తుర్లపాటి కుటుంబరావు
సందర్భం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ సృష్టించిన ప్రళయం అపూర్వమని చెప్పాలి. అయితే, కేజ్రీవాల్ నిజాయితీకి మారుపేరయినా, ఆయన మంత్రివర్గ సహచరులందరూ తనలా కలకాలం నీతిమంతులుగా ఉండగలరని చెప్పలేము.
ఆయన రాజకీయ నాయకు డు కాడు. రాజకీయ కుటుం బంలో జన్మించిన వాడూ కా డు. అయినా, ఇప్పుడు భార తదేశంలో ‘కేజ్రీవాల్’ అంటే ఎంత మోజు! ఎంత క్రేజు! మరీ, మొన్న దేశ రాజధాని ఢిల్లీలో ఆయన పార్టీ ఆమ్ ఆద్మీ (సగటు మనిషి) పాగా వేయడంతో ఆయన పేరు ప్రపంచ పరివ్యాప్తమైంది. ఆ పార్టీ ఆవిర్భవించి కిందటి నవంబర్ నెలకు రెండేళ్లు. పుట్టిన ఏడాదికే ఆయన పేరు, ఆ పార్టీ పేరు ప్రజల నాల్కలపై ఆడసాగాయి. ఒకప్పుడు పేరు ఉచ్చారణే తికమకగా ఉండేది!
పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చి నవారు లేకపోలేదు. కానీ, ఆ ఎన్టీఆర్ ఎక్కడ? ఈ కేజ్రీ వాల్ ఎక్కడ? ఆయన సినీ గ్లామర్ అనితర సాధ్యం, ఈయనో.. గ్లామర్‌కు ఆమడ దూరం. అసలు గ్లామర్ ఉంటే కదా! ఔను! ఇన్‌కమ్‌టాక్స్ జాయింట్ కమిషనర్ గా ఉన్నవాడికి గ్లామర్ ఎక్కడినుంచివస్తుంది? కాగా అవినీతి ఇప్పుడు కొత్తగా రాలేదు. అది అనాదిగా మనిషి రక్తంలో ఎంతోకొంత స్థాయిలో పుట్టుకతోనే ఉంటూ వచ్చింది. అసలు అవినీతి అంటే ఏమిటి? నీతి కానిదం తా అవినీతి కాదా? మన రామాయణ, మహాభారతా లనే తీసుకోండి. పరదారాపహరణం- రావణుని చర్య- అవినీతి కాదా? మహాభారతం మాత్రం? నిండు పేరోల గంలో వదిన వరుస ద్రౌపది వలువలూడ్చాలని ప్రయ త్నించడం దుర్యోధనుని అవినీతికి పరాకాష్ట కాదా?
ప్రస్తుత కాలానికి వస్తే, తాను ఒక పార్టీకి చెందిన వాడినని నమ్మించి, ప్రజల ఓట్లను వేయించుకుని, ఎన్ని కైన తరువాత డబ్బుకోసమో, పదవి కోసమో మరో పార్టీలోకి దూకడం నమ్మకద్రోహమనే అవినీతి కాదా? లంచం ఇస్తే కానీ ప్రభుత్వ అధికారి పెన్షన్ ఇవ్వడా? అధికారి చెయ్యి తడిపితే కానీ కాగితం కదలదా?
అవినీతి, అన్యాయం, అక్రమం, బడుగు జీవుల నిరాదరణ - భారతదేశంలో వీరవిహారం చేస్తున్నాయి. ఈ అవినీతికి సగటు మానవుడు బలిపశువు అయిపోతు న్నాడు! అందువల్లనే, ముంబైలో ఒక ఖైర్నార్ (మునిసి పల్ కమిషనర్), ఢిల్లీలో అన్నా హజారే, బాబా రామ్ దేవ్ వంటివారు ఎందరో అవినీతి నిర్మూలనోద్యమానికి నడుంకట్టారు. వారిసహ ప్రయాణికుడే కేజ్రీవాల్ కూడా.
అయితే, అవినీతి నిర్మూలనకు నిరాహారదీక్షలు, ప్రచారోద్యమాల వల్ల ప్రయోజనం లేదని, అవినీతికి పుట్టిల్లు రాజకీయరంగమేనని నమ్మిన కేజ్రీవాల్ రాజ కీయ రంగంనుంచే అవినీతి నిర్మూలన ప్రారంభం కావా లని ఆమ్‌ఆద్మీ పార్టీని స్థాపించాడు. ఈక్రమంలో ఆయ న మార్గనిర్దేశకుడు హజారేకు దూరమైనాడు కూడా.
128 సంవత్సరాల మహా చరిత్ర సృష్టించిన కాం గ్రెస్ ఎక్కడ? ఎక్కడి భారతీయ జనతాపార్టీ? ఆ కాం గ్రెస్‌ను మొన్నటి ఢిల్లీ ఎన్నికలలో ఆమ్‌ఆద్మీ పార్టీ నామ రూపాలు లేకుండా చేసింది! కిందటి సంవత్సరం జరి గిన లోక్‌సభ ఎన్నికలలో అఖండ విజయం సాధించి, ఆ తరువాత జరిగిన అసెంబ్లీల ఎన్నికలలో కూడా జైత్ర యాత్ర చేస్తున్న బీజేపీకి మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని కలలో బ్రేక్ పడ్డమేకాక కేవలం మూడంటే మూడు స్థా నాలు రావడం దేశానికే కాదు, ఆ పార్టీకి దిగ్భ్రాంతి కలి గించింది. ఇది కేజ్రీవాల్ సృష్టించిన ఎన్నికల సునామీ!
భారతదేశంలో మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఆమ్‌ఆద్మీ ప్రళయం లాంటిది ఏ పెద్ద రాష్ట్రం లోనూ వచ్చినట్లు కనిపించదు. కాకపోతే, చిన్న రాష్ట్ర మైన సిక్కింలో నార్ బహదూర్ భండారీ కొత్తగా పెట్టిన సిక్కిం సంగ్రామ పరిషత్తు, ఆ తరువాత పవన్ కుమార్ చామ్లింగ్ ఆ అసెంబ్లీలోని 32 స్థానాలనూ కైవసం చేసు కున్న చరిత్ర ఉన్నా, ఢిల్లీ ఎక్కడ? సిక్కిం ఎక్కడ? దేశ రాజధానికి, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల కంటే చిన్నది సిక్కింకు పోలిక ఎక్కడ? అక్కడ క్షీణ దశలో ఉన్న కాంగ్రెస్‌ను ఓడించడం ఎవరికైనా నల్లేరుపైన నడకే! అయితే, కేజ్రీవాల్‌కు ఇకనుంచి మరో పరీక్ష ప్రారం భమౌతుంది. అధికారం అవినీతికి దారితీస్తుంది, అత్య ధిక అధికారం అతి అవినీతికి దారితీస్తుందన్న సూక్తి కేజ్రీ వాల్‌కు తెలిసే ఉండాలి. అధికారంలో ఉన్న వ్యాధే అది! అది నిజంగా అంటువ్యాధి. ఎంత నీతిపరుడినైనా అవి నీతిపరుడిగా మార్చివేస్తుంది. అవినీతి చేయకపోయినా ఆ ముద్రపడుతుంది. లేదా, అవినీతి అంటకడతారు.
ఒకానొక దశలో భారత రాజకీయ రంగంలో ముగ్గు రు మిస్టర్ క్లీన్‌లు ఉండేవారు. రాజీవ్‌గాంధీ, డాక్టర్ మన్మోహన్‌సింగ్, మాజీ రక్షణ మంత్రి ఆంటోనీ. అయితే ఆ తరువాత రాజీవ్‌గాంధీపై బోఫోర్స్ మచ్చపడింది. మన్మోహన్ సింగ్ నీతిమంతుడైనా, ఆయన మంత్రివర్గం లోని కొందరి అవినీతి కుంభకోణాల ఛాయలు ఆయ నపై పడ్డాయి. ఇక మూడవ మిస్టర్ క్లీన్ ఆంటోనీపై కూడా రక్షణశాఖ ఆయుధాల కొనుగోలులో కొన్ని ఆరో పణలు వచ్చాయి. కేజ్రీవాల్ ఎంత నీతీనిజాయితీలకు మారుపేరైనా, ఆయన మంత్రివర్గంలోని మంత్రులం దరూ ఆయన అంతగా కలకాలం నీతిమంతులుగా ఉండగలరని చెప్పలేము. వారిపై ఏదో ఒకరూపంలో అవినీతి చినుకులు పడితే అవి కేజ్రీవాల్‌పై కూడా చిందే ప్రమాదం ఉంది! మరి, అధికారంలోనే అవినీతి ఉంది కదా! కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఒక్కరిపైన అవినీతి చిను కులు పడినా, అవి ఆయనను నమ్ముకున్న ఆమ్ ఆద్మీ లను హతాశుల్ని చేస్తాయి!
అంతేకాదు. రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ తనను వెన్నుపోటు పొడిచిన తన పుత్ర సమానుడు బ్రూటస్‌ను ఉద్దేశించి, ‘‘నువ్వు కూడానా బ్రూటస్’’ అని నిర్ఘాంతపోయినట్లు, సామాన్యులు ‘‘నువ్వు కూడానా కేజ్రీవాల్’’ అని నిర్ఘాంతపోయే సన్నివేశం రాకుండా ఆయన తన ప్రభుత్వాన్ని వెయ్యి కళ్లతో కనిపెట్టి ఉండ టం అవసరం! కాగా, మొన్న డిల్లీ ఎన్నికలు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు సామాన్యుని హెచ్చరికగా కూ డా పరిగణించాలి. తాను తలుచుకుంటే, సామాన్యుడు అతి సామాన్యుని సయితం మహానాయకుని చేయగల డని దీన్ని బట్టి అర్థం కావడం లేదా?
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు)