ప్రజాపతి బ్రహ్మ పలుమార్లు యాగాలు చేసిన చోటు కనుక ప్రయాగ అని పిలిచారు. నూరు యాగాలు చేసిన ఫలితం ప్రయాగ నివాసంతో లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రాచీన కాలం నుంచి ఎందరెందరో ఋషులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పంచమాధవులో ఒకడైన వేణీమాధవుడు వెలిసిన చోటది. సతీదేవి కుడిచేతి వేళ్లు పడిన చోటది. అన్నింటికంటే మిన్నగా ప్రయాగ క్షేత్రాన్ని ప్రస్తావించినప్పుడు చెప్పుకోవలసింది అక్షయ వటవక్షాన్ని గురించి.
మహాప్రళయ వేళ విష్ణుమూర్తి ఆ మర్రియాకుపైనే తెప్పగా తేలి వటపత్రశాయి అవుతాడని చెబుతారు. యుగాల తరబడి అలాగే నిలిచివుంది. చరిత్రలో ఒకనాడు మతమౌఢ్యంతో కొందరు రాజులు తరాల తరబడి దీక్షగా ఆ చెట్టుని నాశనం చేయడానికి ప్రయత్నించారు. కొమ్మలు నరికించినా, మొదలు నరికించినా, కాచిన నూనెను పోయించినా చెట్టుమాత్రం ఇప్పటికీ నిలిచే ఉంది.
... ఆ చెట్టుకింద ఎవరో కుష్టురోగి ఆత్మహత్యా ప్రయత్నంలో ఉన్నాడు. ఊడలను మెడకు ఉరిబెట్టుకో బోతున్నాడు. పరుగు పరుగున వెళ్లి అతణ్ణి ఆపాడు పద్మపాదుడు. గురువైన శంకరుని ముందు ప్రవేశపెట్టాడు. మిగిలిన శంకర శిష్యులు కాస్త దూరంగా జరిగారు. ఒళ్లంతా పుళ్లు పడి ఆ కుష్ఠురోగి శరీరం నుంచి దుర్గంధం వస్తోంది. ఆచార్య శంకరుడు అతడికి స్వయంగా ఉపచారాలు చేశాడు. ఆయన అమతహస్త ప్రభావమో, చికిత్సల్లో గొప్ప గుణం ఉందో తెలియదు కానీ, ఆ కుష్ఠురోగికి పూర్తిగా నయమైంది. మునుపటి రూపం వచ్చింది.
తన శరీరం కేసి ఒకసారి చూసుకుని, ‘‘స్వామీ! నన్ను నేనే గుర్తుపట్టలేకుండా ఉన్నాను. ఇక గతంలో నన్ను ఎరిగిన వారు కూడా గుర్తుపట్టలేరు. మళ్లీ పాత జీవితంలోకి వెళ్లాలనే కోరిక లేదు. నన్ను మీ శిష్యుల్లో ఒకనిగా చేర్చుకోండి. నాకు కూడా సంన్యాసం అనుగ్రహించండి’’ అని వేడుకున్నాడు.
‘‘కుదరదు. నీవంటి దుర్బల మనస్తత్వం ఉన్నవారికి సంన్యాసం ఇవ్వడం సాధ్యం కాదు. ఆత్మహత్యకు పాల్పడ్డ నీకు మోక్ష కారణమైన సంన్యాసం స్వీకరించే అర్హత లేదు’’ అని నిర్ద్వంద్వంగా అతడి అభ్యర్ధనను తోసిపుచ్చాడు శంకరుడు. ‘‘నీకు ఉదంకుడు అనే నూతన నామం ఇస్తున్నాను. హాయిగా వెళ్లి కొత్త జీవితాన్ని ఆరంభించు. నీ గత చరిత్ర ఎవరికీ చెప్పకు’’ అన్నాడు.
ఉదంకుడు సెలవు తీసుకుని వెళ్లాడు. కానీ శంకరుడు చెప్పిన మాటను మాత్రం పాటించ లేదు. ఆచార్య శంకరుని చేయి తాకగానే తన రోగం మటుమాయమైపోయిందని... వెళ్లిన చోటల్లా, అడిగిన వారికీ అడగని వారికీ చెప్పుకుంటూ పోయాడు. అతడి నుంచి ఆ సంగతి విన్న వారందరూ శంకరుని దర్శించడానికి వచ్చేవారు. తమ బాధలేవో చెప్పుకుని ఉపశమనం కావాలని కోరేవారు. కానీ ఈ వైనం విన్న మొట్టమొదటి వ్యక్తి మాత్రం శంకరుని ఊసే పట్టించుకోలేదు. కాకతాళీయంగా శంకరుడే స్వయంగా ఒకరోజున ఆ వ్యక్తిని కలుసుకోవడానికి బయలుదేరాడు.
అతడే ప్రభాకరుడు... నివాస పట్టణం ప్రతిష్ఠానపురం.
ప్రయాగ క్షేత్రానికి అత్యంత సమీపంలో గంగకు ఆవలి ఒడ్డున ఉన్నదే ప్రతిష్ఠానపురం. చంద్రవంశ క్షత్రియులు పాలిస్తున్న ప్రాంతం. నిత్యాగ్నిహోత్రులైన కర్మిష్ఠులతో నిండిపోయింది. ఆ పురప్రముఖులలో అగ్రస్థానంలో ఉన్నవాడు ప్రభాకరాచార్యుడు. సొంతవూరు గోకర్ణ క్షేత్రం కాగా, చాలాకాలం క్రిందటే అక్కడ స్థిరపడ్డాడు.
ప్రభాకరుడు పూర్వమీమాంసా శాస్త్రానికి దిక్సూచిగా వెలుగొందుతున్న కుమారిల భట్టుకు అనుంగు శిష్యుడు. కుమారిల భట్టు మార్గంలో ఉన్నవారంతా కర్మకాండలే ప్రధానమని, వేదాలు ప్రబోధించినది కర్మమార్గమేనని దృఢంగా నమ్మేవారు. అటువంటి వారందరికీ గురుస్థానంలో ఉన్నవాడు ప్రభాకరాచార్యుడు.
‘ఎంతటి మహిమాన్విత యోగి అయినా తనను చూడడానికి వస్తున్నాడంటే, అతనికంటే నేనే గొప్ప కదా!’ అనిపించింది ప్రభాకరుని మనస్సులో. కానీ ఆ భావం చివరిదాకా నిలబడలేదు. శంకర దర్శనమైన క్షణం నుంచే అతడి చిత్తం క్రమంగా కరగడం ప్రారంభించింది. శంకరుడు రానే వచ్చాడు. ప్రభాకరుడు అసంకల్పితంగా సాష్టాంగపడి, ఆసనమిచ్చి అర్చించాడు.
శంకరుడు చిరునవ్వులు చిందిస్తూ ఇలా అడిగాడు. ‘‘ప్రభాకరాచార్యా! జ్ఞానమే ప్రధానమని చెప్పే ఉపనిషత్ మత ప్రవర్తకులం మేము. కర్మమార్గమే ప్రధానంగా ఎంచుకుని పవిత్రజీవనం సాగిస్తున్నవారు మీరు. వేదమే ప్రమాణమని మేమూ అంగీకరిస్తాం. విధి, అర్థవాదం, మంత్రం, నామధేయమనే వేదవిభాగాలలో విధికే ప్రాముఖ్యమిస్తారు మీరు. శబ్దభావన ముఖ్యమని మీ గురువైన భట్టపాదులు బోధిస్తారట. మీరేమో వేదాన్ని ఆజ్ఞలుగా స్వీకరించే నియోగానికే ప్రాధాన్యమిస్తారని విన్నాం. మీ వాదనలు వినాలని, మీ గురుశిష్యులిద్దరినీ గురించి తెలుసుకోవాలని కోరిక. దయచేసి చెప్పగలరా?...’’
శంకరుని మాటలు విన్న ప్రభాకరుడు పొంగిపోయాడు.
‘‘నా గురించి చెప్పడానికేమీ లేదు స్వామీ! మా గురువు గురించి చెబుతాను. ఆయన చేసిన లోకోత్తర త్యాగాలను గురించి మీ వంటివారు వినాలి. పదిమందికి తెలిసేలా వాటిని చెప్పి తీరాలి’’ అన్నాడు.
‘‘మా ప్రార్థన కూడా అదే’’ అన్నాడు శంకరుడు.
తన గురువైన కుమారిలభట్టు కథను ప్రభాకరాచార్యుడు చెప్పడం మొదలుపెట్టాడు.
భట్టపాదుడు కలియుగాది 2,545లో జన్మించాడు. ఆయన జన్మస్థలం ఓఢ్రదేశంలోని మహానదీ తీరంలో ఉన్న జయమంగళం. ఆయన తల్లిదండ్రుల పేర్లు చంద్రగుణ, యజ్ఞేశ్వరులు. వారు తెలుగువాళ్లే. జైమిని మహర్షి అడుగు జాడల్లో నడుస్తూ వేదవిహితమైన కర్మకాండలను ఆచరించేవాడు భటపాదుడు. పూర్వమీమాంసా శాస్త్రంపై అనేక గ్రంథాలు కూడా వెలువరించాడు. ఎందరికో ఆచార్యస్థానంలో నిలిచాడు. అప్రతిహతంగా సాగిపోతున్న భట్టపాదుని గాథను మలుపు తిప్పినవాడు వర్థమాన మహావీరుడు.
కాశ్యప గోత్రంలో సిద్ధార్ధుడనే సామంత రాజుకు వర్ధమాన మహావీరుడు జన్మించాడు. రాజ్యం చేపట్టకుండా విరాగియై తీవ్ర తపస్సు చేశాడు. అతడిని నిర్గ్రంథులు ఇరవైనాలుగో తీర్థంకరునిగా గుర్తించారు.
పూర్వవైదిక యుగాల్లోని తీర్థంకరులందరూ మన సనాతన ధర్మాన్ని అంగీకరించిన వారే. వారి ఆదినాథుడైన వృషభదేవుడు మనకు పూజనీయుడే. శివమహిమ్నా స్తోత్రం రచించిన మన పుష్పదంతుడు వారి తీర్థంకరుడే. పూర్వజన్మలో అతడే మరీచి మహర్షి అని జైనులు చెప్పే వర్ధమాన మహావీరుడు మాత్రం వేదప్రామాణ్యాన్ని అంగీకరించ లేదు. బ్రాహ్మణ ఆధిక్యతను తిరస్కరించాడు. పవిత్రమైన జీవనం గడుపుతూ, తపస్సు చేస్తే దైవంతో పని లేకుండానే కైవల్యం పొందవచ్చునని బోధించాడు. రాజకుటుంబం నుంచి వచ్చినవాడు కనుక త్వరలోనే రాజవంశాల వారందరినీ ఆకట్టుకున్నాడు. మిధిల, కోసల, మగధరాజ్య ప్రభువులందరూ క్రమంగా జైనమతాన్నే అనుసరించడం మొదలుపెట్టారు.
మతానికి రాజకీయం తోడైంది. అహింసనే ప్రధానంగా బోధించిన ఆ మతంలో తొందరలోనే పరమత అసహనం పెచ్చుమీరింది. వర్ధమానుడు జీవించి ఉండగానే ఆయన శిష్యులు చెలరేగడం ప్రారంభించారు. యజ్ఞయాగాదులు ధ్వంసమైపోతుంటే పూర్వాచార పరాయణుడైన మా గురువు చేతులు ముడుచుకుని కూర్చోలేకపోయాడు. ముప్పై ఏళ్ల వయస్సులోని మిసిమి యవ్వనం ఆయనను కూర్చోనీయ లేదు. ఒంటరి పోరాటానికి సిద్ధపడ్డాడు. పేరు మార్చుకుని వర్ధమాన మహావీరుని శిష్యునిగా చేరిపోయాడు.
కానీ ఈయన అక్కడ చేరిన కొత్తలోనే వర్ధమానుడు నిర్వాణం చెందాడు. ఆ తర్వాత రెండేళ్లపాటు మహావీరుని ప్రధాన శిష్యులైన గౌతముడు, మైత్రేయుడు, సుధర్ముడు, ప్రభాసుడు వంటివారి వద్ద భట్టపాదుడు శిష్యరికం చేశాడు. జైనమత ప్రబోధాలను, సిద్ధాంతాలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. కొంతకాలం ఎవరికీ ఏ అనుమానమూ రాలేదు.
మహావీరుని బోధనలను సంకలనం చేయడం మొదలైంది. గ్రంథ రచన సాగుతుండగా భట్టపాదుడు కూడా అందులో భాగస్వామి అయ్యాడు. అక్కడ వేద ధర్మానికి వ్యతిరేక భావాలు వచ్చినప్పుడల్లా ఈయన వాటిని ఖండించడం మొదలు పెట్టాడు. వాదవివాదాలతో గ్రంథరచన ముందుకు సాగలేదు. దాంతో మహావీరుని శిష్యులకు అనుమానం వచ్చింది.
ఒకటికి పదిసార్లు ఆయనను నిలదీశారు. ‘నువ్వు వేదమతాభిమానివే కదా... ఏ దురాలోచనతో మాలో చేరావో చెప్ప’మంటూ పలురకాలుగా హింసించారు. కానీ ఆయన బయట పడలేదు. ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా ఏవేవో సమాధానాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. వారు పెట్టే బాధలను పెదవి బిగువున ఓర్చుకున్నాడు.
చివరకు ఓ రోజున వారంతా కలిసి ఓ పన్నాగం పన్నారు. నిద్రపోతున్న సమయంలో ఎత్తయిన భవనం మీదనుంచి ఆయనను కిందికి తోసి.... పీడ విరగడ చేసుకోవాలని భావించారు. కానీ నిద్ర నటిస్తున్న భట్టపాదులకు వారి ఆంతర్యం తెలుసు. అయినప్పటికీ ప్రతిఘటించలేదు. అనుకున్నట్లుగానే వారంతా కలిసి మేడమీద నుంచి ఆయనను కిందికి దొర్లించేశారు.
కిందికి పడుతుండగా ఆయన, ‘వేదాలే ప్రమాణమైతే నేను రక్షింప బడుదును గాక!’ అని శాసనం చేశాడు. అన్నట్లుగానే ఆయనకేమీ కాలేదు. కానీ ఒక కన్ను పోయింది.
‘ఎందుకిలా జరిగింది గురుదేవా!’ అని అడిగాను నేను.
‘వేదాలే ప్రమాణం కనుక నేను రక్షింప బడుదును గాక! అనలేదు నేను గమనించావా...’ అని వివరణ ఇచ్చాడాయన. ఏదేమైనా ఆ సంఘటన తరువాత మాలో వేదధర్మం పట్ల విశ్వాసం ఇనుమడించింది. ఇది జరిగి ఇప్పటికి ముప్పై రెండేళ్లయింది. ఇప్పుడు మా గురువు మధ్యందిన మార్తాండుడై అవైదిక మతాలపై నిప్పులు చెరుగుతున్నాడు...’’ ఇంతవరకూ చెప్పి ఆగాడు ప్రభాకరాచార్యుడు.
‘‘అవునవును. అటునుంచి నరుక్కురా! అనే నానుడికి కారణమయ్యాడని కూడా విన్నాను’’ అన్నాడు శంకరుడు నవ్వుతూ.
‘‘అందులో అధర్మమేదీ లేదు ఆచార్యా! నిజానికి మెచ్చుకోవలసిన సంగతి కూడా అది. పూర్తి వివరాలు చెబుతాను... చిత్తగించండి’’ అంటూ ఆ కథను ఇలా ప్రారంభించాడు ప్రభాకరుడు.
అశోక చక్రవర్తి కాలానికి మగధకు సామంతరాజ్యమే అయిన విదర్భ తరువాతి కాలంలో స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ప్రస్తుతం ఆ రాజ్యానికి రాజధాని అమరావతి. పాలకుడు సుధన్వుడు. ఆయనకు చార్వాక, జైన, బౌద్ధ వంటి నాస్తిక మతాలపై ప్రీతి ఎక్కువ. వారితో ఎల్లప్పుడూ చర్చలు చేస్తుండేవాడు. సుధన్వుని పట్టపురాణి పూర్వాచార పరాయణురాలు. భర్త మనసు మరలించమని భట్టపాదుని ప్రార్ధించింది. ఆయన అంగీకరించాడు.
దేవాలయాలు కట్టించడం, చలివేంద్రాలు పెట్టడం వంటి పనుల వల్ల బాటసారులకే ప్రయోజనం కానీ, రాజ్యానికి కలిసి వచ్చేదేమీ లేదని వాదించేవారు చార్వాకులు. విబూది పూసుకోవడం పౌరుషహీనులు చేసే పని. వ్యవసాయం, వర్తక వాణిజ్యాలు పెంచాలి. దండనీతి అమలుచేసి డబ్బు సంపాదించాలని రాజుకు బోధించేవారు. ఈ లోకం కంటే భిన్నంగా స్వర్గనరకాలు ఎక్కడో లేవు అనే చార్వాకులతో భట్టపాదుడు తలపడ్డాడు.
వేదాలు అపౌరుషేయాలు కావు అని వాదించే జైనులకు అవి పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాసలు. వేదమంత్రాలను విన్న ఋషులందరూ ద్రష్టలే కానీ వాటిని సష్టించిన వారు కాదు అని నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు.
సృష్టిలో ఈ క్షణమే ఉంది కానీ గతమంటూ లేదు. అసలు గతమెప్పుడూ ఇలా లేదు. భవిష్యత్తు కూడా ఇలా ఉండబోదు. ఇది నిత్య పరిణామశీలం అని వాదించే బౌద్ధులకు పాపం పునర్జన్మపై మాత్రం మక్కువ ఎక్కువ. అప్పటికే ముక్కలు చెక్కలైపోయిన బౌద్ధులకు విడివిడిగానూ, ఉమ్మడిగానూ మా గురువు సత్యబోధ చేయడానికి ప్రయత్నించాడు. కానీ విఫలుడయ్యాడు.
చివరకు, ‘కనిపించే ఆ పర్వత శిఖరం పైనుంచి దూకి, చెక్కు చెదరకుండా వచ్చినవారి మతమే గొప్పది’ అని మొండివాదంలోకి దిగాడు. పీడ విరగడవుతుందని అందరూ సంతోషించారు. – సశేషం
-నేతి సూర్యనారాయణ శర్మ
Comments
Please login to add a commentAdd a comment