ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర  | Biography of Adi Shankaracharya In Funday | Sakshi
Sakshi News home page

వ్యాస దర్శనం

Published Wed, Oct 30 2019 11:36 AM | Last Updated on Wed, Oct 30 2019 11:36 AM

Biography of Adi Shankaracharya In Funday - Sakshi

‘‘అంత్యేష్టి సంస్కారం ఒక్కరోజుతో ముగిసిపోయేది కాదు. సన్యాసులైన మీకు శ్రాద్ధాదులు నిర్వహించే అవకాశం ఎలాగూ లేదు. అయినా ఇంటి బాధ్యతలు విడిచిపెట్టి ఏనాడో సన్యసించిన మీకు ఇప్పుడు మాత్రం ఎందుకింత ఆరాటం? ఇందులో మీకెందుకింత పట్టుదల?’’ తీవ్రంగా ప్రశ్నించారెవరో.

శంకరుడు ఒక్కక్షణం కన్నులు మూసుకున్నాడు. దేహత్యాగం తరువాత కూడా తల్లి మనసులోని కోరికలో ఏ మార్పూ లేదని గ్రహించాడు. కన్నులు తెరిచి అందరివంకా చిరునవ్వుతో చూస్తూ ఇలా సమాధానం చెప్పాడు...

‘ఆత్మయందు అగ్నిని ఆరోపించుకున్న సన్యాసిని నేను. అగ్నిలాగే సర్వత్ర పూజనీయుణ్ణి. అగ్నిలాగే సన్యాసి సమక్షంలో సమస్తమూ శుద్ధత్వాన్ని పొందుతుంది. పుణ్యక్షేత్రము, పుణ్యసమయము, సన్యాసి సన్నిధి తపస్సులకు రెట్టింపు ఫలాలనిస్తాయి. యతి సమక్షంలో నిర్వహించిన క్రతువులు దేవతానుగ్రహాన్ని శీఘ్రంగా సంపాదించి పెడతాయి. తల్లిదండ్రులు, బంధువులు నాకెవరూ లేరు. లౌకిక బంధాలేవీ నాకు లేవు. తోటి సన్యాసులు తప్ప ఇతరులు నాకు నమస్కరిస్తే ప్రతి నమస్కారం చేయాల్సిన అవసరం కూడా లేనివాణ్ణి. అయినప్పటికీ జీవులందరిలాగే నాకు కూడా తల్లిని మించిన దైవం లేదు. ఈ యతిజీవితానికి రాకముందు జన్మనిచ్చిన తల్లి కోరిన కోరిక తీర్చవలసిన బాధ్యత నాపై ఉంది. శాస్త్రవిరుద్ధమైనా అది నెరవేర్చక తప్పదు.’’ 

‘‘మీరు చేస్తారు సరే... రాబోయే తరాల్లో ఎవరైనా శంకరుడే చేసిన పనిని మేమెందుకు చేయరాదు అని పూనుకుంటే ఏమని సమాధానం చెప్పాలి’’ గుంపులో నుంచి మరోప్రశ్న వచ్చింది. ప్రశ్న అడిగిన వ్యక్తివంక పరమ అసహనంగా చూశాడు కారుణ్య శంకరుడు. ‘‘అల్పప్రజ్ఞావంతుడు సాహస కార్యాలకు పూనుకోక పోవడమే మంచిది. అయినా మన సమాజంలో అనుకరించే వారే కానీ, అనుసరించే వారు చాలా అరుదు. అటువంటి వారికి సమాధానం చెప్పవలసి వస్తే ఇదిగో ఇది వినండి.... పరంపరగా అపరాధాలు చేస్తూవుండే కుపుత్రుడినైనా తల్లి తప్పక చేరదీస్తుంది. అజ్ఞానం కొద్దీ అపమార్గం తొక్కినా తిరిగి తన చరణాల వద్దకు చేర్చుకుంటుంది. నేను సన్యాసిగా మారేందుకు ఒకనాడు నా తల్లిని మోసపుచ్చాను. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకామె ఇలా కల్పించిందని భావిస్తాను. బలీయమైన కోరికను నెరవేర్చుకునేందుకు అపమార్గాన్ని తొక్కినవారెవరైనా సరే తదుపరి జరగబోయే పరిణామాలకు కూడా సిద్ధంగానే ఉండాలి. నేను అన్నింటికీ సిద్ధపడే వచ్చాను. వెనుకడుగు వేసేది లేదు.’’ శంకరుని పలుకులు కొదమసింహం గర్జించినట్లున్నాయి.

పూర్వాచార పరాయణత్వమే ఆరోవూపిరి అయిన కాలటి ప్రజలు వెనక్కి తగ్గలేదు. శంకరుని కోరిక మన్నించలేదు. 
‘‘మేము కూడా మీలాగే సిద్ధపడి ఉండాలి కదా! మీరు మా గుడికి వస్తే మీ చేతికి హారతిని అందిస్తాం. మీ చేతిమీదుగా నీరాజనమిస్తే దైవం సానుకూల పడతాడని భావిస్తాం. దీపం అందిస్తాం. మీరు వెలిగించిన మరోదీపం సాక్షాత్తూ భగవత్‌ స్వరూపమేనని మొక్కుతాం. కానీ మీ భోజనానికి వంటచెరుకు ఇవ్వడానికి సైతం అంగీకరించం కదా! మీ తిండికే ఇవ్వని నిప్పుని....తల్లికి తలకొరివి పెట్టేందుకు మాత్రం ఇస్తామని ఎలా అనుకుంటున్నారు? మా వంశాలను ఉద్ధరించే పవిత్ర అగ్నిహోత్రాన్ని ఒక సన్యాసి చేతికి....అందులోనూ ఇటువంటి కార్యానికి ఏ ధైర్యంతో అందించమని శాసిస్తున్నారు?’’ అంటూ మొండిగా తమ వాదన కొనసాగించారు. అక్కడ శంకరుని జ్ఞాతులున్నారు. శంకరుని వల్ల, అతడి తల్లిదండ్రుల వల్ల అనేక విధాలుగా సాయాలు పొందినవారున్నారు. ఈ సమయంలో మాత్రం వంశాచారం భ్రష్టమైపోతున్నదనే బెంగే తప్ప...సాటిమనిషి పట్ల ఏమాత్రం జాలిలేదు వారిలో.

శంకరుడు వాదన కట్టిపెట్టి, మౌనంగా లేచి పెరటి వైపు నడిచాడు. ఎదురుగా పూర్ణానది ఒడ్డులొరుసుకుంటూ హోరున ప్రవహిస్తోంది. అందుబాటులో ఉన్న కలపను ఒకచోట చేర్చి స్వయంగా చితిపేర్చాడు శంకరుడు. లోనికి వచ్చి తల్లి పార్థివ దేహాన్ని రెండు చేతులా పైకెత్తాడు. భుజంపై మోసుకుని వెళ్లి చితిపై పరుండబెట్టాడు. శంకరుని ప్రయత్నానికి ఒక్కసారిగా అందరూ అడ్డుపడ్డారు. 
‘‘ఏమిటిది? ఇళ్ల మధ్యలో మనిషిని తగలబెడితే ఇక ఈ ఊళ్లో మేమంతా ఎలా ఉండాలి? తీసేయండి...’’ అంటూ గోలపెట్టసాగారు.
మంచిగంధం చెట్టు చల్లగా ఉంటుంది. సుగంధం వెదజల్లుతుంది. కానీ దానిని అదే పనిగా మధిస్తే దానియందున్న అగ్ని వెలికివచ్చి దహించి వేస్తుంది.

ఇప్పుడు శంకరుని స్థితి సరిగ్గా అదే. ఊరివారి నైజం అతడి మనసును తీవ్రంగా గాయపరిచింది.
‘‘నేటి నుంచి మీ శ్మశాన భూములు మీ ఇళ్లలోనే ఉండుగాక! మీరు వేదబాహ్యులు అగుదురు గాక! వైదికకర్మలకు దూరమైపోదురు గాక! నిజమైన సన్యాసులు ఇక్కడ భిక్ష గ్రహించకుందురు గాక!’’ అన్నాడు ఆవేదనతో జన్మభూమిని శపిస్తూ. ఆ మహాపురుషుని శాపవచనం అక్కడున్న వారందరినీ అప్రతిభులను చేసింది. చేష్టలు దక్కి అందరూ ఎక్కడి వారక్కడే నిలుచుండి పోయారు. 
శంకరుడు విష్ణుస్మరణ చేస్తూ చితిని సమీపించాడు. చేతిలోని జ్ఞానదండాన్ని పైకెత్తి మాతృమూర్తి కుడిభుజానికి తాటించాడు. ఆ దండం నుంచి పుట్టిన విద్యుత్తు తల్లి చితిని రగిలించి మోక్షమిచ్చింది.

వేడిమిపాలు ఒక్కింత కూడా లేని మృతదేహాన్ని ఒక ఎండుపుల్లతో మథిస్తే నిప్పు రాజుకున్న వింతను అక్కడున్న వారంతా అచ్చెరువు పడుతూ చూశారు. జన్మనిచ్చిన తల్లికి అంత్యేష్టి సంస్కారంలో భాగంగా ఒక కొడుకు నెరవేర్చవలసిన బాధ్యతలన్నీ శంకరుడు నెరవేర్చాడు. తిరుగు ప్రయాణమయ్యాడు. తలచుకున్న వెంటనే యోగశక్తిచేత కాలటికి చేరుకున్నట్లే... మళ్లీ మహాశ్మశానమని పిలిచే కాశీకి కూడా అదే శక్తిచేత తిరిగి చేరుకున్నాడు. శంకరుడు తిరిగివచ్చే సమయానికి సరిగ్గా కొద్దిసేపటి ముందు ఒక అద్భుత సంఘటన చోటు చేసుకుంది. దానికి పద్మపాదుడు సాక్ష్యంగా నిలిచాడు. అసలేం జరిగిందంటే...శంకరుడు రచించిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని పరిశీలించడానికి వ్యాస భగవానుడు స్వయంగా వచ్చాడు. వృద్ధబ్రాహ్మణునిగా మారురూపుతో వచ్చిన వ్యాసునితో కలిసి, శంకరుడు వ్యాసకాశీకి సమీపంలోని ఒక గుహలో ప్రవేశించాడు. 

‘‘మా అంతట మేమే బయటకు వచ్చేవరకూ మీరెవరూ లోనికి రావద్దు’’ అని ముందుగా శంకరుడు శిష్యులను హెచ్చరించాడు. ఆచార్యుని ఆజ్ఞమేరకు ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేదు. ఇది జరిగి మూడురోజులైంది. తల్లి మరణంతో శంకరుడు అకస్మాత్తుగా కాలటికి ప్రయాణమైన విషయం శిష్యులెవరికీ తెలియదు. అపరిచితుడైన ఒక వృద్ధమూర్తితో రోజుల తరబడి తమ గురువు ఇలా చర్చల్లో కూరుకుపోవడం వారిలో ఆందోళన నింపింది. చివరకు పద్మపాదుడు తెగించి గుహలోనికి వెళ్లాడు. అక్కడ బ్రహ్మసూత్రాలలోని దేవతాధికరణంపై చర్చ జరుగుతోంది. 

‘‘యోగి తన యోగబలం చేత అనేక శరీరాలను ఏర్పరుచుకోవచ్చు. వాటన్నింటితోనూ భూమండలం మీద సంచరించవచ్చు. కొన్ని దేహాలతో విషయభోగాలను అనుభవించవచ్చు. అన్నింటితో ఉగ్రమైన తపస్సు చేయవచ్చు. తరువాత వాటన్నింటినీ సూర్యుడు తన కిరణాలను ఉపసంహరించుకున్నట్లు ఉపసంహరించుకోవచ్చు’’ అని స్మృతిని ప్రమాణంగా చూపాడు శంకరుడు. మరింత ముందుకు చెబుతూ, ‘‘యోగులే ఇలా చేయగలిగినప్పుడు పుట్టుక నుంచి సిద్ధులైన దేవతల మాట వేరే చెప్పనక్కర లేదు కదా! ఒక్కో దేవతకు ఒకే సమయంలో అనేక రూపాలు ఉంటాయని శ్రుతి చెబుతోంది. ఒక దేవత అనేక రూపాలుగా తోచవచ్చు. అనేక రూపాలు కలిసి ఒక్కటిగానూ మారవచ్చు. మొత్తంమీద ఒకే దేవత అనేక రూపాలచేత తనను తాను విభజించుకుని ఒకే పర్యాయం అనేక యాగాలలో అంగత్వం పొందుతుంది. అంతర్థానశక్తి ఉండడం వల్ల ఇతరులు ఆ దేవతను చూడలేరు...’’ శంకరుని భాష్య వివరణ ఇంకా పూర్తికాలేదు. అంతలో పద్మపాదుడు అందుకున్నాడు.  ‘‘గురుదేవా! నా అంచనా తప్పు కాకపోతే... ఇప్పుడు మనముందు ఉన్న వృద్ధబ్రాహ్మణుడు మరెవరో కాదు, సాక్షాత్తూ వ్యాసభగవానుడే’’ అన్నాడు.

శంకరుడు అతడిని చూసి చిరునవ్వు నవ్వాడు. 
‘‘అది నిజమే’’ అన్నాడు శంకరుడు పెదవులు కదలకుండానే. 
ఆశ్చర్యపోతూ వెనుతిరిగి చూశాడు పద్మపాదుడు. పై మాటలు చెప్పిన శంకరుడు గుహద్వారంలో నిలబడి ఉన్నాడు.
వృద్ధబ్రాహ్మణుని స్థానంలో వ్యాసభగవానుడు స్వస్వరూపాన్ని ధరించి కనిపిస్తున్నాడు. అప్పటివరకూ తనను తాను రెండుగా విభజించుకుని, శంకరునిగా కూడా తానే అయి భాష్య పరిశీలన చేస్తున్నాడాయన. ఆ రెండో రూపాన్ని ఇప్పుడు ఉపసంహరించాడు. 
శంకరుడు, అతడి వెనుకనే పద్మపాదుడు కూడా వ్యాసభగవానునికి పాదాభివందనం చేశారు.
త్యక్త్వా మమాహమితి బంధకరే పదే ద్వే
మానావమాన సదృశాః సమదర్శినశ్చ
కర్తారమన్యమవగమ్య తదర్పితాని
కుర్వంతి కర్మపరిపాక ఫలాని ధన్యాః

– నాది, నేను అనే బంధాలను విడిచిపెట్టినవాడే ధన్యుడు. దూషణ, భూషణలను సమానంగా స్వీకరిస్తూ, సర్వత్ర సమస్వరూపమైన ఆత్మనే వీక్షించువాడు ధన్యుడు. ఈశ్వరుడినే కర్తగా తీసుకుని, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను నిర్వర్తించేవాడు ధన్యుడు. 
శంకరుడు గురుసమక్షంలో ధన్యాష్టకం చెబుతున్నాడు.
‘‘ఇంద్రియ సుఖాలకు అతీతంగా, ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని పరమార్థ తత్త్వాన్ని నిర్ణయించడానికి పూనుకున్నవాడే ధన్యుడు. మిగిలినవారంతా భ్రమల లోకంలో తిరుగాడుతూ ఉంటారు. అరిషడ్వర్గాలను నిర్జించిన వాడికి యోగరాజ్యం కైవసం అవుతుంది. ఆత్మవిద్యను వరించి, లోకాలయాన్ని త్యజించిన ధన్యుడు వానప్రస్థుడవుతున్నాడు. హృదయంలో పరంజ్యోతి వీక్షించాలని యత్నిస్తున్నవాడు ధన్యుడు. సదసత్తులు, అణుమహత్తులు, చివరకు స్త్రీ పురుష నపుంసకులలో ఎవరూ కాని బ్రహ్మమును ఏకాగ్రచిత్తంతో ధ్యానించేవాడు ధన్యుడు. బ్రహ్మసాక్షాత్కారం జరిగితే జగత్తే నందనవనం అవుతుంది. అన్ని చెట్లూ కల్పవృక్షాలవుతాయి. జలమంతా గంగయే అవుతుంది. సమస్త కార్యాలూ పుణ్యక్రియలే... పలికిన మాటలు వేదవాక్యాలు అవుతాయి. భూమండలమంతా కాశీక్షేత్రమే అవుతుంది. అటువంటి జ్ఞాని ఏ రూపంలో ఉన్నా సాక్షాత్‌ బ్రహ్మమే అవుతున్నాడు’’ అన్నాడు శంకరుడు.
వ్యాసభగవానుడు పరమానంద భరితుడయ్యాడు. అర్ధనిమీలిత నేత్రాలతో, ‘‘జగద్గురూ!’’ అని పిలిచాడు. 

‘‘సరిగ్గా మీరు వచ్చే సమయానికి బ్రహ్మసూత్రాలలోని దేవతాధికరణం పరిశీలిస్తున్నాను. అందులో ఒకచోట ‘స్వాధ్యాయాదిష్ట దేవతాసం ప్రయోగః’ అన్న పతంజలి సూత్రాన్ని గురించి చెప్పారు. ఆ సందర్భంలోని మీ అభిప్రాయాలను ఒకసారి వినిపించండి’’ అడిగాడు వ్యాసుడు.
‘‘స్వాధ్యాయం అంటే మంత్రజపం వల్ల ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. దేవతతో మాట్లాడడమూ సాధ్యమవుతుంది. దేవతలకు మంత్రమే శరీరం. దేవతలను మనస్సు చేతనే ధ్యానించాలి అంటూ వారికి ప్రత్యేక రూపాలను శ్రుతులు చెప్పలేదు. కానీ ఇతిహాస పురాణాలు చెప్పాయి. దేవతలకు అవి విగ్రహాలను కల్పించాయి. శ్రుతులలోని మంత్రాలు, అర్థవాదాలే ఇతిహాస పురాణాలకు మూలం కావచ్చు. కొన్ని ప్రత్యక్ష ప్రమాణాలూ ఉంటాయి’’ చెబుతున్నాడు శంకరుడు.
పద్మపాదుడు అందుకుని, ‘‘వ్యాసుని వంటి మహనీయులు దేవతలతో ప్రత్యక్షంగా వ్యవహరించేవారని పురాణాలు చెబుతున్నాయి’’ అన్నాడు.

కొనసాగింపుగా శంకరుడు, ‘‘ఇప్పటి వాళ్లలా ప్రాచీనులకు కూడా దేవతలతో వ్యవహరించే నేర్పు లేదు అని వాదించేవాడికి జగత్తులోని వైచిత్రి బోధపడలేదని అర్థం. ఇప్పుడు జగదేక సార్వభౌముడు లేడు కనుక, గతంలోనూ లేడని వాడు వాదించవచ్చు. గతంలో కూడా ఇప్పటిలాగే వర్ణాశ్రమ ధర్మాలన్నీ అస్తవ్యస్తంగానే ఉండేవని, పాతతరంవారు మనకంటే తీసికట్టుగా ఉండేవారని వదరుబోతుతనంతో వాగవచ్చు. అది తెలియని వారిని మోసపుచ్చే మాటలు. అవే నిజమైతే మన మహర్షుల ధర్మప్రబోధం వల్ల యుగాలనాడే వ్యవస్థీకృతమైన మన మహోన్నత వారసత్వమంతా కేవలం గ్రంథాల్లో చేసిన కల్పనే అవుతుంది. ఇది మేధను వృథా పరుచుకోవడం తప్ప మరేమీ కాదు. – తస్మాత్‌ ధర్మోత్కర్షవశాత్‌ చిరంతనా దేవాదిభిః ప్రత్యక్షం వ్యవజహ్రురితి శ్లిష్యతే – అందువల్ల మన ప్రాచీనులు ఉత్కర్షమైన ధర్మబలం సహాయంతో దేవతలతో ప్రత్యక్షంగా వ్యవహరించారని చెప్పడం మంచిది. అలాగే దేవతలకు విగ్రహాలు లేవు అని వాదించే వాడి వాదనలో పస లేదు. శ్రుతులు క్రమముక్తిని చెప్పాయి. మరణించిన వ్యక్తులు ఆయా దేవలోకాలకు వెళ్లి, అక్కడ కొంతకాలం ఉండి తరువాత క్రమముక్తికి వెళతారు. దేవతలకు విగ్రహాలే లేకపోతే ఇవన్నీ కుదరనే కుదరవు’’ అన్నాడు శంకరుడు.
వ్యాసుడు సంతృప్తి వ్యక్తం చేశాడు.

‘‘ఇంతకూ దేవతలు ఎంతమంది అని యాజ్ఞవల్క్యుణ్ణి ప్రశ్నిస్తే ముప్పై ముగ్గురు అని సమాధానం చెప్పాడట. మళ్లీమళ్లీ ప్రశ్నించినప్పుడల్లా సంఖ్య మారుస్తూ ఆరుగురు, ముగ్గురు, ఇద్దరు, ఒకరు అని సమాధానాలు చెప్పాడట. నిజానికి దేవత ఒక్కటే ఉంది...అదే ప్రాణం. దేవతలందరూ ఆ ప్రాణం యొక్క రూపాలే. ఆ ఒక్క ప్రాణమే ఒకే సమయంలో అనేక దేవతా రూపాలలో ఉన్నది. అనేకమంది ఒకేసారి సమర్పిస్తున్న హవిస్సులను స్వీకరిస్తోంది. స్వాధ్యాయ పరునికి మంత్రఫలాన్ని, అర్థవాదులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది’’ అనే అర్థం వచ్చే భాగాలను శంకరుని బ్రహ్మసూత్ర శారీరక భాష్యం నుంచి పద్మపాదుడు పఠించాడు.
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః

– ‘శంకరుడే భాష్యరచన చేసిన శంకరాచార్యుడు. అంతకుముందు సూత్రాలను అందించిన ఈ వ్యాసుడు సాక్షాత్తూ విష్ణు భగవానుడే. ఈ భగవంతులిద్దరి కలయిక ప్రతియుగంలోనూ జరుగుతూనే ఉంటుంది...’ అని పలికింది ఆకాశవాణి.
(సశేషం)
∙నేతి సూర్యనారాయణ శర్మ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement