Life History
-
ఎనిమిదేళ్లకే పెళ్లి..బడి గుమ్మం తొక్కలేదు : అయితేనేం ఆమె ఒక లెజెండ్!
స్వాతంత్ర్య పోరాటంలో భారతీయ మహిళలు కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సమరరంగాన దూకేందుకు ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. అలాంటి సమర యోధుల్లో నెల్లూరుకు చెందిన పొణకా కనకమ్మ ఒకరు. ఎనిమిదేళ్లకే వివాహం. పాఠశాల గడప తొక్క కుండానే పాండిత్యాన్ని సంపాదించారు. చివరికి జైలుకు వెళ్లారు. ఎవరీ కనకమ్మ? నెల్లూరు వాసులకే కాదు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచిన ధీరవనిత కనకమ్మ జీవిత విశేషాలు మీకోసం... కవయిత్రి, సామాజిక కార్యకర్త కనకమ్మ 1882 జూన్ 10న పోట్లపూడి గ్రామంలో మరుపూరు కొండారెడ్డి, రావమ్మల దంపతులకు జన్మించారు. ఎనిమిదేళ్లకే నెల్లూరు సమీపంలోని పొట్లపూడి గ్రామం భూస్వామి మేనమామ, సుబ్బ రామ రెడ్డితో బాల్య వివాహం అయింది కనకమ్మకు. దీంతో కుటుంబ కట్టుబాట్ల ప్రకారం పాఠశాలకు వెళ్లేందుకు అనుమతి లేదు. అయితే ఆమెలోని ధీరత్వం వెనక్కి పోలేదు. సంఘ సేవ కోసం ఇల్లు విడిచి కనకమ్మ ఉద్యమబాటన నడిచారు. నెల్లూరు కాంగ్రెస్ కమిటీకి తొలిమహిళా అధ్యక్షురాలుగా ఎంపికైన ఘనత కనకమ్మ సొంతం. మహాత్మా గాంధీ శిష్యురాలిగా ఉప్పు 1930ల కాలంలో సత్యాగ్రహం,వందేమాతరం ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దీంతో వేలూరు, నెల్లూరు జైళ్లలో ఒక ఏడాదికిపైగా జైలు జీవితాన్ని అనుభవించారు. 1913లో పోట్లపూడిలో సుజన రంజనీ సమాజ స్థాపన, వివేకానంద గ్రంథాలయం, బాలబాలికల విద్య కోసం శ్రీ కస్తూరిదేవి విద్యాలయం స్థాపనలో ఆమె కృషి మరువలేనిది. సాహిత్య రంగంలో కూడా కనకమ్మ ఎంతో కృషి చేశారు. వ్యాసాలు, కవితలు రచించారు. ముఖ్యంగా స్త్రీవాద కోణంలో ఆమె రచనలు సాగాయి. కొంతకాలం జమీన్ రైతు పత్రికను కూడా నడిపారు. అందుకే ప్రతిష్ఠాత్మకమైన గృహలక్ష్మి స్వర్ణకంకణం కూడా ఆమెను వరించింది.తన జీవితంలో 45 ఏళ్లు సామాజిక కార్యక్రమాలకే అంకితం చేసిన గొప్ప మహిళ. 1963 సెప్టెంబర్ 15న కనకమ్మ కనకమ్మ అస్తమించారు. 2011లో ఆమె ఆత్మకథను తెలుగులో “కనకపుష్యరాగం” పేరుతో డా.కె.పురుషోత్తం విడుదల చేయడం గమనార్హం‘‘ఊయలలూగించే కోమల కరాలే రాజ్యాలు శాసిస్తవి ,తూలికపట్టే మృదుహస్తాలే శతఘ్నులు విదలిస్తవి, జోలలుబుచ్చే సుకుమారపు చేతులే జయభేరులు మోగిస్తవి’’ -కనకమ్మ -
మొదటి కుమార్తె మరణం కంటే అది చాలా బాధాకరం - ఎలాన్ మస్క్
అపర కుబేరుడు & టెస్లా కంపెనీ అధినేత 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి తెలియని వారు ఉండరు. అయితే త్వరలోనే ఈయన జీవిత చరిత్రకు సంబంధించిన బుక్ ఒకటి విడుదలకానున్నట్లు సమాచారం. అందులో మస్క్ గురించి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఆయన కుమార్తె 'జెన్నా'తో ఉన్న విభేదాలను గురించి వెల్లడించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ఎలాన్ మస్క్ మాజీ భార్య 'జస్టిస్ విల్సన్' ద్వారా ఇద్దరు కుమారులు జన్మించారు. వారు 'జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్'. అయితే మస్క్ 2008లో జస్టిస్‌కి విడాకులిచ్చాడు. ఆ తరువాత జేవియర్ అలెగ్జాండర్ లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిగా మారి 'వివియన్ జెన్నా విల్సన్'గా మారింది. తండ్రి మీద ఉన్న కోపంలో ఇలా చేసుకున్నట్లు గతంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మస్క్ జెన్నాను కలుసుకోవడానికి చాలా సార్లు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఆమెకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉండటం. దీంతో డబ్బున్నవారందరూ చెడ్డవాళ్లే అని దృడంగా నమ్మి తనకు దూరంగా ఉంటోంది. జెన్నా ఎప్పుడూ నాతో కొంచెం సమయం కూడా గడపడానికి ఇష్టపడలేదు, ఇది తనను ఎంతో బాధకు గురిచేసినట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: మొదటి సారి నా భార్యను అక్కడే కలిసాను - ఆనంద్ మహీంద్రా ఇది నా మొదటి కుమార్తె 'నెవాడా' (Nevada) మరణం కంటే కూడా చాలా బాధించిందని తెలిపాడు. ఇవన్నీ కూడా మస్క్ జీవిత చరిత్ర పుస్తకంలో ఉన్నట్లు సమాచారం. ఈ బుక్ ఈ నెల 12న (2023 సెప్టెంబర్ 12) విడుదలయ్యే అవకాశం ఉంది. -
ఎవరీ టైగర్ ప్రభాకరన్.. హీరోనా? విలనా?
అణచివేత ఏ రూపంలో ఉన్నా.. ఏదోఒకనాటికి అగ్గిని రాజేయడం ఖాయం!. అలా లంక గడ్డపై అక్కడి సింహళీయుల చేతుల్లో దారుణంగా అవమానాలకు గురైన తమిళులకు ఆరాధ్య దైవంగా మారాడు వేలుపిళ్లై ప్రభాకరన్. యావత్ తమిళ సమాజం దృష్టిలో.. ప్రత్యేకించి తమిళ సాహిత్య-సంస్కృతికి గుండెకాయ లాంటి జాఫ్నా(శ్రీలంక) నేల తమిళులకు ఆయన మాత్రం తలైవర్(నాయకుడు). ఇంతకీ ప్రభాకరన్ నేపథ్యం ఏంటి? హీరోగా కొందరు.. విలన్‌గా మరికొందరు ఎందుకు ఆయన్ని ఎందుకు బేరీజు వేసుకుంటారు?. డీఎన్ఏ టెస్ట్‌లోనూ ఆయన మరణించారనే ధృవీకరణ ప్రకటన వెలువడినప్పటికీ.. ఇంకా సజీవంగా ఉన్నాడని, తిరిగి వస్తాడనే ఆశలు ఎందుకు పెట్టుకుంటున్నారు?.. వేలుపిళ్లై ప్రభాకరన్.. ఉత్తర తీర పట్టణం వాల్వెట్టితురైలో 26 నవంబర్ 1954 న జన్మించాడు. నలుగురు పిల్లలలో చిన్నోడు. తండ్రి ప్రభుత్వ అధికారి. సంపన్న కుటుంబం వాళ్లది. కానీ, లంక ప్రభుత్వాలు తమిళులపై చూపించే వివక్ష ఆయన్ని బడి చదువును పక్కన పెట్టించింది. పదిహేనేళ్ల వయసులో.. సత్యసీలన్ ఏర్పాటు చేసిన తమిళ మనవర్ పెరవై అనే గ్రూప్‌లో చేరాడు. ఆపై తమిళులకు స్వయంప్రతిపత్తిని పిలుపుతో ముందుకు సాగాడు. పెరవై నుంచి విడిపోయి.. తమిళ న్యూ టైగర్స్ పేరుతో భాగస్వామ్య కూటమిని ఏర్పాటు చేశాడు. అదే సమయంలో.. తమిళులకు సింహళీయులతో సమానంగా హక్కులను కల్పించాలని, తమిళులు అధికంగా ఉండే చోట్లను స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతాలుగా మార్చాలని ఒక వర్గం వారు కోరగా.. ఇంకో వర్గం ఏకంగా తమిళ ప్రాంతాన్నిటినీ కలిపి తమిళ్ ఈళం అనే ప్రత్యేక దేశాన్ని తమకు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టాలతో అగ్గి.. హక్కుల్లో అసమానతలు, జాతి వివక్ష, దేశ అంతర్యుద్ధంలో జరిగిన అకృత్యాలు, అఘాయిత్యాలు. శ్రీలంకలో తమిళులు కొందరు ఎన్నో శతాబ్దాలుగా ఉన్నా, అధిక శాతం వారు బ్రిటిషర్ల పాలనలో వలస కూలీలుగా తీసుకురాబడినవారే. వీరు ఎక్కువగా ఉండేది ఉత్తర, తూర్పు శ్రీలంకలో. శ్రీలంకకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 1970 వరకూ అందరికీ సమాన హక్కులు ఉండేవి. కానీ 1970లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం రెండు కొత్త చట్టాలను అమలులోకి తెచ్చింది. అవి రెండూ శ్రీలంక తమిళులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకటి.. యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ఆ యూనివర్సిటీ ఎక్కడైతే ఉంటుందో ఆ లొకాలిటీలో ఉండేవారికి 40% కేటాయించాలి. శ్రీలంకలో సింహళీయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి సీట్లన్నీ వారికే వెళ్ళేవి. దీని వల్ల తమిళులకు సీట్లు రావాలంటే సింహళ విద్యార్థి కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే తప్ప సీట్ దొరికే అవకాశం లేదు. రెండు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా సింహళం వచ్చినవారికి మాత్రమే ఉద్యోగం. అంతే కాకుండా సింహళాన్ని జాతీయ భాషగా ప్రకటించి తమిళానికి కనీసం అధికారిక భాషగా కూడా గుర్తింపు ఇవ్వలేదు.అంతే కాకుండా సామాజికంగా కూడా తమిళులను నిమ్నభావంతో చూడటం కూడా మొదలైంది. ఇవన్నీ శ్రీలంక తమిళుల స్వాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉండటం వల్ల శ్రీలంక ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. హత్యతో మొదలై.. ప్రభాకరన్ ఉడుకు రక్తం.. అప్పటి లంక రాజకీయాలు ఆయన్ని తీవ్ర నిర్ణయాలపై అడుగులు వేయించింది. ఆ సమయంలోనే 1975లో తమిళ ఉద్యమంలో పాల్గొని.. ఆపై జాఫ్నా మేయర్ దురైప్పాను హత్య చేయడం ద్వారా సంచలనానికి తెర తీశాడు ప్రభాకరన్. ఆ దెబ్బకి ప్రభాకరన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. తమిళులు హీరోగా అభివర్ణించసాగారు. ఆపై మే 5, 1976లో తమిళ న్యూ టైగర్స్ టీఎన్టీని.. ఎల్టీటీఈగా మార్చేశాడు. సింపుల్‌గా దీన్నే తమిళ టైగర్స్ అని కూడా పిలుస్తారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈళం వర్గానికి నాయకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్. దీనిని 32 దేశాలు తీవ్రవాద సంస్థగా ముద్ర వేశాయి. అనధికారికంగా ఉత్తర, తూర్పు లంకలో తమ సొంత ప్రభుత్వాన్నే నడిపేది. వీరు సొంత పోలీస్ స్టేషన్, కోర్టు, హాస్పిటల్, రేడియో, టీ.వీ చానెల్, దినపత్రిక, ఎయిర్ ఫోర్స్, నేవీ వంటివి కూడా నడిపేవారు. వన్యప్రాణులను పెంచుకునేవాడు ప్రభాకరన్. వీటన్నింటికీ నిధులు కెనడా, సింగపూర్ లో స్థిరపడ్డ తమిళులు, భారతీయ తమిళులు కూడా పంపేవారు. ప్రభాకరన్ తమిళులు నివసించే ప్రాంతాలన్నీ తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. తమకు కావలసిన ఆయుధాలను, డబ్బును విదేశాలనుండి సమకూర్చుకున్నారు. మారణహోమానికి ఆద్యుడా? నరనరాన నిండిన తమిళ జాతీయ వాదం.. విప్లవ స్ఫూర్తిని రాజేసి ఏకంగా లంక సైన్యంతో అంతర్యుద్ధం వైపుగా ఆయన్ని అడుగులు వేయించింది. ఇక శ్రీలంక సైన్యం జరిపిన మెరుపు దాడి.. ఏకంగా దేశంలో హింసకే దారి తీసింది. శాంతి చర్చలు జరిపినప్పటికీ.. అవి విఫలం కావడం, అప్పటికే ఎల్టీటీఈపై ఆగ్రహంతో ఊగిపోతున్న లంక సైన్యం ఎదురు దాడికి దిగడంతో ఘోర కలి జరిగింది. మూడేళ్ల పాటు అలాగే కొనసాగింది.. ఎంతోమంది శ్రీలంక సైనికులు, ఎల్టీటీఈ సైన్యం చనిపోసాగారు, గొడవలు జరిగే చోట లంక ప్రభుత్వం నీరు, భోజన సరఫరాను నిలిపివేసేది. దాని వల్ల ప్రజలు వలసలు పోయేవారు. ఈ వలసల వల్ల చాలా కుటుంబాలు తమ సొంత ఇళ్ళనీ, ఆస్తులనీ కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబంలో చనిపోకుండా మిగిలిన వారు పగతీర్చుకోడానికని ఎల్టీటీఈలో చేరేవారు. వలస వెళ్ళే వాళ్ళను ఎల్టీటీఈ ఆపేసే యత్నం చేసేది. శ్రీలంక సైనికులకు ఎవరు ప్రజలో ఎవరు తమిళ టైగర్స్ గుర్తించలేక ఆ స్థలాల్లో కనబడిన వారినందరినీ చంపేసే వారు. కొన్ని చోట్ల ఎల్టీటీఈ వాళ్ళు ఆత్మాహుతి దాడులు చేసేవారు. అలా.. పరీక్షల్లో తేలినా.. ముల్లైటివులోని వెల్లముల్లివాయికల్లో 2009 మే 18వ తేదీన లంక సైన్యం ఘోరంగా విరుచుకుపడింది. వంద మంది ఎల్టీటీఈ సైన్యం మృతి చెందింది. అందులో ప్రధాన నేతలు కూడా ఉన్నారని, ప్రభాకరన్ కూడా ఉన్నాడని లంక సైన్యం ప్రకటించింది. శ్రీలంక రక్షణ దళాల నుండి తప్పించుకోబోయి హతుడయ్యాడని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఆ మరుసటి రోజు స్వర్ణవహిని చానెల్లో డెడ్‌బాడీని చూపించారు. డీఎన్ఏ పరీక్షలో ప్రభాకరన్ మరణం ధృవీకరణ కూడా అయ్యింది!. కానీ, ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లు ఆయన మరణించలేదని చెబుతుంటారు. ఇంకొందరు ఆయన్ని ఘోరంగా చంపారని, ఉరి తీశారని, సహజంగా మరణించారని.. ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తారు. కొన్నాళ్లకు ఎల్టీటీఈ కొత్త చీఫ్ సెల్వరస పధ్మనాథన్ ప్రభాకరన్ మరణాన్ని ధృవీకరించాడు. రెండు వారాల తరువాత డీఎన్ఏ పరీక్షలో ప్రభాకరన్, అతని కుమారుడు చార్లెస్ అంటోనీలు చనిపోయినట్లు ధ్రువీకరించారు. అలా సాయుధ పోరాటం ఆగిపోయింది. శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసింది. దీని వల్ల దాదాపు లక్ష మంది చనిపోయారు వారిలో ఆ దేశ ప్రజలు, భారత సైనికులు, LTTE వర్గం వారు, లంక సైనికులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో లంక ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న మనదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా LTTE ఆత్మాహుతి దాడిలో మరణించారు. ప్రభాకరన్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయిందనేది లంక ఆర్మీ విశ్వాసం. ఆయన తల్లిదండ్రులు తిరువెంకటం, పార్వతిలను సైన్యం అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి చనిపోయే వరకు సైన్యం అదుపులోనే ఉన్నారు. చె గువేరా ఆఫ్ లంక 80వ దశకం ప్రారంభం నాటికి.. పోలీస్ దళాలపై ఎల్టీటీఈ దాడులు పెరిగిపోయాయి. ఆపై సైన్యంపై పెట్రోలింగ్ దాడి.. ఈలం యుద్ధానికి దారి తీసింది. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లోకి చేరిపోయాడు ప్రభాకరన్. శత్రువు చేత సజీవంగా పట్టుబడకుండా గౌరవంగా చనిపోవటానికి నేను ఇష్టపడతాను లాంటి కొన్ని ఆయన మాటలు.. తమిళులను తీవ్రంగా ప్రభావితం చేసేవి. ఆ సమయంలో చే గువేరాతో ప్రభాకరన్‌ను పోల్చింది ఓ ప్రముఖ పత్రిక. ఆపై రాజీవ్ గాంధీ హత్యకు. ఎల్టీటీఐకు సంబంధం ఉందనే వాదన తెరపైకి వచ్చింది. కానీ, ప్రభాకరన్ మాత్రం అది అంతర్జాతీయ కుట్ర అనేవారు. మరణాంతరం ఆ అభియోగాలకు మన దగ్గరి టాడా కోర్టు ఎత్తేసింది. ఘోరాలే.. ఇదిలా ఉంటే, యుద్ధంలో శ్రీలంక సైనికుల చేతిలో చిక్కిన LTTE వారిని, వాళ్ల కుటుంబ సభ్యులను చాలా ఘోరాతి ఘోరంగా హింసించి చంపిన ఉదంతాలను కొన్ని మీడియా సంస్థలు, ఫొటోగ్రాఫర్లు బయటపట్టారు. వారి బట్టలు ఊడదీసి అవమానించి, కళ్ళకు గంతలు కట్టి సుత్తులతో నెత్తిన కొట్టి, ఆడవారిని మానభంగం చేసి అతిక్రూరంగా కాల్చి చంపేవారు. ఇదంతా ఎవరో తీసిన వీడియో టేపు లీక్ అయిన తర్వాత బయటపడ్డ విషయాలు. దీని మీద ప్రపంచ మానవహక్కుల పరిరక్షణ సమితిలో కేసు నమోదు చేయగా, ఇప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఆ వీడియోలో ఉన్న వ్యక్తులను గుర్తించటానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారే తప్ప ఏ చర్య తీసుకోలేదు. ప్రభాకరన్ 12 ఏళ్ల కుమారుడు బాలచంద్రన్‌ను శ్రీలంక సైన్యం పట్టుకుని అత్యంత దారుణంగా హింసించి చంపిన తీరుకు అద్దం పట్టే ఫోటోలు బయటకు వచ్చాయి. జయలలిత సైతం ఆ ఘోర కలిని ఖండించారు అప్పట్లో. కానీ, లంక ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. భారత్ ప్రమేయం ఎంతవరకంటే.. లంక తమిళ వేర్పాటువాద ఉగ్ర సంస్థలు వర్సెస్ ప్రభుత్వం మధ్య అంతర్యుద్ధం. ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు, ఇంత జరుగుతుంటే పక్కనే ఉన్న మనదేశం ఊరుకోదుగదా! అప్పట్లో భారత ప్రధానమంత్రైన రాజీవ్ గాంధీ మొదట్లో ఎల్టీటీఈ కి మద్దతుగా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే.. 1987లో శ్రీలంక సైనికు దళం ప్రభాకరన్ దళం ఉన్న దాదాపు అన్ని ప్రాంతాలను తమ అదుపులోకి తెచ్చుకుంది. ఇక లొంగిపోవడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. అంతలో భారత ప్రభుత్వం ఆహారాన్ని, కొన్ని ఆయుధాలను హెలికాప్టర్ల ద్వారా తమిళ టైగర్లకు అందించిందట. ఈ విషయం లంక ప్రభుత్వానికి తెలిసి, భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటంటే తమిళ తీవ్రవాదుల ఆయుధాలన్నీ తమకు అప్పగించాలని, తమిళులకు ప్రత్యేక దేశం ఇవ్వడం తప్ప మిగిలిన షరతులను అంగీకరిస్తామని చెప్పింది. ఆ ఒప్పందం మీద Indian peace keeping force అనే పేరు మీద ఒక సైనిక బలగాన్ని లంకకు పంపింది ఇండియా. అప్పటి వరకు తమకు అనుకూలంగా ఉన్న ఇండియా ఒకే సారి వ్యతిరేకం అవ్వడం ప్రభాకరన్ సైన్యానికి పెద్ద అడ్డంకిగా అయ్యింది. ఈ ఒప్పందం తమిళ ప్రజలకు అనుకూలంగా లేదని, ఒక్కసారి ఆయుధాలను అప్పగిస్తే భారత సైన్యం తిరిగి వెళ్ళాక ఎల్టీటీఈనే కాదు.. తమిళ జాతి మొత్తాన్ని లంక సైన్యం అంతం చేసేస్తుందని భావించి ప్రభాకరన్ ఈ ఒప్పందాన్ని సమ్మతించలేదు. ఇక చేసేదేమీ లేక భారత సైన్యం కూడా ప్రభాకరన్ ను పట్టుకునే పనిలో పడింది. దాంతో భారతీయ సైనికులు కూడా చాలా మంది దాడుల్లో మరణించిసాగారు. భారత్.. ప్రమేయం శ్రీలంక వాసులకి నచ్చలేదు. పొరుగు దేశం వచ్చి తమ దేశ విషయాల్లో తలదూర్చడమేంటని లంక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, అప్పుడు లంక మన సైన్యాన్ని తిరిగి వెళ్ళిపోయింది కోరింది. ఈలోపు భారత్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి సైన్యాన్ని వెనక్కి రప్పించుకుంది. సోర్స్: వివిధ రకాల సైట్లు.. పాత అంతర్జాతీయ కథనాల ఆధారంగా.. క్రూరుడు.. మూర్ఖుడు.. మొండివాడు ప్రభాకరన్ శ్రీలంక తమిళ ప్రజల దృష్టిలో అమరవీరుడు. కానీ, విమర్శకులు ఆయన్ని అత్యంత క్రూరుడిగా, మూర్ఖుడిగా, అధునాతన తిరుగుబాటులల్లో ఆద్యుడిగా పేర్కొంటారు. రాజకీయ ఉగ్రవాద గ్రూపులను ప్రభావితం చేయటానికి అనేక వ్యూహాలతో ముందుకొచ్చిన ఉగ్రవాది అంటారు. 1976 లో స్థాపించబడిన ఎల్టీటీఈ 1983 లో జాఫ్నా వెలుపల శ్రీలంక సైన్యం పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో మెరుపుదాడికి దిగింది. ఫలితంగా 13 మంది సైనికులు మరణించగా.. ఆపై చెలరేగిన హింసతో పాటు వేలాది మంది తమిళ పౌరులు మరణించారు. ఇది ప్రభాకరన్ ఏకపక్ష నిర్ణయమనేది కొంది వాదన. అయితే.. తన మార్గాన్ని ఆయన ఎప్పుడూ సమర్థించుకునేవాడు. అహింసా మార్గాలు పనికిరానివి వాడుకలో లేవని గమనించిన తరువాత మాత్రమే తాను విప్లవ మార్గాలను ఎంచుకున్నానని ప్రభాకరన్ వాదించాడు. ముఖ్యంగా 1987 లో తమిళ ఈలం విప్లవకారుడు తిలీపాన్ ఆమరణ నిరాహార దీక్ష.. ఫలితం లేకుండా ముగియడం ఆయన్ని ప్రభావితం చేసిందట. లక్ష్యం లేని ఆ మార్గాన్ని పక్కన పెట్టాడని చెప్తాడాయన. అన్నింటికి మించి.. ‘‘చిన్నతనంలో అలెగ్జాండర్, నెపోలియన్ వంటి యుధ్ధ వీరుల గురించి తెలిసింది పుస్తకాల ద్వారానే. భారత జాతీయోద్యమం తోనూ, సుభాస్ చంద్రబోస్, భగత్ సింగ్, బాలగంగాధర తిలక్ వంటి నాయకులతోనూ గాఢమైన మానసిక సాన్నిహిత్యాన్ని ఏర్పరచినవీ పుస్తకాలే. నేను విప్లవకారుడిగా మారటానికి పునాది వేసినవి ఆ పుస్తకాలే. భారత జాతీయోద్యమం నా అంతరాంతరాలను కదిలించి విదేశీ దోపిడీ మీదా, పెత్తనం మీదా తీవ్రమైన ఆగ్రహాన్ని రగిలించింది. 1958 లో శ్రీలంకలో చెలరేగిన జాతుల ఘర్షణలు, వాటి ఫలితంగా తమిళులు అనుభవించిన వేదనా నన్ను సాయుధ పోరాటం వైపుకు నడిపాయి. దినపత్రికల్లో వార్తలను చూస్తుంటే ఆగ్రహావేశాలు నా హృదయాన్ని తుపాను వలె చుట్టు ముట్టేవి. తమిళ రచయితలు కాశియన్ (పామినిప్ పావై), శాండిల్యన్ (కాదత్ పురా), కల్కి (పొన్నియన్ సెల్వన్) ల రచనలు చదివాక మన పూర్వీకులు ఎంత స్వతంత్రంతో, స్వయం నిర్ణయాధికారం తో పాలన సాగించారో అర్ధమైంది. మన జాతి ప్రజలు ఈ బానిసత్వం నుంచి విముక్తులై తమ స్వతంత్ర దేశంలో ఆత్మ గౌరవంతో, స్వేఛ్చతో జీవించే రోజులు మళ్ళీ రావాలన్న గాఢమైన కాంక్షను నాలో కలిగించాయి ఈ పుస్తకాలు. “ఫలితాన్ని గురించి ఆలోచించక నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు” అనే భగవద్గీతా ప్రబోధం కూడా నన్ను చాలా ఆకర్షించింది. క్రమశిక్షణ కలిగిన ఉత్తమ జీవితాన్ని గడపాలని, నా జాతి ప్రయోజనాలకు కట్టుబడి పనిచేయాలని బాల్యం లోనే నిశ్చయించుకునేందుకు తోడ్పడినవి నేను చదివిన సందేశాత్మక గ్రంథాలే. సుభాస్ చంద్రబోస్ జీవితం నాకు దారి చూపిన వేగుచుక్క. క్రమశిక్షణా యుతమైన ఆయన జీవితమూ, దేశ స్వాతంత్ర్యం కొరకు ఆయన నిబద్ధత నన్ను తీవ్రంగా ప్రభావితం చేసి, మార్గ నిర్దేశం చేశాయి. నేను చదివిన పుస్తకాలే నన్ను ప్రజా విముక్తి పోరాటం లోకి నడిపించాయని చెబుతాను. జాఫ్నాకు చెందిన తమిళ సాహిత్య పత్రిక “వెలిచ్చమ్” కోసం 1994 లో ప్రభాకరన్ ఇచ్చిన ఇంటర్వ్యూ.. దానికి కాత్యాయని చేసిన అనువాదం -
పరిశోధనలో ఆయన ఘనాపాఠి
ననుమాస స్వామి అనగానే గుర్తొచ్చేవి కుల పురాణాలు. ఎన్నో కులాల పుట్టుపూర్వోత్తరాలను ఆయన జానపద గా«థల ఆధారంగా తెలియజేశారు. ముఖ్యంగా వృత్తి పురాణాలపై ఆయన చేసిన పరిశోధన పండితుల ప్రశంసలను అందుకుంది. అలాగే ఆయన అనేక ఉద్యమ గీతాలను అందించి తెలంగాణ ఉద్యమానికి ఊపును తీసుకొచ్చారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, అరెస్టయి వరంగల్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవించిన యోధుడు ననుమాసస్వామి (నమామి). అప్పటినుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తన భుజానెత్తిన తెలంగాణ జెండాను దించలేదు. 2013లో తెలంగాణ పోరాట యోధుల సంఘాన్ని స్థాపించారు. సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, శరద్ యాదవ్, ఏబీ బర్దన్ లాంటి నాయకులకు విజ్ఞా పన పత్రాలను అందించారు. 1969లోనే గాదు, 2001 నుండి తెలంగాణా ఉద్యమ గీతాలను రాసి పాడి తొలి తెలంగాణ ఉద్యమ వాగ్గేయ కారుడు అనిపించుకొన్నారు. 1969 లోనే ఉద్యమగీతాలు ‘అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్య’ లాంటి పాటతోపాటు మరో ఏడు పాటలను రాశారు. 2001లో తెరాస ఆవిర్భావసభ సందర్భంగా కూడా నాలుగు పాటలు రాసి 1969 నాటి ఉద్యమ స్ఫూర్తిని చాటారు. నిరక్షరాస్యుల కుటుంబంలో పుట్టిన ననుమాస స్వామి మూడు డాక్టరేట్లు, ఒక ఎం.ఫిల్ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూనే 1990లో ‘తెలుగు పరిశోధన’ పత్రికను స్థాపించి, పరిశోధన లను పదునెక్కించారు. ఎంతోమంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఆయన పర్యవేక్షణలో 21 మంది పరి శోధకులు పీహెచ్డీ పట్టాలనూ, తొమ్మండుగురు ఎం.ఫిల్ పట్టా లనూ సాధించారు. వృత్తి పురాణాల పరిశోధన కోసం ఆయన ఉభయ తెలుగురాష్ట్రాల్లో గ్రామగ్రామాన తిరిగి 14 చిత్రపటం కథా ప్రదర్శనలను, 34 వృత్తి కథా ప్రదర్శనలను వీడియో రూపంలో సేకరించారు. మడేల్, నాయీ, ముదిరాజ్, గౌడ పటంకథలతో సహా 12 పుస్తకాలను ప్రచురించారు. జానపద పురాణాలు, కుల పురాణం పేరుతో వివిధ పత్రికల్లో విస్తారంగా కాలమ్స్ రాశారు. ఇవి కొన్ని ఏళ్ల తరబడి కూడా కొనసాగాయి. వృత్తి దేవతలు పేరిట ఎస్వీ భక్తి చానల్లో ధారావాహిక నిర్వహించారు. ‘ఊసెత్తుతే చాలు ఉలిక్కిపడే పురాణాలు’ అంశం మీద 13 గంటలు ధారాళంగా ఉపన్యసించి ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్’ (2015)లోకి ఎక్కారు. అమె రికా, శ్రీలంక, యూకే లాంటి దేశాల్లో జరిగిన సదస్సులలో పాల్గొని, పరిశోధన పత్రాలను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధ్యా పక సంఘంలో 1995 నుండి 2011 దాకా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో అన్నింటా తెలుగు భోధన ఉండాలని ఉద్యమించి ప్రగతిని సాధించారు. 2011లో ‘భాషా పరిరక్షణ సమితి’ని స్థాపించి మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో, అంతర్జాతీయ యూనివర్సిటీలో తెలుగు శాఖలను ఏర్పాటు చేయించేందుకు చొరవ తీసుకున్నారు. – డా. నేతి మాధవి,జానపద పరిశోధకురాలు (నేడు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ననుమాస స్వామి మూడు పుస్తకాలు – ప్రవహిస్తున్న జైలుగానం,గాడ్గే బాబా, తెలంగాణ బోనాలు – ఆవిష్కరణ కానున్నాయి) -
వివక్షపై ధిక్కార స్వరం
దక్షిణాఫ్రికాలో సమానత్వం, న్యాయం కోసం దశాబ్దాలుగా సాగిన జాతివివక్షా వ్యతిరేక సుదీర్ఘ పోరాటంలో నెల్సన్ మండేలా వెన్నంటి నిలిచిన విశిష్ట వ్యక్తి డెస్మండ్ టూటూ. అమల్లో ఉన్న పాలక వ్యవస్థను మతపరంగా, సాంస్కృతికపరంగా, రాజకీయంగా సవాలు చేయడానికి ఆయన ఎన్నడూ భయపడలేదు. దాదాపు 80 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఇథియోపియా, భారతదేశం, జాంబియా వంటి దేశాల్లోని మారుమూల గ్రామాలలో పర్యటించి బాల్యవివాహాల బారిన పడిన, ఆ ఒత్తిడికి గురవుతున్న బాలికల వాణిని విన్నారు. బిషప్‌గా వ్యవహరిస్తూనే అనేక విధాలుగా ప్రజల జీవితాలను స్పృశించిన ఆయన చిరస్మరణీయుడు. ఆర్చ్ బిషప్ డెస్మండ్ టూటూ మహాభినిష్క్రమణంతో, ఈ లోకంలో మంచికోసం నిలబడిన ఓ గొప్ప శక్తిని ఈ ప్రపంచం కోల్పోయింది. మన ప్రపంచానికి అనురక్తినీ, క్షమాగుణాన్నీ నేర్పుతూ, ఉక్కు సంకల్పంతో తన కర్తవ్యాన్ని కొనసాగించిన మాన్యుడు టూటూ. దక్షిణాఫ్రికాలో జాతి సమానత్వం, న్యాయం కోసం దశాబ్దాలుగా సాగిన జాతివివక్షా వ్యతిరేక సుదీర్ఘ పోరాటంలో నెల్సన్ మండేలా వెన్నంటి నిలిచారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గళమెత్తడమే కాక, అనేక విధాలుగా ప్రజల జీవితాలను స్పర్శించిన ఆయన చిరస్మరణీయుడు. ప్రత్యేకించి, బాల్య వివాహాలను అంతమొందించడానికి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ప్రయత్నాలకు ఆయన చేసిన దోహదం అనన్య సామాన్యం. తనకు తెలియని విషయాన్ని తెలీదు అని అంగీకరించడంలో ఆయన ప్రదర్శించే నమ్రత తనలోని మరొక్క గొప్ప లక్షణం. బాల్యవివాహాల పట్ల ఇలాంటి ఎరుకతోనే వాటికి వ్యతిరేకంగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. సబ్–సహారన్ ఆఫ్రికాలో బాల్య వివాహ నిష్పత్తి, దక్షిణాసియా లేక మధ్యప్రాచ్య దేశాల్లో జరుగుతున్నంత స్థాయిలో, లేదా అంతకంటే ఎక్కువగా నమోదవుతోం దని ఆయన మొదటిసారిగా విన్న సందర్భం ఇంకా నాకు గుర్తుంది. ఈ సమస్య ఆఫ్రికాకు కూడా వర్తించే విషయమని తాను ఆలోచించలేదని ఆయన నిజాయితీగా చెప్పారు. ఆఫ్రికా ఖండంలోనూ బాల్య వివాహాల సమస్య ఉందని తెలి శాక, దాని పరిష్కారం పట్ల ఆయన పూర్తి నిబద్ధత ప్రదర్శించారు. దాదాపు 80 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఇథియోపియా, భారత్, జాంబియా వంటి దేశాల్లోని మారుమూల గ్రామాలలో పర్యటించి బాల్యవివాహాల బారిన పడిన, ఆ ఒత్తిడికి గురవుతున్న బాలికల వాణిని వారి గొంతుతోనే విన్నారు. ఆ చిన్నారుల తల్లితండ్రులు, మత నాయకులు, గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులను కలసి మాట్లాడారు. బాల్యవివాహాలు బాలికలకు ప్రయోజనకరం కావని వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అమల్లో ఉన్న పాలక వ్యవస్థను మతపరంగా, సాంస్కృతికపరంగా లేదా రాజకీయంగా సవాలు చేయడానికి ఆయన ఎన్నడూ భయపడలేదు. ఆయన ఒక గొప్ప కమ్యూనికేటర్. అదేసమయంలో శ్రోతలను నిమిషాల్లోనే నవ్పించి, ఏడిపించేలా చేయగలిగే జిత్తులమారి కేంపెయినర్ కూడా. సరైన భావోద్వేగపు బటన్లను ఎప్పుడు ప్రెస్ చేయాలో, విభిన్నమైన సందేశాలను ఎలా పంపించాలో ఆయనకు బాగా తెలుసు. తాను చెప్పే అంశాన్ని ఒప్పించడానికి తరచుగా ఆయన కథలు చెప్పేవారు. దేశాధ్యక్షులు, ప్రధానమంత్రుల వంటి నాయకులు ఆయన చెప్పే కథలను చిన్నపిల్లల్లాగా వింటూండిపోవడం, ఆ కథలోని ప్రధానాంశం నేరుగా తమకే తగులుతోందని వారు గుర్తించడం అసాధారణమేమీ కాదు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి పాలనకు 1948లో ప్రజామోదం లభిం చినప్పుడు డెస్మండ్ టూటూ వయస్సు 17 సంవత్సరాలు. అయితే ఈ భవిష్యత్ ఆర్చి బిషప్‌కి 40 ఏళ్లు వచ్చిన తర్వాత మాత్రమే నల్లజాతి విముక్తి భావన ఆయన ప్రపంచాన్ని విస్తృతపరిచింది. 1970ల మధ్యలో మాత్రమే ఆయన దక్షిణాఫ్రికా విముక్తి పోరాటంతో మమేకమయ్యారు. 90 ఏళ్ల వయసులో ఇటీవలే కన్నుమూసిన టూటూ మొదట్లో చర్చి మనిషిగానే ఉండేవారు. రాజకీయాల్లోకి రావాలని ఆయన ఎన్నడూ కోరుకోలేదు. 1975లో జోహాన్స్‌బర్గ్‌కి తొలి నల్లజాతి ఆంగ్లికన్ డీన్ అయినప్పుడు డెస్మండ్ టూటుకు రాజకీయంగా పెద్దగా చైతన్యం ఉండేది కాదు. అన్యాయం తన దృష్టికి వచ్చినప్పుడు అధికారంలో ఉన్నవారు దానిగురించి తప్పకుండా తెలుసుకునేలా ఆయన వ్యవహరించేవారు. బలవంతపు వివాహాల పాలై ఇక్కట్లపాలవుతున్న బాలికల గురించి మాట్లాడటమే కాదు... ఈ హానికరమైన దురాచారాన్ని అంతమొందించడంలో పురుషుల పాత్రకున్న ప్రాధాన్యంపై కూడా ఆయన చర్చించేవారు. భార్యలను తమతో సమానులుగా పురుషులు గుర్తించినప్పుడు జరిగిన మార్పుల గురించి మాట్లాడేవారు. ఏదైనా అంశంపై ఆయన మనసులో వ్యతిరేక అభిప్రాయం స్థిరపర్చుకున్నారంటే చాలా గట్టిగా దాన్ని ప్రతిఘటించేవారు. ప్రజలకు వారి విలువ ఏమిటో అర్థం చేయించేవారు. దేశాధ్యక్షుడిని అయినా సరే వేచి ఉండేలా చేసేవారేమో కానీ, తనకు టీ అందించేవారు, తనకోసం తలుపులు తెరిచేవారితో మాట్లాడటానికి సమయం వెచ్చించేవారు. ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులేనని, ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని ఆయన ప్రముఖులతో చెప్పేవారు. గొప్ప మార్పును సృష్టించాలంటే గొప్ప వెల్లువ అవసరమవుతుందని తరచుగా చెప్పేవారు. మనలో ప్రతి ఒక్కరూ ఆ వెల్లువలో నీటిబిందువుల్లా ఉండగలమనీ, కలిసి పనిచేయడం ద్వారానే మనం గొప్ప పనులను సాధించగలమని ఆయన చెప్పేవారు. ‘‘ఇతరులను క్షమిద్దాం, మనల్ని మనం క్షమించుకుందాం...’’ ఆయన పదేపదే చెప్పే సందేశాల్లో ఇది ఒకటి. చిన్నచిన్న పనులు చేయడం ద్వారా గొప్పమార్పును తీసుకురావచ్చని ఆయన చెప్పిన మాటలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. ఆయన విశ్వాసాన్ని ఎత్తిపట్టడం ద్వారా ఈ సంక్షుభిత ప్రపంచంలో అంతిమంగా మంచితనమే విజయం సాధిస్తుందని చెప్పగలను. – మబెల్ వాన్ ఆరెంజ్, సామాజిక కార్యకర్త జోహాన్స్‌బర్గ్‌కి వంద మైళ్ల దూరంలో ఉన్న, ఆఫ్రికన్ల ప్రాబల్యం ఉండే వ్యవసాయ నగరం కుగ్రెర్స్ డోర్ప్లో టూటూ 1931 అక్టోబర్ 7న పుట్టారు. తండ్రి జకరయ్య స్థానిక మెథడిస్ట్ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు. తల్లి అలెట్టా గృహిణి. టూటూ అఫ్రికన్, ఇంగ్లిష్ రెండు భాషలనూ నేర్చుకున్నారు. 14 ఏళ్ల వయస్సులో క్షయవ్యాధికి గురై 20 నెలలపాటు ఆసుపత్రిలో గడిపారు. అక్కడే ఆయనకు బ్రిటన్‌కి చెందిన అంగ్లేయ చర్చి ప్రీస్ట్ ఫాదర్ ట్రెవర్ హడిల్స్టన్తో జీవితకాల స్నేహం అంకురించింది. దక్షిణాఫ్రికాలోనూ, దేశం వెలుపలా వర్ణ వివక్షపై బద్ధవ్యతిరేకత ప్రదర్శించి పోరాడిన అత్యంత ప్రముఖులలో ఫాదర్ ట్రెవర్ ఒకరు. టూటూకు జీవితాంతం ఆయనకు మతసంబంధమైన స్ఫూర్తిప్రదాతగా, బోధకుడిగా ఫాదర్ ట్రెవర్ నిలిచిపోయారు. 1953లో బోధనారంగంలో డిప్లొమా తీసుకున్న టూటూ తదుపరి ఏడాది కరెస్పాండెన్స్ ద్వారా బీఏ డిగ్రీ పుచ్చుకున్నారు. జోహాన్స్‌బర్గ్‌లో 1954లోనూ, క్రుగెర్స్డోర్ప్లో 1955–57 మధ్య కాలంలో పాఠాలు బోధించారు. తర్వాత 1961లో ప్రీస్టుగా మారిన టూటూ ఒక ఆఫ్రికన్ టౌన్ షిప్లో సేవలందించారు. 1962–66 మధ్య లండన్‌లో కింగ్స్ కాలేజీలో థియాలజీలో మాస్టర్స్ డిగ్రీ సాధించిన దశలో టోరీలు రాజకీయంగా ఆయన్ని ఆకర్షించారు. తర్వాత 1972–75 ప్రాంతంలో తిరిగి బ్రిటన్ వెళ్లిన టూటూ అక్కడ లెసోతోలో బిషప్‌గా పనిచేశారు. తిరిగి స్వదేశం వచ్చాక టూటూలో రాజకీయ అమాయకత్వం ముగిసిపోయింది. తన విస్తృత పర్యటనల ద్వారా ఆఫ్రికా వికార స్వరూపాన్ని దర్శించగలిగారు. జాతి వివక్షకు వ్యతిరేక దృక్పథం ఆయనలో పెరగసాగింది. ఈ క్రమంలోనే నెల్సన్ మండేలా వెన్నంటి నడిచేవాడిగా టూటూ మారారు. దక్షిణాఫ్రికా విముక్తి అనివార్యమని ఇద్దరూ గ్రహించారు. వర్ణవివక్షా పాలనలోని దేశంలో మార్పు తప్పదని గ్రహించిన తర్వాత 1980లలోనే ఈ మతబోధకుడి పాత్ర మారిపోయింది. న్యాయం కోసం డిమాండు స్థానంలో ఐక మత్యం, రాజీపడటం అనే అంశాలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వసాగారు. దక్షిణాఫ్రికా శ్వేతజాతి సమాజం టూటూ భావాలకు గాను ఆయన పట్ల బద్ధశత్రుత్వం ప్రకటించింది. ‘రేపు మీది కాదు’ అని టూటూ తేల్చి చెప్పినందుకే శ్వేతజాతి ఆయనపై విషం కక్కింది. తన చివరి సంవత్సరాల్లో కేన్సర్ వ్యాధితో పోరాడుతూనే టూటూ మానవ హక్కులు, స్వాతంత్య్రం కోసం అనేక దేశాల్లో ప్రచారం సాగించారు. అన్యాయానికి, వివక్షకు వ్యతిరేకంగా చివరివరకూ గళమెత్తిన డెస్మండ్ టూటూ 2021 డిసెంబర్ 26న శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. -
మూగబోయిన గళం.. ఆగిపోయిన కలం
విజయవాడ కల్చరల్: ఆ గళం మూగబోయింది.. ఆ కలం ఆగిపోయింది.. ఏడు దశాబ్దాల సుదీర్ఘ పాత్రికేయ ప్రస్థానం ముగిసి పోయింది.. విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు, కాలమిస్ట్, గ్రంథ రచయిత పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతి పాత్రికేయులతో పాటు, సాహితీ ప్రియుల్లో విషాదం నింపింది. నిన్నటి వరకూ సన్నిహితులతో సరదాగా మాట్లాడిన ఆయన ఆకస్మిక మరణాన్ని పాత్రికేయులు, సాహితీ ప్రియులు నమ్మలేకున్నారు. విజయవాడ నగరంలోని స్వర్గపురిలో సోమవారం సాయంత్రం తుర్లపాటికి ప్రముఖులు, సాహితీవేత్తలు, జర్నలిస్టుల అశృనయనాల మధ్య అంత్య క్రియలు జరిగాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణా జిల్లా పామర్రులో 1933 ఆగస్టు 10న తుర్లపాటి జన్మించారు. పత్రికా రంగంలో ఆయన ప్రస్థానం 1946లో తన 14వ ఏట ప్రారంభమైంది. పాత్రికేయునిగా ప్ర«ధాన మంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు వంటి ప్రముఖులతో ఆయనకు అనుబంధం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను సైతం తుర్లపాటి ఇంటర్వ్యూ చేశారు. దేశ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పి.వి.నరసింహారావుతో ఆయనుకు పరిచయాలున్నాయి. రాష్ట్రంలో రాజీవ్‌గాంధీ ప్రసంగాలకు తుర్లపాటి అనువాదకుడిగా వ్యవహరించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. అంతేకాదు రాష్ట్రపతులుగా సేవలందించిన వి.వి.గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలామ్లతో ఆయనకు పరిచయం ఉంది. సినిమా రంగంలో ప్రత్యేక ముద్ర తుర్లపాటి కుటుంబరావు జ్యోతిచిత్ర ఎడిటర్‌గా ఉన్నప్పుడు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తమ ఇంటర్వ్యూల కోసం తుర్లపాటి వద్ద సినీనటులు పడిగాపులు పడేవారని చెబుతారు. సినిమాల రిలీజ్ సమయంలో తమ సినిమా గురించి వ్యాసం రాయండంటూ నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు ఆయన వద్దకు క్యూ కట్టేవారు. అదే సమయంలో ముంబైలో జరిగే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల తరహాలో తెలుగు సినిమా పరిశ్రమలో అవార్డులు ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఫిల్మ్‌ఫేమ్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి, మంచి చిత్రాలకు అవార్డులను అందజేసేవారు. కాల క్రమేణా ప్రభుత్వం నంది అవార్డులను ప్రవేశ పెట్టడంతో అవి నిలిచిపోయాయి. 6 వేలకు పైగా జీవిత చరిత్రల వ్యాసాలు పాత్రికేయ కురువృద్ధునిగా పిలుచుకునే తుర్లపాటి వార్తల్లోని వ్యక్తిగత శీర్షిక ద్వారా ఆరు వేలకు పైగా జీవిత చరిత్రలను పరిచయం చేశారు. ఇలా దేశ ప్రధానులు, రాష్ట్రపతులు, ప్రముఖుల గురించి వ్యాసాలు రాశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాల గురించి బుక్లెట్లను ప్రచురించారు. అవార్డులు.. రివార్డులెన్నో.. ఉపన్యాస కేసరి, దశ సహస్ర సభాకేసరి, ముట్నూరి కృష్ణారావు పాత్రికేయ పురస్కారం (1989), ఉత్తమ జీవిత చరిత్ర రచయిత పురస్కారం, (తెలుగు విశ్వవిద్యాలయం 1990), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2002లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అత్యధిక సభల్లో పాల్గొన్నందుకు 1993లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందారు. సభ ఏదైనా అధ్యక్ష స్థానం ఆయనదే.. విజయవాడ నగరంలో జరిగే సాహిత్య, రాజకీయ సభ ఏదైనా అధ్యక్ష స్థానంలో మాత్రం తుర్లపాటి ఉండేవారు. ఆ సభ నిర్వహించే అంశాలపై ఆయన అనర్గళంగా మాట్లాడేవారు. అంశం ఏదైనా, సందర్భోచితంగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకునే వారు. ఎన్నో విశేషాలను వివరిస్తూ, ఆ సభపై తనదైన ముద్ర వేసేవారు. ప్రకాశం పంతులు గారు రూ.5 బాకీ.. ప్రకాశం పంతులుకు కార్యదర్శిగా పనిచేసే సమయంలో ఏదో సందర్భంలో ఆయనకు తుర్లపాటి రూ.5 ఇచ్చారట. తరువాత మరో సందర్భంగా ప్రకాశం ఎదురుపడ్డప్పుడు నాకు మీరు రూ.5 బాకీ. అవి ఎప్పుడిస్తారు? అని సరదాగా అడిగేవారని సన్నిహితులతో చెప్పేవారు. అక్కినేని నాగేశ్వరరావుకు నటసామ్రాట్ బిరుదు ప్రదానం చేసింది తుర్లపాటే. అక్కినేని నటజీవన ప్రస్థానంలో అత్యంత విలువైన బిరుదు నటసామ్రాట్‌ను తుర్లపాటి ప్రేరణతో విజయవాడలోనే ప్రదానం చేశారు. ఎన్టీఆర్ నటుడు కాదు.. గుంటూరులో ఎన్టీఆర్ నటించిన సినిమా శతదినోత్సవ సభలో ఆయన వేదిక మీదకు రాలేదు. తుర్లపాటి మాట్లాడుతూ ఎన్టీఆర్ నటుడు కాదు అని కొద్ది సమయం గ్యాప్ ఇచ్చారట. దీంతో జనం తుర్లపాటి మీదకు దాడికి వచ్చారట. అప్పుడు రామారావు నటుడు కాదు.. మహానటుడు అనడంతో ఆయన అభిమానులు కేరింతలు కొట్టారని తుర్లపాటి తన జీవిత చరిత్ర పుస్తకంలో రాసుకున్నారు. ఆంజనేయ స్వామి భక్తుడు తుర్లపాటి ఆంజనేయ స్వామి భక్తుడు. లబ్బీపేట సాయిబాబా ఆలయానికి ట్రస్ట్ బోర్డ్ సభ్యుడుగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జర్నలిస్ట్ సంఘాలతో సన్నిహిత సంబంధాలుండేవి. ఆయన సలహాలు, సూచనలతోనే సంఘాలు నడిచేవి. రచయితల సంఘం సంతాపం కుటుంబరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య,చలపాక ప్రకాష్, నవ్యాంధ్ర రచయితల సంఘం కార్యదర్శి కలిమిశ్రీ, కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి జీవీ పూర్ణచంద్ సంతాపం వ్యక్తం చేశారు ప్రముఖుల సంతాపం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థనరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తదితరులు తుర్లపాటి పార్ధివ దేహాన్ని సందర్శించారు. వివిధ కళాసంస్థలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. -
తిరుమల మందిర సుందరా!
అఖిల బ్రహ్మాండాలనూ కన్నతల్లి అయిన పార్వతి ఒకసారి భర్తతో సరాగమాడబోయింది. వెనుకగా వెళ్లి నేనెవరో చెప్పుకోండి అన్నట్లుగా శివుని రెండుకన్నులనూ మూసింది. దాంతో లోకాలన్నీ చీకటిగా మారిపోయాయి. తన సృష్టికి ఎక్కడ లోపం వస్తుందో అని తొందరపడి శివుడు మూడోకన్ను తెరిచి భార్యను చూశాడు. అమ్మ గౌరవర్ణం కాస్తా నల్లగా మారిపోయింది. తన రూపాన్ని చూసుకున్న ఆమె బాధపడింది. బాగు చేసుకునే మార్గం చెప్పమని కోరింది. తపస్సు చేపట్టమని శివుడు ఆదేశించాడు. దాంతో ఆమె దక్షిణాపథానికి వచ్చి అనేకచోట్ల తపస్సు చేసింది. ఒక్కొక్కచోట ఆమె తపస్సు ఒక్కోలా ఫలించింది. కావేరీ తీరంలో పార్వతీదేవి శివునికోసం తపస్సు చేసిన దివ్యక్షేత్రం జంబుకేశ్వరం. ఇక్కడ శివుడు జలలింగమై వెలిశాడు. పార్వతి కంటే ముందు ఇక్కడ జంబూ మహర్షి తపస్సు చేశాడు. నేరేడుచెట్టుగా మారి లింగానికి నీడనిచ్చాడు. ఆ తరువాత శివగణాలలోని వారైన పుష్పదంతుడు, మాల్యవంతుడనే వారు ఒకరినొకరు శపించుకున్న కారణంగా తరువాతి జన్మల్లో ఏనుగు, సాలీడు రూపాల్లో పుట్టి శివుణ్ణి సేవించారు. ఏనుగుగా జన్మించి శివుణ్ణి సేవించిన పుష్పదంతుడు తరువాత కూడా శివభక్తునిగా అనేక జన్మలెత్తాడు. ఆచార్య శంకరుని కాలానికి అతడే కోసంఘాత చోళుడనే నామాంతరం కలిగిన రాజసేనునిగా జన్మించాడు. చోళదేశంలో అనేక శివాలయాలు నిర్మించాడు. జంబుకేశ్వరాన్ని పునరుద్ధరించి మహానిర్మాణం చేపట్ట దలిచాడు. కానీ అతడి అపూర్వ ప్రయత్నానికి సాక్షాత్తూ జగజ్జననియే ఆటంకంగా మారింది. అఖిలాండేశ్వరి అనే పేరుతో అమ్మవారు జంబుకేశ్వరంలో కొలువుదీరి ఉంది. నల్లని రూపు కలిగి, మొసలివంటి చెక్కిళ్లతో కనిపించే అఖిలాండేశ్వరిని శాక్తతంత్రాలు విద్యలకు అధిదేవతగా ప్రకటించాయి. ఆమె విజ్ఞానాన్నే కాకుండా సంతానాన్ని, సంపదను, ఆయుష్షును కూడా ప్రసాదిస్తుందని చెప్పాయి. జంబుకేశ్వరంలో ఆమె ఉగ్రకళలతో అవతరించింది. ప్రతిరోజూ ఎవరైతే ముందుగా తన ఆలయం తలుపులు తీస్తారో వారిని ఆమె మింగేసేది. ఆ తలుపు తీయకుండా ఉండలేక, రోజూ సాగే నరబలిని సహించలేక చక్రవర్తితో సహా రాజ్య ప్రజలందరూ దిక్కుతోచక ఉన్నారు. అటువంటి సమయంలో ఆచార్య శంకరుడు శ్రీరంగంలో ఉన్న వార్త వారికి తెలియవచ్చింది. తమ సమస్యను విన్నవించి పరిష్కారం చూపమని ప్రార్థించారు. శంకరుడు జంబుకేశ్వరానికి విచ్చేశాడు. తలుపులు తీసేముందుగా, వేరొక ప్రాకారంలో ఉన్న వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చి అఖిలాండేశ్వరి ఆలయానికి ఎదురుగా ప్రతిష్ఠించాడు. తలుపు తీసిన వెంటనే అమ్మవారి నేత్రదృష్టి తొలిగా కుమారుడైన గణపతిపై పడింది. ఆమెలో అమ్మప్రేమ పొంగింది. రోజుకొకరిని ఆమె బలి తీసుకునే సంప్రదాయానికి ఆనాటితో తెరపడింది. శంకరుడు చేసిన మహోపకారానికి అందరూ జేజేలు పలికారు. అమ్మకు ఆనాడు తొలి అర్చన చేసేందుకు శంకరుడు కదిలాడు. చతుష్షష్టి ఉపచారాలతో అర్చన సాగుతున్న వేళ, అంతకుముందు ఎవ్వరూ చూడని అపూర్వమైన రెండు చెవికమ్మలు శంకరుని చేతిలో ప్రత్యక్షం కావడం అందరి దృష్టిలోనూ పడింది. ఆ రెండింటినీ అమ్మకు అలంకరించిన తరువాత ఆమెలోని ఉగ్రకళలు పూర్తిగా శాంతించి శుద్ధజ్ఞాన స్వరూపిణిగా అవతరించడం గమనింపులోకి వచ్చింది. వెలుపలికి వచ్చిన తరువాత చోళునితో, ‘‘రాజా! ఈ క్షేత్రంలో పార్వతీదేవి తపించి శివజ్ఞానాన్ని పొందింది. కానీ శివుడామెను చేపట్టలేదు. ఆమెలోని విరహమే ఉగ్రకళగా మారింది. అందుకే పరమాత్మతో సమైక్య సూచనగా శ్రీచక్ర సమన్వితమైన ఆ కుండలాలను ఆమెకు అలంకరించాను. దీనితో పార్వతీ కల్యాణ ఘట్టాన్ని నెరవేర్చిన ఫలితం వచ్చినట్లే. అయితే ఈ కుండలాలను ప్రతిరాత్రి తొలగించి, తిరిగి ఉదయాన్నే అలంకరించాలి’’ అని చెప్పాడు శంకరుడు. ‘‘స్వామీ! మా చోళదేశంలో ఇటువంటి గడ్డు సమస్యలు ఇంకా అనేకం ఉన్నాయి. వీలువెంట తమరు...’’ అభ్యర్థనగా అన్నాడు చోళుడు. ‘‘మీరు కోరవలసిన పని లేదు. ఇప్పుడు వేంకటాచలాన్ని దర్శించడానికి వెళుతున్నాం. సమయానుసారంగా మీ చోళదేశంలో మా కర్తవ్యాలను నెరవేరుస్తాం’’ అని అభయమిచ్చాడు శంకరుడు. పంచాయుధ స్తోత్రం పఠిస్తూ యతిబృందం ఏడుకొండలెక్కుతోంది. కలియుగ విభుని ఆనంద నిలయం చేరువ అవుతోంది. నేలపై శ్రీహరి అవతరణకు కారణమైన ఒకనాటి దేవయజ్ఞం కోసం తనంత తానుగా ఉప్పొంగిన పుష్కరిణిలో మునకలేశారు. ఆలయ ప్రవేశం చేస్తున్న వేళ అశరీరవాణి వినిపించింది. ‘‘కర్మ జ్ఞాన మార్గాలకు వంతెన వేయాల్సిన సమయం ఆసన్నమైంది. విగ్రహాన్ని మూర్తిమంతం చేయాలి. దానిముందు అగ్నిహోత్రాన్ని వెలార్చాలి. ఇది నా అభిమతం. సన్యాసులకు అగ్నిహోత్రంతో పనిలేదు. కానీ శంకరా!...’’ అని అర్థోక్తిలో ఆగిపోయింది ఆ కంఠం. ‘‘ఆచార్యదేవా! ఎవరిదా కంఠం?’’ ప్రశ్నించాడు పద్మపాదుడు. శంకరుడు అతనివైపు కాకుండా మండనమిశ్రుని వంక తిరిగి సమాధానమిచ్చాడు. ‘‘ఆ కంఠం అత్రిమహర్షిది. నా ఎనిమిదో ఏట ఇవే పలుకులు విన్నాను. మళ్లీ ఇన్నాళ్లకు పనిగట్టుకుని అదే వాణి వినిపించిందంటే...’’ అని శంకరుడు కూడా అర్థోక్తిలోనే ఆగాడు. మండన మిశ్రునికి కర్తవ్యం బోధపడింది. తనతో వచ్చినవారంతా స్వామి దర్శనానికి కదలగా తాను మాత్రం హోమ సంబారాలను సమకూర్చుకునే పనిలో పడ్డాడు. ఈ తరుణం కోసమే ఎవరో కాసుకుని కూచున్నట్లు, కావలసినవన్నీ ఎదుటవుంచి వెళ్లినట్లు మండన మిశ్రుని ప్రయత్నం శ్రమ లేకుండానే, ఎక్కువ వ్యవధి తీసుకోకుండానే పూర్తయింది. దేవతల కోరిక మేరకు ఒకనాడు ఆధ్వర్యునిగా చతుర్ముఖ బ్రహ్మ వహించిన స్థానమిప్పుడు మండన మిశ్రుని పరమైంది. దేవతాంశల రాకను పరికించిన జడప్రకృతి కృతయుగాల నాటి సందర్భాన్ని నెమరేసుకుంటోంది. మండన మిశ్రుడు సమర్పిస్తున్న ఆహుతులను స్వీకరించిన అగ్నిహోత్రుడు ఒక్కొక్క దేవతను స్వాగతించి ఆనాటి ముచ్చట్లను జ్ఞాపకం చేస్తున్నాడు కాబోలు, పరిసరాలన్నీ దివ్యతేజస్సును పెంచుకుంటున్నాయి. స్వామికి ఎదురుగా క్రతువు సాగుతుండగా, శంకరుడు గర్భాలయంలో ప్రవేశించాడు. శ్రీనివాసుణ్ణి పదసుమాలతోనూ, బిల్వదళాలతో అర్చిస్తున్నాడు. ఇలవైకుంఠంలో ఆయన దర్శించిన విష్ణుస్వరూపాన్ని పాదాల నుంచి కేశాలవరకూ అణువణువునూ మనం తరించేలా ఇలా వర్ణించాడు. భువనమనే గృహానికి ఏర్పరిచిన ధ్వజస్తంభంలాంటి స్వామి పాదాలు తామరపూల నడిమిభాగంలా లలితంగా కనిపిస్తున్నాయి. వాటిపై సన్నటి చీరపోగుల్లాంటి చక్ర, మత్సా్యది రేఖలున్నాయి. పుండరీకాక్షుని పాదధూళి భక్తిపరులమైన మా అంతఃకరణాలను శుద్ధి చేయును గాక! ఎర్రకలువల అంచుల్లో నిలిచిన మంచుబొట్లలాగా శ్రీహరి కాలిగోళ్లు భాసిస్తున్నాయి. ఆ గోటి మెరుపుల్లో ఇంద్రాదులు తమ ప్రతిబింబాలను చూసుకుని వేరొక దేవజాతి కాబోలని కలవర పడుతున్నారు. సుందరకాంతి మండలం కలిగిన ఆ కాలిగోళ్లు మాకు స్వాతిశయ సంపదను సాధించును గాక! హరిమూర్తి మీగాళ్లు వంగి నమస్కరించిన మా పాపాలను అంతం చేయును గాక! నారాయణుని కాలిపిక్కలు సురలకు సుఖకారులై, శత్రువులను నశింపచేసే సాముద్రిక సలక్షణాలు కలిగినవి. స్వామి మోకాలి చిప్పలు తీరైన వృత్తాకృతిలో దర్శనమిస్తాయి. ఆయన మోకాలి చిప్పలనే ఎత్తుపీటగా మార్చుకుని సజ్జనులు తమ చిత్తాలనే అద్దాలను అక్కడే నిలిపి ఉంచుకుంటారు. మాటిమాటికీ అందులో తమను దర్శించుకుంటూ హృదయానందం పొందుతుంటారు. మధుకైటభులనే రాక్షసులను శ్రీహరి సర్వమూ జలమయమైన చోట తొడలపై పెట్టుకుని సంహరించాడు. వృత్తాకృతిలో, పైకి పోయేకొద్దీ చక్కగా బలిసినట్లు కనిపిస్తున్న శ్రీహరి ఊరువులు మా మనసులకు అతిశయమైన ప్రీతిని సంధానించు గాక! బడబాగ్ని జ్వాలలతో అలంకృతమైన సముద్రంలా శ్రీహరి కటిస్థలం పసుపు పచ్చని పీతాంబరంతో ప్రకాశిస్తోంది. మనోహరమైన ఆ ఘననితంబం మమ్మల్ని పతితుల్ని కాకుండా రక్షించు గాక! మందర పర్వత మధ్యస్థానాన్ని పెద్దపడగలతో వాసుకి చుట్టినట్లు ఆ కటిభాగాన్ని చుట్టివున్న అందమైన బంగారు రంగు మొలతాడు నా మతిని శుభకరముగా తీర్చుగాక! సృష్టికి పూర్వం బ్రహ్మ అనే స్వాయంభువ తుమ్మెదకు నెలవై దేవపూజ్యమైన కమలం ఆవిర్భవించిన విష్ణుని బొడ్డు చెరువులో మా మానస హంస చిరకాలం కుతూహలంతో విహరించు గాక! ఆ కమలపు కాడ పాతాళం. రేకుల వరుస దిశలు. పుప్పొడి తిత్తి గల కాడ కొండలు. మధ్యలోని కర్ణిక మేరుపర్వతం. ఆ పెద్ద తామరపువ్వు మాకు కామిత ఫలదాయిని అగును గాక! దామోదరుని కడుపు అనే సముద్రం కాంతులనే జలాలతో నిండి ఉంది. తరంగాలు ఆ పొట్టపై మడతలుగా భాసిస్తున్నాయి. లోతైన నాభి అనే సుందర సుడిగుండమొకటి ఉంది. ఆ ఉదరమనే జలధిలో నా చిత్తమనే చేప చిరకాలం ఇష్టారీతిగా ఆటలాడుకొను గాక! నాభికమల మూలం నుంచి బయలుదేరిన నూగారు అంతకంటే అధికమైన పరిమళంపై ఆశకొద్దీ ముఖపద్మానికి అభిముఖంగా సాగుతోంది. అది తుమ్మెదల నల్లని బారులా తోస్తోంది. స్వామి ఉదర మధ్యమునకు అధిక కాంతిని ఇస్తున్న ఆ రోమరాజి మాకు సకల సంపదలను అనుగ్రహించు గాక! కౌస్తుభమణి కాంతుల వల్ల కాలకాలుని కంఠంలో కొలిమలాగా... చంద్రబింబానికి అందాన్నిచ్చే మచ్చలాగా... కానవస్తున్న విష్ణు వక్షోవిభాసిని అయిన శ్రీవత్సమనే పుట్టుమచ్చ లక్ష్మీప్రీతికరమై మాకు అధిక సంపదలిచ్చు గాక! గళసీమలోని జయంతి మాలిక లక్ష్మీదేవి లాలన పొందుతూ వాసుదేవుని సుభద్రమూర్తిగా మార్చింది. దేవదేవుని బాహుమూలము తారహార కాంతులచే, పొడవైన తులసీమాలికా కిరణాలచే, బంగరు సొమ్ముల కాంతులచే కమ్ముకున్న అందం గలది. చాల నష్టాలను కలిగిస్తున్న సంసార బంధాల వల్ల బాధలను తొలగించమని హరిబంధుర బాహుమూలము ఎదుట నిలిచి అంజలి బద్ధుణ్ణై మరీమరీ వేడుకుంటున్నాను. విశ్వరక్షా దీక్ష వహించిన హరి బాహువులు విస్పష్టమైన గుణకీర్తులు తెచ్చిపెట్టే ఆశ్చర్యకరమైన పనులు నిర్వర్తిస్తూ ఉంటాయి. ఆ వేయిచేతులు జీవుల మోహాన్ని బాపేందుకు ఉద్యమించు గాక! కంఠాభరణాల నుంచి, బంగారు కుండలాల నుంచి పుట్టివచ్చిన వేయి తలలు కలిగిన శ్రీహరి కంఠం విచిత్రవర్ణం కలిగినది. శ్రీలక్ష్మి కౌగిలించుకోగా ఆమె చేతి కంకణాలు ఒత్తుకొని ముద్రపడిందక్కడ. ఆ మంగళకరమైన వైకుంఠుని కంఠం వెనుబాటు లేకుండా నా మతిలోనే స్థిరంగా నివసించు గాక! అరుణశోభతో వ్యాప్తమైన అగ్రభాగం కలది ఆయన అధరం. ముఖమనే ఆకాశంలో దంతాలనే నక్షత్ర పంక్తులను ఆచ్ఛాదిస్తున్న శ్రీనాథుని అధరమనే అంబరమణి మా పాపాలను పోగొట్టుగాక! ఉదయ సూర్యకాంతితో విరాజిల్లుతున్న మకర కుండలాలు కలిగిన హరి గండభాగం మాకు రాబోయే ఆపదలను అడ్డగించును గాక! తళుకులీనే కుండలాల కాంతుల వల్ల ఆయన నాసిక ఎర్రబడింది. ప్రాణవాయు సంచార మార్గమైన ఆ మురారి ముక్కు మాకు ప్రాణదానము చేయు గాక! అధిక దయా నిర్భరంగా కొంచెం ఎరుపు, తెలుపు, నలుపు కాంతులతో మనోహరాలైన ఆ పద్మాక్షుని కన్నులు మమ్మల్ని రక్షించు గాక! గరుడ గమనుని కనుబొమల జంట కొంచెం కదిలేసరికి సురాసుర సంఘాలు తమతమ పదవులలో నియమితులవుతూ ఉంటారు. అరచందమామలా పరిశుద్ధమైన లలాటవేదిపై నల్లత్రాచులా నడుమ వంగిన శ్రీనాథుని భ్రూయుగము మమ్మల్ని అడుగున పడిపోకుండా రక్షించు గాక! భువన విభుని సుప్రసిద్ధమైన ఊర్ధ్వపుండ్రము... స్ఫాటిక శివలింగంలా ఉంది. కనుబొమల నడుమ నుంచి పుట్టి, జనన మరణ రూపమైన సంసార అంధకారాన్ని ఖండించే ఆ ఊర్ధ్వపుండ్రం మాకు అతిశయ విభూతిని ప్రసాదించు గాక! ముంగురుల కొనలే పానవట్టంగా, కిరీటమనే మహాదేవుని లింగం ప్రతిష్ఠితమైన కైటభారి లలాటమదిగో... ఆ నాట్యరంగంపై తీక్షణమతి అనే నటి తన అలసత్వమనే తెరను తొలగించి, ప్రస్ఫుటమైన అవయవ సంపదతో, సమర్థవంతంగా మమ్మల్ని భావన అనే నాటకాన్ని ఆడించు గాక!... అన్నాడు శంకరుడు. శ్రీనివాసమూర్తినే శివస్వరూపంగా శంకరుడు అనుసంధానించిన వైనం ఎవరిని మెప్పించిందో కానీ.... యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శ్శివః అని ఆకాశం నినదించింది. విష్ణుపాదాది కేశాంత స్తోత్రంలో కిరీటం వరకు వచ్చాడు శంకరుడు. అటుపైన... నూరుగురు సూర్యులున్న ఆకాశంలా స్వామి కిరీటరత్నం చూడశక్యం కానిదై ఉంటుంది. ఒక సముద్రము, దానికి ఆవలి ఒడ్డున ప్రజ్వలించే బడబాగ్ని అన్నట్లు కనిపిస్తున్న స్వామి కిరీటం మా కలి కలుషాలనే చీకట్లను పోగొట్టు గాక! అన్నాడు స్తోత్రంలో శంకరుడు. అప్పుడు ఆయన దృష్టి మూలవిరాట్టుకు వెనుక వైపున విగ్రహంలోనే అంతర్భాగంగా ఉన్న కేశపంక్తిపై పడింది. దేహమనే మణికాంతుల వల్ల మెరిసే స్వామి కేశాలు అరిషడ్వర్గాలనే అగరుచెట్లను కాల్చే రోషాగ్ని పొగలాగా ఉన్నాయి. జీవుల పంచక్లేశాలను తెంచివేయగలిగే స్వామి కేశాలకు తుది ఎక్కడో చూడడం దేవతలకు సైతం సాధ్యపడదు.... అన్నాడు. ‘‘ఎందుకని?’’ స్వామి కాబోలు ప్రశ్నించాడు. ‘‘స్వామీ! ఇది శివుని జటాజూటమైతే... నీ పాదాలనుంచి పుట్టిన గంగను మోస్తోందని చెప్పవచ్చు. ఆ గంగధారకు ఎదురు ఈదితే నీదాకా రావచ్చు. నిన్ను దాటిన ఆవల ఏముందో ఎవరు మాత్రం తెలియ గలరు?’’ అడిగాడు శంకరుడు. ‘‘ఏ జ్ఞానప్రసూనం జీవునికి అవ్వలి వెలుగును ఏకాకృతిగా దర్శింప చేయగలదో కదా!’’ అన్నాడు స్వామి. శంకరునికి తన తదుపరి మజిలీ స్థిరపడింది. – సశేషం - నేతి సూర్యనారాయణ శర్మ -
తోటకాష్టకం
ఒకే ఒక్క సూర్యుడు జగత్తులోని సమస్తాన్నీ ప్రకాశింప చేస్తున్నట్లు నీవు అనేక గురురూపాల్లో సంచరిస్తూ అందరినీ ఉద్ధరిస్తున్నావు. గురువులందరికీ గురువైన జగద్గురూ! వృషభ«కేతనుడైన శివునివి నీవే. జ్ఞానులలో నీకు సమానుడెవ్వడూ లేడు. ‘‘జ్వలించే అగ్నిహోత్రం నుంచి నిప్పురవ్వలు ఎగసిపడుతున్నట్లుగా పరమాత్మ నుంచే సృష్టి సమస్తం వచ్చింది. బయటకు వచ్చిన ప్రతిదీ తిరిగి ఆయనలో లయమైపోయేదే. తాను అతడికి చెందినవాడని నిరూపించడానికే ప్రతిదీ తనదైన కర్మలను నిర్వహిస్తూ ఉంటుంది.. ఓంకారమే ధనుస్సుగా, మనస్సు అందులో ఎక్కుపెట్టిన బాణంగా సాధన చేసేవాడికి తనచుట్టూ ఉన్నదంతా బ్రహ్మమే అవుతుంది. బ్రహ్మము నుంచి వచ్చిన తానే బ్రహ్మము అవుతున్నది అని తెలియవస్తుంది అని ముండకోపనిషత్తు చెబుతున్నది. కాగా అంతఃప్రజ్ఞ, బహిఃప్రజ్ఞ, ఉభయత్ర ప్రజ్ఞ, ప్రజ్ఞానఘనమనే నాలుగు పాదాలతో బ్రహ్మము విస్తరిస్తోంది. జాగ్రత్, స్వప్న, సుషుప్తిలయందు ప్రపంచాన్ని కొనసాగిస్తోంది. చతుర్థమైన తురీయమందు ప్రపంచాన్ని ఉపశమింప చేసే ఆత్మ అవుతున్నది. ఆ ఆత్మప్రత్యయ సారం శివము, అద్వైతము, శాంతము. అదే బ్రహ్మము అవుతున్నది... అయమాత్మా బ్రహ్మ అని మాండూక్యోపనిషత్తు వచించింది...’’ ఆ అది పడమటి కనుమలలోని మతంగ పర్వత ప్రాంతం. తన చుట్టూ పరివేష్ఠించి ఉన్న శిష్యబృందానికి ఆచార్య శంకరుడు పాఠం చెబుతున్నాడు. ద్వారకలో పశ్చిమామ్నాయ శంకరపీఠ స్థాపన తరువాత ఆయన దణానికి మరలి మతంగ పర్వత సమీపానికి విచ్చేశాడు. ఆవేళ అయమాత్మా బ్రహ్మ అన్న మహావాక్యాన్ని గురించి పాఠం జరుగుతున్నవేళలో ఒక తియ్యని గొంతు ఇలా వినవచ్చింది. అంగం గలితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండం – వృద్ధాప్య ఛాయలు ముసురుకున్నాయి. శక్తి సన్నగిల్లింది. జుత్తు తెల్లబడి రాలిపోతున్నది. పళ్లు ఊడిపోయాయి. చేతికి కర్రవచ్చింది. అయినా ఏదో ఆశమాత్రం వదిలిపెట్టడం లేదు. ఇకనైనా తెలివి తెచ్చుకోవాలని, దైవంపై భారం వేయాలని తోచడం లేదు... అందరూ ఆ శ్లోకం వినవచ్చిన దిశగా తలలు తిప్పి చూశారు. ఎవరో ఒక బాలుడు ఒకానొక వృద్ధుణ్ణి చేయిపట్టుకుని నడిపిస్తూ అటువైపే వస్తున్నాడు. ఆ బాలుడు పాడుతున్న గీతం శంకరుని భజగోవిందానికి కొనసాగింపులా తోచింది పద్మపాదునికి. దూరం నుంచి అటువైపే నడుచుకుంటూ వస్తున్న ఆ బాలుని దృష్టి అంతలో ఆచార్య శంకరునిపై పడింది. వృద్ధుణ్ణి వదిలిపెట్టి, శంకరుని సమక్షానికి పరుగుపరుగున వచ్చి పడ్డాడు. సాష్టాంగ వందనం చేశాడు. ‘‘స్వామీ! నా పేరు ఆనందగిరి. నేనో చదువురాని మొద్దును. బుద్ధిమంతుడిని కాను. నా గొంతు బాగుంటుందని కొందరు పాటలు పాడించుకుంటారు. పనులు చెబుతుంటారు. అవసరంలో ఉన్నవారికి తోచిన సాయం చేస్తూ వారిచ్చిన దాంతో పొట్ట పోషించుకుంటున్నాను. నాకు తెలిసింది ఇంతమాత్రమే. తమరు నాపై అనుగ్రహం చూపాలి. నన్ను మీ శిష్యునిగా అనుమతించాలి’’ అని ప్రాధేయపడ్డాడు. శంకరుడు సమ్మతించి, అతడికి సంన్యాస దీక్షనిచ్చాడు. అంతకుముందే శంకరుని శిష్యవర్గంలో ఒక ఆనందగిరి ఉన్నాడు. కాగా అదే పేరుతో ఇప్పుడు ఇతడు వచ్చాడు.బృహస్పతి అవతారమైన మొదటి ఆనందగిరి తొలితరంలో శంకరవిజయాన్ని రచించినవారిలో ఒకడు. కాగా, నేటి ఆనందగిరి మాత్రం పద్మపాదుని వలె తరువాతికాలంలో ఒక సార్థకనామాన్ని పొంది ప్రఖ్యాతుడయ్యాడు. ఆ కథ చిరస్మరణీయంగా ఉంటుంది. ఆనందగిరికి గురుసేవ చేయడం తప్ప ఇతరమేదీ తెలియదు. అతడు వచ్చిన తరువాత గురువు అవసరాలను నెరవేర్చే పని ఇతరులకు దక్కనివ్వకుండా చేస్తున్నాడు. ప్రతిరోజూ పళ్లుతోము పుల్లతో మొదలుపెట్టి, స్నానానికి కావాల్సిన మృత్తికా సేకరణ, స్నానానంతరం శుభ్రవస్త్రాలను అందించడం, దర్భాసనాదులను సిద్ధం చేయడం, అర్చనకు కావాల్సిన సరుకు సంబారాలను సమకూర్చడం వంటి పనులన్నీ గురుదేవునికి ఆనందగిరియే చేసి పెడుతున్నాడు. అతడు గురువు ఎదుట ఎన్నడూ ఆవులించడు. కాళ్లు చాచి కూర్చోడు. గురుదేవుడు లేచి నిల్చున్న సమయంలో తాను కూర్చొనడు. తాను విన్నవించుకోవాల్సిన విషయాలను ఉపేక్షించి ఊరుకోకుండా తగిన సమయం కనిపెట్టి అడిగి తీరుతాడు. అలాగని వృధాగా ఒక్కమాట కూడా మాట్లాడడు. గురువు సన్నిధినుంచి ఈవలకు వచ్చేవేళలో గిరుక్కున వెనుతిరిగి, వీపు చూపించడు. గురువు మాటలను ఒళ్లంతా చెవులు చేసుకుని వింటాడు. గురువుకు ఇష్టమైన పనిని ఆయన చెప్పకముందే చేస్తాడు. ఇష్టంలేని పనిని ఎప్పుడూ చేయడు. మొత్తంమీద గురుశుశ్రూషా పరాయణుడైన శిష్యుడు ఎలా ఉండాలో చెప్పాలంటే ఆనందగిరిని చూపిస్తే సరిపోతుంది. అటువంటి శిష్యగణం శంకరునికి ఇప్పుడు చాలనే ఉన్నది. అయితే ఆయన నలుగురు ప్రధాన శిష్యులలో హస్తామలకుడు, పద్మపాదుడు ఇప్పటికే సంన్యాసాశ్రమంలో ప్రవేశించారు. నాలుగో శిష్యుని కథ మనమింకా చెప్పుకుంటున్నాం. మూడో శిష్యుడైన మండన మిశ్రునికి ఆచార్యులింకా సంన్యాసాన్ని అనుగ్రహించలేదు. ఒకరోజు మండనమిశ్రుడు ఆచార్యుని సమీపించి, ‘‘స్వామీ! మీ బ్రహ్మసూత్ర శారీరక భాష్యానికి వార్తికాలు రచించవలెనని కొన్నాళ్లుగా అనిపిస్తున్నది. మీ అనుమతిని వేడుతున్నాను’’ అని మనసులో కోరిక విన్నవించాడు. శంకరుడు నోరు తెరిచి ఏదో చెప్పబోయాడు. అంతలోనే ఒక శిష్యుడు, ‘‘వద్దు స్వామీ!’’ అన్నాడు. ‘‘ఇతడు నిన్నమొన్నటి వరకూ కర్మమార్గంలో ఉండి అద్వైతాన్ని తిరస్కరిస్తూ వచ్చినవాడు. ఓటమి కారణంగా మీ వెంటవచ్చాడు కానీ, మీ మార్గాన్ని త్రికరణశుద్ధిగా అంగీకరించి వచ్చినవాడు కాదు. ఇటువంటివాడు వార్తిక రచనకు పూనుకుంటే పూర్తి న్యాయం చేయలేడు’’ అని వాదించాడు. శిష్యులలో అనేకమంది మనసుల్లో కూడా అటువంటి ఆలోచనే ఉన్నది. వేదాంతోదర సంగూఢం సంసారోత్సారి వస్తుగం జ్ఞానం వ్యాకృతమప్యన్యై వకేష్య గుర్వనుశిక్షయా ‘‘వేదాంత హృదయం అర్థం చేసుకోవాలంటే, వాస్తవిక జ్ఞానాన్ని పొందాలంటే గురుశుశ్రూష మినహా గత్యంతరం లేదు. నేను ఆ సంప్రదాయాన్ని ధిక్కరించేవాడను కాను’’ అన్నాడు మండన మిశ్రుడు. ‘‘పండిత శిఖామణీ! ఇప్పుడు నీవు చెప్పిన శ్లోకం స్వీయరచనా?’’ ప్రశ్నించాడు ఆచార్య శంకరుడు. ‘‘అవును స్వామీ! నిన్నటివరకూ కర్మమార్గంలో ఉన్న నేను దానిని వదిలించుకోవడానికే నైష్కర్మ్యసిద్ధి అనే గ్రంథరచనకు పూనుకున్నాను. అందులో గురువందన పూర్వకంగా చెప్పిన శ్లోకమిది’’ అని సమాధానమిచ్చాడు మండన మిశ్రుడు. ‘‘బాగున్నది. రచన పూర్తయినదా?’’ అడిగాడు శంకరుడు. ‘‘లేదు స్వామీ! ఇంకా కొనసాగుతున్నది’’ అన్నాడు మండనమిశ్రుడు. ‘‘ముందుగా ఈ గ్రంథాన్ని పూర్తిచేయి. ఉపనిషత్ మార్గంలో నీనుంచి మరికొన్ని గ్రంథాలు రావలసి ఉన్నది. ఆ తరువాత వార్తిక రచనకు పూనుకోవచ్చు’’ అని సెలవిచ్చాడు శంకరుడు. గురువు ఆజ్ఞను ఔదలదాల్చి మండనమిశ్రుడు గ్రంథరచనలో మునిగిపోయాడు. ఆచార్యుని పర్యవేక్షణలో నైష్కర్మ్యసిద్ధి రచన కొనసాగుతున్నది. నాలుగు అధ్యాయాల్లో సృష్టి వికాసాన్ని, కర్మసిద్ధాంతాన్ని, కర్మలను శూన్యం చేసుకుని పునరావృత్తి రాహిత్యాన్ని పొందడానికి తగిన మార్గాలను గురించి మండన మిశ్రుడు లోతైన పరిశీలనతో రచన పూర్తి చేశాడు. అప్పటికి కూడా అతడికి శంకరభాష్యాలకు వార్తికారచనకు అనుమతి లభించలేదు. ఇతర శిష్యులు ఈ విషయమై వెల్లడించిన అభిప్రాయంలో ఈర‡్ష్య, అసూయల కంటే అద్వైత సిద్ధాంతానికి అన్యాయం జరగరాదన్న ఆవేదనయే అధికంగా కనిపిస్తోంది. ఈ యదార్థాన్ని శంకరుడు సైతం కాదనలేక పోయాడు. అంతలో ఇతరుల ప్రోత్సాహంతో పద్మపాదుడే బ్రహ్మసూత్ర శంకరభాష్యానికి వార్తిక రచన పూర్తి చేశాడు. అనుమానమైనా రానివ్వని విధంగా రహస్యంగా రచన పూర్తి చేసి గురువుకు సమర్పించడం మండనమిశ్రుని మనసుకు ఏదో కుట్రలా తోచింది. తనకు అవకాశం దక్కకపోవడం అతడిలో ఉక్రోషాన్ని పెంచింది. ‘‘నేనుగాక బ్రహ్మసూత్రాలకు వార్తికాలను రచించేవాడు ఎంతటివాడైనా అతడి గ్రంథం నశించుగాక!’’ అని ఆగ్రహంతో శపించాడు. శంకరుడు ఆ మాట విన్నాడు. చిరునవ్వు నవ్వి, ‘‘పండితాగ్రేసరా! నీ మాట పొల్లుపోదు. పద్మపాదుడు తన గ్రంథాన్ని పంచపాదిక, వృత్తి అనే రెండుభాగాలుగా రచించాడు. నీ శాపవశాన ఈ భూమిమీద పంచపాదిక ఒకటే మిగులుతుంది. కాగా వార్తికకారునిగా ప్రసిద్ధి కెక్కడానికి ముందుగా నీనుంచి మరో స్వతంత్ర రచన కూడా రావాల్సి ఉన్నది’’ అన్నాడు. . మండనమిశ్రుడు అప్పటికప్పుడు తన తదుపరి స్వతంత్ర రచనగా బ్రహ్మసిద్ధికి శ్రీకారం చుట్టాడు. అటుపై శంకరాద్వైతాన్ని తేటతెల్లం చేసిన దక్షిణామూర్తి స్తోత్రానికి మానసోల్లాస వ్యాఖ్యను, పంచీకరణ వార్తికాన్ని ఆచార్యుని అనుమతి మేరకు సమకూర్చాడు. తదుపరి బృహదారణ్యక, తైత్తిరీయ ఉపనిషత్తులకు శంకరభాష్యానుసారమైన వార్తికాలను రచించే పనిలో ముగిపోయాడు. శిష్యులందరూ ఎవరికి అప్పగించిన పనుల్లో వారు తలమునకలుగా ఉన్నారు. మార్కండేయాది మహర్షులు తపస్సులు సాగించిన మతంగ పర్వత సీమల్లో ఆవాసం, సాక్షాత్ జగద్గురు సన్నిధిలో అద్వైత వేదాంత శ్రవణం దినచర్యలుగా వారికి కాలం గడిచిపోతున్నది. తగని స్పర్థతో ఒకరితో ఒకరు పోటీలు పడుతూ చదువుతున్నారు. అటువంటి సమయంలో ఒకరోజున ఆసక్తికరమైన సంఘటన జరిగింది. గురువుగారి పాఠానికి వేళ సమీపించింది. శిష్యులందరూ వచ్చి కూర్చున్నారు. ఆచార్యులు మాత్రం పాఠం ప్రారంభించకుండా తాత్సారం చేస్తున్నారు. ‘‘గురుదేవా! సమయం మించిపోతున్నది’’ అని సుబోధాచార్యుడు గుర్తుచేశాడు. ‘‘ఆనందగిరి ఇంకా రాలేదు కదా! కొద్దిసేపు నిరీక్షిద్దాం’’ అన్నాడు శంకరుడు. ‘‘గురుదేవా! మీకు తెలియనిది కాదు. అతడు మందమతి. మీ పాఠాలేవీ అతడి బుర్రకు ఎక్కనే ఎక్కవు. ఈ చెట్టుకు ఆ పుట్టకు చెప్పినందువల్ల ఎంతటి ప్రయోజనముంటుందో అతనికి చెప్పినా అంతే ప్రయోజనం’’ అన్నాడు సుబోధాచార్యుడు. ‘‘అతనికి పాఠం కంటే మీ వస్త్రాలను ఉతికి శుభ్రం చేయడంలోనే శ్రద్ధ ఎక్కువ ఆచార్యా! పాఠానికి వేళమించిపోతోందయ్యా వేగిరం రా అని ఇందాక మేమంతా పిలిస్తే... తుంగభద్ర నుంచి బయటికే రాలేదు. మీ కౌపీనాన్ని అదేపనిగా బండకేసి బాదుతూనే ఉన్నాడు. అతడిప్పట్లో వచ్చే సూచన కనిపించడం లేదు. దయచేసి మీరు పాఠాన్ని ప్రారంభించండి’’ అని వీలైనంత వినయంగా విన్నవించాడు నిత్యానందుడు. వారి మనసులోని మాటలన్నీ వారిచేతనే బయటపెట్టించిన తరువాత శంకరుడు కన్నులు మూసుకుని అంతర్ముఖుడయ్యాడు. శంకరుని అనుగ్రహం ఆనందగిరిపై వర్షించింది. ఆచార్యుని సంకల్పమాత్రం చేత అతనికి విద్యలన్నీ స్ఫురించాయి. అతడు అప్పటికప్పుడు మహాపండితుడు అయ్యాడు. అంతేకాదు శంకరునిపై కమనీయమైన స్తోత్రాన్ని ఇలా ఆలపించాడు. విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ అఖిల శాస్త్రాలనూ తనలో నింపుకున్న అమృత సముద్రం శంకర దేశికుడు. ఉపనిషత్ జ్ఞానాన్ని లోకానికి వెల్లడించడానికి వచ్చినవాడు. ఆయన విమల చరణాలను నేను హృదయమందు నిలుపుకుని ఆరాధిస్తాను. అఖిల దర్శన తత్త్వాలనూ ఎరిగిన ఆ తత్త్వవిదుని శరణు పొందిన వారిని సంసార దుఃఖాలు బాధించవు. స్వామీ కరుణావరుణాలయా! నాకు శరణునొసగి నన్ను రక్షించు అన్నాడు ఆనందగిరి. అతడి గొంతులోని మార్దవానికి మతంగ పర్వతసీమ పరవశిస్తోంది. అతడి నుంచి వెలువడుతున్న తేజఃకాంతి పుంజాలు చూస్తున్న ఇతరుల కనులకు మిరుమిట్లు గొల్పుతున్నాయి. తాబేటి తలపు న్యాయంలాగా కేవలము ఒక్కక్షణం సేపు తనపై ఆలోచనను సారించడం ద్వారా విద్యలన్నీ అనుగ్రహించిన ఆచార్యుని పాదాలను తాకి నమస్కరించాడు ఆనందగిరి. తనకు గురువు ఏమేమి ప్రసాదించాడో ఇలా చెప్పుకొచ్చాడు. నీ వల్లనే జనులకు ఆనందమనే పదానికి అర్థం తెలిసింది. నీ బోధల వల్లనే జిజ్ఞాసువులు ఆత్మమర్మం ఎరిగి తరిస్తున్నారు. ఈశ్వరునికి, జీవేశ్వరునికి గల అభేదాన్ని తెలియగలుగుతున్నారు. స్వామీ! నీవు సాక్షాత్ శంకరునివని తెలుసుకున్నాను. ఇది తెలియడం వల్ల నా హృదయం ఎన్నడెరుగని బ్రహ్మానంద స్థితికి చేరువవుతున్నది. మోహమనే మహాజలధిని ఒక్క అంగలో దాటేసిన అనుభూతి కలుగుతున్నది. సమదర్శనాన్ని సాధించాలనే ఆశయంతో ఎన్నెన్నో మార్గాల్లో ప్రయత్నించి విఫలమయ్యాను. నాకు సరియైన మార్గాన్ని ప్రబోధించి నన్ను కరుణించావు. ఒకే ఒక్క సూర్యుడు జగత్తులోని సమస్తాన్నీ ప్రకాశింప చేస్తున్నట్లు నీవు అనేక గురురూపాల్లో సంచరిస్తూ అందరినీ ఉద్ధరిస్తున్నావు. గురువులందరికీ గురువైన జగద్గురూ! వృషభ«కేతనుడైన శివునివి నీవే. జ్ఞానులలో నీకు సమానుడెవ్వడూ లేడు. నీవు తత్త్వనిధివే కాక, శరణాగత వత్సలునివి కూడా కనుక వేరెవ్వరినీ కాక నిన్నే నేను శరణు జొచ్చుతున్నాను. లిప్తపాటులో నువ్వు అనుగ్రహించినది ఎంతో నెమరేసుకోవడానికే నాకు శక్తి చాలడం లేదు. నీ జ్ఞానసంపదలోని చిన్ని భాగాన్నైనా పొందలేదనే స్పృహను ఎప్పటికీ ఉంచుకుంటాను. నాకు ఇతర సంపదలేవీ వద్దు. నీ సహజ వాత్సల్యధోరణిలో నన్ను కరుణించి చేరదీయి చాలు...’’ అని నమస్కరించాడు. అతడిని లేవనెత్తి, ‘‘తోటకాచార్యా!’’ అని సంబోధించాడు శంకరుడు. ‘‘సుందరమైన తోటకవృత్తంలో నన్ను కీర్తించిన నువ్వు ఇకనుంచి తోటకాచార్యునిగా ప్రసిద్ధి పొందుతావు. . నీవు రచించిన తోటకాష్టకం గురుస్తోత్రాలలో అగ్రగణ్యమవుతుంది’’ అని నారాయణ స్మరణ పూర్వకంగా సెలవిచ్చాడు. శంకరుడు శిష్యుణ్ణి అనుగ్రహించిన విధానం మిగిలిన వారికి కనువిప్పు కలిగించింది. మందమతిగా పేరు తెచ్చుకున్నవాడు కాస్తా చూస్తుండగానే ప్రధాన శిష్యుడైపోవడం అబ్బుర పరిచింది. నలుగురు ప్రధాన శిష్యులే చతురంగ బలాలుగా మారి దన్ను ఇస్తుండగా శంకరుని దిగ్విజయ యాత్ర దక్షిణాపథంలో ప్రారంభమైంది. పర్వత సీమలనుంచి దిగివచ్చి... శంకరయతి జనపదాలలో ప్రవేశించాడు. – సశేషం -
నేలకు దిగిన నక్షత్రాలు
‘‘అన్నింటి కంటే గొప్ప సంపద తపస్సు. భౌతిక సంపదలను తక్కువ విలువతో మదింపు చేయవచ్చు. ఈ సంవత్సరం బొత్తిగా ఆదాయం లేదండీ అని రాజుకు పన్ను ఎగవేయవచ్చు. కానీ తపస్సంపద అటువంటిది కాదు. ఆ సంపద గడించిన వారి అనుమతి లేకుండానే అందులోని ఆరోవంతు భూమినేలే రాజుకు చేరిపోతుంది. మా తపస్సులన్నీ ప్రభువుల క్షేమాన్ని, రాజ్య సంక్షేమాన్ని ఆశించేవే. రాజాస్థానాల కన్నా సాధనలో తరించడమే మాకు అధిక ప్రీతినిస్తుంది. అందులోనూ మావంటి బ్రహ్మచారులకు భోగాలపై ఆసక్తి నిషిద్ధం. దయచేసి వెళ్లిరండి’’ చెప్పాడు శంకరుడు. ‘‘స్వామీ! మన ప్రభువు కవి పండిత పక్షపాతులు. మీ గురించి విన్నారు. మీ పాద రేణువులను శిరస్సున దాల్చాలని వారి అభిలాష. ఇది భద్రగజం. సకల శుభలక్షణాలూ కలిగినది. మీకోసం ప్రత్యేకంగా ప్రభువులే ఎన్నిక చేసి పంపారు. అందుచేత తమరు కాదనకుండా...’’ ‘‘మంత్రివర్యా! మూడు వేళల్లోనూ స్నాన సంధ్యావందన అగ్నిహోత్రములే మాకు కర్తవ్యమని వేదశాసనం. ఈ ఏనుగులతోనూ, గుర్రాలతోనూ, పల్లకీలతోనూ పనిలేదు. అదీకాక నాకు వృద్ధురాలైన తల్లి ఉంది. ఆమె ఈ ఊరిని విడిచి రాదు. ఆమెను విడిచి రాజసభలకు నేను రాలేను. ధర్మమార్గాన్ని విడిచిపెట్టని ప్రభువుకు ఇవే మా ఆశీస్సులు అని సందేశం అందించండి.’’ ఆ ప్రసంగాన్ని అక్కడితో ముగించి లేచి, అగ్నికార్యం నెరవేర్చడానికి ఉద్యుక్తుడయ్యాడు శంకరుడు. చేసేది లేక మంత్రి తన పరివారంతోనూ భద్రగజంతోనూ కలిసి తిరుగుముఖం పట్టాడు. అప్పటి వరకు గడప వెనుక నిలబడి కొడుకు మాటలు వింటున్న ఆర్యాంబ సంతోషించింది. లోనికి వెళ్లి నీటి కడవతో ఇంటి బయటికొచ్చింది. ఎడమ వైపు సందులోనికి తిరిగి ముందుకు సాగింది. అక్కడ పచ్చిక మేస్తున్న కపిలగోవు పృష్టాన్ని తాకి నమస్కరించింది. సురభీకృత దిగ్వలయం సురభి శతైరావృతం సదా పరితః సురభీతి క్షపణ మహాసురభీమం యాదవం నమత కొడుకు రచించిన శ్లోకాన్ని ఆర్యాంబ వల్లెవేస్తోంది. ఆ సురభిగోవుకు ఏం తోచిందో ఏమో ఆమెను వెంబడింది. కుడివైపున పశ్చిమాభిముఖుడైన శ్రీకృష్ణుని ఆలయం ఉంది. ఆలయ గోపురానికి నమస్కరించి గో సమేతంగా ఆర్యాంబ పూర్ణానదీ తీరం వైపు అడుగులు వేసింది. శంకరుడు తిరిగి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె ఉత్సాహంగా ఉంటోంది. భర్తకు దూరమైన తర్వాత కఠిన నియమాలతో శరీరాన్ని శుష్కింప చేసుకుంటూ వచ్చిందామె. కొడుకు గురుకులంలో ఉన్నంత కాలం ఎలా బతికిందో ఏమో కానీ, అతడు తిరిగి వచ్చిన తరువాత లేని సత్తువ తిరిగి వచ్చినట్లుంది. అందరూ కొడుకు గుణగణాలను పొగుడుతుంటే ఆమెకు ఆత్మానందం మరింత పెరిగి, తనపై తనకు శ్రద్ధ తగ్గింది. కొడుకేం చేస్తున్నాడు... ఎవరితో మాట్లాడుతున్నాడు... ఏమిటి రాస్తున్నాడు... సూర్యాగ్నులను ఆరాధించడంలో పెద్దల త్రోవకు ఏ విధంగా మెరుగు పెడుతున్నాడని పరిశీలించడమే ఆమెకు నిత్యకృత్యంగా ఉంది. తండ్రి కాలం నాటి దుర్గాలయం అర్చకత్వపు బాధ్యతలు జ్ఞాతుల చేతుల్లోనే ఉండనిచ్చాడు శంకరుడు. కానీ ఆలయం బాగోగులు చూసుకోవడంలో మాత్రం ఏమరడం లేదు. తండ్రి శిష్యులకు, పరిసర గ్రామాల్లోని అనేకులకు తానే గురువయ్యాడు. పండిత వంశం పేరు నిలబెట్టాడు. తమ కులదైవమైన శ్రీకృష్ణునికి అంకితంగా కొడుకు రచిస్తున్న శ్లోకాలంటే తల్లికి ప్రాణం. ఆ శ్లోకాలనే పదేపదే పాడుకుంటూ ఆమె నడుస్తూ ఉంది. పూర్ణానది హోరు దగ్గరవుతోంది. నదిపై నుంచి వచ్చే చల్లని గాలి జ్యేష్ఠమాస భానుని భుగభుగల నుంచి ఉపశమనం కలిగిస్తోంది. పచ్చిక దాటి నదీతీరంలోని ఇసుకలో కాలుపెట్టేసరికి ఆర్యాంబకు పాదాలు చురుక్కుమన్నాయి. తడబడుతూ నడుస్తోంది. కొద్దిదూరం నడిచిందో లేదో ఆమె కళ్లు తిరిగి కుప్పకూలింది. నియమాలతో శుష్కింప చేసుకున్న ఆమె దేహం ఎండ వేడిమికి తాళలేకపోయింది.అప్పటి వరకు అనుసరించి వస్తున్న సురభి ఆమె ముఖాన్ని ఆప్యాయంగా నాకడం మొదలుపెట్టింది. రేవులోని స్త్రీలు సాయం కోసం వచ్చారు. ఈలోగా ఇంటిలోని శంకరునికి ఈ వార్త తెలిసింది. పరుగు పరుగున వచ్చాడు. అప్పటికే తల్లికి తెలివి వచ్చింది. మెల్లగా లేవడానికి ప్రయత్నిస్తోంది. శంకరుడు తల్లికి చేయందించి, మెల్లగా నడిపించుకుంటూ ఇంటికి చేర్చాడు. వడదెబ్బ నుంచి తేరుకోవడానికి కావలసిన ఉపచారాలు చేశాడు. వృద్ధాప్యంలో తల్లి పడుతున్న కష్టం చూసి చలించిపోయాడు. పూర్ణానదీ తీరానికి వెళ్లి ఆ నదీమ తల్లిని అనేక స్తోత్రాలతో కీర్తించాడు. అతడి ప్రార్థనలకు మెచ్చిన నదీదేవత స్త్రీరూపం ధరించి ఎదుట సాక్షాత్కరించింది. ‘‘శంకరా! రేపటి ఉదయానికి నీ అభీష్టం నెరవేరుతుంది’’ అని వరమిచ్చింది. వాన లేదు, వరద లేదు. ముందస్తుగా ఏ సంకేతాలూ లేకుండా పూర్ణానదీ మహాప్రవాహం స్వచ్ఛందంగా తన మార్గం మార్చుకుంది. ఈ సన్నివేశం కాలటి ప్రజలను విస్తుపోయేలా చేసింది. ఇది శంకరుని చర్య అని తెలిసిన తరువాత వారి ఆనందానికి మేరలేదు. ఇప్పుడు పూర్ణానది శంకరుని పెరటి వాకిలిని ఒరుసుకుని ప్రవహిస్తోంది. కృష్ణాలయ ప్రాకారాన్ని కౌగిలించి ఆక్రమించింది. ఆలయ ముఖద్వారం ముంగిట ముగ్ధలా తలవంచి నిలిచిపోయింది. సంతోషంలో ఆర్యాంబకు రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజులకు...రెండు జాముల పొద్దెక్కిన వేళలో... కాలటి గ్రామంలో కోలాహలం బయలుదేరింది. మహారాజు పరివార సమేతుడై వస్తున్నాడు. గ్రామవాసులంతా ఆయనను వెంబడించి వస్తున్నారు. అల్లంత దూరంలోనే ఏనుగు దిగి పాదరక్షలు, అంగరక్షలు విడిచిపెట్టాడు మహారాజు. శంకరుని శిష్యులు పాఠం వల్లెవేయడం ఆపి లేచి నిలబడ్డారు. మహారాజు నేరుగా శంకరుని వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. ‘‘రాజశేఖర వర్మ అభివాదం గ్రహించండి’’ అన్నాడు. ‘‘వంశాభివృద్ధిరస్తు’’ అన్నాడు శంకరుడు. మనసులో ఉన్న కోరిక నోరు తెరిచి అడగకుండానే వరంగా లభించినందుకు రాజశేఖరుడు పొంగిపోయాడు. ‘‘స్వామీ ధన్యోస్మి!’’ అంటూ మరోసారి నమస్కరించాడు. శంకరుడు ఆదరంతో కుశల ప్రశ్నలు వేశాడు. మహారాజును ఇంటిలోనికి ఆహ్వానించాడు. రాజశేఖరుడు సుఖాసీనుడై, ‘‘మహానుభావా! నేను నాటకకర్తను. తమరు దయతో నా నాటకాలు పరిశీలించి గుణదోషాలు తెలియచెప్పాలని విన్నపం’’ అన్నాడు. శంకరుడు అనుమతించగా పరివారం ఆ నాటకాల ప్రతులను లోనికి తీసుకువచ్చారు. బంగారు నాణేలను ఉంచిన పళ్లెరాలలో ఉన్న మూడు నాటకాల ప్రతులను అక్కడ ఉంచి వెళ్లిపోయారు.రాజశేఖరుడు ఆ నాటకాలను అక్కడక్కడా చదివి వినిపించాడు. ‘‘రాజా! నీ నాటకాలు అతి రమ్యంగా ఉన్నాయి. దోషాలు లేవు. నా మనసుకు ఆహ్లాదాన్ని పంచాయి. ఇందుకు ఏం వరం కావాలో కోరుకో’’ అన్నాడు శంకరుడు. ‘‘వీటిని మీరు స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయండి’’ అన్నాడు రాజశేఖరుడు బంగారు నాణేల వైపు రెండు చేతులతోనూ చూపిస్తూ. శంకరుడు ప్రసన్నంగా నవ్వాడు. ‘‘బ్రహ్మచారిని నేనేం చేసుకోను వాటిని? మా గ్రామ ప్రజలందరికీ పంచి పెట్టించు. మరో వరం కోరుకో’’ అన్నాడు. ‘‘తమరు ముందుగా ఇచ్చిన వరమే. వంశోద్ధారకుడైన పుత్రుడు కావాలి’’ అన్నాడు రాజశేఖరుడు. ‘‘తథాస్తు. దేవతా ప్రీతికోసం పుత్రకామేష్టిని నిర్వహించు. త్వరలోనే నీకు పుత్రోదయం అవుతుంది’’ అని శంకరుడు యాగ విధానాన్ని మహారాజుకు బోధించాడు. శంకరుని దయాగుణాన్ని కీర్తిస్తూ మహారాజు రాజధానికి మరలిపోయాడు. బంగారు నాణేలను మహారాజ బహుమానంగా అందుకున్న కాలటి గ్రామ ప్రజలు శంకరునికి జేజేలు పలికారు. కొడుకు సాధిస్తున్న విజయాలను చూసిన ఆర్యాంబ పుత్రోత్సాహం రోజురోజుకీ రెట్టింపవుతూనే ఉంది. కలియుగం ప్రవేశించి 2,603 సంవత్సరాలు గడిచాయి. శ్రీప్లవ నామ సంవత్సరం ప్రవేశించింది. శంకరునికి పదేళ్లు నిండి పదకొండో ఏడు నడుస్తోంది. కొడుక్కి తొందరగా పెళ్లి చేయాలని తల్లి మనసు ఆరాటపడుతోంది. ‘మా అబ్బాయికి మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి’ అని కనిపించిన వాళ్లందరినీ అడుగుతోందామె. అప్పుడే తొందరేమిటని ఎవరైనా అడిగితే విసుక్కునేది. ‘ఈ ఏడాది ఎలాగైనా చేసేస్తానండీ మా వాడికి’ అనేది. తల్లి కోరిక అన్యాపదేశంగా శంకరుని చెవిన కూడా పడింది. నవ్వి ఊరుకున్నాడు. భాద్రపదమాసం ప్రవేశించింది. వినాయక చవితి నాటి అర్ధరాత్రి... మూలా నక్షత్రానికి పక్కగా ఉన్న అగస్త్య నక్షత్రం నుంచి ఒక కాంతి పుంజం బయలుదేరి వేగంగా భూమివైపు దూసుకొస్తున్నట్లు కార్తాంతికులు గుర్తించారు. సూర్యోదయంతో రుషిపంచమి తిథి వచ్చింది. ఆర్యాంబ భక్తిశ్రద్ధలతో పర్వ నియమాలను పాటించింది. అపరాహ్ణవేళలో మాధ్యాహ్నిక సంధ్యావందనంలో భాగంగా.... చిత్రం దేవానాముదగా దనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః... వరించదగిన వెచ్చటి స్నేహాన్ని వర్షిస్తున్న దివ్యచక్షువది. పగటి వెలుగులా నడుమ తెల్లని తారకతో, రాత్రి చీకటిలాంటి నల్లటి పాపతో, అగ్నిలా ఎర్రజీరతో ప్రకాశిస్తున్న పరమాత్మ కన్ను దివిని, భువిని, అంతరిక్షాన్ని నింపుతూ నిండుగా కనిపిస్తోంది. జగత్తుకు చూపునిచ్చే కిరణసైన్యంతో పరమాత్మ ప్రాణికోటి కోసం దాచిపెట్టిన గుప్తసంపదను ప్రదర్శింప చేస్తోంది.– అని శంకరుడు సూర్యోపస్థాన మంత్రాలు చదువుతున్నాడు. దివ్యతేజంతో వెలిగిపోతున్న అయిదుగురు మహాపురుషులు శంకరుని ఇంటిముందు ఆకాశం నుంచి దిగివచ్చినట్లు కనిపించారు. శంకరుడు ఒక్క ఉదుటన లేచి వెళ్లి, వారందరికీ ఒకేసారి సాష్టాంగ ప్రణామం చేశాడు. అలికిడి విన్న ఆర్యాంబ పూజగదిలో నుంచి బయటకు వచ్చింది. ఎవరో మహర్షులను శంకరుడు వినయంగా ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నాడు. వారిలో ఒక్కరిని మాత్రమే ఆర్యాంబ గుర్తు పట్ట గలిగింది. శంకరుని ఉపనయన వేళ పిలవకుండానే భార్యా సమేతంగా వచ్చి, బ్రహ్మోపదేశం చేసిన వ్యక్తి ఆయనే. అందరిలోనూ పొట్టిగా ఉన్న వ్యక్తి. నేడు ఎందుకోసమో మరి... తనతో పాటు నలుగురిని వెంటబెట్టుకుని వచ్చాడు. అర్ఘ్యపాద్యాలిచ్చి శంకరుడు వారందరినీ ఉచితాసనాలపై కూర్చో బెట్టాడు. వారిముందు తాను నేలపై చేతులు కట్టుకుని కూర్చున్నాడు. ఆర్యాంబ వారికోసం పళ్లు తీసుకుని వచ్చి, నమస్కరించి సమర్పించి దూరంగా నిలబడింది. ‘‘శంకరా! ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అవతరించక పూర్వమే ఈయన మహాలక్ష్మీ స్తుతి చేశాడు. చంద్రునిలో ఉండే వెన్నెల, సూర్యునిలో ఉండే వేడి, అగ్నిలో దహించే శక్తి, దేహంలో ఉండే వైశ్వానరాగ్ని కూడా మహాలక్ష్మియే అంటాడీయన. అటువంటి ఈయన కూడా నీ కనకధారకు ముగ్ధుడయ్యాడు’’ అన్నాడు అందరిలోనూ పెద్దవాడైన మహర్షి. ‘‘అత్రి మహర్షీ! తనలాగే దేవతానుగ్రహం పొందగలడని ముందుగానే తెలిసే కాబోలు... అగస్త్య మహర్షి.... ఈ కుర్రవాడి ఉపనయన వేళ కోరివచ్చి మరీ బ్రహ్మోపదేశం చేశాడు.’’ ఆర్యాంబ తన చెవులను తానే నమ్మలేక పోతోంది. మహాతపస్వులకు సైతం దర్శనమివ్వని మహానుభావులు తన కొడుకు కోసం ఇంతదూరం వచ్చి, ప్రేమ కురిపించడం ఆమె హృదయంలో ఆవేగాన్ని పెంచుతోంది. ‘‘మీరన్నది నిజమే ఉపమన్యూ! అగస్త్య మహర్షి సర్వజీవుల పట్ల సమభావం కలవాడు. ఒకనాడు ఇంద్రద్యుమ్నుడనే విష్ణుభక్తుడు తపస్సు చేసుకుంటుంటే కోరి వెళ్లి.... అతని మేలు కోసమే ఒక శాపంలాంటి వరాన్నిచ్చాడు. ఫలితంగా ఆ మహారాజు త్రికూటాచలంపై గజేంద్రుడై పుట్టాడు. మకరి నోటికి చిక్కి మహావిష్ణువు కరుణ పొందాడు. గజేంద్ర మోక్షం మన అగస్త్య మహర్షి చలవే కదా!’’ అత్రి మహర్షి ప్రశంసించాడు. ‘‘సరే స్వామీ! దధీచీ! ఆ మకర జన్మ ఎత్తిన హూహూ గంధర్వుడు మళ్లీ మీకెక్కడైనా కనబడ్డాడా?’’ ఉపమన్యువు ప్రశ్నించాడు. ‘‘విష్ణుచక్రం మెడకు తాకగానే శాపవిమోచనం కలిగింది. పూర్వరూపం వచ్చింది. కానీ గజేంద్రునిలా మోక్షం పొందలేక పోయానే అనే బాధ వాడిలో ఉండిపోయింది. భక్తుడి పాదం పట్టుకున్న వాడికి భగవంతుడి పాదం తప్పక దొరుకుతుందని విశ్వాసం. అందుకోసం అవసరమైతే మళ్లీ మకరం కావడానికైనా వాడు సిద్ధమే.’’ దధీచి చెప్పిన వింత వృత్తాంతం విన్న అగస్త్యుడు ఇలా స్పందించాడు. ‘‘దధీచి మహర్షీ! దక్షయాగం ధ్వంసమై పోవడానికి మీరిచ్చిన శాపమే కదా కారణం. మీ వచనం పొల్లుపోదు. మీ వంటి మహర్షుల ధిషణ కూడా లోకకల్యాణానికే కారణమవుతుంది. శంకరా! ఇదిగో ఈయన గౌతముల వారు. తాను రచించిన న్యాయదర్శనాన్ని కాదన్నాడని, ఒకప్పుడు వ్యాసునికి సైతం దర్శనం ఇవ్వనని భీష్మించుకున్న వ్యక్తి. జైమిని పట్ల వ్యాసుడెలా వ్యవహరించాడో, ఈయన కూడా వ్యాసుని పట్ల అలాగే ప్రవర్తించి శిష్యవాత్సల్యానికి అర్థం చెప్పాడు’’ అన్నాడు. ‘‘అసలేం జరిగింది స్వామీ?’’ ఆసక్తిగా అడిగాడు శంకరుడు. అగస్త్యుడు ఏదో చెప్పబోయాడు. అప్పటివరకూ దూరంగా ఉన్న ఆర్యాంబ మెల్లిగా వారి ముందుకు వచ్చింది. చేతులు జోడించి, ‘‘మహాత్ములారా! మీరంతా మా అబ్బాయి పట్ల ఇంత వాత్సల్యాన్ని చూపించడం సంతోషంగా ఉంది. మీరు మాట్లాడుకున్నదంతా చిన్నపిల్లలకు చెప్పే కథల్లాగే ఉన్నా... వాటిలోని అంతరార్థమేమిటో నాకు తెలియడం లేదు. సరే... నా సందేహం ఒక్కటి తీర్చండి’’ అని ఆగింది. ‘‘అడగవమ్మా’’ అన్నాడు అగస్త్యుడు మహర్షులందరి తరఫునా. ‘‘మా శంకరుడికి పదకొండేళ్లు వచ్చేశాయి. అతని వివాహం కళ్లారా చూసి వెళ్లిపోవాలని నా కోరిక. ఎంతోమంది వస్తూనే ఉన్నారు. మా వాడి జాతకం ఇవ్వమని అడిగి తీసుకువెళ్లిన వారే కానీ, మా పిల్లనిస్తాం చేసుకోండని ముందుకు వచ్చిన వాళ్లు లేరు. ఇంతకూ మావాడికి పెళ్లెప్పుడు అవుతుందంటారు?’’ అడిగింది ఆర్యాంబ. తల్లి మనసు గ్రహించిన అగస్త్యుడు ఆమెకు సమాధానం చెప్పడం ప్రారంభించాడు. -నేతి సూర్యనారాయణ శర్మ -
బాస్
-
తమిళ నోట తెలుగు పాట
పండబారిన వెన్నెల రాత్రిలో, చేరదేశపు చెలులు దగ్గర ఉండగా, చక్కటి తెలుగు పాట పాడుతూ, సింధు నదిలో పడవ నడుపుదాం... దర్శకుడు జ్ఞాన రాజశేఖరన్- ‘భారతి’ పేరుతో ఒక జీవితచరిత్రను సినిమాగా తీయడానికి ముఖ్య కారణం, సుబ్రహ్మణ్యం భారతి భావనలు ఆయన్ని ఊపేయడం మాత్రమే కాదు; ప్రమాదవశాత్తూ, దురదృష్టవశాత్తూ కూడా, సుబ్రహ్మణ్య భారతి మరణించినప్పుడు కేవలం పద్నాలుగు మంది మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారని తెలియడం కూడా! అదెలా జరిగిందో తెలియాలంటే, జీవితానికీ సాహిత్యానికీ ఉన్న సంబంధం ఏమిటో తెలియాలి. సాహిత్యాన్ని జీవితం, జీవితాన్ని సాహిత్యం పెనవేసుకున్న వైనం తెలియాలి.సుబ్రహ్మణ్య భారతి అసలు పేరు సుబ్బియ. ఐదేళ్లకే తల్లిని కోల్పోయాడు. నేర్చుకున్న సంగీతం ఒడిలో సేదతీరాడు. 11 ఏళ్ల వయసులోనే అపర గాంధర్వులనుకున్నవారితో సంగీతంలో పోటీపడ్డాడు. ఫలితంగా ‘భారతీయార్’ అన్న బిరుదునూ, దానిమీదుగానే ‘పేరు’నూ పొందాడు. అలౌకిక బీజాలు కనబడుతున్న కొడుకుని లౌకిక ప్రపంచంలోకి లాగడానికి పదహారేళ్లకే పెళ్లి జరిపించాడు తండ్రి. అయినా వివాహం బంధనం కాలేకపోయింది. కాశీ వెళ్లాడు భారతి. సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. లోకసంచారిగా బ్రిటిష్‌వారి పాలనలోని భారతదేశపు పేదరికాన్ని, అసమానతలను నగ్నంగా దర్శించాడు. దేశపుత్రుడిగా మాతృమూర్తికి స్వాతంత్య్రపు అంబరాల్ని తొడగాల్సిన బాధ్యతను గుర్తెరిగాడు. భారతమాతను తల్చుకుంటేనే అంతరాళాల్లో పొంగే ధైర్యాన్ని స్పృహించాడు. ‘కాలిపోయినా, బాధపడ్డా పదేపదే వందేమాతరం’ పాడదామన్నాడు. భారతి లక్ష్యాలు రెండు. మొదటిది స్వాతంత్య్రం పొందడం. రెండవది, స్వాతంత్య్రం అనంతరం మనల్ని మనం సంస్కరించుకోవడం. అందుకుగానూ ‘స్వదేశీ మిత్రన్’, ‘ఇండియా’ వంటి పత్రికలు నెలకొల్పాడు. కవిత్వం అల్లాడు. కథలు చెప్పాడు. వ్యాసాలు రాశాడు. కన్నన్ పాట్టు, కూయిల్ పాట్టు, పాప్ప పాట్టు లాంటి రచనలు చేశాడు. సమాజ స్థితినీ, గతినీ సజీవంగా చిత్రించాడు. కులాల మెట్లు కూలిపోవాలన్నాడు. మతాల అడ్డుగోడలు పడిపోవాలన్నాడు. జన హృదయ పరివర్తనను కాంక్షించాడు. ‘కాకీ, పిచ్చుకలదీ మన కులమే; సముద్రం, పర్వతం మన సమూహమే’ అన్నాడు. ‘మూర్ఖులు మాత్రమే మనుషుల మధ్య మంటలు పెడతా’రన్నాడు. అడ్డగోలు దేవుళ్ల ఉనికిని నిరసించాడు. ‘దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడూ ప్రతి జీవిలోనూ ఉన్నా’డన్నాడు. ‘ప్రేమతో మాత్రమే ఈ ప్రపంచం వర్ధిల్లగల’దని విశ్వసించాడు. వంద సంవత్సరాల క్రితమే లింగ వివక్షను ప్రశ్నించాడు. విద్యతోనే వికాసమని మహిళలకు ఉద్బోధించాడు. స్వయం సమృద్ధమైన సామ్యవాదాన్ని స్వప్నించాడు. ‘ప్రియురాలు తమిళంలో మాట్లాడితే అది జీవనదుల ఊట’ అంటూనే, ‘సుందర తెలుంగు నిఱ్ పాట్టి శైత్తు/ త్తోణిగ ళోట్టి విళైయాడి వరువోం’(పండబారిన వెన్నెల రాత్రిలో, చేరదేశపు చెలులు దగ్గర ఉండగా, చక్కటి తెలుగు పాట పాడుతూ, సింధు నదిలో పడవ నడుపుదాం’ అని భారతీయ హృదయాన్ని ఆవిష్కరించుకున్నాడు. ‘వెలుగే నీ కనులే చిట్టెమ్మా సూర్యచంద్రులే/ నల్లని నీ కనుపాపే చిట్టెమ్మా వానమేఘాలే’ అని పాడుకున్నాడు. ‘నిప్పులో చెయ్యిపెడితే నిన్ను ముట్టుకున్నట్లే ఉందేమిటి కృష్ణా’ అని పరవశించాడు. ‘కవిత రాసేవాడు కవి కాడు. కవిత్వాన్ని జీవితంగా జీవితాన్ని కవిత్వంగా చేసుకున్నవాడే కవి’ అన్నాడు భారతి. ఆయన కవిని మించిన సంస్కర్త. సంస్కర్తను మించిన కవి. జీవితాన్నీ సాహిత్యాన్నీ లౌక్యంగా వేరు చేయలేదు. ఆయనకు రెండూ ఒకటే. రైతులతో, కూలీలతో భుజాలు కలిపి తిరిగాడు. దళితులను ఆలింగనం చేసుకున్నాడు. స్వయంగా ‘హరిజనుడికి’ ఉపనయనం చేశాడు. తన కూతురు తంగమ్మను అదే వర్గంలో ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. అదిగో, అప్పుడు, ఆయన దగ్గరివాళ్లందరికీ దూరమైపోయాడు. దగ్గరవడానికి ప్రయత్నించినవాళ్లు ఆ సమయంలో దూరంగా ఉండివుంటారు! దాంతో- నిత్యజీవితపు కోలాహలం నుంచి అనాసక్త స్థితికి వచ్చాడు. కవిత్వం రాసుకోవడం, పార్థసారథి కోవెలకు వెళ్లడం, అక్కడి ఏనుగుతో కాసేపు గడపడం చేస్తూవచ్చాడు. అయితే రోజూ ఆయనచేతి అరటిపళ్లను ప్రేమగా తినేంతగా మాలిమి అయిన ఆ ఏనుగే తొండంతో ఆయన్ని చుట్టి నేలకు కొట్టింది. ఒక వీరుడు మరణించకూడని చావు అది! కానీ వాస్తవం అది! అలా నలభయ్యో జన్మదినం కూడా చూడకుండా సుబ్రహ్మణ్య భారతి (11 డిసెంబర్ 1882- 11 సెప్టెంబర్ 1921) దుర్మరణం పాలయ్యాడు. ‘భారతి నిజంగా అగ్నిలాంటివాడు. జనం ఆ అగ్నిని తమ చేతుల్లో కొంతసేపే మోయగలరు తప్ప ఎల్లప్పుడూ కాదు. అగ్నిని కింద పడవేయాల్సిందే, పడవేశారు’ అంటాడు జ్ఞాన రాజశేఖరన్, ‘అంత్యక్రియలకు పద్నాలుగు మంది హాజరు’కు గల అప్పటి కారణాన్ని ఊహిస్తూ. కానీ, అదే అగ్ని నెమ్మదిగా హృదయాల్ని వెలిగించే దివ్వెలుగా రూపాంతరం చెందివుంటుంది! ఇక పడేయడం కాని పని! - ఆర్.ఆర్.