‘‘శంకరాచార్యా! నేను మీ ఉపనిషత్ మతాన్ని సమ్మతించను. వేదం అపౌరుషేయం. కానీ ఉపనిషత్తులు వేర్వేరు ఋషుల చర్చలు మాత్రమే. వేదమంత్రాలకు ఉన్న శక్తి ఉపనిషత్ వాక్యాలకు ఉందంటే ఒప్పుకోను’’ ఈ మాటతో శంకర మండనమిశ్ర సంవాదం ఆసక్తికరంగా ప్రారంభమైంది.
‘‘ఎందుకు? వేదమంత్రంతో మీరు ఒక దైవాన్ని ఆహ్వానించవచ్చు. అర్చించవచ్చు. కోరిన కోరికలు నెరవేర్చుకోవచ్చు. కానీ ఉపనిషత్ వాక్యాల వల్ల దైవికమైన చైతన్యాన్ని దర్శించవచ్చు. సర్వాత్మ భావన పెంపొందించుకో వచ్చు’’ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు శంకరుడు.
‘‘సర్వాత్మ భావన మానసికమే కానీ, క్రియారూపం కాదు కదా! శక్తి ఎప్పుడూ మంత్రంతోనే పుడుతుంది. ఉపనిషత్ వాక్యానికి ఆ విధమైన శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు’’ ఘంటాపథంగా చెప్పాడు మండనుడు.
‘‘ఎందుకు లేదు? పరమేష్ఠి సల్పిన క్రియారూప తపస్సే సృష్టి. ఆయన నుంచి వెలువడిన తొలిశబ్దమే అహం బ్రహ్మాస్మి అన్నది. పరబ్రహ్మ తనను తాను ‘నేను’ అని గుర్తించడమే అతడి సృష్టిరచనకు కారణమైంది’’ చెప్పాడు శంకరుడు.
చిగురాకుల రెపరెపలతో గాలి మంద్రంగా వీస్తోంది. అందరూ చెవులు రిక్కించి వింటున్నారు.
‘‘పరబ్రహ్మ గాఢనిద్రలో ఉన్నాడు. అప్పుడు సృష్టి ఆత్మగా ఉంది. పరబ్రహ్మ కన్నులు విప్పి చూసి, తనను తానే చూసుకుని కలవరపడ్డాడు. అంతలోనే అతడికి తనకంటే భిన్నంగా ఇక్కడేమీ లేదని అర్థమైంది. ‘అహం బ్రహ్మాస్మి’... నేనే బ్రహ్మమును అవుతున్నాను అన్నాడు. అదే అతడి నోటివెంట వెలువడిన తొలివాక్యం. దానితో అతడికి సర్వాత్మ భావన ఏర్పడింది. ఈకాలంలో కూడా ఎవరైనా ఆ ఉపనిషత్ వాక్యాన్ని అనుసంధానం చేయడం ద్వారా సర్వాత్మ భావనను పెంచుకోవాలని ప్రయత్నిస్తే అతడిని దేవతలు సైతం అడ్డుకోరని బృహదారణ్యకం స్పష్టం చేస్తోంది. ఇది తెలిసినా తెలియకపోయినా మానవులు ఏ మాట చెప్పడానికైనా ముందుగా నేను అని మొదలుపెడుతూ ఉంటారు. అది బ్రహ్మ నుంచి వచ్చిన ఆ అలవాటు. దానికంటే శక్తివంతమైనది ఏముంది?’’ ప్రశ్నించాడు శంకరుడు.
‘‘నేను అన్న తరువాత వెంటనే ఒకడు బ్రహ్మమును అనకుండా వెంకన్నను, సుబ్బన్నను అంటే... అప్పుడు శక్తిహీనమైన వాక్యమే అవుతుందా?’’ మెలికపెట్టాడు మండనుడు.
‘‘కాదు. అక్కడ అహం బ్రహ్మాస్మి అని ప్రకటన చేస్తున్నది బ్రహ్మమే అవుతోంది కానీ, ఇతడు కాదని తెలుసుకోవాలి. సాధకుడు బ్రహ్మమే నేనుగా అయింది అనే భావనతో తన సాధన ప్రారంభిస్తాడు. ఇక్కడ పొరబాటు, ఏమరుపాటు ఉండకూడదు. ‘అహం బ్రహ్మాస్మి’ వంటి ఉపనిషత్ వాక్యాలు స్వస్వరూపాను సంధానానికి ఉపయోగపడాలి. నిత్యానిత్య వస్తువివేకంతో, నిదిధ్యాసతో పరబ్రహ్మతో అపరోక్షానుభూతిని సొంతం చేసుకోవాలి. అంతేకానీ జీవుడైన తననే తత్ అని పిలిచే పరబ్రహ్మగా ధ్యానించే స్వాత్మతత్త్వంలో పడకూడదు. జీవుడే దేవుడు ఎన్నటికీ కాదు. కానీ ఆ రెంటికీ భేదం లేదు. ఆ రెండూ ఎన్నటికీ విడివిడిగా ఉన్నదీ లేదు’’ చెప్పాడు శంకరుడు.
‘‘అంటే జీవేశ్వరులు ఎప్పుడూ కలిసే ఉన్నారంటారు. అంతేనా...’’ అన్నాడు విషయాన్ని తేల్చేస్తూ మండనుడు. ‘‘యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే సమయంలో ఆధ్వర్యం వహించే ఋత్విక్కులను మేము దేవతా స్వరూపులుగా అర్చిస్తాం. అంతమాత్రం చేత వారే ఆ దేవతలు అయిపోలేరు కదా! తానూ దైవమూ ఒక్కటి కాదన్న స్పృహ మానవుడికి ఎప్పుడూ ఉండనే ఉంది కదా! అందుకే పూజలు, మంత్రాలు, హోమాలు ఈ కర్మకాండ అంతా వేదమార్గంలో ప్రవేశించాయి. జ్ఞానమే గొప్పది... కర్మకాండ వృథా ప్రయాస అని చెబితే వాటిని వేదం ఎందుకు చెప్పినట్లు?’’ ప్రశ్నించాడు.
సమాధానం చెప్పేందుకు శంకరుడు ఉద్యుక్తుడవుతున్నాడు. ఇంతలో సభాస్తంభాలపై నిలిచి వింటున్న చిలుకలు రెండు ఒకేసారి ఇలా ఆలపించాయి....
పూజకోటి సమం స్తోత్రం
స్తోత్రకోటి సమం మంత్రం
మంత్రకోటి సమం ధ్యానం
ధ్యానకోటి సమం లయః
శంకరుడు ఆ శ్లోకార్థాన్నే వివరించడం ప్రారంభించాడు. ‘‘షోడశోపచారాలతో, వివిధ ద్రవ్యాలను ఉపయోగిస్తూ దైవాన్ని అర్చించడం పూజ అవుతుంది. అటువంటి కోటి పూజలతో సమానమైనది స్తోత్రం. వేదసూక్తాలు, ఋషులిచ్చిన స్తోత్రాలు భగవత్ తత్త్వసారాన్ని ఒంటపట్టిస్తాయి. అతివిస్తారమైన ఆ తత్త్వాన్ని అనేక కోణాల నుంచి అర్థం చేసుకోవడానికి మానవుడు చాలానే శ్రమపడాల్సి వస్తుంది. తెలియని వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే ఆ మాటల లోకాన్ని కల్పించడం జరిగింది. ఆ లోకంలో ప్రవేశించినవాడు పరమార్థాన్ని అన్వేషించడం ప్రారంభిస్తాడు. అటువంటి వారికే శబ్దబ్రహ్మను బీజాక్షారాలలో నిక్షిప్తం చేస్తూ కోట్లాది మంత్రాలు పుట్టాయి. ఆ మంత్రాన్ని మననం చేస్తున్న కొద్దీ పుడుతున్న శక్తి సాధకునికి కాంతిరూపంలో సాక్షాత్కరిస్తుంది. క్రమంగా పెదవులు మంత్రాన్ని జపించడం మానివేస్తాయి. సాధకుని మనస్సు మంత్రాధిదేవతను తన ముందు ఉంచుకుని నడవడం మొదలుపెడుతుంది. అలా దేవతా చైతన్యంతో నిండిన మనస్సు నీరవ నిశ్శబ్దస్థితిలో చేసేదే ధ్యానం. అది తదేకలగ్నం అయ్యే కొద్దీ మనోభూమిక సైతం రద్దయిపోతుంది. అమనస్కయోగి సాధన లయయోగంలో ప్రవేశించడంతో బ్రహ్మజ్ఞానం అందుకోవడానికి తగిన అర్హతను సాధిస్తుంది.’’ అన్నాడు.
‘‘జ్ఞానమేం చేస్తుంది స్వామీ! ప్రారబ్ధ కర్మను తప్పించగలదా? మానవుడు తాను అప్పటివరకూ పడుతున్న కష్టాలను తొలగించగలదా? అలా జరగనప్పుడు బతుకు దుర్భరమైపోదా? సామాన్యుడికి ఈ జ్ఞానంతో పనేమిటి?’’ మండనుడి వాదన అడ్డగోలుగా తిరిగింది.
‘‘ఇది బ్రహ్మజ్ఞానంలోని వైవిధ్యాన్ని తెలుసుకోనందువల్ల వచ్చిన అపవాదు. బ్రహ్మజ్ఞానం ఏకైక స్వరూపమే. కానీ బ్రహ్మసాక్షాత్కారం కలిగిన జ్ఞానులు పొందే సమాధినిష్ఠలో తారతమ్యాలున్నాయి. జ్ఞానాన్ని పొందగోరి సత్త్వాపత్తి అనే సమాధి నిష్ఠలో ఉన్నవారిని బ్రహ్మవేత్తలంటారు. వారికి జ్ఞాన ప్రారబ్ధాలలో వర్తమానంలో ఆచరిస్తున్న ప్రారబ్ధమే బలవత్తరంగా ఉంటుంది. ఆ ప్రారబ్ధకర్మను అనుభవం చేత క్షీణింప చేసుకుంటారు. ఆత్మను బ్రహ్మయందు లీనం చేసి, గతజన్మలలోనూ ఈ జన్మలోనూ మూటగట్టుకున్న సంచిత కర్మలను నశింప చేసుకుంటారు. తాము నిష్క్రియాత్మ స్వరూపులమనే దృఢనిశ్చయం తెచ్చుకున్న వారు కనుక వారిని ఆగామి కర్మలు అంటుకోవు’’ నిలకడగా చెప్పాడు శంకరుడు.
‘‘ఇప్పుడు అనుభవిస్తున్న ప్రారబ్ధ కర్మలు కొద్దిపాటివి మాత్రమే. కానీ మనకు తెలియకుండానే మూటగట్టుకున్న సంచిత కర్మలు అనంతాలు కదా! వాటినేం చేస్తారు?’’ విసుగు ప్రదర్శించాడు మండనుడు.
‘‘దానిని దహించివేసే అగ్ని సమ్యక్ జ్ఞానమే. ఆత్మను ఆ అగ్నిలో ప్రకాశింప చేసుకోవడమే సన్యాసం. అక్కడ అప్పటికప్పుడు అనుభవిస్తూ నశింపచేసుకుంటున్న ప్రారబ్ధ కర్మలే కానీ, వెనుక నుంచి తెచ్చుకున్నవి, ముందు అనుభవించాల్సినవి ఏమీ ఉండవు. ఆ కర్మలను సన్యాసి స్థితప్రజ్ఞతో నిర్వహిస్తున్నప్పుడు బ్రహ్మవిద్వరుడు అవుతాడు. ఇతడి సమాధి నిష్ఠను అసంసక్తి అని పిలుస్తారు’’ శంకరుడింకా పూర్తి చేయలేదు.
‘సత్సంగత్వే నిస్సంగత్వం’ అంటూ రామచిలుకలు భజగోవిందాన్ని పాడాయి.
‘‘అందుకే ఏ సంగత్వమూ లేకుండా పోవడానికే సన్యాసులు ఇల్లు, పెళ్లి, పిల్లలనే బంధాలను విడిచిపెట్టేస్తారు. కొందరు అడవులు పట్టిపోతారు. మరికొందరు ఇదిగో ఇలా దేశంమీద పడి గృహస్థుల లౌకిక వ్యవహారాలను చెడగొడుతూ ఉంటారు’’ మండనుడి ముఖంలో వైషమ్యభావం సెగలు కక్కుతోంది.
‘‘బ్రహ్మజ్ఞానం తాలూకు సమాధినిష్ఠలో మూడోదశ ఉంది. అదే పదార్థాభావన అని పిలిచే బ్రహ్మవిద్వరీయసుని స్థితి. ఆ స్థితిని చేరుకోవడానికి ఎవరైనా సన్యాసాశ్రమంలోనే చేరనక్కరలేదు. మీ కర్మమార్గం తెచ్చిపెట్టే ఆరాటాన్ని జయిస్తే గృహస్థుగానూ పొందవచ్చు. బ్రహ్మవిద్వరీయసునికి చేసినది, చేస్తున్నది, చేయాల్సింది అంటూ కర్మలేమీ ఉండవు. బ్రహ్మచైతన్యం పురిగొల్పినప్పుడు దానికో పనిముట్టుగా చేయాల్సిందేదో చేస్తుంటాడు. లేనప్పుడు ఏమీ చేయకుండానే ఊరుకుంటాడు. తనంత తానుగా నిష్ఠ నుంచి వెలికిరాడు’’ మూసివుంచిన కన్నులముందు శంకరునికి భక్త ప్రహ్లాదుడు దర్శనమిచ్చాడు.
‘‘నీ తిండి నువ్వు సంపాదించుకోవు. నీ శరీరాన్ని పోషించే బాధ్యతకూడా పక్కవాడిమీదే పెట్టినప్పుడు నిశ్చింత కాక మరేమిటి వస్తుంది? ఎవరోవచ్చి అయ్యోపాపమని తినబెడితే తింటావు. లేనప్పుడు ఊరుకుంటావు. నీ సొమ్మేం పోయింది’’ మండనుడి విమర్శ అధమస్థాయికి జారుతోంది.
సభాసదులలో ముఖ్యపీఠాన్ని అధిరోహించిన కాళిదాసు అతడిని వారించాడు. ‘‘ఆర్య మండనమిశ్రా! తమరు వ్యక్తిగత విమర్శలకు దిగవద్దు. శాస్త్రచర్చను నీరుకార్చ వద్దు. మీస్థాయికి తగిన రీతిలో ప్రవర్తించండి’’ అన్నాడు. మండనుడు సర్దుకుని కూర్చుని, మౌనం వహించాడు. శంకరుడు కొనసాగించాడు.
‘‘కట్టకడపటిదైన తుర్యగ్ స్థితి ఉన్నది. అది బ్రహ్మవిద్వరిష్ఠుని స్థితి. ఆ స్థితిలోనే జీవుడు బ్రహ్మమయుడు అవుతాడు. అది నిర్గుణ పరబ్రహ్మ స్థానము. దానికంటే పైకి వెళ్లాల్సిన అవసరం కానీ, క్రిందికి దిగి జన్మకు రావాల్సిన అవసరం కానీ ఉండదు. ఆ సిద్ధుడు అనుకుంటే రావడం, పోవడమే. జన్మరాహిత్యమంటే అదే’’ అన్నాడు.
‘‘మరి ఈ సిద్ధులన్నీ సాధించలేని మామూలు మానవుడి గతి ఏమిటి? వాడికి ముక్తి లభించే మార్గమే లేదా? ఎప్పటికీ అధోగతి తప్పదా?’’ మండన మిశ్రుడు తదుపరి ప్రశ్న వేశాడు.
‘‘దానినే మాయ అంటున్నాం. ఆ మాయను తరించడానికి కర్మమార్గమూ, జ్ఞానమార్గమూ అంగీకరించే ఒకే ఒక శక్తికి పేరు భక్తి. భావన బలంగా ఉండాలే కానీ, భక్తి సాధించలేనిది ఏమీ లేదు’’ అన్నాడు శంకరుడు. భక్తిప్రాధాన్యాన్ని ఇలా విస్తరించాడు.
మోక్షకారణసామగ్య్రాం భక్తిరేవ గరీయసీ
స్వస్వరూపానుసన్ధానం భక్తిరిత్యభిధీయతే
అపరోక్షానుభూతిని అందించేది భక్తి. ద్వైదీభావాన్ని నశింపచేసి ఆత్మను అద్వితీయ పరబ్రహ్మ సాక్షాత్కారానికి ఆయత్తం చేస్తుంది. బ్రహ్మాత్మల ఏకత్వ స్థితి ఎల్లవేళలా ఉంటుంది. ఇది దర్శించి తెలుసుకోవలసిందే. దీనికి అందరూ అర్హులే. అసమానమైన భక్తిని హృదయం నిండా నింపుకున్నవాడికి ఆరువిధాలుగా ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సాయుజ్యము అంటే భగవంతునికి దగ్గరగా వెళ్లడం. సాలోక్యము అంటే భగవత్ లోకానికి చేరుకోవడం. సామీప్యము అంటే భగవంతుని చేరువలో నిలిచే అర్హత సాధించుకోవడం. సారూప్యము అంటే భగవత్ రూపాన్ని తాను పొందడం. సామ్యము అంటే భగవంతునితో సమానుడు కావడం. బ్రహ్మలీనుడు ఆయనలోనే లీనమైపోవడం. ఈ చిట్టచివరి స్థితిని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ భావనాబలాన్ని సాధించడంలోనే వెనుకంజ వేస్తుంటారు. ఎడతెగని కర్మలను నిర్వహిస్తూ ఆరాటం పెంచుకుంటారు. ముక్తి కోరుకుంటే వెంటనే లభించి తీరుతుంది. అంతటి విశ్వాసం ఉండాలి ముందుగా. దానికి భక్తి మాత్రమే చక్కని మార్గం వేయగలుగుతుంది. కామోత్కంఠత వల్ల గోపికలు, భయంతో కంసుడు, వైరం పూనిన శిశుపాలాదులు, శ్రీకృష్ణదేవుడు జన్మించినందువల్ల వృష్ణి వంశం, ప్రేమతో పాండవులు, భక్తితో నారదాదులు విష్ణు సాయుజ్యాన్ని పొందారు. అటువంటి ఏదో ఒక మార్గాన్ని సాధకుడు ఎంచుకోవాలి. ’’
‘‘సరేలెండి స్వామీ! మీ వరస చూస్తుంటే పరలోకం ఒకటుందని కూడా ఒప్పుకునేట్లు లేరు. ముక్తిని కూడా నేలమీదకు లాక్కొచ్చి నిలబెట్టేలా ఉన్నారు. దాని సంగతి తర్వాత చూద్దాం. మీరు బోధించే జ్ఞానమార్గంలో కూడా దుష్టజ్ఞానం, అజ్ఞానం, సంశయం అనే మూడు దశలుంటాయి. ఆ మూడింటినీ దాటిన తరువాత కదా మానవుడు భక్తి పరుడు కావడం. నేటి మానవుడికి భక్తితోనూ, చివరకు భగవంతునితోనూ కూడా పనిలేదు. కావలసిందల్లా కోరిక నెరవేరడం. నిన్నమొన్నటి ద్రుపదరాజు హోమగుండం నుంచి నేరుగా సంతానాన్ని పొందాడు. సకల వస్తు సంపదలను, సంతానాన్ని, సమస్త వాంఛితార్థాలను హోమగుండమే అందిస్తుంది. భక్తిలోపం కలిగినా పరవాలేదు కానీ, కర్మలోపం చేయకుండా ఉంటే ఫలితం దానంతట అదే పుడుతుంది. ఇదే అచ్చంగా అందరికీ కావలసింది. కోరిన కోరిక నెరవేరాలి’’ పూర్వమీమాంసా దర్శనాన్ని కాచివడబోశాడు మండనుడు.
‘‘భక్తుని కోరిక నెరవేర్చడమే భగవంతునికి అభీష్టం. అందులో సందేహమేమీ లేదు. కానీ కోరుకోవడమే భక్తునికి తెలియదు. రెండింతలు మూడింతలుగా దొరికే అనుగ్రహాన్ని భక్తుడు అల్పమైన కోరికతో సరిపెట్టేసుకుంటాడు కర్మనిష్ఠుడు’’ అని సెలవిచ్చాడు శంకరుడు.
‘‘కావచ్చు. కానీ మాకు మా లౌకిక వ్యవహారాలు సజావుగా నడవడమే కావలసింది. మా పాతకాన్ని జపం పోగొడుతుంది. వాంఛితాన్ని అగ్నిహోత్రం ఇస్తుంది. లయసమాధులను సాధించే మీరంతా నివృత్తి మార్గం పట్టి సన్యాసులై పోతుంటే లోకవృత్తం అస్తవ్యస్తమవుతుంది. ఇందుకు మేం అంగీకరించం’’ అన్నాడు మండన మిశ్రుడు.
‘‘అగ్నిముఖంగా వెలువడుతున్న చైతన్యమంతా భగవద్దత్తమే. అగ్ని ఆరాధన అప్రయోజనమని మేమూ చెప్పడం లేదు. కానీ మీ గృహస్థుల తరహాలో కామ్యకర్మలను చేయకుండా విడిచిపెట్టేశాం అంతే...’’ చెప్పాడు శంకరుడు.
‘‘అయితే కర్మకాండ అవశ్యం అనుసరణీయమేనని అంగీకరించనట్లేనా?’’ అడిగాడు మండనుడు.
‘‘వ్యక్తి సంక్షేమం కోసం, సమాజక్షేమం కోసం నిత్యకర్మలను ప్రతి ఒక్కరూ చేయవలసిందే. ఇక సందర్భానుసారంగా చేయవలసినవి నైమిత్తిక కర్మలు. జన్మకు వచ్చినందుకు వాటిని అనుసరించడం మన బాధ్యత. కానీ కర్తృత్వాన్ని మనపై పెట్టుకోకూడదు. అంటే నేను చేస్తున్నది భగవంతుని పని అనే భావనతో నిమిత్తమాత్రంగా ఉండి కర్మ నిర్వహణ చేయాలి. చివరిగా కామ్యకర్మలను పూర్తిగా విడిచిపెట్టాలి. కోరికలతో సత్కర్మలను ఆచరించ కూడదు. జనన మరణ చక్ర పరిభ్రమణం నుంచి విడుదలయ్యేలా ప్రారబ్ధ, సంచిత, ఆగామి, కర్మలు నిశ్శేషమయ్యేలా నిష్కామ కర్మలను మాత్రమే తప్పక ఆచరించాలి’’ విశదీకరించాడు శంకరుడు.
‘‘కోరికలే లేకపోతే తమరు ముక్కుమూసుకుని తపస్సు చేసుకోండి. ప్రజల మధ్యకు రావడం ఎందుకు? ఆకలి దప్పికల వేళ, ఆలిని కూడే వేళ, పుత్రాదులను పొందేవేళ కామపురుషార్థాన్ని ధర్మయుతంగా సాధించే గృహస్థుకంటే మోక్షానికి అర్హుడెవ్వడు?’’ మండనమిశ్రుని గుండెల్లోని ఆరాటం అతడి మెడలో వేలాడుతున్న పూలమాలకు అర్థమవుతోంది. – సశేషం
భక్తిరేవ గరీయసీ
Published Sun, Nov 24 2019 5:36 AM | Last Updated on Sun, Nov 24 2019 5:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment