‘‘సృష్ట్యాదిలో నామరూపాలు లేవు. జ్యోతిస్వరూపమైన ప్రకృతి చిన్మాత్ర బిందువుగా ఉంది. సృష్టిని ప్రారంభించాలనే ఆశయంతో ప్రధాన ప్రకృతి తనను తాను స్థూల, సూక్ష్మ, పరా బిందువులుగా విభజించుకుంది. ‘అ’ అనే అచ్చు అక్షరంలో నాలుగు ముక్కలుగా కనిపించే ఆకాశమే చిన్మాత్ర బిందుప్రకాశాన్ని విభజించి చూపి సృష్టి రచనకు నాంది పలికింది. ఈ విభజన జరిగే క్రమంలో మొదటిగా ఆ కాంతిస్థావరం నుంచి అవ్యక్తమైన నాదం వెలువడింది. ఆ నాదం కారణమై చంద్రమండలం ఏర్పడింది. బిందు, విసర్గలు కాకుండా మిగిలిన పదహారు అక్షరాలూ ప్రాణకళలతో ప్రకాశించాయి. వాటినుంచే సమస్త భువనాలూ పుట్టాయి. క నుంచి భ వరకు గల ఇరవైనాలుగూ కలిసి సూర్యమండలమయ్యాయి. దానికి క–భ, ఖ–బ ఇలా పన్నెండు కళలున్నాయి. వాటినుంచే జీవరాశులన్నీ పుట్టాయి. అయితే ఏ జీవిలోనూ సృష్టికర్త ఇరవైనాలుగు సంపూర్ణ తత్త్వాలనూ పొదగలేకపోయాడు. చిట్టచివరకు తనకు ప్రతిరూపంగా పూర్ణజీవిగా మానవుణ్ణి రూపొందించాడు. ఆ దేహానికి అచ్చులు ప్రాణం పోశాయి. య నుంచి క్ష వరకు ఉన్న పది అక్షరాలే పంచభూతాత్మకమై కర్మ, జ్ఞానేంద్రియాలను కలిగించాయి. ఇక హల్లులలోని వర్గాక్షరాలలో చిట్టచివరిదైన మకారమే ఆత్మ అవుతున్నది.... అని నారాయణుడు మునుపు సృష్టి మొదలైన క్రమాన్ని చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించాడు.
’’ శంకరగళం ప్రపంచ సారతంత్రాన్ని ప్రవచిస్తోంది.అతడి ప్రవాహధోరణికి మండన మిశ్రుడు మొదట విస్మయ పడ్డాడు. కర్మకాండను ప్రవచించిన పూర్వమీమాంసను జీవితకాలమూ ఆరాధిస్తూ వచ్చిన వ్యక్తి అతడు. దానిని కాదని జ్ఞానకాండను బోధిస్తున్న శంకరుణ్ణి వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నప్పుడు... వాదంలోకి వేదాంతశాస్త్రాన్ని రానివ్వకుండా చూసుకోవలసింది. కానీ అతడు ఆ పని చేయక పొరబాటు చేశాడు. దానితో శంకర విజయం నల్లేరు మీద బండి నడక అయింది. ఇప్పుడు మండన మిశ్రుని ఇల్లాలైన ఉభయ భారతి వాదానికి సిద్ధపడింది. శంకరుణ్ణి పూర్వమీమాంసకు ప్రాతిపదికగా నిలిచిన తంత్రశాస్త్రంలోకి దించింది. మండన మిశ్రునికి ఈ పరిణామం ఒకవంక మోదాన్ని, ఒకవంక ఖేదాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే అతడు శంకరుణ్ణే తన గురువుగా మనసా అంగీకరించి ఉన్నాడు. కనుక ఎలాగైనా తన గురువే చివరకు విజయం సాధించాలని ఆరాట పడుతున్నాడు.ఉభయ భారతి సాగించిన యోగప్రస్థానాన్ని మూడు విభిన్న భూమికలలో నిరోధించి ఆమెను త్రిపుర, భువనేశ్వరి, వనదుర్గా శక్తులుగా దర్శించి, ఆకర్షించి నిలువరించిన వాడు శంకరుడు. శబ్దమయ ప్రపంచమనే మహారణ్యంలో అపూర్వము, అలభ్యమైన పుష్పాలను ఏరుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. అతడి వేగానికి ఉభయ భారతి అడ్డుకట్టలు వేస్తోంది.
‘‘తమరు ఆత్మవిద్యా విశారదులు. అందుకే రుద్రరూపమైన మకారం ఆత్మ అని చెబుతున్నారు. నిజానికి క నుంచి మ వరకు ఉన్న ఇరవై అయిదు హల్లు అక్షరాలనూ స్పర్శలనే పిలుస్తారు కదా! మకారానికే ఎందుకంత ప్రాధాన్యం?’’ అడిగిందామె.‘‘మవర్ణానికి ముందు, తరువాత కూడా సృష్టి ఉంది. కానీ సమస్తమూ అందులో నుంచే వచ్చి, తిరిగి అందులోనే లయమవుతోంది. హల్లులన్నీ అచ్చులతో కలిసినప్పుడే ప్రాణవంతాలు అవుతున్నాయి. వాటి తరువాత వచ్చే అంతస్థములైన ‘యరలవశ’లు సూర్యశక్తితో నిండిన వ్యాపనములు. వాటినుంచే పంచభూతాలు వచ్చాయి. ఇక గాలిని పైకి ఊదుతూ పలికే అక్షరాలను ఊష్మాలంటారు. అవే షసహళక్ష అనే అయిదు అక్షరాలుగా మారి అగ్నిశక్తితో నిండి పంచేంద్రియాలయ్యాయి. స్పర్శలని పిలిచే హల్లులకు, య నుంచి క్షవరకు గల వ్యాపన, ఊష్మాలకు.... అచ్చులు ప్రాణం పోసినప్పుడు స్వరం ఏర్పడి దేహంలో కదలిక వస్తోంది. అందువల్ల దేహం వేరు, ఆత్మ వేరు. అందువల్ల మకారమే ఆత్మ.
అదే లయస్థానం.... రుద్రరూపం’’ అన్నాడు శంకరుడు. కలగలిసిపోతున్న పెదవులు రెండింటినీ విశేష ప్రయత్నంతో విడగొట్టాలని ప్రయత్నిస్తుంటే... దేహంలోని నాడీతంత్రులన్నింటినీ స్పర్శిస్తూ నాసిక నుంచి పెదవుల నుంచి ఒకేసారి మకార ధ్వని పుడుతుంది. ప్రాణమనే అచ్చును కలబోయకుండా హల్లుగానే మకారాన్ని ఉచ్చరిస్తే పుట్టే నాదం లోలోపలే లయమైపోతూ ఉంటుంది. మెళకువలోని అనుక్షణమూ ఏదో ఒకటి వింటూ ఉండకపోతే అసలేమీ తోచదు మనకు. అర్థంపర్థం లేకుండా రొదపెడుతూ హోరుపుట్టిస్తూ వినిపిస్తున్న ధ్వనుల మైకంలో పడి ఇంద్రియ శక్తులను నిష్కయ్రగా, నిస్తేజంగా మార్చుకుంటూ ఉంటాం. వింటున్న దానినుంచి ఏదో అర్థం చేసుకోవాలని, వింటూ చదువుతూ తపించిపోతుంటాం. కానీ మనలో కన్నులు మూసుకుని వింటున్నదెంతమంది?! చెవులు మూసుకుని చదువుతున్నదెంతమంది?! ఆడంబరంగా శబ్దాలను పోగేసుకుంటూ ఉంటే లాభం లేదు... దానికి పరమైన పరమేశ్వరుణ్ణి తెలుసుకో లేదంటే నీ చదువు వృధా అంటోంది భాగవతం. నోరునొవ్వంగ హరికీర్తి పాడమంటోంది.
‘‘లయస్థానం సంగతి సరే... అక్షరశక్తి సృష్టి, స్థితులను ఎలా పాలిస్తుంది?’’ ఉభయభారతి తదుపరి ప్రశ్న వేసింది. ‘‘అకారం సృష్టికర్త రూపం. ఆకారం అతడి స్త్రీరూపం. ఇకారం శివస్వరూపం. ఈశత్వం అతడి శక్తి. ఉకారం స్థితికారకత్వం.... విష్ణురూపం. అతడి స్త్రీరూపమే ఊ. అక్కడి వరకూ ఉన్న ఆరు అక్షరాలనూ ఊర్ములని పిలుస్తారు. సృష్టి, స్థితి, లయలు ఏర్పడిన తరువాత జగత్ వ్యాపారం కొనసాగడానికి ముందుగా తొలి ఆరు అక్షరాల నుంచే ఆకలి, దప్పిక, శోకం, మోహం, జననం, మరణం అనే ఊర్ములు సంభవించాయి. అప్పుడు జగన్మాతృక అగ్నిబీజ రకారంనుంచి కళలను గ్రహించి ఋ, ౠ, అలు, అలూ అనే సంధ్యాక్షరాలను జనింప చేసింది. అవి వాయురూపాన్ని పొంది ఊర్ధ్వ అధోముఖాలుగా, కుడిఎడమ నాసికలలో ఉత్తరాయణ, దక్షిణాయనాలను సాగించాయి. ఆ తరువాత ఈశ్వరీశక్తి హ్రీంకారమై గుణ, కరణ, సంఘాత, చేతన శక్తుల చేత బిందు, విసర్గలతో సహా మిగిలిన అచ్చులను ఉద్భవింప చేసింది.’’ ప్రాణం పుట్టుకను, స్థితిని, లయను లిపిరూపమైన కాంతిగా... నాదంగా దర్శింపచేస్తున్నాడు శంకరుడు.
‘కదలికయే ప్రాణసంకేతం. అది సృష్టి ప్రారంభంలో అవ్యక్తనాదంగా వినిపించిందన్నారు కదా! నాదం విస్తరించిన తరువాత అయినా అదేమిటో తెలిసిందా లేదా? ఇంతకూ నాదబిందువుల సంయోగంలో వినబడిన ఆ తొలినాదం ఏది?’’ ప్రశ్నించింది ఉభయ భారతి. ‘‘ఓంకారం’’ సమాధానమిచ్చాడు శంకరుడు. ‘‘అకార, ఉకార, మకారాలను కలగలిపితే ఓ అనే అచ్చు అక్షరం పుడుతుంది. దానికి బిందు, నాదాలు కలిసినప్పుడు ‘ఓమ్’ అవుతుంది. అ నుంచి క్ష వరకూ అక్షర సమామ్నాయం అంతటికీ కలిపి ఏభై కళలున్నాయి. ఆ కళలన్నీ ఓంకారంలో ఉన్నాయి.
అదే సృష్టిలో వినబడిన తొలినాదం. ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నప్పటి లయం కంఠం నుంచి కిందికి పోతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఓంకారాన్ని కపోలబిందువుతో కలిపి వ్రాయడాన్ని బట్టి ఆ నాదం ఊర్ధ్వగతినే సూచిస్తుంది. దానినే సహస్రారంలోని బిందుస్థానంగా సమయాచార శాక్తేయులు చెబుతారు. బ్రహ్మజ్ఞానం పొందగోరే వారికి ఏకైక శరణ్యం ఓంకారమే’’ వివరించాడు శంకరుడు. ‘‘కాంతిని మీరు స్త్రీరూపంగా ప్రకృతిగా, ప్రధానగా, జగన్మాతగా వర్ణిస్తున్నారు. నాదం శివస్వరూపం కనుక పురుషునిగా వర్ణిస్తున్నారు. వారిద్దరిలో ముందుగా పుట్టినవారెవరు?’’ ఉభయ భారతి చిక్కుముడి వేసింది.
శంకరుడు తర్కాన్ని వినిపించాడు. ‘‘ఒకడు తలవంచుకుని కూర్చున్నాడు. ఉరుము శబ్దం వినబడింది. తలపైకెత్తి చూస్తే మెరుపు కాంతి కనవచ్చింది. ఆకాశం వంక ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాడు. ఉరుము పుట్టిన చోటి నుంచే మెరుపు వెలుగులు విస్తరించడం కానవచ్చింది. ఒకేసారి పుట్టిన కవలల్లో ముందుగా బయటకు వచ్చిన ప్రాణి ఎప్పుడూ రెండోదే అవుతుందనే లోకసామాన్య వ్యవహారం. మొత్తంమీద కాంతి ఎల్లప్పుడూ ఉన్నది. శబ్దం దానిని విస్తరించేందుకు సమకట్టింది. శబ్దసముచ్ఛయమే మంత్రమై వినిపించింది. లిపిబద్ధమైనప్పుడు దానిని బీజాక్షరమన్నారు. దేవతాస్వరూపాన్ని ఆ అక్షర రూపంలో చూడడానికి ఋషులు ప్రయత్నించారు. బీజాక్షరానికి దేవతానామాన్ని కలిపి స్పష్టమైన ఉచ్చారణతో పదేపదే మననం చేసినప్పుడు... సాధకునికి హృదయంలోనే ఆ దేవతాస్వరూపం కాంతిరూపంలో దర్శనమిస్తుంది. దైవవాణి నాదమై వినిపిస్తుంది’’ అని ఉభయతారకమైన సమాధానమిచ్చాడు శంకరుడు.ఉభయభారతి మరో మలుపుకు తిరిగింది. ‘‘ఇంతకూ అక్షర జగత్తును కన్నతల్లి ఎవరు?’’ అని అడిగింది.
‘హకారమే జగత్పస్రూతిక. నాభినుంచి అగ్నికళగా పుట్టిన హకార నాదం అనాహతాన్ని పూరించి, కంఠమూలం నుంచి వాయురూపంగా బయటకు వెలువడుతుంది. హ్రీంకార మాయాబీజ స్వరూపిణిౖయె భువనేశ్వరి ఈ చతుర్దశ భువనాలనూ నిర్మించింది. అది అంతుపట్టకుండా విస్తరిస్తున్నప్పుడు విష్ణువు హంసగా మారాడు. హ్రీంకారంలోని కుండలినీ శక్తిని సవితగా మార్చి మోసుకెళ్లి సూర్యునిలో నిక్షేపించాడు. మనం నివసిస్తున్న భువన బ్రహ్మాండానికి కావలసిన పోషక శక్తి అంతా సూర్యుని నుంచి వస్తున్నది. చర్మచక్షువులతో చూడలేని సూర్యునిలోని ఆ సవితాశక్తి మనలోనికి గాయత్రీ ఉచ్చారణ వల్ల వచ్చి చేరుతుంది’’ అన్నాడు శంకరుడు.
‘‘అయితే మనం నివసించే భువన బ్రహ్మాండానికి ఆవల మరెన్నో బ్రహ్మాండాలు ఉన్నాయన్న మాట. మనం దర్శిస్తున్న ఈ సూర్యుడు కాక మహాసౌర శక్తి వేరే ఉన్నదన్నమాట. దర్శమొదలు పౌర్ణమి వరకు పదహారు కళలు ప్రదర్శించే ఈ చంద్రుడు కాకుండా వేరే చంద్రమండలం ఉన్నదన్న మాట.’’ ‘‘అవును. భూమండల నివాసులమైన మనం ఇక్కడ చర్మచక్షువులతో దర్శిస్తున్నవన్నీ అసలు శక్తులకు ప్రతీకలే. ఇవన్నీ నిజశక్తులతో మనకు అనుసంధానం కలిగించగలవు. ఆ శక్తి ఋషులు నిర్మించిన మంత్రనాదానికి ఉంది’’ అని ఘంటాపథంగా చెప్పాడు శంకరుడు.
‘‘అయితే పరమశివుని ఫాలభాగాన కనిపించే అసలు నెలవంక ఏది? దానికి సమానమైన శక్తికళ ఏది?’’ మళ్లీ ప్రశ్నించింది ఉభయభారతి. ‘‘రుద్రునికి మొత్తం పదహారు కళలున్నాయి. యోగి అయిన ఆయన ధరించే మొదటి కళకు పేరు నివృత్తి. ఆయన ఏడింట భవభూతిగా ఉన్నప్పుడు ఋత్వాన్ని పోలివుండే రేచికా అనే చంద్రకళను ధరించినప్పుడు సతి ఆయనను వరించింది. ఎనిమిదోదైన ౠకారాన్ని పోలివుండే మోచికాకళను ఆశ్రయించి ఆమె గోముఖిౖయె, తిథి స్వరూపుడైన శివుణ్ణి కూడుతుంది’’ అన్నాడు శంకరుడు. శ్రీవిద్యా రత్నసూత్రాలను, సుభగోదయ స్తుతిని అందించిన గౌడపాదుని శిష్యపరంపరలో సాక్షాత్ శంకరుడు ఇప్పటికి పరమ శాక్తేయునిగా అవతరించాడు. ఎన్నెన్నో విశ్వ మహారహస్యాలను సంకేతార్థాలనిచ్చే శ్లోకాలుగా ప్రపంచసార తంత్రంలో పొందుపరిచాడు. అతడికి ముఖ్యశిష్యుడైన పద్మపాదుడు దానికి విశేష వివరణతో కూడిన వృత్తిని రచించి ఇతరులకు వివరించాడు. ఉపాసనాకాండకు ఊతమిచ్చిన ఈ ప్రపంచసార తంత్రాన్ని తరువాతి కాలంలో ఎందరెందరో విభిన్న కోణాల్లో విశ్లేషించారు.
ఆనాడు కుమారసంభవ సృష్టికర్త సన్నిధిలో శంకరుడు కళామయ ప్రపంచాన్ని మహోన్నతంగా ఆవిష్కరించాడు. బిందు, నాదకళా సంయోగాలపై ఆ చర్చ సుదీర్ఘంగా సాగింది. ‘‘హ్రీకారంలోని అగ్నిశిఖ క్లీం శక్తియై పురుషుణ్ణి ఆకర్షించింది. తిథిస్వరూపుడైన రుద్రుడు ఎన్నివేల యుగాల వరకూ గోముఖి అనే పేరుగల శక్తికళతో రమిస్తూ ఉండిపోయాడో ఎవరికీ తెలియదు. దక్షయజ్ఞం సతీవియోగానికి కారణమైంది. శివునిలో నైరాశ్యం ఆవరించింది. మూలాధారంలో పరాబిందువుతో కలిసి అదేపేరు గలిగిన నాదమయుడై తనలో తానే దాగిపోయాడు. అప్పుడాయనను స్థాణువని పిలిచారు. ఆ స్థితినుంచి ఆయనను మణిపూరంలోని తన స్వస్థానానికి సూక్ష్మకళగా ఆకర్షించింది పార్వతి. శివుడు సామాన్య స్పందనతో పశ్యంతి వాక్కుగా వెలువడ్డాడు. కార్యబిందువు హృదయస్థానానికి ఆ నాదాన్ని లాగినప్పుడు మధ్యమ వాక్కుగా సూక్ష్మామృత కళను, విశుద్ధి, సహస్రారాల మధ్యకు అతడిని ఆమె ఆహ్వానించినప్పుడు వైఖరీ వాక్కుగా జ్ఞానామృత కళలను ప్రదర్శించాడు.
సద్యోజాతుడై శివుడు ఆప్యాయనీ కళను ప్రదర్శించినప్పుడు శక్తి దానిని జ్వాలాముఖియై అందుకుంది. అనుగ్రహేశ్వరుడై వ్యాపినీ కళను ప్రదర్శించినప్పుడు ఆమె ఉల్కాముఖిగా మారి ఒడిసిపట్టింది. అక్రూరుడై వ్యోమరూపాన్ని ధరించినప్పుడు ఆమె శ్రీముఖియై శివతత్త్వాన్ని జగత్తుకు వెల్లడి చేసింది. మహాసేనుడై అనంతరూపాన్ని ధరించినప్పుడు విద్యాముఖియై ఆయనను అరవైనాలుగు కళాస్వరూపాలతో వర్ణించి తనివి పొందింది. ఇవన్నీ అష్టమి నుంచి పాడ్యమిలోపు కృష్ణపక్షంలో జరిగిన సంగతులు’’ అన్నాడు శంకరుడు. ‘‘జగత్ వ్యాపారం కొనసాగడానికి జగజ్జనని తరువాతి దశలో ఏం చేసింది?’’ ఉభయభారతి కీలకమైన తదుపరి ప్రశ్న వేసింది. ‘‘కామ, అగ్ని, నాదాలనే మూడు క్రియలను చేపట్టింది’’ అని సమాధానమిచ్చాడు శంకరుడు. ‘‘ఖండద్వయయుతా చతుర్థస్వర విశిష్టా కామకళా... అని కదూ గౌడపాదులు సూత్రీకరించారు?!’’ అని ఉభయ భారతి ముక్తాయింపుకు ఆదితాళమేసింది.
– సశేషం
- నేతి సూర్యనారాయణ శర్మ
Comments
Please login to add a commentAdd a comment