా నిలబడిపోయాయి. ఈనాటికీ వాటికి శిరస్సువంచి నమస్కారం చేస్తున్నాం.ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన జీవితం. వీరిలో కొంతమంది సంసారంలో ఉండి సన్యాసులుగా జీవించారు. మరికొందరు అపారమైన ఐశ్వర్యం ఉండి దానితో సంబంధం లేకుండా జీవించారు. మరికొందరు సంసారంలో ఉండి జ్ఞానంలో జీవించారు. ఏ స్థితిలో ఉన్నా నిరంతరం లోపల ఉండే నాదాన్ని ఉపాసనచేసి దాని ద్వారా పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యస్థితిని పొందడానికి వారు సోపానాలు నిర్మించుకున్నారు.
వారు చేసిన ఒక్కొక్క కీర్తనను... చివరకు ఆ పరమేశ్వరుడు కూడా చెవి ఒగ్గి వింటాడట. ‘‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః’’. పాముని కూడా పడగవిప్పి ఆడేటట్లు చేయగల శక్తి సంగీతానికి ఉంది. ‘‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం, ఏకమాపాత మధురం అన్యమాలోచనామృతం’’. అంటే... సంగీతం, సాహిత్యం రెండూ సరస్వతీదేవి రెండు స్తనాలు. ఒకటి ఆపాత మధురం. ఒకదానిలో క్షీరాన్ని గ్రోలడానికి ఏ విధమైన అర్హతా అక్కర్లేదు. ఆ పాలు తాగితే చాలు తేనె. రెండవ స్తన్యంలో ఉన్న పాలని స్వీకరించడానికి మాత్రం కొంత అర్హత కావాలి. దానికి వివేచన కావాలి. ఆలోచించగలిగిన సమర్ధత ఉండాలి. దాన్ని అర్థం చేసుకునే శక్తి భగవద్దత్తంగా లభించాలి.
అటువంటి అర్థగాంభీర్యంతో ఆయా వాగ్గేయకారుల చేసిన కృతులలో కొన్నింటిని ఎంచుకుని వాటిని గురించి తెలుసుకుందాం. ఆ కీర్తనలలోని ఆర్తిని, అర్థాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. చెప్పగలిగినవాడు సమర్ధుడా కాడా అని చూడకుండా భగవత్ శబ్దం ప్రతిపాదింపబడితే చాలనుకుని, పాఠకులు పరవశించే హృదయం కలవారు కనుక సాహసం చేస్తున్నా. ఇందులో తప్పొప్పులుండవచ్చు. కానీ వెనక ఉన్న ఉద్దేశాన్ని మాత్రం గ్రహించండి.
అమ్మ ఆర్తితో పెట్టే అన్నంలో ఒకరోజు పప్పులో ఉప్పు మరిచిపోవచ్చు. అంతమాత్రం చేత ఉప్పులేని పప్పు పెట్టాలన్నది అమ్మ ఉద్దేశం అనలేం కదా. పిల్లాడికి అన్నం పెట్టి ఆకలి తీర్చాలన్నదే అమ్మ ఉద్దేశం... అలా సమర్థత ఉందా లేదా అన్నది చూడకుండా ఆ మహానుభావుల కీర్తనలకు భాష్యం చెప్పడంలోని ఉద్దేశాన్ని సదుద్దేశంతో స్వీకరించండి. మొట్టమొదటగా త్యాగరాజ కృతి ‘నగుమోము కనలేని నాదు జాలీ తెలిసీ...’ వ్యాఖ్యానం వచ్చేవారం.‘సంగీత సాహిత్యం’ వాగ్గేయకారుల కీర్తనలకు వ్యాఖ్యానాలు, వారి జీవితచిత్రాల ఆవిష్కరణ లతో కొత్తసీరీస్ ప్రారంభం.
మీకు తెలుసా?
భగవంతుడికి నివేదించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు. తెలిసి చెసినా, తెలియక చేసినా తప్పు తప్పే కనుక... దేవునికి నైవేద్యంగా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు. పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదించరాదు. చల్లారాకనే నివేదించాలి. నివేదనలో మంచినీటిని కూడా తప్పనిసరిగా పెట్టాలి. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.
Comments
Please login to add a commentAdd a comment