వైఎస్ రాజశేఖరరెడ్డితో తుర్లపాటి కుటుంబరావు
ప్రముఖ జర్నలిస్ట్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు 1933 ఆగస్టు 10న తుర్లపాటి సుందర రామారావు, శేషమాంబ దంపతులకు విజయవాడలో జన్మించారు. హైస్కూల్ విద్యాభ్యాసం గన్నవరంలో, ఆ తరువాత విజయవాడలో కొనసాగించారు. 1946లో 14వ ఏట జర్నలిజంలోకి ప్రవేశించారు. 1951లో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ‘ప్రజా పత్రిక’ దినపత్రికలో చేరి కొంత కాలం ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. ప్రముఖ కూచిపూడి నర్తకి కృష్ణ కుమారిని ప్రేమించి 1959లో వివాహమాడారు. వీరి పిల్లలు ప్రేమజ్యోతి, జవహర్‌లాల్ నెహ్రూ. నార్ల వెంకటేశ్వరరావుకి ఏకలవ్య శిష్యునిగా ఒక దినపత్రికలో 1959లో సహాయ సంపాదకుడిగా ఉద్యోగంలో చేరారు. ‘వార్తల్లోని వ్యక్తి’ అనే శీర్షికను వివిధ దినపత్రికల్లో మొత్తం 50 ఏళ్లపాటు కొనసాగించారు.
‘ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్’ను స్థాపించి రాష్ట్రంలోని 42 బ్రాంచిలతో ప్రతిఏటా ఉత్తమ నటుడు, నటీమణులు, ఇతరులకు అవార్డులిచ్చి సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ‘నంది’ అవార్డులు ప్రవేశ పెట్టడానికి కారణం వీరే. నేషనల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా, నంది అవార్డ్స్ కమిటీ సభ్యుడిగా, నేషనల్ ఫిల్మ్ సలహాదారుగా, కేంద్ర సాహిత్య అకాడమీ మెంబర్‌గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్‌గా, వివిధ హోదాలలో తుర్లపాటి పనిచేసారు. ‘మహా నాయకులు’, ‘జాతి నిర్మాతలు’, ‘1857 విప్లవ వీరులు’, ‘నా కలం, గళం’ లాంటి గొప్ప పుస్తకాలను రాసి స్ఫూర్తినిచ్చారు.
గాంధీజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, స్వాతంత్య్ర సమరయోధులు ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్, తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ఇప్పటి ప్రధాని నరేంద్రమోదీ, మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకు ఎప్పటికప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిన నేర్పరి తుర్లపాటి. ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, జగ్జీవన్ రాం లాంటి ఉద్దండుల ఇంగ్లిష్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువాదించేవారు. ఇప్పటివరకు దాదాపు 18,000 ఉపన్యాసాలు ఇచ్చి గిన్నీస్ బుక్ వారి ప్రత్యేక ప్రశంస పొందిన ఘనాపాటి తుర్లపాటి. సభాధ్యక్షుడిగా సభలను నడిపించటంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనకు ‘ఉపన్యాస కేసరి’ ‘దశ సహస్ర సభా కేసరి’ అనే బిరుదులతో పాటు, ఏయూ వారి ‘కళా ప్రపూర్ణ‘, తొలి తెలుగు ప్రధాని పి.వి.నరసింహారావు చేతుల మీదుగా ‘నేషనల్ సిటిజన్స్’ అవార్డ్, ముట్నూరి కృష్ణారావు ఉత్తమ జర్నలిస్ట్ లాంటి ఎన్నో అవార్డులు సాధించారు.
తెలుగు భాషకు అధికార హోదా రావడానికి అనితర సాధ్యమైన ప్రయత్నం చేశారు తుర్లపాటి. 2002లో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అందుకున్న ఏకైక తెలుగు జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు పనిచేసిన 18 మంది ముఖ్యమంత్రులతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి 75 ఏళ్ల చరిత్రకు సజీవ ‘సాక్షి’గా నిలిచిన గొప్ప వ్యక్తి తుర్లపాటి. ఏ రోజు కూడా ఆయన వారి వద్ద ఏమీ ఆశించకుండా నీతి, నిజాయితీగా ఉంటూ చివరకు కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా వెళ్లిపోయారు. 1978,1980లో ఆయనను ఎమ్మెల్సీ చేయాలని అప్పటి సీఎం ప్రయత్నించినా అది తృటిలో తప్పిపోయింది. 2007లో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆయనను గవర్నర్ నామినేషన్ ద్వారా ఎమ్మెల్సీని చేయాలని మరోసారి ప్రయత్నం చేసినా అదికూడా అనివార్య కారణాల వల్ల తప్పిపోయింది. వైఎస్సార్ మీద 64 వ్యాసాలు, ఎన్నో పుస్తకాలు రాశారు.
జర్నలిజంలో 75 ఏళ్ల అనుభవం ఉండి, అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగిన అజాతశత్రువు తుర్లపాటి. తెలుగు జర్నలిజంలో మకుటం లేని మహారాజుగా నీతి నిజాయితీలతో, అత్యున్నత విలువలతో తన వద్దకు సహాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదరించి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారు. విజయవాడను, ఆంధ్రప్రదేశ్‌ను ఎన్నెన్నో అవార్డులు, రివార్డుల ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లి ఇంతమంది ప్రేమాభిమానాలు పొంది తన జన్మసార్థకం చేసుకున్న ధన్యజీవి తుర్లపాటి 89 ఏళ్ల వయస్సులో కాలం చేశారు. తుర్లపాటి జీవితం భావితరాలందరికీ ఆదర్శం, అనుసరణీయం.
- తుర్లపాటి కృష్ణ కుమార్
వ్యాసకర్త తుర్లపాటి కుటుంబరావు మనవడు
Comments
Please login to add a commentAdd a comment