తరుణారుణ ముఖకమలం
కరుణారసపూర పూరితాపాంగం
సంజీవన మాశాసే మంజుల
మహిమాన మంజనాసూనుం
విషయవాంఛలను విడిచిన వైరాగ్య పూర్ణుడవు కనుక, నీలో ఆనందానికి లోటు లేదు. నీ సజల నేత్రాలు, నీ రోమాంచాలు, నీ నిర్మలత్వం ఇవన్నీ మెచ్చుకున్న శ్రీరాముడు నిన్ను తన దూతగా ఎన్నుకున్నాడు. నవవికసితమై ఎర్రనైన నీ ముఖపద్మం, దయారస ప్రవాహం కల నీ చూపులు, నీ మనోహరత్వం, నీ మంజుల హృదయం నా పాలిట సంజీవనులు. నిన్ను నిరంతరం నా మనసులోనే నిలుపుకునే భోగాన్ని అంజనాతనయా! నాకు అనుగ్రహించు. నీవలె సడలని రామభక్తిని నాకూ కొంత దయచేయి... అన్నాడు శంకరుడు.ఆంజనేయుడు తలపంకించాడు.
శంకరుడు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించిన తరువాత... కాశ్మీర యువరాజ కుమారుడైన గోపాదిత్యుని కోరిక మేరకు జ్యేష్ఠ రుద్రేశ్వరాలయానికి కుంభాభిషేకం నిర్వహించాడు. విభిన్న వాదాలను ఖండిస్తూ, మతాల మధ్య సమన్వయం సాధిస్తూ కొంతకాలం పాటు కాశ్మీర భూముల్లో దిగ్విజయ యాత్రలు జరిపాడు. కలియుగాది 2611 (క్రీ.శ. 491) శ్రీసాధారణ నామ సంవత్సరం నాటికి.... హిమాలయ భూముల్లో పడమటి కొస నుంచి తూర్పుకు మళ్లి, యమునా తీరాన శ్రీకృష్ణ బృందావనాన్ని సమీపించాడు.
ఆ కార్తిక పౌర్ణమివేళ శ్రీకృష్ణదర్శనానికి ముందుగా బృందావన క్షేత్రపాలకుడైన ఆంజనేయుని దర్శించి అనుమతిని అర్థించాడు. శ్రీకృష్ణదేవుడు రాధాసమేతుడై మహారాస జరిపే పర్వదినాన బృందావనానికి రావాలంటే దేవతలైనా హనుమ అనుజ్ఞ కోరవలసిందే.
జగద్గురువుగా, యతివేషాన్ని ధరించి తనముందు నిలిచిన సాక్షాత్ శంకరునితో కొద్దిసేపు సంభాషించాలని ఆ రుద్రాంశ సంభూతునికి మనసు లాగింది.
‘‘జగద్గురూ! పరమాత్మ నల్లగా ఉంటాడా.. తెల్లగా ఉంటాడా... ఎర్రని వాడా... నీలమేఘచ్ఛాయ బోలు దేహము వాడా?’’ అని ఒక చిలిపి ప్రశ్న సంధించాడు.
‘‘ఛాందోగ్యం ఆదిత్యుని వర్ణన చేసింది కదా స్వామీ! అంగోపాసనలను చెప్పిన తర్వాత వచ్చే మంత్రంలో... ఆదిత్యునిలోని తెల్లని ప్రకాశమే ఋక్కు, ఆయనలోని అతిశయించిన నల్లదనమే నీలవర్ణమై సామగా మారిందని తెలియచేసింది. ఆదిత్యునికి మధ్యలో బంగరు రంగు పురుషుడున్నాడన్నది...’’ శంకరుడు చెప్పుకుపోతున్నాడు.
‘‘కాస్త ఆగు స్వామీ! ఆ హిరణ్మయుని జుత్తు, మీసం, గెడ్డం కూడా బంగారం రంగులో ఉన్నాయంటోది కదూ ఉపనిషత్తు?’’ అడిగాడు ఆంజనేయుడు.
‘‘పరమాత్మ బంగారు వర్ణంలో ఉన్నాడంటే బంగారంతో స్వామిని ఎవరో తయారు చేశారని అర్థం కాదు కదా! దేహప్రకాశం వల్ల బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటాయి కానీ, నిత్యయవ్వనుని కేశాలు నల్లగా కాక మరోలా ఉన్నాయంటే అసంబద్ధంగా ఉంటుంది’’ అని సమాధానమిచ్చాడు శంకరుడు.
‘‘వేదాంతం చెప్పడానికి పూనుకున్నప్పుడు శాస్త్రాన్ని శాస్త్రంలా చెప్పాలి కానీ, జ్ఞానులైన ఋషులు కూడా కవిత్వాన్ని ఒలకబోస్తే ఇలాగే ఉంటుంది... సామాన్యులకు అర్థం కాదు. అది సరే కానీ, ఆ తరువాత మంత్రమున్నదే... అదే... ‘తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణీ తస్యోదితి నామ’ దానిమీద నీ అభిప్రాయం ఏమిటి?’’ అని ఆగి నోటిపై నాలుగువేళ్లనూ ఉంచుకుని, ‘హవ్వ’ అన్నట్లు సంకేతిస్తూ, ‘‘పరమాత్మ కళ్లను గురించి చెబుతూ కోతిపృష్ఠభాగంలా ఎర్రగా ఉంటాయని చెప్పడం తగిన పనేనంటావా?’’ అన్నాడు హనుమంతుడు తోక దాచుకుంటూ.
‘‘అయ్యయ్యో అదేమీ లేదయ్యా తండ్రీ!’’ చెప్పాడు శంకరుడు. ‘‘కోతిపృష్ఠభాగంలా ఎర్రగా ఉండేవి పద్మాలు. బురదలో పుట్టిన పద్మానికే ఆ నీచోపమ చెందుతుంది కానీ, స్వామి కన్నులు పద్మాలే. ఏ సందేహమూ తగలకుండా పుండరీకాక్షుడని చెప్పింది అందుకే...’’ అన్నాడు.
‘‘సరేలే... నీ సంగతి చూస్తుంటే మన ఋషులమీద, శాస్త్రాలమీద ఈగ వాలనిచ్చేలా లేవు. అందరినీ సమర్థిస్తూ, సమన్వయిస్తూ పోవాలంటేనూ... కొందరినైనా కాదని తిట్టిపోయకుండా ఉండాలంటేనూ.... సత్యం ఒక్కటే కానీ పండితులు అనేక రకాలుగా చెబుతుంటారని తెలుసుకోవాలంటే నీలాంటి తెలివితేటలు అందరికీ ఉండొద్దా చెప్పు! తెలివిదేమున్నది కానీ, ఇంత చిన్నవయస్సులో ఇంతటి వైరాగ్యాన్ని ఎక్కడ సాధించావు చెప్పవా’’ మనకోసం అడిగినట్టు అడిగాడు పాపం ఆంజనేయుడు.
‘‘భగవానుడందించిన గీతనుంచే. సుఖహేతువులైన విషయాలు మూడురకాలుగా ఉంటాయి. వినిపించేవి, స్మరణకు వస్తుండేవి, అనుభవంలోకి వచ్చేవి. ఒక వ్యక్తి తనకు ప్రీతిని కలిగించే వ్యక్తిని గురించి విన్నప్పుడు తెలియకుండానే సకాముడు అవుతున్నాడు. ఆ వ్యక్తిని మనసున స్మరించి స్మరించి కామము కలవాడవుతున్నాడు. ప్రీతికరమైన వస్తువు లేదా వ్యక్తి తనకు సన్నిహితమైనప్పుడు అనుభవించి కూడా తనివి తీరక కామాన్ని పెంచుకుంటున్నాడు. శరీరమందు గగుర్పాటు, కన్నులు విప్పార్చడం, ముఖంలో ప్రీతి, శరీరం కంపించి పోవడం, చెమటలు పట్టడం, పెదవులు కొరకటం, కన్నులు రక్తం చిమ్మటం, మనసులో తెలియరాని సంక్షోభం చెలరేగడం వంటి కామక్రోధోద్భవ వేగాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అభ్యాసం చేయాలి. ఈ సంకేతాలు కనిపించగానే కామాన్ని అరికట్టగలిగితే యోగం అవుతుంది. వైరాగ్యం, భగవద్భక్తి రెండూ అందుకు సాధనాలు. కాగా దీనిలో నిశ్చయము, అనిర్వేదము, సమదర్శనము అనేవి అనుష్ఠించ దగినవి’’ శంకరుడు ఇంకా చెబుతూనే ఉన్నాడు.
అంతలోనే ఆంజనేయుడు అందుకుని, ఆ సందర్భంలోని గీతాశ్లోకాన్ని పఠించాడు.
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే
శంకరుడు దానికి భాష్యాన్ని ఇలా వెలువరించాడు. ‘‘అభ్యాస వైరాగ్యముల చేతనే మనస్సును నిగ్రహించడం సాధ్యమవుతుంది. మన చిత్తవృత్తులలో భాసించే ఇష్ట దేవతనే బ్రహ్మస్వరూపంగా ఎంచుకోవాలి. అన్ని స్థితుల యందూ సమానంగా తోస్తున్న చిత్తవృత్తినే దేవతారూపంగా దర్శించడం కనుక అభ్యసిస్తే మనస్సు తేలికగా స్వాధీనమవుతుంది. ఐహిక ఆముష్మిక భోగాలయందు దోషాన్ని చూడడం అభ్యసించడం వల్ల వైరాగ్యం ఉదయిస్తుంది. శ్రద్ధ, ఆస్తిక్య బుద్ధి కలిగి ఇటువంటి అభ్యాసం చేసిన యోగికి మరణకాలంలో స్మృతి భ్రష్టమైనా, అతడు యోగమార్గం నుంచి మాత్రం భ్రష్టుడు కాడు. ఆ యోగబలమే అశ్వమేధాది యాగఫలాన్ని అందిస్తుంది. తరువాతి జన్మలలో కూడా అటువంటి యోగి అధర్మవర్తన నుంచి దూరంగానే ఉంటాడు. మోక్షమార్గాన్ని తేలికగా పొందుతాడు.... ’’
‘‘అయితే అశ్వమేధాది యాగాలను మానసికమైన యోగబలంతోనే నిర్వహించాలంటావు. నిజంగానే జంతువును తీసుకొచ్చి బలివెయ్యనక్కరలేదంటావు’’ అడిగాడు ఆంజనేయుడు.
‘‘ఉపనిషత్తు చెప్పిన ఏకైకమార్గం మాత్రం అంతే...’’ అన్నాడు శంకరుడు.
‘‘సరే... ఈనాడు కార్తిక పౌర్ణమి. మాధవ దేవుడు మహారాస కోసం బృందావనానికి తరలి వచ్చే సమయం ఆసన్నమవుతోంది. అదిగో ఆ భక్తులందరూ అందుకే అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఈ రాత్రివేళ వారు సమకూర్చిన సకల సంభారాలూ దైవానికే అనుభవైక వేద్యమవుతాయి. తాను వచ్చివెళ్లిన ఆనవాళ్లను మాధవదేవుడు రేపటికి మిగుల్చుతాడు. ఈరాత్రి సమయంలో ఈ చుట్టుపక్కల ఉండేందుకు మానవ మాత్రులెవరికీ అనుమతి లేదు. ఇక్కడ గోవిందుడొక్కడే పురుషుడు. కనుక ఇచ్ఛామాత్రంగా దేహాన్ని మార్చుకోగలిగిన దేవతలు, మహర్షులు సైతం పశుపక్ష్యాది రూపాలలోకి మారి, దూరాన నిలిచి కృష్ణలీలలను తిలకించి జన్మధన్యత పొందుతుంటారు. అయినా అతిచిన్న వయస్సులోనే స్వామి నీ మాటవిన్నవాడు. నీ కోరికమేరకు లీలామాత్రంగా తన ఆలయాన్ని పూర్ణానది ముంపునుంచి తప్పించినవాడు. మరి నీకక్కడ మినహాయింపు లభిస్తుందో లేదో నేను చెప్పలేను. ఏం చేస్తావో చెప్పు... ఇతరుల వలె నీవు కూడా రూపు మార్చుకుంటావా?!’’ అడిగాడు హనుమంతుడు ముసిముసిగా నవ్వుతూ.
‘‘అక్కడికి వెళ్లాక చెబుతాను’’ అని జవాబిచ్చాడు శంకరుడు దారితీస్తూ. ఆనాడు హనుమతో కలిసి శంకరుడు శ్రీకృష్ణదర్శనం చేశాడు.
ముదురుతున్న చలిని ఇక తట్టుకోవడం నావల్లకాదంటూ మార్గశిరానికి చోటిచ్చి కార్తికం మరలిపోయింది. శంకరుడు బృందావనాన్ని విడిచిపెట్టి, ద్వారకానగరం దిశగా మరలాడు. ఆవేళ సర్వజ్ఞపీఠంలో చందనదారు శిల్పమై వెలిíసిన ఉభయభారతి ఇప్పుడు సంచారపీఠానికి అధిదైవమై వెంటనంటి వస్తోంది. పద్మపాద, మండనమిశ్ర, హస్తామలకాది పద్నాలుగు మంది ముఖ్యశిష్యులతోనూ, ఇతర శిష్యులతోనూ, అభిమాన గణంతోనూ కలిసి ఒక మహాసమూహంగా శంకరయతి గోమతీతీరంలో ప్రవేశించాడు.
అవి మాఘమాసపు మాతంగీ నవరాత్రి పర్వదినపు రోజులు. ఆ పంచమినాడు స్నానార్థమై నదిలో మునిగిన శంకరాచార్యుడు ఒడ్డుకు వచ్చే సమయంలో చేతిలో ఒక గోమతీచక్రాన్ని తీసుకువచ్చాడు. ఎర్రని రంగు కలిగి, శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శనాన్ని పోలివుండే గోమతీచక్రం మహాలక్ష్మీ స్వరూపం. దానిని పీఠంలో ఉంచి, శంకరుడు తగినరీతిన అర్చించసాగాడు.
అర్చన ముగింపుకు వచ్చేవేళలో అవ్యక్తమధురమైన ఒక కంఠధ్వని వినవచ్చింది. ‘‘జగద్గురూ! శ్రీకృష్ణదేవుడు ఆనతిచ్చిన శుభముహూర్తం సమీపించింది’’ అన్న సందేశమది. కన్నులు తెరిచి చూసేసరికి తన ఎదుట ఉన్న శ్రీశారదా రూపం నల్లనికాటుక రంగులోకి మారి ఉంది. క్రమంగా ఆ శిల్పంలో కదలిక వచ్చింది.
శంకరుడు ఆ మహాకాళీ స్వరూపం వెంట మౌనంగా నడిచాడు. కదులుతున్న చీకటిరాశిలా కాళి ఆయనను ద్వారకా నగరంలోకి తీసుకుపోయింది. ద్వారకాధీశుని ఆలయానికి కొద్దిదూరంలో సముద్రతీరాన శుద్ధస్ఫటిక మూర్తిగా దర్శనమిచ్చే సిద్ధేశ్వర మహాదేవుని సన్నిధిలో నిలబెట్టింది. ఆ స్వామి వెలుగులు ప్రసరించిన తరువాత నల్లని కాళి కాస్తా అరుణవర్ణంలో భద్రకాళిగా మారింది. శంకరుడు ఆ ఇద్దరినీ శాస్త్రవిధిన అర్చించాడు. శ్రీశారదా చందన దారుమూర్తిలోని ఒక కళ ద్వారకలోని భద్రకాళిలో చేరి అక్కడే స్థిరపడింది. కాగా దారుమూర్తి మళ్లీ శంకరుని వద్దనే మిగిలిపోయింది.
భరతఖండానికి పశ్చిమదిశలో తొలి శంకర పీఠం ద్వారకలో నెలకొల్పడానికి భద్రకాళీ, సిద్ధేశ్వరుల అనుమతి ఆ విధంగా లభించింది. శ్రీసాధారణ నామ సంవత్సర మాఘశుక్ల సప్తమి అనగా రథసప్తమినాడు ద్వారకా పీఠస్థాపనకు ముహూర్తం ఖరారైంది.
శంకరుడు తన తొలిపీఠానికి కాళీపీఠమనే నామకరణం చేశాడు. కానీ దానిని కూడా శారదాపీఠమనే పిలుస్తుంటారు. పీఠస్థాపన వేళ శంకరుడు ఇలా ప్రకటించాడు.
‘‘సముద్రాన్ని ఆనుకుని ఉన్న సౌరాష్ట్రదేశం (గుజరాత్), సింధు, సౌవీరదేశాలతో (పంజాబ్ నుంచి ఎగువకు ఉన్న ప్రాంతం) మొదలుపెట్టి మహారాష్ట్రం వరకు ఉన్న ప్రాంతాలన్నీ నేటి నుంచి ద్వారకా కాళీపీఠ పాలనలోకి వస్తాయి. భద్రకాళీ, సిద్ధేశ్వరులు ఈ పీఠానికి అధిదేవతలు. భరతఖండానికి నాలుగు దిక్కులా పీఠస్థాపనలు చేయాలన్న ప్రణాళికలో ఇది మొదటి అడుగు. ఈ పీఠ ఆచార్య స్థానానికిగానూ హస్తామలకాచార్యుణ్ణి ఎంపిక చేస్తున్నాను’’ అంటూ శంకరుడు తన శిష్యుణ్ణి చేరబిలిచాడు.
హస్తామలకుడు వినమ్రంగా వెళ్లి జగద్గురువు ముందు నిలబడ్డాడు. పీఠాధిపతిగా శంకరుడు అతడిని అభిషేకించాడు. అనంతరం...
‘‘సామవేద సారమైన ఛాందోగ్యోపనిషత్తు అందించిన ‘తత్త్వమసి’ మహావాక్యాన్ని ద్వారకా పీఠాధిపతులు బోధిస్తారు. వీరందరూ భూతదయతో ఉంటారు. క్రిమికీటకాదులను సైతం హింసించని నియమం కలవారు. కనుక వీరిది కీటవార సంప్రదాయమవుతుంది. గోమతీ తీర్థాన్ని సేవించే వీరికి అవిగత గోత్రాన్ని ప్రసాదిస్తున్నాను. తత్ వాక్యార్థాన్ని గ్రహించినవాడే ఇక్కడ తీర్థుడవుతాడు. సన్యాసాశ్రమ గ్రహణ నిపుణుడు, ఆశాపాశాల నుంచి విడివడినవాడు ఆశ్రమనామాన్ని ధరిస్తాడు. స్వానందమున క్రీడిస్తూ స్వస్వరూపమును ఎరిగిన వాడికి ఈ పీఠాధిపతులు స్వరూపనామాన్ని అనుగ్రహిస్తారు’’ అన్నాడు.
ద్వారకలో కాళీపీఠ స్థాపన కార్యక్రమం జయప్రదంగా నెరవేరింది. కానీ పీఠాధిపత్యాన్ని శంకరులు తనవద్దనే ఉంచుకోకుండా వేరొకరికి ఎందుకు కట్టబెట్టారన్న ప్రశ్న కొందరిని వేధించింది. మరికొందరి మనసుల్లో ఎందరో శిష్యులుండగా హస్తామలకుడే తొలిపీఠాధిపతిగా ఎందుకు ఎంపికయ్యాడో అన్న సందేహం మెదిలింది.
శంకరుడొకసారి వారి సందేహాన్ని తీర్చాడు. ‘‘ఈనాడు పదహారేళ్ల బాలునిగా కనిపిస్తున్న ఈ హస్తామలకుని వయస్సు నిజానికి అంతకంటే చాలా ఎక్కువ. వాయుదేవుని అంశతో జన్మించిన ఇతడు పూర్వజన్మలోనే సిద్ధస్థితిని పొందాడు. ఒకరోజున గంగాతీరాన బాహ్యస్మృతిలేని తపస్సమాధిలో ఉన్నాడు.
ప్రభాకర పండితుని ఇల్లాలు తన రెండేళ్ల కుమారుణ్ణి ఎత్తుకుని గంగాస్నానానికి వచ్చింది. తన పిల్లవాణ్ణి సిద్ధుని ముందు దిగవిడిచి స్నానానికి వెళ్లింది. తల్లి తనకు పిల్లవాణ్ణి అప్పగించి వెళ్లిందన్న సంగతి సిద్ధుడు గుర్తించలేదు. అన్నెం పున్నెం ఎరుగని పసిబాలుడు అమ్మవెళ్లిన తోవను వెతుక్కుంటూ వెళ్లి నదిలో మునిగి మరణించాడు.
తల్లి తన బిడ్డ శవాన్ని ఎత్తుకుని సిద్ధుని ముందుకు వచ్చి బావురుమని విలపించింది. సిద్ధుని మనస్సు కరిగి నీరైపోయింది. తనపై వచ్చిన అపవాదును పోగొట్టుకోవడానికి, ఆ తల్లి కడుపుకోతను తీర్చడానికి ఆయన తన విద్యను ఉపయోగించాడు.
అప్పటికప్పుడు తన దేహాన్ని తృణప్రాయంగా త్యజించి బాలుని దేహంలోకి పరకాయ ప్రవేశం చేశాడు. బాలుడు తిరిగి బ్రతికాడు. కానీ ఆ బాలునికి కూడా తనలోపల ఉన్న సిద్ధునికి వలెనే లౌకిక ప్రపంచం పట్టేది కాదు. అతని తీరుచూసిన పెద్దలు అతడు వఠ్ఠి జడుడు అనుకున్నారు. తండ్రిగా ప్రభాకరుడు ఎంతో ఆవేదన పడ్డాడు. కుమారుని శ్రేయస్సుకోసం ఉపనయనాది సంస్కారాలు నిర్వహించాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. శంకరుణ్ణి కలుసుకునే వరకూ అతని సంగతి ఎవరికీ అంతుపట్టలేదు. చేతిలో ఉసిరికాయలతో శంకరుని ముందుకు వచ్చి తొలిసారిగా తన స్వస్వరూప స్థితిని నివేదించాడు. ఆనాటి జడస్వరూపం నేడు భరతఖండానికి సామవేదోక్తమైన ధర్మనియమాలపై అంతిమ నిర్ణయాన్ని వెలువరించగలిగే పశ్చిమామ్నాయ శంకర పీఠానికి తొలి గురువు అయ్యాడు.’’
(సశేషం)
- నేతి సూర్యనారాయణ శర్మ
Comments
Please login to add a commentAdd a comment