సెప్టెంబర్ 5 అనగానే ఉపాధ్యాయుల దినోత్సవం అనుకోవటం కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తున్నాం. ఇటువంటి సందర్భంలో ఒకసారి గురువులను అంటే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన గురువులను స్మరించుకోవాలి. మొట్టమొదటగా మనం చెప్పుకోవలసిన, గుర్తు చేసుకోవలసిన గురువు జగద్గురువు శ్రీకృష్ణపరమాత్ముడు. ఈ జాతికి భగవద్గీతను బోధించిన గురువు ఆ నల్లనయ్య, ఒక్క భగవద్గీతతో అర్జునునిలోని అజ్ఞానాన్ని తొలగించాడు. కురుక్షేత్ర యుద్ధం చేయించాడు. దుష్టసంహారం చేయించాడు. కురు వృద్ధుడైన భీష్మాచార్యుడు స్వయంగా శ్రీకృష్ణుడిని జగద్గురువు అని సంబోధించాడు.
గురువు అంటే తన శిష్యునిలోని అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలేవాడని అర్థం. అంతేకాని పాఠాలు చెప్పే ప్రతివారు గురువులు కాదు. విద్యార్థికి మార్గదర్శనం చేసి, విద్యార్థిలోని ఆసక్తిని గమనించి, ఆ విద్యార్థి ఏ రంగంలో రాణించగలడో గమనించగల శక్తి కలవాడే గురువు అని భీష్ముని మాటలలో వ్యక్తమవుతుంది. అందుకే వయసులో శ్రీకృష్ణుడు భీష్ముడి కంటె చిన్నవాడైనప్పటికీ జగద్గురుత్వం ప్రాప్తించింది.
చదవండి: సీఎం వైఎస్ జగన్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
m
అదే గౌరవం దక్కిన మరొకరు ఆదిశంకరాచార్యులు.
జగద్గురు ఆదిశంకరాచార్య అనే మనం భక్తితో, గౌరవంగా పిలుచుకుంటాం. 32 సంవత్సరాలు మాత్రమే తనువుతో జీవించినా, ఆయన రచనలతో నేటికీ అంటే కొన్ని వందల సంవత్సరాల తరవాత కూడా జీవించాడు శంకరాచార్యుడు. ఆచార్యత్వ గుణాల వల్లే శంకరుడు శంకరాచార్యుడయ్యాడు. జగద్గురువయ్యాడు. భారతజాతికి అనర్ఘరత్నాల వంటి స్తోత్రాలు అందించాడు. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు తిరుగుతూ, శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ, శక్తి పీఠాలు స్థాపించి, జ్ఞానతృష్ణ ఉన్నవారికి పరోక్షంగా గురువుగా నిలుస్తున్నాడు శంకరుడు.
చదవండి: మొదటి నమస్కారం... టు టీచర్.. విత్ లవ్
మరో జగద్గురువు స్వామి వివేకానందుడు. రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం చేసి, ఆయన దగ్గర జ్ఞాన సముపార్జన చేసి, గురువుల సందేశాలను యావత్ప్రపంచానికి అందించి, అతి పిన్నవయసులోనే కన్నుమూశాడు వివేకానందుడు. అయితేనేం నేటికీ వివేకానందుడు ఎంతోమందికి గురువుగా పరోక్షంగా జ్ఞానభిక్ష ప్రసాదిస్తున్నాడు. చెళ్లపిళ్ల కవుల దగ్గర చదువుకున్నామని చెప్పుకోవటం ఒక గర్వం, ఒక ధిషణ,
ఒక గౌరవం.
అంతటి గురువుల దగ్గర చదువుకున్న కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన గురువులకు దక్కని గౌరవం తనకు దక్కిందన్నారు. తన వంటి శిష్యులున్న గురువులు మరెవరూ లేరని సగర్వంగా అన్నారు. అదీ గురువుల ఔన్నత్యాన్ని చాటిచెప్పే సంఘటన.
గురువులు అంటే శిష్యుల భుజాల మీద చేతులు వేసుకుని, వారితో సమానంగా అల్లరి పనులు చేయటం కాదు.
గురువులు అంటే శిష్యుల దగ్గర డబ్బులు చేబదులు పుచ్చుకుని, వ్యసనాలను తీర్చుకోవటం కాదు.
వందే గురు పరంపర
గురువు అంటే తన దగ్గర చదువుకునే విద్యార్థిని ప్రేమ వివాహం చేసుకోవటం కాదు.
గురువంటే బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు.
ఉత్తర తన శిష్యురాలు. ఆమెను వివాహం చేసుకోమని విరటుడు కోరితే, అందుకు అర్జునుడు..
అయ్యా, నా దగ్గర చదువుకున్న అమ్మాయి నాకు కూతురితో సమానం. కూతురితో సమానమైన అమ్మాయిని కోడలిగా చేసుకోవచ్చు కనుక నా కుమారుడు అభిమన్యునికిచ్చి వివాహం చేస్తానన్నాడు. అదీ గురువు లక్షణం.
చదువురాని గురువులు విద్యార్థులకు చేసే బోధన మీద తెన్నేటి లత ఆ రోజుల్లోనే సంచలన కథ రాశారు.
అదే ఎబ్బెచెడె...
అంటే ఏ బి సి డి లను ఎలా పలుకుతారో వివరించారు.
అంతేకాదు కొన్ని పాఠశాలల్లో టీచర్లు చుక్ చుక్ రైలు వస్తోంది అనే బాల గేయాన్ని...
సుక్కు సుక్కు రైలు వత్తాంది అని చెబుతున్నారు.
ఇటువంటి గురువుల వల్ల విద్యార్థులకు గురువుల పట్ల అగౌరవంతో పాటు, విద్య అంటే ఏమిటో తెలియకుండా పోతారు.
చదువు చెప్పే గురువులకు చదువుతో పాటు క్రమశిక్షణ, నిబద్ధత, సత్ప్రవర్తన వంటి మంచి లక్షణాలు ఉండాలి.
అటువంటి గురువులు ఉన్ననాడే ఉపాధ్యాయ దినోత్సవానికి అర్థం పరమార్థం కలుగుతుంది.
గురుదేవోభవ అనే మాటల అంతరార్థం నిజమవుతుంది.
గురువు దేవుడిలా బోధించాలి.
దానవుడిలా బోధిస్తే అది దానవత్వాన్ని వృద్ధి చేస్తుందని గుర్తించాలి.
- వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment