తుర్లపాటి పార్ధివ దేహం వద్ద నివాళులర్పిస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు
విజయవాడ కల్చరల్: ఆ గళం మూగబోయింది.. ఆ కలం ఆగిపోయింది.. ఏడు దశాబ్దాల సుదీర్ఘ పాత్రికేయ ప్రస్థానం ముగిసి పోయింది.. విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు, కాలమిస్ట్, గ్రంథ రచయిత పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతి పాత్రికేయులతో పాటు, సాహితీ ప్రియుల్లో విషాదం నింపింది. నిన్నటి వరకూ సన్నిహితులతో సరదాగా మాట్లాడిన ఆయన ఆకస్మిక మరణాన్ని పాత్రికేయులు, సాహితీ ప్రియులు నమ్మలేకున్నారు. విజయవాడ నగరంలోని స్వర్గపురిలో సోమవారం సాయంత్రం తుర్లపాటికి ప్రముఖులు, సాహితీవేత్తలు, జర్నలిస్టుల అశృనయనాల మధ్య అంత్య క్రియలు జరిగాయి.
బహుముఖ ప్రజ్ఞాశాలి
కృష్ణా జిల్లా పామర్రులో 1933 ఆగస్టు 10న తుర్లపాటి జన్మించారు. పత్రికా రంగంలో ఆయన ప్రస్థానం 1946లో తన 14వ ఏట ప్రారంభమైంది. పాత్రికేయునిగా ప్ర«ధాన మంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు వంటి ప్రముఖులతో ఆయనకు అనుబంధం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను సైతం తుర్లపాటి ఇంటర్వ్యూ చేశారు. దేశ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పి.వి.నరసింహారావుతో ఆయనుకు పరిచయాలున్నాయి. రాష్ట్రంలో రాజీవ్‌గాంధీ ప్రసంగాలకు తుర్లపాటి అనువాదకుడిగా వ్యవహరించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. అంతేకాదు రాష్ట్రపతులుగా సేవలందించిన వి.వి.గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలామ్‌లతో ఆయనకు పరిచయం ఉంది.
సినిమా రంగంలో ప్రత్యేక ముద్ర
తుర్లపాటి కుటుంబరావు జ్యోతిచిత్ర ఎడిటర్‌గా ఉన్నప్పుడు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తమ ఇంటర్వ్యూల కోసం తుర్లపాటి వద్ద సినీనటులు పడిగాపులు పడేవారని చెబుతారు. సినిమాల రిలీజ్ సమయంలో తమ సినిమా గురించి వ్యాసం రాయండంటూ నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు ఆయన వద్దకు క్యూ కట్టేవారు. అదే సమయంలో ముంబైలో జరిగే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల తరహాలో తెలుగు సినిమా పరిశ్రమలో అవార్డులు ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఫిల్మ్‌ఫేమ్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి, మంచి చిత్రాలకు అవార్డులను అందజేసేవారు. కాల క్రమేణా ప్రభుత్వం నంది అవార్డులను ప్రవేశ పెట్టడంతో అవి నిలిచిపోయాయి.
6 వేలకు పైగా జీవిత చరిత్రల వ్యాసాలు
పాత్రికేయ కురువృద్ధునిగా పిలుచుకునే తుర్లపాటి వార్తల్లోని వ్యక్తిగత శీర్షిక ద్వారా ఆరు వేలకు పైగా జీవిత చరిత్రలను పరిచయం చేశారు. ఇలా దేశ ప్రధానులు, రాష్ట్రపతులు, ప్రముఖుల గురించి వ్యాసాలు రాశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల గురించి బుక్‌లెట్‌లను ప్రచురించారు.
అవార్డులు.. రివార్డులెన్నో..
ఉపన్యాస కేసరి, దశ సహస్ర సభాకేసరి, ముట్నూరి కృష్ణారావు పాత్రికేయ పురస్కారం (1989), ఉత్తమ జీవిత చరిత్ర రచయిత పురస్కారం, (తెలుగు విశ్వవిద్యాలయం 1990), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2002లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అత్యధిక సభల్లో పాల్గొన్నందుకు 1993లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందారు.
సభ ఏదైనా అధ్యక్ష స్థానం ఆయనదే..
విజయవాడ నగరంలో జరిగే సాహిత్య, రాజకీయ సభ ఏదైనా అధ్యక్ష స్థానంలో మాత్రం తుర్లపాటి ఉండేవారు. ఆ సభ నిర్వహించే అంశాలపై ఆయన అనర్గళంగా మాట్లాడేవారు. అంశం ఏదైనా, సందర్భోచితంగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకునే వారు. ఎన్నో విశేషాలను వివరిస్తూ, ఆ సభపై తనదైన ముద్ర వేసేవారు.
ప్రకాశం పంతులు గారు రూ.5 బాకీ..
ప్రకాశం పంతులుకు కార్యదర్శిగా పనిచేసే సమయంలో ఏదో సందర్భంలో ఆయనకు తుర్లపాటి రూ.5 ఇచ్చారట. తరువాత మరో సందర్భంగా ప్రకాశం ఎదురుపడ్డప్పుడు నాకు మీరు రూ.5 బాకీ. అవి ఎప్పుడిస్తారు? అని సరదాగా అడిగేవారని సన్నిహితులతో చెప్పేవారు. అక్కినేని నాగేశ్వరరావుకు నటసామ్రాట్ బిరుదు ప్రదానం చేసింది తుర్లపాటే. అక్కినేని నటజీవన ప్రస్థానంలో అత్యంత విలువైన బిరుదు నటసామ్రాట్‌ను తుర్లపాటి ప్రేరణతో విజయవాడలోనే ప్రదానం చేశారు.
ఎన్టీఆర్ నటుడు కాదు..
గుంటూరులో ఎన్టీఆర్ నటించిన సినిమా శతదినోత్సవ సభలో ఆయన వేదిక మీదకు రాలేదు. తుర్లపాటి మాట్లాడుతూ ఎన్టీఆర్ నటుడు కాదు అని కొద్ది సమయం గ్యాప్ ఇచ్చారట. దీంతో జనం తుర్లపాటి మీదకు దాడికి వచ్చారట. అప్పుడు రామారావు నటుడు కాదు.. మహానటుడు అనడంతో ఆయన అభిమానులు కేరింతలు కొట్టారని తుర్లపాటి తన జీవిత చరిత్ర పుస్తకంలో రాసుకున్నారు.
ఆంజనేయ స్వామి భక్తుడు
తుర్లపాటి ఆంజనేయ స్వామి భక్తుడు. లబ్బీపేట సాయిబాబా ఆలయానికి ట్రస్ట్ బోర్డ్ సభ్యుడుగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జర్నలిస్ట్ సంఘాలతో సన్నిహిత సంబంధాలుండేవి. ఆయన సలహాలు, సూచనలతోనే సంఘాలు నడిచేవి.
రచయితల సంఘం సంతాపం
కుటుంబరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య,చలపాక ప్రకాష్, నవ్యాంధ్ర రచయితల సంఘం కార్యదర్శి కలిమిశ్రీ, కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి జీవీ పూర్ణచంద్ సంతాపం వ్యక్తం చేశారు
ప్రముఖుల సంతాపం
రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థనరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తదితరులు తుర్లపాటి పార్ధివ దేహాన్ని సందర్శించారు. వివిధ కళాసంస్థలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment