మాంధాత పర్వతం మీద శంకరుడు పాదం మోపిన తొలి క్షణంలోనే గోవింద భగవత్పాదునిలో చలనం కలిగింది. నిస్సత్తువను జయించి కన్నులు తెరిచి, పక్కమీద నుంచి పైకి లేచి నిలబడ్డారాయన. ఆనాడు బదరికాశ్రమంలో అలకనంద నుంచి శంకరుడు వెలికితీసిన నారాయణుణ్ణి దర్శించడానికి గోవిందులు వచ్చారు. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెయ్యేళ్లకు పైబడిన చరిత్ర కలిగిన దేహయాత్రను ఇక విరమించబోతున్నట్లు ఆనాడే సంకేతమిచ్చారు. చన్నీట స్నానం చేయలేని గురువు కోసం శంకరుడు అప్పటికప్పుడు బదరిలో వేడినీటి గుండం తవ్వాడు.
ఆ తర్వాత గురుశిష్యులిద్దరూ కలిసి దక్షిణామూర్తి దర్శనానికి వెళ్లడం, శంకరునికి భాష్యరచనకు ఆదేశం రావడంతో మొదలుపెట్టుకుని ఇప్పటికి చాలనే కథ జరిగింది. చూస్తుండగానే నాలుగు సంవత్సరాల కాలం కరిగిపోయింది. ఈవేళ కలియుగాది 2609 (క్రీ.శ. 492) శ్రీకీలకనామ సంవత్సరంలోని శ్రావణ పౌర్ణమి. గోవిందులు దేహత్యాగానికి నిర్ణయించుకున్న రోజు.
గురుపుత్రుడైన భర్తృహరి సందేశాన్ని అందుకుని శంకరుడు హుటాహుటిన వచ్చాడు. అల్లంత దూరాన శంకరుణ్ణి చూడగానే గోవిందులు ఆదుర్దాగా పైకి లేచి అడుగు ముందుకు వేశారు. తూలిపడ బోతున్న ఆయనను శంకరుడు పొదివి పట్టుకున్నాడు. శిష్య పరిష్వంగంలో ‘శంకరా!’ అన్నదే చివరిమాటగా గోవింద భగవత్పాదులు శరీరత్యాగం చేశారు.
అక్కడికి రాదగిన వారంతా అంతకుముందే వచ్చి వున్నారు. ఆ గురువుతో జన్మాంతరాల నుంచి అనుబంధం ఉన్నవారంతా దూరదూరంగానే నిలిచి ఉన్నారు. శంకరుడు తన గురువు పార్ధివదేహాన్ని అలాగే చేతులతో ఎత్తి తీసుకువెళ్లి, ముందుగా ఆయనే ఎంచుకున్న స్థానంలో కూర్చుండబెట్టాడు. వెనువెంటనే సమాధి మూతపడింది.
పద్మపాదునితో కలిసి శంకరుడు అక్కడి నుంచి కదిలాడు. యోగులు, సన్యాసులైన ఇతర శిష్యులూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పూర్వాశ్రమంలో గోవింద భగవత్పాదునికి క్షత్రియ స్త్రీ వల్ల జన్మించిన శ్రీహర్ష విక్రమార్కుడు మాత్రం అక్కడే ఉన్నాడు. తన తండ్రి సమాధిపై శివలింగాన్ని స్థాపించడానికి, ఆలయాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేశాడు. మాంధాత పర్వతం అని పిలిచే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని చుట్టి వచ్చేవారికి నర్మదా పరిక్రమ మార్గంలో గోచరించేలా అపూర్వ శిల్పచాతుర్యంతో విశాలమైన మందిర నిర్మాణం చేశాడతను.
శంకరయతి పద్మపాదునితో కలిసి మాహిష్మతీ సరిహద్దు అటవీ భూములవైపు కదిలాడు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సుశర్మ పంపిన భటులు శంకరుని దేహాన్ని దొంగతనంగా ఎత్తుకుపోయారు. విష్ణుశర్మ వెతుక్కుంటూ వచ్చే సమయానికే శంకరుణ్ణి చితిపై పడుకోబెట్టి నిప్పు అంటించారు. అగ్నికీలలు ముమ్మరంగా చెలరేగుతున్నాయి. హఠాత్తుగా కనిపించిన దృశ్యానికి ముందు మాటరాక నిలిచిపోయిన విష్ణుశర్మ ఒక్కసారిగా ‘గురుదేవా!’ అంటూ కేకపెట్టాడు. అతడు కేకపెట్టిన ఉత్తర క్షణంలో మంటల చిటపటలు సద్దుమణిగి చితిపై నుంచి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినిపించడం మొదలైంది.
శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే
భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం
– వేయిపడగల ఆదిశేషుని పడగలపైని మణుల కాంతులతో పాలకడలి మెరిసిపోతోంది. దానిపై యోగీశునివై, శాశ్వతునివై నిలిచివున్న లక్ష్మీనృసింహుడా! అగ్నియందు ఆవిర్భవించిన నీ చేతి సుదర్శన శక్తిని కాస్త... నా భవబంధాలను తెంచిపెట్టమని ఆదేశించు. లక్ష్మీ హృదయమనే సరోవరంలో విహరించే రాజహంసా! సంసారమనే ఈ ఘోరాటవిలో సంచారం ఎంత కష్టమో నేను వర్ణించ లేను. ఇక్కడ ఎన్నెన్నో క్రూరమృగాలున్నాయి. వేటికవే వేర్వేరు కోర్కెలతో నన్ను చుట్టుముట్టి పీడిస్తున్నాయి. నాలో భయానుకంపాన్ని పెంచడానికి పూనుకుంటున్నాయి. నీవే గనుక నా చేయి పట్టుకుని నడిపిస్తే నాకీ కష్టాలు దాపురించేనా?
సంసారమనే చీకటికూపం భయపెడుతుంది. బయటపడనివ్వకుండా తనలోకి లాగుతుంది. వందలాదిగా ఉన్న దీనిలోని దుఃఖాలనే పాములు నన్ను నిరంతరాయంగా కాట్లు వేస్తున్నాయి. దేవా! నేను దీనుణ్ణి. నీ పాదాలముందు వాలాను. నీ చేయూతనందించి నా దుఃఖాన్ని పోగొట్టు.
సంసారమనే సాగరంలో రాగద్వేషాలనే మొసళ్లు నన్ను మింగవస్తున్నాయి. మింగబోయిన రాహుకేతువులను దూరంగా ఉమ్మేసిన సూర్యునిలా నువ్వు నా ముందు అవతరించు.
సంసారమనే వృక్షం పాపబీజాలతో ఆవిర్భవించి, అనంతకర్మలనే శాఖలుగా విస్తరించింది. కామ్యాలనే ఆకులు, పువ్వులతో నిండిపోయింది. నేనీ వృక్షంమీది పళ్లపై ఆశతో దుఃఖాలు కొని తెచ్చుకుని పతనమైపోతున్నాను.
సంసారమనే సర్పపు కాటు మహాతీవ్రమైనది. కోటికోరలతో నన్ను అణువణువూ నష్టపరుస్తోంది. గరుడవాహనా! కాళీయుని పడగ త్రొక్కి కాళిందిని కాపాడినట్లు నన్ను కాపాడు అన్నాడు స్తోత్రంలో శంకరుడు.
సంసారదావ దహనాకర భీకరోగ్ర
జ్వాలావళీభిరతి దగ్ధ తనూరుహస్య
త్వత్పాదపద్మ సరసీరుహమాగతస్య
లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం
– అదుగో స్వామీ! సంసారమనే ఘోరదావాగ్ని నన్ను తరుముకొస్తోంది. ఆ అగ్నికీలల్లో నేను నిలువెల్లా దహించుకుపోతున్నాను. నీ పాదపద్మాలను శరణుజొచ్చినవాడిని చేయందించి నన్ను కాపాడవా... ఇంద్రియాలనే ఎరలు వేసి ఈ సంసార సాగరంలోని చేపలను పట్టే జాలరి నీవు. ఈ చేప నీవువేసిన ఎరను కొరికి, తీవ్రంగా గాయపడింది. ఇక వేటచాలించి పైకి చేదుకో.
సంసారమనే మత్తగజం తన కుంభస్థలంతో నన్ను కిందికి నెట్టేసింది. నా గుండెపై తన కాలువేసి నొక్కిపట్టింది. ప్రాణప్రయాణమనే భవభీతిని తెలియని నొప్పిగా మార్చి ఆర్తిని నశింపచేసే దేవరా నీ చేయూతనందించరా!
వివేకమనే నా మహాధనాన్ని ఇంద్రియాలనే చోరులు దోచుకు వెళ్లారు. మోహాంధకారమనే లోతైన బావిలో నన్ను పడదోసి పోయారు. నేను అంధుణ్ణయ్యాననే భ్రాంతి కలుగుతోంది. దేవా దేవేశా! నీ చేయూతనందించు అని శంకరుడు స్తోత్రాన్ని పూర్తి చేశాడు. చుట్టుముట్టిన ఘోరాగ్ని అతడి దేహాన్ని ఏమీ చేయలేకపోయింది. నిప్పుల మధ్యనుంచి పువ్వులా బయటకు నడిచివచ్చాడు.
మంటల వెలుగులో రాజ్యలక్ష్మీ నృసింహుడు మేఘగర్జన స్వరంతో ఇలా పలికాడు.... ‘మాయాకల్పిత దేహాన్ని అగ్నికీలలు చుట్టుముట్టిన ఈ సమయంలో నువ్వు గానం చేసిన కరావలంబ స్తోత్రాన్ని మెచ్చాను. ఇకనుంచి నా సన్నిధిలో శంకరుణ్ణి తలచినా, నీ సమక్షంలో నృసింహ గుణగానం చేసినా మానవులు సుఖజీవనులవుతారు.’
చితిమంటల నుంచి నడిచివచ్చిన శంకరుని దేహం వేయివన్నెల పసిడిలా మెరిసిపోతోంది. శంకరుణ్ణి మంటల పాలు చేసిన రాజభటులు ఏమైపోయారో ఎవరికీ తెలియదు. విష్ణుశర్మ ఆనందానికి అవధులు లేవు. పరుగు పరుగున వెళ్లి శంకరుని పాదాలపై పడ్డాడు. శంకరుడు అతడికి సేదతీరుస్తున్నాడు.
దుష్కరమైన గండాన్ని అవలీలగా అధిగమించి వచ్చిన ఆచార్యుణ్ణి తదేక దీక్షతో గమనిస్తూ, పద్మపాదాచార్యుడు నృసింహతాపినీ ఉపనిషత్ మంత్రాలను నెమరు వేసుకుంటున్నాడు.
‘అన్నిచోట్లా అలుపెరుగకుండా తిరిగే ఆత్మకు మూడు రూపాలున్నాయి. అభిమంత అయిన జీవుడు, స్త్రీస్వరూపుడైన హిరణ్యగర్భుడు, వ్యక్తచైతన్యం కలిగిన ఈశ్వరుడు అన్నీ ఆత్మరూపాలే. అన్ని అవస్థల్లోనూ జీవులందరూ ఈశ్వరునిలాగే సర్వమయులే కానీ, ఆయనతో పోల్చినప్పుడు వారంతా అల్పులు. ఈశ్వరుడే జీవులందరిలోనూ భూతాల్ని, ఇంద్రియాల్ని, విరాట్ ని, దేవతల్ని, కోశాల్ని సృష్టించి వాటిలో ప్రవేశిస్తున్నాడు. ఏమాత్రం మూఢత్వం లేనివాడయినా మాయతో కలిసి మూఢునిలాగే ప్రవర్తిస్తున్నాడు.
మాయావట స్వరూపమైన సంసార వృక్ష బీజం సజాతీయమైన తనవంటి ఎన్నో మర్రిచెట్లని విత్తనాలతో సహా పుట్టించి పూర్ణమవుతుంది. అసిద్ధ స్థితిలోని విత్తనానికి, సిద్ధస్థితిలోని చెట్టుకు గల ఈ భేదంలాగే మాయకూడా మనకు తనకంటే వేరుకాని పూర్ణక్షేత్రాల్ని చూపించి ద్వైతభావనను కలిగిస్తుంది. జీవ–ఈశ ఆభాసను పుట్టిస్తూ ఉంటుంది. ఆత్మకంటే వేరుకాని పరమాత్మ నిత్యుడు, సన్మాత్రుడు, శుద్ధుడు, బుద్ధుడు, ముక్తుడు, నిరంజనుడు, విభుడు, అద్వయానంద పరుడు.
యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజలందరూ ఎవరిని శరణు వేడుకుని నమస్కరిస్తారో, అటువంటి స్వామి నృసింహుడు. కనుకనే ఆయన సర్వతోముఖుడయ్యాడు. సృష్టిలోకెల్లా గొప్ప వీర్యవంతుడైన మానవుడు, జంతువులలో కెల్లా వీర్యమంతమైన సింహం కలగలిసిన సంయుక్త రూపం నృసింహుడు. ఆయనే జగత్తును రక్షించడానికి తగినవాడు. అతడు ఎల్లరికీ భయంకరుడు కానీ, ఎవరివల్లనూ తాను భయాన్ని పొందడు కనుక భీషణుడయ్యాడు. స్వయం ప్రకాశశక్తి కలిగి, తాను ఇతరులను ప్రకాశింప చేయగలవాడు... శుభమంగళ విగ్రహుడు, శుభాలను కలిగించేవాడు... అపమృత్యుదోషాలను తొలగించగల శక్తిగలవాడు కనుక ఆయన భద్రమూర్తి’ అని అర్థం వచ్చే ఉపనిషన్మంత్రాలు మనసులో మెదులుతుండగా....
‘మా శంకరుడంటే సింహం’ అనుకున్నాడు పద్మపాదుడు. ‘నృసింహుడే ఆచార్యరూపంలో దిగివచ్చినట్లుంది. ఆ కన్నులు సర్వతోముఖ భద్ర వీక్షణాలను శిష్యుల దిశగా ప్రసరిస్తున్నాయి. ఆ భీషణ రూపం ధర్మగ్లానిని తలపెట్టేవారి గుండెల్లో ప్రచండ గర్జనలు నినదిస్తుంది. అమ్మలాంటి అందం, నాన్నలాంటి వాత్సల్యం కలగలిసిందే శంకరరూపం’ పద్మపాదుని ఆలోచనలు పలుతెరగుల విస్తరిస్తున్నాయి.
ఆ మహాప్రవాహానికి అవరోధం కలిగిస్తూ విష్ణుశర్మ దీనవచనం అప్పుడు వినవచ్చింది.
‘‘గురుదేవా! ఇక నన్ను కరుణించండి’’ అన్నాడు విష్ణుశర్మ పైమాట చెప్పలేక ఆగిపోతూ.
శంకరుడు చిరునవ్వు నవ్వి అతడి కోరికను మన్నించాడు. విష్ణుశర్మకు సన్యాసం అనుగ్రహించాడు. నాటినుంచి అతడు చిత్సుఖాచార్యుడయ్యాడు.
ఆనాడే వారు ముగ్గురూ కాశ్మీరానికి ప్రయాణమయ్యారు. శ్రీస్థలమని పురాణప్రసిద్ధిని పొందిన సిద్ధాపురంలో సరస్వతీ నదిని దాటి కాశ్మీర భూములలో అడుగు పెట్టారు. సరిహద్దులలోనే వారి రాకకోసం హస్తామలకాచార్యుడు, ఇతర శిష్యులు ఎదురు చూస్తున్నారు.
అందరూ కలిసి లోనికి సాగుతుండగా మహాజన ప్రవాహం గగ్గోలు పెడుతూ వారికి ఎదురువచ్చింది. పట్టపుటేనుగు కట్టు తెంచుకుంది. భయానకంగా చెలరేగిపోతోంది. దాని ధాటికి తట్టుకోలేక జనాలు విరగబడి పోతున్నారు. దాన్ని అదుపు చేసే సాహసం చేయడం లేదెవరూ. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెడుతున్నారు.
అటువంటి సమయంలో శంకరయతి దర్శనమైంది. అప్పటివరకూ భీభత్సాన్ని సృష్టించిన మహాగజం కాస్తా ఒక్కసారిగా సాధువుగా మారిపోయింది. అతడి ముందు మోకరిల్లింది. తొండమెత్తి నమస్కరించింది.
అక్కడితో అందరికీ స్వస్థత చిక్కింది. తమను మహాపద నుంచి రక్షించిన యతీశ్వరునికి అందరూ నేలపై సాగిలపడి భక్తిగా మొక్కారు. ఎవరో ఒక అత్యుత్సాహవంతుడు మాత్రం స్వామి పాదాలను తాకి, నమస్కరించాలని ప్రయత్నించాడు. శంకర శిష్యులు వారించారు.
‘‘ఏం సామీ! మేం తాకితేనే మీ పెద్దసామి మైలపడిపోతాడా?’’ దీనంగా అడిగాడు అతడు.
ఆ ప్రశ్నకు పద్మపాదుడు మందహాసం చేసి, ‘‘చూడబ్బీ! సన్యాసి అంటే నడిచే నిప్పు. అనుమతి లేనిదే ప్రమాదంలో పడేది నువ్వే. నిప్పులాగే సన్యాసి కూడా అందరికీ వినియోగ పడడానికే ఉన్నాడు. నిప్పుని వాడుకున్నట్లే సన్యాసినీ వాడుకో నీకు చేతనైతే. నీ చేత్తో వారిని తాకడం కాదు... వారి కన్ను నిన్ను తాకేలా చూసుకో వీలైతే. వారి తలపు నీపైకి మళ్లేలా చేసుకో సత్తా ఉంటే’’ అన్నాడు.
అజ్ఞానం ఇంకా వెర్రితలలు వేయని మంచిరోజులు కనక పద్మపాదుడిచ్చిన సమాధానం అప్పటి కుర్రవాడికి అర్థమైంది. తెచ్చిన పళ్లు ఫలాలు స్వామికి సమర్పించి పక్కకు తప్పుకున్నాడు. శంకరుడు కాశ్మీర సర్వజ్ఞపీఠం నెలకొన్న గోపాద్రి దిశగా ముందుకు సాగిపోయాడు.
కృతయుగాల నాడు కశ్యప ప్రజాపతి తపఃఫలంగా వెల్లడైన సతీ సరోవరమే కాశ్మీరభూమిగా అవతరించింది. శ్రీరామచంద్రుని కుమారుడైన లవుని ఏలుబడిలో ఉండేది. ద్వాపరయుగం నాటికి జరాసంధుని బంధువుల రాజ్యమయింది. భారతయుద్ధం తరువాత గోనంద వంశస్థులు శ్రీకృష్ణ భక్తులుగా మారారు. గంగ, మధుమతి, సరస్వతీ నదుల మధ్యనున్న శారదీ నగరం ఒకప్పుడు విద్యలకేంద్రంగా విలసిల్లింది. బదరికాశ్రమంలోని వేదఘోష కాశ్మీర సరస్వతి వింటూ ఆనందిస్తుంటుందని పూర్వులు చెప్పేవారు. కానీ శంకరుని కాలంనాటికే ఆ విద్యాప్రాభవమంతా క్రమంగా కనుమరుగైంది. కాశీనగరం భరతఖండపు విద్యారాజధాని అయింది.
శంకరుడు కాశ్మీరానికి రావడానికి నాలుగువందల సంవత్సరాలకు ముందుగానే అక్కడ హూణవిద్యలు ప్రవేశించాయి. మిహిరకులుడనే నరరూప రాక్షసుడు విద్యాకాశ్మీరాన్ని కేవలం సంగ్రామభూమిగా మార్చివేశాడు. బౌద్ధసన్యాసుల కారణంగా కాశ్మీర రాజస్త్రీలకు ఏర్పడిన కళంకాన్ని తొలగించడానికి అతడు దారుణ మారణహోమాలు చేశాడు. కాశ్మీర స్త్రీలకు సింహస్వప్నంలా నిలిచిన మిహిరకులుడి కన్నకొడుకైన బకుడు చివరకు ఒక స్త్రీ చేతిలోనే దారుణ మరణం పొందాడు. వసునందనుడి కాలం నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం కాశ్మీరాన్ని అతడి కుమారుడైన నరుడు పాలిస్తున్నాడు. నరుని కుమారుడైన అక్షుడు యువరాజు. కాశ్మీర ప్రభుత్వంలో అధికారమంతా వారిద్దరిదే కానీ, మాటచెల్లుబడి మాత్రం యువరాజ పుత్రుడైన గోపాదిత్యునిది.
గోపాదిత్యుడు వేదధర్మాభిమాని. వయసులో చిన్నవాడే అయినా, సనాతన ధర్మాన్ని మళ్లీ కాశ్మీరంలో నెలకొల్పాలని విశేష కృషి చేస్తున్నాడు. దేశదేశాల నుంచి పండితులను రప్పించి విద్వత్ సభలు నిర్వహిస్తున్నాడు. అనాచార పరులైన కాశ్మీర బ్రాహ్మణులకు కనువిప్పు కలిగేలా ధర్మపరాయణులను తమ దేశానికి రప్పించి, మడిమాన్యాలను కట్టబెట్టడం మొదలుపెట్టాడు. ఈ చర్యల వల్ల ఇక్కడివారు మారాలన్నది అతడి తాపత్రయం.
శారదా మండలమని పేరుబడ్డ కాశ్మీరంలో అనేకచోట్ల గోపాదిత్యుడు సరస్వతీ ఆలయాలను నిర్మించాడు. ప్రస్తుతం అతి ప్రాచీనమైన సర్వజ్ఞపీఠానికి సమీపంలో జ్యేష్ఠ రుద్రేశ్వరాలయాన్ని పునరుద్ధరిస్తున్నాడు. బ్రహ్మవిదుడై కాశ్మీర పండితులందరినీ వాదంలో గెలిచి, సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించిన వ్యక్తిచేతనే జ్యేష్ఠరుద్రేశ్వరాలయానికి కుంభాభిషేకం నిర్వహింప చేయాలని ఎదురు చూస్తున్నాడు. అతని కోరిక నెరవేరే తరుణం ఆసన్నమయింది.
ఆచార్య శంకరుడు కాశ్మీరభూమిపై అడుగు పెట్టాడు.
– నేతి సూర్యనారాయణ శర్మ
Comments
Please login to add a commentAdd a comment