కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వేళ రాజకీయ వేడి
పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార, ప్రతిపక్షాల ఏర్పాట్లు
రైతు పండుగ మొదలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వరకు దూకుడుగా అధికార పక్షం
రాష్ట్రమంతటా కలియదిరుగుతున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు
శాఖల వారీగా ప్రగతి నివేదికలు విడుదల.. 7, 8, 9 తేదీల్లో అట్టహాసంగా వేడుకలు
మరోవైపు బీజేపీ చార్జిషీట్లు.. నేడు నడ్డా రాక.. 6 అబద్ధాలు–66 మోసాల పేరుతో సభ
నిరసన కార్యక్రమాలతో గులాబీ దళం హడావుడి..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. ఓవైపు అధికార కాంగ్రెస్ అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నిరసనలు, బీజేపీ చార్జిషీట్లతో వారం రోజులుగా హడావుడి పెరిగిపోయింది. కాంగ్రెస్ సర్కారు రైతు పండుగ పేరుతో గత నెల 30న ప్రారంభించిన ప్రజాపాలన విజయోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్‌గా బీజేపీ, బీఆర్‌ఎస్‌ల చార్జిషిట్లు, నిరసనలు, బీఆర్‌ఎస్ నేతల నిర్బంధం వంటివి రాజకీయంగా సెగ పెంచుతున్నాయి.
రైతు పండుగ నుంచి..
గత నెల 30న రైతు పండుగ పేరుతో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన భారీ సభతో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలను ప్రారంభించింది. రైతు రుణమాఫీకి సంబంధించి నాలుగో విడతగా రూ.2,700 కోట్లను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేశారు. తర్వాతి రోజున మీడియాతో మాట్లాడిన సీఎం... రైతుల సంక్షేమం కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందజేస్తామని ప్రకటించారు. తర్వాతి రోజున ఆరోగ్య ఉత్సవాల్లో పాల్గొనడంతోపాటు సిద్దిపేట జిల్లాలో కోకాకోలా ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలతో ‘హైదరాబాద్ రైజింగ్’పేరిట కార్యక్రమం నిర్వహించారు.
తర్వాతి రోజున పెద్దపల్లిలో యువ వికాసం సభలో డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులతో కలసి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. మరుసటి రోజున ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభించారు. శుక్రవారం హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవాలకు హాజరైన సీఎం రేవంత్.. హోంగార్డులపై వరాల జల్లు కురిపించారు. ఇక 7, 8, 9 తేదీల్లో ఘనంగా విజయోత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 9న సచివాలయంలో ‘తెలంగాణ తల్లి’విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక వివిధ ప్రభుత్వ శాఖలు గత ఏడాది కాలంలో సాధించిన పురోగతిపై ప్రోగ్రెస్ రిపోర్టులను కూడా విడుదల చేయడం గమనార్హం.
చార్జిషిట్లతో ప్రజల్లోకి బీజేపీ..
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ కొంత దూకుడుగా వెళుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 1 నుంచి 5వ తేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిలలో చార్జిషిట్లు, ఐదు రోజుల పాటు బైక్‌ర్యాలీల నిర్వహణ, కరపత్రాల పంపిణీ ద్వారా... ప్రభుత్వ వైఫల్యాలను 6 అబద్ధాలు– 66 మోసాల పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఇక 7న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఎలాంటి విమర్శలు గుప్పిస్తుందన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు కేంద్రంలోని గత పదేళ్ల బీజేపీ పాలన, ఇక్కడి ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలంటూ టీపీసీసీ నేతలు సవాల్ విసరడంతో బీజేపీ చార్జిషిట్ల ఎపిసోడ్ రక్తి కట్టింది.
నిర్బంధాల నడుమ
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్‌ఎస్ కూడా గట్టిగానే పోరాడుతోంది. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్‌గాం«దీ, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంశాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. చాలా అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో గత కొన్నిరోజుల్లోనే కేటీఆర్, హరీశ్‌రావులపై 10కిపైగా కేసులు నమోదయ్యాయి. ఇక మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఫోన్‌ట్యాపింగ్ కేసు నమోదడంతో ప్రధాన ప్రతిపక్షం కొంత అప్రమత్తమైంది.
ఇందుకు ప్రతిగా ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన ఫోన్ ట్యాప్ అవుతోందని.. కేసు నమోదు చేయాలంటూ చేసిన హడావుడి రాజకీయ రచ్చకు దారితీసింది. పోలీసులు ఎమ్మెల్యేపైనే కేసుపెట్టి, అదుపులోకి తీసుకోవడం, పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్‌రావును కూడా అదుపులోకి తీసుకుని 10 గంటల తర్వాత విడుదల చేయడం చర్చజరిగింది. మరోవైపు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపునిచి్చంది.
దీంతో శుక్రవారం ఉదయం నుంచే హరీశ్‌రావు, కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు నిర్బంధించారు. ఇక ఈ నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీనితో ఈ రాజకీయ వేడి మరికొంతకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment