వివక్షపై ధిక్కార స్వరం | Sakshi Guest Column On Desmond Tutu Life History | Sakshi
Sakshi News home page

వివక్షపై ధిక్కార స్వరం

Published Thu, Dec 30 2021 1:16 AM | Last Updated on Thu, Dec 30 2021 12:35 PM

Sakshi Guest Column On Desmond Tutu Life History

దక్షిణాఫ్రికాలో సమానత్వం, న్యాయం కోసం దశాబ్దాలుగా సాగిన జాతివివక్షా వ్యతిరేక సుదీర్ఘ పోరాటంలో నెల్సన్‌ మండేలా వెన్నంటి నిలిచిన విశిష్ట వ్యక్తి డెస్మండ్‌ టూటూ. అమల్లో ఉన్న పాలక వ్యవస్థను మతపరంగా, సాంస్కృతికపరంగా, రాజకీయంగా సవాలు చేయడానికి ఆయన ఎన్నడూ భయపడలేదు. దాదాపు 80 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఇథియోపియా, భారతదేశం, జాంబియా వంటి దేశాల్లోని మారుమూల గ్రామాలలో పర్యటించి బాల్యవివాహాల బారిన పడిన, ఆ ఒత్తిడికి గురవుతున్న బాలికల వాణిని విన్నారు. బిషప్‌గా వ్యవహరిస్తూనే అనేక విధాలుగా ప్రజల జీవితాలను స్పృశించిన ఆయన చిరస్మరణీయుడు.

ఆర్చ్‌ బిషప్‌ డెస్మండ్‌ టూటూ మహాభినిష్క్రమణంతో, ఈ లోకంలో మంచికోసం నిలబడిన ఓ గొప్ప శక్తిని ఈ ప్రపంచం కోల్పోయింది. మన ప్రపంచానికి అనురక్తినీ, క్షమాగుణాన్నీ నేర్పుతూ, ఉక్కు సంకల్పంతో తన కర్తవ్యాన్ని కొనసాగించిన మాన్యుడు టూటూ. దక్షిణాఫ్రికాలో జాతి సమానత్వం, న్యాయం కోసం దశాబ్దాలుగా సాగిన జాతివివక్షా వ్యతిరేక సుదీర్ఘ పోరాటంలో నెల్సన్‌ మండేలా వెన్నంటి నిలిచారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గళమెత్తడమే కాక, అనేక విధాలుగా ప్రజల జీవితాలను స్పర్శించిన ఆయన చిరస్మరణీయుడు.

ప్రత్యేకించి, బాల్య వివాహాలను అంతమొందించడానికి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ప్రయత్నాలకు ఆయన చేసిన దోహదం అనన్య సామాన్యం. తనకు తెలియని విషయాన్ని తెలీదు అని అంగీకరించడంలో ఆయన ప్రదర్శించే నమ్రత తనలోని మరొక్క గొప్ప లక్షణం. బాల్యవివాహాల పట్ల ఇలాంటి ఎరుకతోనే వాటికి వ్యతిరేకంగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. సబ్‌–సహారన్‌ ఆఫ్రికాలో బాల్య వివాహ నిష్పత్తి, దక్షిణాసియా లేక మధ్యప్రాచ్య దేశాల్లో జరుగుతున్నంత స్థాయిలో, లేదా అంతకంటే ఎక్కువగా నమోదవుతోం దని ఆయన మొదటిసారిగా విన్న సందర్భం ఇంకా నాకు గుర్తుంది. ఈ సమస్య  ఆఫ్రికాకు కూడా వర్తించే విషయమని తాను ఆలోచించలేదని ఆయన నిజాయితీగా చెప్పారు. 

ఆఫ్రికా ఖండంలోనూ బాల్య వివాహాల సమస్య ఉందని తెలి శాక, దాని పరిష్కారం పట్ల ఆయన పూర్తి నిబద్ధత ప్రదర్శించారు. దాదాపు 80 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఇథియోపియా, భారత్, జాంబియా వంటి దేశాల్లోని మారుమూల గ్రామాలలో పర్యటించి బాల్యవివాహాల బారిన పడిన, ఆ ఒత్తిడికి గురవుతున్న బాలికల వాణిని వారి గొంతుతోనే విన్నారు. ఆ చిన్నారుల తల్లితండ్రులు, మత నాయకులు, గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులను కలసి మాట్లాడారు. బాల్యవివాహాలు బాలికలకు ప్రయోజనకరం కావని వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. 

అమల్లో ఉన్న పాలక వ్యవస్థను మతపరంగా, సాంస్కృతికపరంగా లేదా రాజకీయంగా సవాలు చేయడానికి ఆయన ఎన్నడూ భయపడలేదు. ఆయన ఒక గొప్ప కమ్యూనికేటర్‌. అదేసమయంలో శ్రోతలను నిమిషాల్లోనే నవ్పించి, ఏడిపించేలా చేయగలిగే జిత్తులమారి కేంపెయినర్‌ కూడా. సరైన భావోద్వేగపు బటన్లను ఎప్పుడు ప్రెస్‌ చేయాలో, విభిన్నమైన సందేశాలను ఎలా పంపించాలో ఆయనకు బాగా తెలుసు. తాను చెప్పే అంశాన్ని ఒప్పించడానికి తరచుగా ఆయన కథలు చెప్పేవారు. దేశాధ్యక్షులు, ప్రధానమంత్రుల వంటి నాయకులు ఆయన చెప్పే కథలను చిన్నపిల్లల్లాగా వింటూండిపోవడం, ఆ కథలోని ప్రధానాంశం నేరుగా తమకే తగులుతోందని వారు గుర్తించడం అసాధారణమేమీ కాదు.

దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి పాలనకు 1948లో ప్రజామోదం లభిం చినప్పుడు డెస్మండ్‌ టూటూ వయస్సు 17 సంవత్సరాలు. అయితే ఈ భవిష్యత్‌ ఆర్చి బిషప్‌కి 40 ఏళ్లు వచ్చిన తర్వాత మాత్రమే నల్లజాతి విముక్తి భావన ఆయన ప్రపంచాన్ని విస్తృతపరిచింది. 1970ల మధ్యలో మాత్రమే ఆయన దక్షిణాఫ్రికా విముక్తి పోరాటంతో మమేకమయ్యారు. 90 ఏళ్ల వయసులో ఇటీవలే కన్నుమూసిన టూటూ మొదట్లో చర్చి మనిషిగానే ఉండేవారు. రాజకీయాల్లోకి రావాలని ఆయన ఎన్నడూ కోరుకోలేదు. 1975లో జోహాన్స్‌బర్గ్‌కి తొలి నల్లజాతి ఆంగ్లికన్‌ డీన్‌ అయినప్పుడు డెస్మండ్‌ టూటుకు రాజకీయంగా పెద్దగా చైతన్యం ఉండేది  కాదు. అన్యాయం తన దృష్టికి వచ్చినప్పుడు అధికారంలో ఉన్నవారు దానిగురించి తప్పకుండా తెలుసుకునేలా ఆయన వ్యవహరించేవారు. బలవంతపు వివాహాల పాలై ఇక్కట్లపాలవుతున్న బాలికల గురించి మాట్లాడటమే కాదు... ఈ హానికరమైన దురాచారాన్ని అంతమొందించడంలో పురుషుల పాత్రకున్న ప్రాధాన్యంపై కూడా ఆయన చర్చించేవారు. భార్యలను తమతో సమానులుగా పురుషులు గుర్తించినప్పుడు జరిగిన మార్పుల గురించి మాట్లాడేవారు. ఏదైనా అంశంపై ఆయన మనసులో వ్యతిరేక అభిప్రాయం స్థిరపర్చుకున్నారంటే చాలా గట్టిగా దాన్ని ప్రతిఘటించేవారు. ప్రజలకు

వారి విలువ ఏమిటో అర్థం చేయించేవారు. దేశాధ్యక్షుడిని అయినా సరే వేచి ఉండేలా చేసేవారేమో కానీ, తనకు టీ అందించేవారు, తనకోసం తలుపులు తెరిచేవారితో మాట్లాడటానికి సమయం వెచ్చించేవారు. ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులేనని, ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని ఆయన ప్రముఖులతో చెప్పేవారు. గొప్ప మార్పును సృష్టించాలంటే గొప్ప వెల్లువ అవసరమవుతుందని తరచుగా చెప్పేవారు. మనలో ప్రతి ఒక్కరూ ఆ వెల్లువలో నీటిబిందువుల్లా ఉండగలమనీ, కలిసి పనిచేయడం ద్వారానే మనం గొప్ప పనులను సాధించగలమని ఆయన చెప్పేవారు.

‘‘ఇతరులను క్షమిద్దాం, మనల్ని మనం క్షమించుకుందాం...’’ ఆయన పదేపదే చెప్పే సందేశాల్లో ఇది ఒకటి. చిన్నచిన్న పనులు చేయడం ద్వారా గొప్పమార్పును తీసుకురావచ్చని ఆయన చెప్పిన మాటలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. ఆయన విశ్వాసాన్ని ఎత్తిపట్టడం ద్వారా ఈ సంక్షుభిత ప్రపంచంలో అంతిమంగా మంచితనమే విజయం సాధిస్తుందని చెప్పగలను.
– మబెల్‌ వాన్‌ ఆరెంజ్, సామాజిక కార్యకర్త

జోహాన్స్‌బర్గ్‌కి వంద మైళ్ల దూరంలో ఉన్న, ఆఫ్రికన్ల ప్రాబల్యం ఉండే వ్యవసాయ నగరం కుగ్రెర్స్‌ డోర్ప్‌లో టూటూ 1931 అక్టోబర్‌ 7న పుట్టారు. తండ్రి జకరయ్య స్థానిక మెథడిస్ట్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు. తల్లి అలెట్టా గృహిణి. టూటూ అఫ్రికన్, ఇంగ్లిష్‌ రెండు భాషలనూ నేర్చుకున్నారు. 14 ఏళ్ల వయస్సులో క్షయవ్యాధికి గురై 20 నెలలపాటు ఆసుపత్రిలో గడిపారు. అక్కడే ఆయనకు బ్రిటన్‌కి చెందిన అంగ్లేయ చర్చి ప్రీస్ట్‌ ఫాదర్‌ ట్రెవర్‌ హడిల్‌స్టన్‌తో జీవితకాల స్నేహం అంకురించింది. దక్షిణాఫ్రికాలోనూ, దేశం వెలుపలా వర్ణ వివక్షపై బద్ధవ్యతిరేకత ప్రదర్శించి పోరాడిన అత్యంత ప్రముఖులలో ఫాదర్‌ ట్రెవర్‌ ఒకరు. టూటూకు జీవితాంతం ఆయనకు మతసంబంధమైన స్ఫూర్తిప్రదాతగా, బోధకుడిగా ఫాదర్‌ ట్రెవర్‌ నిలిచిపోయారు.

1953లో బోధనారంగంలో డిప్లొమా తీసుకున్న టూటూ తదుపరి ఏడాది కరెస్పాండెన్స్‌ ద్వారా బీఏ డిగ్రీ పుచ్చుకున్నారు. జోహాన్స్‌బర్గ్‌లో 1954లోనూ, క్రుగెర్స్‌డోర్ప్‌లో 1955–57 మధ్య కాలంలో పాఠాలు బోధించారు. తర్వాత 1961లో ప్రీస్టుగా మారిన టూటూ ఒక ఆఫ్రికన్‌ టౌన్‌ షిప్‌లో సేవలందించారు. 1962–66 మధ్య లండన్‌లో కింగ్స్‌ కాలేజీలో థియాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ సాధించిన దశలో టోరీలు రాజకీయంగా ఆయన్ని ఆకర్షించారు. తర్వాత 1972–75 ప్రాంతంలో తిరిగి బ్రిటన్‌ వెళ్లిన టూటూ అక్కడ లెసోతోలో బిషప్‌గా పనిచేశారు. తిరిగి స్వదేశం వచ్చాక టూటూలో రాజకీయ అమాయకత్వం ముగిసిపోయింది. తన విస్తృత పర్యటనల ద్వారా ఆఫ్రికా వికార స్వరూపాన్ని దర్శించగలిగారు. జాతి వివక్షకు వ్యతిరేక దృక్పథం ఆయనలో పెరగసాగింది. ఈ క్రమంలోనే నెల్సన్‌ మండేలా వెన్నంటి నడిచేవాడిగా టూటూ మారారు. దక్షిణాఫ్రికా విముక్తి అనివార్యమని ఇద్దరూ గ్రహించారు. వర్ణవివక్షా పాలనలోని దేశంలో మార్పు తప్పదని గ్రహించిన తర్వాత 1980లలోనే ఈ మతబోధకుడి పాత్ర మారిపోయింది. న్యాయం కోసం డిమాండు స్థానంలో ఐక మత్యం, రాజీపడటం అనే అంశాలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వసాగారు.

దక్షిణాఫ్రికా శ్వేతజాతి సమాజం టూటూ భావాలకు గాను ఆయన పట్ల బద్ధశత్రుత్వం ప్రకటించింది. ‘రేపు మీది కాదు’ అని టూటూ తేల్చి చెప్పినందుకే శ్వేతజాతి ఆయనపై విషం కక్కింది. తన చివరి సంవత్సరాల్లో కేన్సర్‌ వ్యాధితో పోరాడుతూనే టూటూ మానవ హక్కులు, స్వాతంత్య్రం కోసం అనేక దేశాల్లో ప్రచారం సాగించారు. అన్యాయానికి, వివక్షకు వ్యతిరేకంగా చివరివరకూ గళమెత్తిన డెస్మండ్‌ టూటూ 2021 డిసెంబర్‌ 26న శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement