అది రాజమండ్రి పట్టణం. దీర్ఘవ్యాధితో బాధ పడుతున్న ఒక వ్యక్తికి జబ్బు కుదుర్చుతానని ఒక భూతవైద్యుడు నెల రోజులుగా ‘‘హ్రాం, హ్రీం’’ అంటూ మంత్రాలు చదువుతున్నాడు. మంత్రాలెన్ని చదివినా, జబ్బు మాత్రం కుదరలేదు కాని, నెల రోజులయ్యాక ఆ భూతవైద్యుడు తన ముడుపు మాత్రం తనకు ముట్టవలసిందేనని హూంకరిస్తున్నాడు. పేదవారైన ఆ ఇంటివారు అటు జబ్బూ కుదరక, ఇటు డబ్బూ పోతున్నదని బాధపడుతున్నారు.ఇంతలో ప్రక్క ఇంటివారి బక్క పలుచటి అబ్బాయి వచ్చి, సంగతి తెలుసుకుని, ‘‘డబ్బు యివ్వరు.
దిక్కున్నచోట చెప్పుకో’’మని భూతవైద్యునితో బూకరించాడు. ‘‘నిన్ను చేతబడి చేసి, చంపివేస్తా’’నని భూతవైద్యుడు బెదిరించాడు.‘‘నీకంటే నాకు పెద్ద మంత్రాలే వచ్చు. మళ్లీ మాట్లాడావంటే నా ‘శరభసాళ్వ మంత్రం’ చదివి, నిన్ను ఇక్కడే నెత్తురు కక్కిస్తా’ ననేసరికి ఆ మంత్రం పేరే ఎన్నడూ వినని ఆ భూతవైద్యుడు మంత్ర పఠనం మాని పలాయన మంత్రం పఠించాడు. దానికి మించిన మంత్రం మరి లేదుగదా!
ఆ యువకుడే ఆంధ్ర సాహిత్య, సాంఘిక రంగాలలో నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు. (సౌజన్యం: తుర్లపాటి కుటుంబరావు)
Comments
Please login to add a commentAdd a comment