కలంతో, గళంతో సాహిత్య–సాంస్కృతిక సాఫల్యం సాధించిన తెలుగు పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు. 4,000కు పైగా జీవిత చరిత్రలు, 16,000కు పైగా ప్రసంగాలు చేసి, ప్రపంచ రికార్డు సృష్టించిన తుర్లపాటి కీర్తికాయుడై నేటికి రెండు సంవత్సరాలు.
ముక్కుసూటితనం, చొరవ మూర్తీభవించిన నిజాయితీతో తుర్లపాటి మొదటినుండీ ప్రత్యేకమైన, ప్రతిష్ఠాత్మకమైన సందర్భాలను సొంతం చేసు కున్నారు. స్వరాజ్యనిధికి 5 రూపాయలు ఇస్తేగానీ ఆటోగ్రాఫ్ ఇవ్వని మహాత్మాగాంధీ వద్ద నుండి ఉచితంగా ఆటోగ్రాఫ్ పొందారు. తన 19వ ఏటనే టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద కార్యదర్శిగా చేరారు. నార్ల వెంకటేశ్వరరావుకు ఏకలవ్వ శిష్యునిగా తనను భావించుకునేవారు. పత్రికా రంగంలో ఆచార్య ఎన్జీ రంగా ప్రారంభించిన ‘వాహిని’తో మొదలై, ‘ప్రతిభ’ పత్రికకు మారి, తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు కోరిక మేరకు ‘ప్రజా పత్రిక’కు తన సేవలందించారు. తదనంతరం ‘ఆంధ్రజ్యోతి’, ‘జ్యోతి చిత్ర’ పత్రికలలో పనిచేస్తూ, అలా 70 సంవత్సరాలకుపైగా వివిధ స్థాయిలలో విలువైన సేవలందించిన అతి కొద్దిమంది పాత్రికేయులలో ప్రముఖమైన స్థానం సంపాయించారు.
తెలుగు పత్రికా రంగంలో కళా ప్రపూర్ణ, పద్మశ్రీలను అందుకున్న ఏకైక వ్యక్తి తుర్లపాటి. ఆయనపై బీబీసీ వారు, జపాన్ మీడియా వారు తీసిన ప్రామాణికమైన డాక్యుమెంటరీలు ఆయన ప్రతిభను తేటతెల్లం చేశాయి. ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యునిగా సేవలందించారు. పలు సభలలో జాతీయ స్థాయి నాయకుల, ప్రభుత్వాధినేతల అన్య భాషా ప్రసం గాలకు దీటైన అనువాదకులుగా అందరినీ మెప్పించారు. దశాబ్దాల క్రితమే ఇప్పుడున్నంత సమాచార వ్యవస్థ లేని కాలంలోనే ‘వార్తలలోని వ్యక్తి’ అనే శీర్షికతో దాదాపు 50 సంవత్సరాల పాటు ప్రముఖుల జీవిత రేఖా చిత్రాలు అందించారు. ఆ వివరాలను ఎక్కడెక్కడి నుండి ఆయన సేకరించారో అనే ఆశ్చర్యం చదువరుల వంతయ్యేది. బహుశా 5 దశాబ్దాల పాటు పత్రికలలో కొనసాగిన అరుదైన ఘనత శీర్షికా రచయితగా తుర్లపాటిది. ఆయన ఇతర రచనలు క్లుప్తతనూ, సరళతనూ నింపుకున్న సమాచార సముద్రాలు.
18 మంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ఆయనకు గాఢమైన సత్సంబంధాలు ఉండేవి. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తుర్లపాటి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన చేతుల మీదుగా సత్కారాలు పొందిన కళాకారులు అందరూ ‘గజా రోహణం – గండపెండేరాలు’ పొందినంత సంబరపడి పోయేవారు. ఆయన ద్వారా ‘నటసామ్రాట్’ అన్న బిరుదు పొందిన అక్కినేని కూడా, తాను పొందిన ఎన్నెన్నో బిరుదులన్నింటికన్నా ఆ బిరుదే అత్యంత ఇష్టమైనదని చెప్పేవారు. (క్లిక్ చేయండి: ఆయన జయంతి, వర్ధంతి.. ఒకేరోజు)
‘మనసున మల్లెల మాలలూగెనే – కన్నుల వెన్నెల డోలలూగెనే’ తుర్లపాటికి ప్రాణప్రదమైన పాట. ఎప్పుడూ ఆ పాటను ఎంతో ఆర్తితో పాడించుకునేవారు. తల్లి – బంధువులు మందలించినప్పటికీ, ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణకుమారిని ‘ఏమండీ’ అని సంబోధించే అలవాటు, ఆయనకు మహిళల పట్ల ఉన్న నిజమైన గౌరవానికి సూచిక. ఆమె పట్ల ప్రేమ–గౌరవాలతో ఆయన స్థాపించిన సాంస్కృతిక సంస్థ ‘కృష్ణ కళాభారతి’. పలు సంస్థలవారు చేసే కార్యక్రమాలలో తమ సహ నిర్వహణ సంస్థగా ఈనాటికీ అభిమానంగా పేరు వేస్తూ తమ నివాళి అర్పిస్తున్నారు. తన 87 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో భార్య, కుమార్తెలను పోగొట్టుకున్నా, తనకి కేన్సర్ వ్యాధి వచ్చినా, స్థిత ప్రజ్ఞతతో, దృఢసంకల్పంతో కష్టాలను, అనారోగ్యాన్ని జయించిన విజేత తుర్లపాటి.
– గోళ్ల నారాయణరావు, ప్రధాన కార్యదర్శి
కామ్రేడ్ జి.ఆర్.కె.– పోలవరపు సాంస్కృతిక సమితి
(జనవరి 11 తుర్లపాటి కుటుంబరావు వర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment