Turlapati Kutumba Rao
-
అరుదైన పత్రికా రచయిత తుర్లపాటి కుటుంబరావు
సాక్షి: జర్నలిజంలో పది, ఇరవై ఏళ్లపాటు కొనసాగడమే కష్టం. అలాగే జర్నలిస్టుగా జీవితం ఆరంభించి, కన్ను మూసే వరకు అదే వృత్తిలో ఉంటూ పత్రికలలో వ్యాసాలు రాయడం దాదాపు అసాధ్యం. అందరికీ ఆ అవకాశం లభించదు. అలాంటిది తుర్ల పాటి కుటుంబరావు డెబ్భై ఏళ్లపాటు జర్నలిస్టుగా కొనసాగగలిగారు. ఏభై ఏళ్లపాటు ‘వార్తలలో వ్యక్తి’ పేరుతో ఒక శీర్షిక నిర్వహించగలగడం గొప్ప విషయం. ఒక వ్యాస శీర్షికను ఏభై ఏళ్లు నడపమంటే తేలికైన పని కాదు. కాని తుర్లపాటి వల్ల అది సాధ్యపడింది. ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత ‘వార్త’ దినపత్రికలలో ‘వార్తలలోని వ్యక్తి’ కాలమ్‌ను నిర్వహించేవారు. ఇంత సుదీర్ఘ కాలం జర్నలిస్టుగా ఉండి ఒక సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేకపోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. పాత్రికేయుడిగానే కాకుండా, ‘ఉపన్యాస కేసరి’ అని పిలిపించుకున్న ఏకైక జర్నలిస్ట్ తుర్ల పాటి. 18 వేల ప్రసంగాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డులలోకి ఎక్కారు. అదే సమయంలో పలు పుస్తకాలు రచించారు. ‘జాతి నిర్మాతలు’, ‘1857 విప్లవ వీరులు’ వంటి పలు పుస్తకాలు వీరు రచించినవే. ఆంధ్ర యూనివర్శిటీ నుంచి ‘కళా ప్రపూర్ణ’, ‘ముట్నూరి కృష్ణారావు అవార్డు', ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా ‘నేషనల్ సిటిజన్స్ అవార్డు’, అమెరికాలోని బయోగ్రాఫికల్ సంస్థ వారి ‘ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ వంటి అవార్డులు దక్కాయి. తుర్లపాటి కుటుంబరావు 1933 ఆగస్టు పదో తేదీన జన్మించారు. కృష్ణా జిల్లా గన్నవరం, విజయవాడల్లో చదువుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే పత్రికా రంగంలోకి రావడం ఒక ప్రత్యేకత. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుకు చెందిన ‘ప్రజా పత్రిక’లో ఆయన చేరి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 1959లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో సహాయ సంపాదకుడిగా ఆరంభమైన ఆయన జర్నలిస్ట్ ప్రస్థానం జీవితాంతం కొనసాగింది. 18 మంది ముఖ్య మంత్రులతో ఆయనకు సంబంధాలు, మంచి పరిచయాలు ఉండేవి. అలాగే సినీ రంగంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తదితరులకు ఈయనంటే ఇష్టం. వారి గురించిన వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా రాశారు. వారికి బిరుదులు ఇచ్చి విజయవాడలో సత్కార, సన్మాన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఉదాహరణకు ఏఎన్నార్‌కు ‘నట సామ్రాట్’ అనే బిరుదును ఖాయం చేసి ప్రదానం చేసింది ఈయనే. ‘నంది’ అవార్డులను సినిమావారికి ప్రవేశపెట్టాలని కోరుతూ, అవి వచ్చేందుకు తుర్లపాటి విశేష కృషి చేశారు. జాతీయ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా, జ్యోతిచిత్ర సినిమా పత్రిక సంపాదకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. రాజకీయ, సినీ రంగం రెండిటిలోనూ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించగలగడం అందరికీ కుదరదు. సాహిత్య, సంగీతాభిలాషి అయిన ఆయన అభ్యుదయవాది కూడా. ప్రముఖ కూచిపూడి నర్తకి కృష్ణకుమారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతలతోనే కాదు... పలువురు జాతీయ స్థాయి నాయకులతో కూడా ఆయన సంబంధాలు, ఉత్తరప్రత్యుత్తరాలు నెరపేవారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటివారితో తరచు ఇంటరాక్ట్ అయ్యేవారు. ఇక ఇంది రాగాంధీ, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, రాజీవ్ గాంధీ వంటి వారు ఏపీకి వచ్చినప్పుడు, వారి ఉపన్యాసాలకు అనువాదకులుగా ఉండేవారు. నెహ్రూపై ఉన్న అభిమానంతో ఆయన తన కుమారుడికి ఆ పేరే పెట్టుకోవడం విశేషం. ప్రేమ వివాహానికి గుర్తుగా కుటుంబ రావు తమ కుమార్తెకు ‘ప్రేమ జ్యోతి’ అని పేరు పెట్టారు. చతురోక్తులతో ప్రసంగాలు చేయడం ఆయన విశిష్టత. ఆయా సందర్భాలను బట్టి ఆయా ప్రముఖుల చరిత్రను, వర్తమానాన్ని కలిపి, జీవిత విశేషాలతో ఆ కాలమ్ రాసి పాఠకులను ఆకట్టుకునేవారు. ఇన్ని గొప్పదనాలు ఉన్నవి కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. తెలుగు జర్న లిస్టులలో ఆ గౌరవం పొందింది ఈయన ఒక్కరే కావడం విశేషం. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ (నేడు తుర్లపాటి కుటుంబరావు జయంతి) -
Turlapati Kutumba Rao: ప్రెస్ – పిక్చర్ – ప్లాట్‌ఫాం!
కలంతో, గళంతో సాహిత్య–సాంస్కృతిక సాఫల్యం సాధించిన తెలుగు పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు. 4,000కు పైగా జీవిత చరిత్రలు, 16,000కు పైగా ప్రసంగాలు చేసి, ప్రపంచ రికార్డు సృష్టించిన తుర్లపాటి కీర్తికాయుడై నేటికి రెండు సంవత్సరాలు. ముక్కుసూటితనం, చొరవ మూర్తీభవించిన నిజాయితీతో తుర్లపాటి మొదటినుండీ ప్రత్యేకమైన, ప్రతిష్ఠాత్మకమైన సందర్భాలను సొంతం చేసు కున్నారు. స్వరాజ్యనిధికి 5 రూపాయలు ఇస్తేగానీ ఆటోగ్రాఫ్ ఇవ్వని మహాత్మాగాంధీ వద్ద నుండి ఉచితంగా ఆటోగ్రాఫ్ పొందారు. తన 19వ ఏటనే టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద కార్యదర్శిగా చేరారు. నార్ల వెంకటేశ్వరరావుకు ఏకలవ్వ శిష్యునిగా తనను భావించుకునేవారు. పత్రికా రంగంలో ఆచార్య ఎన్జీ రంగా ప్రారంభించిన ‘వాహిని’తో మొదలై, ‘ప్రతిభ’ పత్రికకు మారి, తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు కోరిక మేరకు ‘ప్రజా పత్రిక’కు తన సేవలందించారు. తదనంతరం ‘ఆంధ్రజ్యోతి’, ‘జ్యోతి చిత్ర’ పత్రికలలో పనిచేస్తూ, అలా 70 సంవత్సరాలకుపైగా వివిధ స్థాయిలలో విలువైన సేవలందించిన అతి కొద్దిమంది పాత్రికేయులలో ప్రముఖమైన స్థానం సంపాయించారు. తెలుగు పత్రికా రంగంలో కళా ప్రపూర్ణ, పద్మశ్రీలను అందుకున్న ఏకైక వ్యక్తి తుర్లపాటి. ఆయనపై బీబీసీ వారు, జపాన్ మీడియా వారు తీసిన ప్రామాణికమైన డాక్యుమెంటరీలు ఆయన ప్రతిభను తేటతెల్లం చేశాయి. ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యునిగా సేవలందించారు. పలు సభలలో జాతీయ స్థాయి నాయకుల, ప్రభుత్వాధినేతల అన్య భాషా ప్రసం గాలకు దీటైన అనువాదకులుగా అందరినీ మెప్పించారు. దశాబ్దాల క్రితమే ఇప్పుడున్నంత సమాచార వ్యవస్థ లేని కాలంలోనే ‘వార్తలలోని వ్యక్తి’ అనే శీర్షికతో దాదాపు 50 సంవత్సరాల పాటు ప్రముఖుల జీవిత రేఖా చిత్రాలు అందించారు. ఆ వివరాలను ఎక్కడెక్కడి నుండి ఆయన సేకరించారో అనే ఆశ్చర్యం చదువరుల వంతయ్యేది. బహుశా 5 దశాబ్దాల పాటు పత్రికలలో కొనసాగిన అరుదైన ఘనత శీర్షికా రచయితగా తుర్లపాటిది. ఆయన ఇతర రచనలు క్లుప్తతనూ, సరళతనూ నింపుకున్న సమాచార సముద్రాలు. 18 మంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ఆయనకు గాఢమైన సత్సంబంధాలు ఉండేవి. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తుర్లపాటి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన చేతుల మీదుగా సత్కారాలు పొందిన కళాకారులు అందరూ ‘గజా రోహణం – గండపెండేరాలు’ పొందినంత సంబరపడి పోయేవారు. ఆయన ద్వారా ‘నటసామ్రాట్’ అన్న బిరుదు పొందిన అక్కినేని కూడా, తాను పొందిన ఎన్నెన్నో బిరుదులన్నింటికన్నా ఆ బిరుదే అత్యంత ఇష్టమైనదని చెప్పేవారు. (క్లిక్ చేయండి: ఆయన జయంతి, వర్ధంతి.. ఒకేరోజు) ‘మనసున మల్లెల మాలలూగెనే – కన్నుల వెన్నెల డోలలూగెనే’ తుర్లపాటికి ప్రాణప్రదమైన పాట. ఎప్పుడూ ఆ పాటను ఎంతో ఆర్తితో పాడించుకునేవారు. తల్లి – బంధువులు మందలించినప్పటికీ, ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణకుమారిని ‘ఏమండీ’ అని సంబోధించే అలవాటు, ఆయనకు మహిళల పట్ల ఉన్న నిజమైన గౌరవానికి సూచిక. ఆమె పట్ల ప్రేమ–గౌరవాలతో ఆయన స్థాపించిన సాంస్కృతిక సంస్థ ‘కృష్ణ కళాభారతి’. పలు సంస్థలవారు చేసే కార్యక్రమాలలో తమ సహ నిర్వహణ సంస్థగా ఈనాటికీ అభిమానంగా పేరు వేస్తూ తమ నివాళి అర్పిస్తున్నారు. తన 87 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో భార్య, కుమార్తెలను పోగొట్టుకున్నా, తనకి కేన్సర్ వ్యాధి వచ్చినా, స్థిత ప్రజ్ఞతతో, దృఢసంకల్పంతో కష్టాలను, అనారోగ్యాన్ని జయించిన విజేత తుర్లపాటి. – గోళ్ల నారాయణరావు, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జి.ఆర్.కె.– పోలవరపు సాంస్కృతిక సమితి (జనవరి 11 తుర్లపాటి కుటుంబరావు వర్ధంతి) -
అజాత శత్రువు... అరుదైన జర్నలిస్టు
ప్రముఖ జర్నలిస్ట్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు 1933 ఆగస్టు 10న తుర్లపాటి సుందర రామారావు, శేషమాంబ దంపతులకు విజయవాడలో జన్మించారు. హైస్కూల్ విద్యాభ్యాసం గన్నవరంలో, ఆ తరువాత విజయవాడలో కొనసాగించారు. 1946లో 14వ ఏట జర్నలిజంలోకి ప్రవేశించారు. 1951లో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ‘ప్రజా పత్రిక’ దినపత్రికలో చేరి కొంత కాలం ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. ప్రముఖ కూచిపూడి నర్తకి కృష్ణ కుమారిని ప్రేమించి 1959లో వివాహమాడారు. వీరి పిల్లలు ప్రేమజ్యోతి, జవహర్లాల్ నెహ్రూ. నార్ల వెంకటేశ్వరరావుకి ఏకలవ్య శిష్యునిగా ఒక దినపత్రికలో 1959లో సహాయ సంపాదకుడిగా ఉద్యోగంలో చేరారు. ‘వార్తల్లోని వ్యక్తి’ అనే శీర్షికను వివిధ దినపత్రికల్లో మొత్తం 50 ఏళ్లపాటు కొనసాగించారు. ‘ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్’ను స్థాపించి రాష్ట్రంలోని 42 బ్రాంచిలతో ప్రతిఏటా ఉత్తమ నటుడు, నటీమణులు, ఇతరులకు అవార్డులిచ్చి సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ‘నంది’ అవార్డులు ప్రవేశ పెట్టడానికి కారణం వీరే. నేషనల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా, నంది అవార్డ్స్ కమిటీ సభ్యుడిగా, నేషనల్ ఫిల్మ్ సలహాదారుగా, కేంద్ర సాహిత్య అకాడమీ మెంబర్‌గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్‌గా, వివిధ హోదాలలో తుర్లపాటి పనిచేసారు. ‘మహా నాయకులు’, ‘జాతి నిర్మాతలు’, ‘1857 విప్లవ వీరులు’, ‘నా కలం, గళం’ లాంటి గొప్ప పుస్తకాలను రాసి స్ఫూర్తినిచ్చారు. గాంధీజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, స్వాతంత్య్ర సమరయోధులు ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్, తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటి ప్రధాని నరేంద్రమోదీ, మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకు ఎప్పటికప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిన నేర్పరి తుర్లపాటి. ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, జగ్జీవన్ రాం లాంటి ఉద్దండుల ఇంగ్లిష్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువాదించేవారు. ఇప్పటివరకు దాదాపు 18,000 ఉపన్యాసాలు ఇచ్చి గిన్నీస్ బుక్ వారి ప్రత్యేక ప్రశంస పొందిన ఘనాపాటి తుర్లపాటి. సభాధ్యక్షుడిగా సభలను నడిపించటంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనకు ‘ఉపన్యాస కేసరి’ ‘దశ సహస్ర సభా కేసరి’ అనే బిరుదులతో పాటు, ఏయూ వారి ‘కళా ప్రపూర్ణ‘, తొలి తెలుగు ప్రధాని పి.వి.నరసింహారావు చేతుల మీదుగా ‘నేషనల్ సిటిజన్స్’ అవార్డ్, ముట్నూరి కృష్ణారావు ఉత్తమ జర్నలిస్ట్ లాంటి ఎన్నో అవార్డులు సాధించారు. తెలుగు భాషకు అధికార హోదా రావడానికి అనితర సాధ్యమైన ప్రయత్నం చేశారు తుర్లపాటి. 2002లో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అందుకున్న ఏకైక తెలుగు జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు పనిచేసిన 18 మంది ముఖ్యమంత్రులతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి 75 ఏళ్ల చరిత్రకు సజీవ ‘సాక్షి’గా నిలిచిన గొప్ప వ్యక్తి తుర్లపాటి. ఏ రోజు కూడా ఆయన వారి వద్ద ఏమీ ఆశించకుండా నీతి, నిజాయితీగా ఉంటూ చివరకు కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా వెళ్లిపోయారు. 1978,1980లో ఆయనను ఎమ్మెల్సీ చేయాలని అప్పటి సీఎం ప్రయత్నించినా అది తృటిలో తప్పిపోయింది. 2007లో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆయనను గవర్నర్ నామినేషన్ ద్వారా ఎమ్మెల్సీని చేయాలని మరోసారి ప్రయత్నం చేసినా అదికూడా అనివార్య కారణాల వల్ల తప్పిపోయింది. వైఎస్సార్ మీద 64 వ్యాసాలు, ఎన్నో పుస్తకాలు రాశారు. జర్నలిజంలో 75 ఏళ్ల అనుభవం ఉండి, అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగిన అజాతశత్రువు తుర్లపాటి. తెలుగు జర్నలిజంలో మకుటం లేని మహారాజుగా నీతి నిజాయితీలతో, అత్యున్నత విలువలతో తన వద్దకు సహాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదరించి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారు. విజయవాడను, ఆంధ్రప్రదేశ్‌ను ఎన్నెన్నో అవార్డులు, రివార్డుల ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లి ఇంతమంది ప్రేమాభిమానాలు పొంది తన జన్మసార్థకం చేసుకున్న ధన్యజీవి తుర్లపాటి 89 ఏళ్ల వయస్సులో కాలం చేశారు. తుర్లపాటి జీవితం భావితరాలందరికీ ఆదర్శం, అనుసరణీయం. - తుర్లపాటి కృష్ణ కుమార్ వ్యాసకర్త తుర్లపాటి కుటుంబరావు మనవడు -
మూగబోయిన గళం.. ఆగిపోయిన కలం
విజయవాడ కల్చరల్: ఆ గళం మూగబోయింది.. ఆ కలం ఆగిపోయింది.. ఏడు దశాబ్దాల సుదీర్ఘ పాత్రికేయ ప్రస్థానం ముగిసి పోయింది.. విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు, కాలమిస్ట్, గ్రంథ రచయిత పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతి పాత్రికేయులతో పాటు, సాహితీ ప్రియుల్లో విషాదం నింపింది. నిన్నటి వరకూ సన్నిహితులతో సరదాగా మాట్లాడిన ఆయన ఆకస్మిక మరణాన్ని పాత్రికేయులు, సాహితీ ప్రియులు నమ్మలేకున్నారు. విజయవాడ నగరంలోని స్వర్గపురిలో సోమవారం సాయంత్రం తుర్లపాటికి ప్రముఖులు, సాహితీవేత్తలు, జర్నలిస్టుల అశృనయనాల మధ్య అంత్య క్రియలు జరిగాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణా జిల్లా పామర్రులో 1933 ఆగస్టు 10న తుర్లపాటి జన్మించారు. పత్రికా రంగంలో ఆయన ప్రస్థానం 1946లో తన 14వ ఏట ప్రారంభమైంది. పాత్రికేయునిగా ప్ర«ధాన మంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు వంటి ప్రముఖులతో ఆయనకు అనుబంధం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను సైతం తుర్లపాటి ఇంటర్వ్యూ చేశారు. దేశ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పి.వి.నరసింహారావుతో ఆయనుకు పరిచయాలున్నాయి. రాష్ట్రంలో రాజీవ్‌గాంధీ ప్రసంగాలకు తుర్లపాటి అనువాదకుడిగా వ్యవహరించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. అంతేకాదు రాష్ట్రపతులుగా సేవలందించిన వి.వి.గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలామ్లతో ఆయనకు పరిచయం ఉంది. సినిమా రంగంలో ప్రత్యేక ముద్ర తుర్లపాటి కుటుంబరావు జ్యోతిచిత్ర ఎడిటర్‌గా ఉన్నప్పుడు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తమ ఇంటర్వ్యూల కోసం తుర్లపాటి వద్ద సినీనటులు పడిగాపులు పడేవారని చెబుతారు. సినిమాల రిలీజ్ సమయంలో తమ సినిమా గురించి వ్యాసం రాయండంటూ నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు ఆయన వద్దకు క్యూ కట్టేవారు. అదే సమయంలో ముంబైలో జరిగే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల తరహాలో తెలుగు సినిమా పరిశ్రమలో అవార్డులు ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఫిల్మ్‌ఫేమ్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి, మంచి చిత్రాలకు అవార్డులను అందజేసేవారు. కాల క్రమేణా ప్రభుత్వం నంది అవార్డులను ప్రవేశ పెట్టడంతో అవి నిలిచిపోయాయి. 6 వేలకు పైగా జీవిత చరిత్రల వ్యాసాలు పాత్రికేయ కురువృద్ధునిగా పిలుచుకునే తుర్లపాటి వార్తల్లోని వ్యక్తిగత శీర్షిక ద్వారా ఆరు వేలకు పైగా జీవిత చరిత్రలను పరిచయం చేశారు. ఇలా దేశ ప్రధానులు, రాష్ట్రపతులు, ప్రముఖుల గురించి వ్యాసాలు రాశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాల గురించి బుక్లెట్లను ప్రచురించారు. అవార్డులు.. రివార్డులెన్నో.. ఉపన్యాస కేసరి, దశ సహస్ర సభాకేసరి, ముట్నూరి కృష్ణారావు పాత్రికేయ పురస్కారం (1989), ఉత్తమ జీవిత చరిత్ర రచయిత పురస్కారం, (తెలుగు విశ్వవిద్యాలయం 1990), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2002లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అత్యధిక సభల్లో పాల్గొన్నందుకు 1993లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందారు. సభ ఏదైనా అధ్యక్ష స్థానం ఆయనదే.. విజయవాడ నగరంలో జరిగే సాహిత్య, రాజకీయ సభ ఏదైనా అధ్యక్ష స్థానంలో మాత్రం తుర్లపాటి ఉండేవారు. ఆ సభ నిర్వహించే అంశాలపై ఆయన అనర్గళంగా మాట్లాడేవారు. అంశం ఏదైనా, సందర్భోచితంగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకునే వారు. ఎన్నో విశేషాలను వివరిస్తూ, ఆ సభపై తనదైన ముద్ర వేసేవారు. ప్రకాశం పంతులు గారు రూ.5 బాకీ.. ప్రకాశం పంతులుకు కార్యదర్శిగా పనిచేసే సమయంలో ఏదో సందర్భంలో ఆయనకు తుర్లపాటి రూ.5 ఇచ్చారట. తరువాత మరో సందర్భంగా ప్రకాశం ఎదురుపడ్డప్పుడు నాకు మీరు రూ.5 బాకీ. అవి ఎప్పుడిస్తారు? అని సరదాగా అడిగేవారని సన్నిహితులతో చెప్పేవారు. అక్కినేని నాగేశ్వరరావుకు నటసామ్రాట్ బిరుదు ప్రదానం చేసింది తుర్లపాటే. అక్కినేని నటజీవన ప్రస్థానంలో అత్యంత విలువైన బిరుదు నటసామ్రాట్‌ను తుర్లపాటి ప్రేరణతో విజయవాడలోనే ప్రదానం చేశారు. ఎన్టీఆర్ నటుడు కాదు.. గుంటూరులో ఎన్టీఆర్ నటించిన సినిమా శతదినోత్సవ సభలో ఆయన వేదిక మీదకు రాలేదు. తుర్లపాటి మాట్లాడుతూ ఎన్టీఆర్ నటుడు కాదు అని కొద్ది సమయం గ్యాప్ ఇచ్చారట. దీంతో జనం తుర్లపాటి మీదకు దాడికి వచ్చారట. అప్పుడు రామారావు నటుడు కాదు.. మహానటుడు అనడంతో ఆయన అభిమానులు కేరింతలు కొట్టారని తుర్లపాటి తన జీవిత చరిత్ర పుస్తకంలో రాసుకున్నారు. ఆంజనేయ స్వామి భక్తుడు తుర్లపాటి ఆంజనేయ స్వామి భక్తుడు. లబ్బీపేట సాయిబాబా ఆలయానికి ట్రస్ట్ బోర్డ్ సభ్యుడుగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జర్నలిస్ట్ సంఘాలతో సన్నిహిత సంబంధాలుండేవి. ఆయన సలహాలు, సూచనలతోనే సంఘాలు నడిచేవి. రచయితల సంఘం సంతాపం కుటుంబరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య,చలపాక ప్రకాష్, నవ్యాంధ్ర రచయితల సంఘం కార్యదర్శి కలిమిశ్రీ, కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి జీవీ పూర్ణచంద్ సంతాపం వ్యక్తం చేశారు ప్రముఖుల సంతాపం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థనరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తదితరులు తుర్లపాటి పార్ధివ దేహాన్ని సందర్శించారు. వివిధ కళాసంస్థలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. -
సీనియర్ జర్నలిస్టు ‘తుర్లపాటి’ కన్నుమూత
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి, అమరావతి : సీనియర్ పాత్రికేయులు, రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కుటుంబరావు కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే తుదిశ్వాస వదిలారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. 1933 ఆగస్టు 10న కృష్ణాజిల్లాలో జన్మించిన ఆయన, 14 ఏళ్ల వయస్సులో జర్నలిజంలోకి అడుగుపెట్టారు. ఏడు దశాబ్దాలపాటు ఆయన పాత్రికేయునిగా, రచయితగా వివిధ హోదాల్లో పనిచేశారు. విలువలకు పెద్దపీట పాత్రికేయునిగా ‘తుర్లపాటి’ విలువలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని, నేటి తరానికి ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని పలువురు స్మరించుకుంటున్నారు. రాష్ట్రంలోనే పద్మశ్రీ అవార్డు పొందిన తొలి జర్నలిస్టు ఆయనే కావడం విశేషం. తెలుగు జర్నలిజం, సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని కృషితో అనేక అవార్డులు అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ప్రముఖులు రాజాజీ, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, వీవీ గిరి, పీవీ నరసింహారావు వంటి వారితో తుర్లపాటికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. జర్నలిస్టుగా ఆయన ప్రస్థానం వివిధ హోదాల్లో 33 ఏళ్లపాటు ఆంధ్రజ్యోతి పత్రికలోనే కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన రచనలు జాతక కథలు (1958), జాతి నిర్మాతలు (1968), మహానాయకులు (1971), 1857 విప్లవ వీరులు, 18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు, నా కలం–నా గళం వంటివి ప్రజాదరణ పొందాయి. గిన్నిస్ రికార్డుల్లో చోటు ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడగలిగే తుర్లపాటి కుటుంబరావు.. 20 వేలకు పైచిలుకు సభల్లో పాల్గొన్నారు. అంతేకాక.. వేలాది సభలకు అధ్యక్షత వహించి 1993లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో స్థానం పొందారు. తానా ఆహ్వానం మేరకు 1985 లాస్ ఏంజెల్స్‌లో జరిగిన తెలుగు సభల్లో ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ సంతాపం తుర్లపాటి మృతిపట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు వేలకు పైగా జీవిత చరిత్రలు రాయటమే కాక, వేలాది ప్రసంగాలతో గిన్నీస్ రికార్డుల్లో స్థానం పొందారని కొనియాడారు. కుటుంబరావు ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశీలి తుర్లపాటి : సీఎం జగన్ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, రచయిత, గొప్ప వక్త తుర్లపాటి కుటుంబరావు మృతిపట్ల సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గొప్ప రచయిత, మంచి వక్త, బహుముఖ ప్రజ్ఞాశీలి అని తుర్లపాటిని ముఖ్యమంత్రి కొనియడారు. ఆయన అనేక అవార్డులు గెలుచుకున్నారని.. తెలుగు సాహిత్యం, జర్నలిజానికి ఆయన చేసిన కృషి చాలా గొప్పదని సీఎం తెలిపారు. అలాగే, మంత్రి పేర్ని నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు జర్నలిస్టులు కూడా తుర్లపాటి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తుర్లపాటి కుటుంబరావు భార్య కృష్ణకుమారి 1969లోనే మృతిచెందారు. ఆయన తనయుడు టీవీఎస్ జవహర్లాల్ విజయవాడలోనే క్రెడాయ్ సంస్థలో సీఈవోగా పనిచేస్తున్నారు. కుమార్తె ప్రేమజ్యోతి పదేళ్ల కిందట మృతిచెందారు. -
తుర్లపాటి మృతికి సీఎం జగన్ సంతాపం
సాక్షి, విజయవాడ: సీనియర్ జర్నలిస్ట్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. కుటుంబరావు కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తుర్లపాటి కుటుంబరావు(89) గత రాత్రి కన్నుమూశారు. గుండెపోటుకు గురికావడంతో వెంటనే విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టంగుటూరి ప్రకాశం దగ్గర కార్యదర్శిగా తుర్లపాటి పనిచేశారు. ఆయన మృతి పట్ల ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. -
తుర్లపాటికి రావూరి భరద్వాజ స్మారక పురస్కారం
సాక్షి, విజయవాడ : సీనియర్ పాత్రికేయుడు, కాలమిస్ట్ నగరానికి చెందిన తుర్లపాటి కుటుంబరావును 2019 సంవత్సరానికి గానూ డాక్టర్ రావూరి భరద్వాజ స్మారక పురస్కారానికి ఎంపిక చేసినట్లు ట్రస్ట్ చైర్మన్ రావూరి వెంకట కోటేశ్వరరావు, రావూరి సాయిసుమంత్ మంగళవారం సాక్షికి వివరించారు. రావూరి కాంతమ్మ సంగీత సేవా పురస్కారానికి గుంటూరుకు చెందిన రామరాజు లక్ష్మీ శ్రీనివాస్‌కు ప్రదానం చేస్తునట్లు తెలిపారు. రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతీ ఏటా రావూరి భరద్వాజ, కాంతమ్మ పురస్కారాలను అందిస్తున్నట్లు తెలిపారు. 5వ తేదీ సాయంత్రం మెగల్రాజపురంలోని ది కల్చరల్ సెంటర్ ఆఫ్ అమరావ తి విజయవాడలో పురస్కార వీటిని అందచేస్తామని, కార్యక్రమానికి పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, చారిత్రక పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిలు పాల్గొంటారని వివరించారు. -
దెబ్బకు భూతం వదిలిస్తా!
అది రాజమండ్రి పట్టణం. దీర్ఘవ్యాధితో బాధ పడుతున్న ఒక వ్యక్తికి జబ్బు కుదుర్చుతానని ఒక భూతవైద్యుడు నెల రోజులుగా ‘‘హ్రాం, హ్రీం’’ అంటూ మంత్రాలు చదువుతున్నాడు. మంత్రాలెన్ని చదివినా, జబ్బు మాత్రం కుదరలేదు కాని, నెల రోజులయ్యాక ఆ భూతవైద్యుడు తన ముడుపు మాత్రం తనకు ముట్టవలసిందేనని హూంకరిస్తున్నాడు. పేదవారైన ఆ ఇంటివారు అటు జబ్బూ కుదరక, ఇటు డబ్బూ పోతున్నదని బాధపడుతున్నారు.ఇంతలో ప్రక్క ఇంటివారి బక్క పలుచటి అబ్బాయి వచ్చి, సంగతి తెలుసుకుని, ‘‘డబ్బు యివ్వరు. దిక్కున్నచోట చెప్పుకో’’మని భూతవైద్యునితో బూకరించాడు. ‘‘నిన్ను చేతబడి చేసి, చంపివేస్తా’’నని భూతవైద్యుడు బెదిరించాడు.‘‘నీకంటే నాకు పెద్ద మంత్రాలే వచ్చు. మళ్లీ మాట్లాడావంటే నా ‘శరభసాళ్వ మంత్రం’ చదివి, నిన్ను ఇక్కడే నెత్తురు కక్కిస్తా’ ననేసరికి ఆ మంత్రం పేరే ఎన్నడూ వినని ఆ భూతవైద్యుడు మంత్ర పఠనం మాని పలాయన మంత్రం పఠించాడు. దానికి మించిన మంత్రం మరి లేదుగదా! ఆ యువకుడే ఆంధ్ర సాహిత్య, సాంఘిక రంగాలలో నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు. (సౌజన్యం: తుర్లపాటి కుటుంబరావు) -
ఘనంగా స్కోర్‌మోర్ అవార్డుల ప్రదానం
విజయవాడ కల్చరల్: భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రతీక స్కోర్ మోర్ ఫౌండేషన్ అని సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు అభినందించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోటల్ ఐలాపురంలో విద్యాశిరోమణి పురస్కారాల సభ ఆదివారం జరిగింది. సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ తుర్లపాటి పట్టాభిరాం మాట్లాడుతూ ప్రతిభ పెద్దపీట వేస్తామన్నారు. జర్నలిస్ట్ సంఘం నేత అంబటి ఆంజనేయులు, ప్రవాసాంధ్ర నాట్య కళాకారిణి డాక్టర్ సుధ, రవి పబ్లిషర్స్ అధినేత అంజనేయరావు ప్రసంగించారు, ప్రత్యేక పురస్కారం డాక్టర్ దార్లనాగేశ్వరరావు, ఉత్తమ పబ్లిషర్ పురస్కారం రవి పబ్లిషర్స్ అధినేత ఎం.ఆంజనేయరావుకు, డాక్టర్ క్రోవి పార్థసారధిలకు విశిష్టవిద్యాశిరోమణి పురస్కారాల్ని బహూకరించారు. వీరికే పురస్కారాలు విద్యాశిరోమణి పురస్కారాలను ఎల్ఆర్. వెంకటరమణ, కె. కృష్ణసాయిబాబు, కండల చందన, ప్రొ. నాదెండ్ల రామారావు, వై.సత్యనారాయణ మూర్తి, కెవీ. నారాయణరావు, కాసుల పద్మావతి, గంగరాజు చిట్టి, జీ,ఆంజనేయ శాస్త్రి, భాస్కరరాజు, సుంకర శ్రీనివాస రావు.బీ రాజేశ్వరరావు, దేవరపల్లి బెనర్జీ, అబిన్ అలెక్స్. డాక్టర్ రమణ గంగిరెడ్డి, సుధా స్రవంతి, డాక్టర్ సుమితా బోస్‌లకు అందజేశారు, ప్రతిభా పురస్కారాలను డాక్టర్ సుధ (అమెరికా), ఘట్టం వెంకటేష్‌లకు అందజేశారు. -
చరిత్ర తిరగరాసిన ‘సామాన్యుడు’
సందర్భం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ సృష్టించిన ప్రళయం అపూర్వమని చెప్పాలి. అయితే, కేజ్రీవాల్ నిజాయితీకి మారుపేరయినా, ఆయన మంత్రివర్గ సహచరులందరూ తనలా కలకాలం నీతిమంతులుగా ఉండగలరని చెప్పలేము. ఆయన రాజకీయ నాయకు డు కాడు. రాజకీయ కుటుం బంలో జన్మించిన వాడూ కా డు. అయినా, ఇప్పుడు భార తదేశంలో ‘కేజ్రీవాల్’ అంటే ఎంత మోజు! ఎంత క్రేజు! మరీ, మొన్న దేశ రాజధాని ఢిల్లీలో ఆయన పార్టీ ఆమ్ ఆద్మీ (సగటు మనిషి) పాగా వేయడంతో ఆయన పేరు ప్రపంచ పరివ్యాప్తమైంది. ఆ పార్టీ ఆవిర్భవించి కిందటి నవంబర్ నెలకు రెండేళ్లు. పుట్టిన ఏడాదికే ఆయన పేరు, ఆ పార్టీ పేరు ప్రజల నాల్కలపై ఆడసాగాయి. ఒకప్పుడు పేరు ఉచ్చారణే తికమకగా ఉండేది! పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చి నవారు లేకపోలేదు. కానీ, ఆ ఎన్టీఆర్ ఎక్కడ? ఈ కేజ్రీ వాల్ ఎక్కడ? ఆయన సినీ గ్లామర్ అనితర సాధ్యం, ఈయనో.. గ్లామర్‌కు ఆమడ దూరం. అసలు గ్లామర్ ఉంటే కదా! ఔను! ఇన్‌కమ్‌టాక్స్ జాయింట్ కమిషనర్ గా ఉన్నవాడికి గ్లామర్ ఎక్కడినుంచివస్తుంది? కాగా అవినీతి ఇప్పుడు కొత్తగా రాలేదు. అది అనాదిగా మనిషి రక్తంలో ఎంతోకొంత స్థాయిలో పుట్టుకతోనే ఉంటూ వచ్చింది. అసలు అవినీతి అంటే ఏమిటి? నీతి కానిదం తా అవినీతి కాదా? మన రామాయణ, మహాభారతా లనే తీసుకోండి. పరదారాపహరణం- రావణుని చర్య- అవినీతి కాదా? మహాభారతం మాత్రం? నిండు పేరోల గంలో వదిన వరుస ద్రౌపది వలువలూడ్చాలని ప్రయ త్నించడం దుర్యోధనుని అవినీతికి పరాకాష్ట కాదా? ప్రస్తుత కాలానికి వస్తే, తాను ఒక పార్టీకి చెందిన వాడినని నమ్మించి, ప్రజల ఓట్లను వేయించుకుని, ఎన్ని కైన తరువాత డబ్బుకోసమో, పదవి కోసమో మరో పార్టీలోకి దూకడం నమ్మకద్రోహమనే అవినీతి కాదా? లంచం ఇస్తే కానీ ప్రభుత్వ అధికారి పెన్షన్ ఇవ్వడా? అధికారి చెయ్యి తడిపితే కానీ కాగితం కదలదా? అవినీతి, అన్యాయం, అక్రమం, బడుగు జీవుల నిరాదరణ - భారతదేశంలో వీరవిహారం చేస్తున్నాయి. ఈ అవినీతికి సగటు మానవుడు బలిపశువు అయిపోతు న్నాడు! అందువల్లనే, ముంబైలో ఒక ఖైర్నార్ (మునిసి పల్ కమిషనర్), ఢిల్లీలో అన్నా హజారే, బాబా రామ్ దేవ్ వంటివారు ఎందరో అవినీతి నిర్మూలనోద్యమానికి నడుంకట్టారు. వారిసహ ప్రయాణికుడే కేజ్రీవాల్ కూడా. అయితే, అవినీతి నిర్మూలనకు నిరాహారదీక్షలు, ప్రచారోద్యమాల వల్ల ప్రయోజనం లేదని, అవినీతికి పుట్టిల్లు రాజకీయరంగమేనని నమ్మిన కేజ్రీవాల్ రాజ కీయ రంగంనుంచే అవినీతి నిర్మూలన ప్రారంభం కావా లని ఆమ్ఆద్మీ పార్టీని స్థాపించాడు. ఈక్రమంలో ఆయ న మార్గనిర్దేశకుడు హజారేకు దూరమైనాడు కూడా. 128 సంవత్సరాల మహా చరిత్ర సృష్టించిన కాం గ్రెస్ ఎక్కడ? ఎక్కడి భారతీయ జనతాపార్టీ? ఆ కాం గ్రెస్‌ను మొన్నటి ఢిల్లీ ఎన్నికలలో ఆమ్ఆద్మీ పార్టీ నామ రూపాలు లేకుండా చేసింది! కిందటి సంవత్సరం జరి గిన లోక్‌సభ ఎన్నికలలో అఖండ విజయం సాధించి, ఆ తరువాత జరిగిన అసెంబ్లీల ఎన్నికలలో కూడా జైత్ర యాత్ర చేస్తున్న బీజేపీకి మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని కలలో బ్రేక్ పడ్డమేకాక కేవలం మూడంటే మూడు స్థా నాలు రావడం దేశానికే కాదు, ఆ పార్టీకి దిగ్భ్రాంతి కలి గించింది. ఇది కేజ్రీవాల్ సృష్టించిన ఎన్నికల సునామీ! భారతదేశంలో మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఆమ్ఆద్మీ ప్రళయం లాంటిది ఏ పెద్ద రాష్ట్రం లోనూ వచ్చినట్లు కనిపించదు. కాకపోతే, చిన్న రాష్ట్ర మైన సిక్కింలో నార్ బహదూర్ భండారీ కొత్తగా పెట్టిన సిక్కిం సంగ్రామ పరిషత్తు, ఆ తరువాత పవన్ కుమార్ చామ్లింగ్ ఆ అసెంబ్లీలోని 32 స్థానాలనూ కైవసం చేసు కున్న చరిత్ర ఉన్నా, ఢిల్లీ ఎక్కడ? సిక్కిం ఎక్కడ? దేశ రాజధానికి, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల కంటే చిన్నది సిక్కింకు పోలిక ఎక్కడ? అక్కడ క్షీణ దశలో ఉన్న కాంగ్రెస్‌ను ఓడించడం ఎవరికైనా నల్లేరుపైన నడకే! అయితే, కేజ్రీవాల్‌కు ఇకనుంచి మరో పరీక్ష ప్రారం భమౌతుంది. అధికారం అవినీతికి దారితీస్తుంది, అత్య ధిక అధికారం అతి అవినీతికి దారితీస్తుందన్న సూక్తి కేజ్రీ వాల్‌కు తెలిసే ఉండాలి. అధికారంలో ఉన్న వ్యాధే అది! అది నిజంగా అంటువ్యాధి. ఎంత నీతిపరుడినైనా అవి నీతిపరుడిగా మార్చివేస్తుంది. అవినీతి చేయకపోయినా ఆ ముద్రపడుతుంది. లేదా, అవినీతి అంటకడతారు. ఒకానొక దశలో భారత రాజకీయ రంగంలో ముగ్గు రు మిస్టర్ క్లీన్లు ఉండేవారు. రాజీవ్‌గాంధీ, డాక్టర్ మన్మోహన్సింగ్, మాజీ రక్షణ మంత్రి ఆంటోనీ. అయితే ఆ తరువాత రాజీవ్‌గాంధీపై బోఫోర్స్ మచ్చపడింది. మన్మోహన్ సింగ్ నీతిమంతుడైనా, ఆయన మంత్రివర్గం లోని కొందరి అవినీతి కుంభకోణాల ఛాయలు ఆయ నపై పడ్డాయి. ఇక మూడవ మిస్టర్ క్లీన్ ఆంటోనీపై కూడా రక్షణశాఖ ఆయుధాల కొనుగోలులో కొన్ని ఆరో పణలు వచ్చాయి. కేజ్రీవాల్ ఎంత నీతీనిజాయితీలకు మారుపేరైనా, ఆయన మంత్రివర్గంలోని మంత్రులం దరూ ఆయన అంతగా కలకాలం నీతిమంతులుగా ఉండగలరని చెప్పలేము. వారిపై ఏదో ఒకరూపంలో అవినీతి చినుకులు పడితే అవి కేజ్రీవాల్‌పై కూడా చిందే ప్రమాదం ఉంది! మరి, అధికారంలోనే అవినీతి ఉంది కదా! కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఒక్కరిపైన అవినీతి చిను కులు పడినా, అవి ఆయనను నమ్ముకున్న ఆమ్ ఆద్మీ లను హతాశుల్ని చేస్తాయి! అంతేకాదు. రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ తనను వెన్నుపోటు పొడిచిన తన పుత్ర సమానుడు బ్రూటస్ను ఉద్దేశించి, ‘‘నువ్వు కూడానా బ్రూటస్’’ అని నిర్ఘాంతపోయినట్లు, సామాన్యులు ‘‘నువ్వు కూడానా కేజ్రీవాల్’’ అని నిర్ఘాంతపోయే సన్నివేశం రాకుండా ఆయన తన ప్రభుత్వాన్ని వెయ్యి కళ్లతో కనిపెట్టి ఉండ టం అవసరం! కాగా, మొన్న డిల్లీ ఎన్నికలు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు సామాన్యుని హెచ్చరికగా కూ డా పరిగణించాలి. తాను తలుచుకుంటే, సామాన్యుడు అతి సామాన్యుని సయితం మహానాయకుని చేయగల డని దీన్ని బట్టి అర్థం కావడం లేదా? (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు)