సంకల్ప బలం
సముద్రపు ఒడ్డున ఉన్న రాతి గుహల్లో ఒక చిన్న పక్షి వుండేది. అది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పొయాయి. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకు పొయాయో, వెంటనే తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకుని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది. తన గుడ్లు కొట్టుకు పోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడ అదేపని చెయ్యడం మొదలు పెట్టారు. ఎలాగైనా సముద్రుడిని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక వారు ఎవరి మాటా వినలేదు.
ఉత్సాహం! దృఢత్వం! పౌరుషం! ప్రయత్నం. దాని రోమరోమంలో నిండిపోయింది. దేశ దేశాలనుండి పక్షులు రావడం మొదలుపెట్టాయి.ఈ సమాచారం పక్షులకు రాజయిన గరుత్మంతుడికి తెలిసింది. ‘పద నేను చూస్తాను‘ అని గరుడుడు కూడా వచ్చాడు. ‘‘ఓ సముద్రమా! మా వారంతా ఒకటై నిన్ను శుష్కింపజేయాలనుకుంటున్నారు. నీవేమో ‘ఇవి నన్నేం చేస్తాయి? క్షుద్రమైన పక్షులు’ అనుకుంటున్నావా?
ఇప్పుడు చూడు నా తడాఖా!’’ అని గరుడుడు సముద్రంపైన తన రెక్కలతో రెండు మూడుసార్లు బలంగా ప్రహారం చేశాడు. అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడైనాడు. పక్షి గుడ్లను తెచ్చి ఇచ్చాడు. ‘అంటే ఎంత పెద్ద పనైనా సరే సంకల్పించి, శక్తికొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు నీకు లభిస్తారు. అప్పుడు ఆ పని చెయ్యడం వలన నీకు సఫలత చేకూరుతుంది అని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి గురువు గౌడపాదాచార్యులవారు శిష్యులకు బోధించేవారు.