ఆదిగురువు ఆయనే.. | Adi Shankara Vijayam Part 15 | Sakshi
Sakshi News home page

ఆదిగురువు ఆయనే..

Published Sun, Sep 22 2019 8:23 AM | Last Updated on Sun, Sep 22 2019 8:23 AM

Adi Shankara Vijayam Part 15 - Sakshi

‘‘కైలాసగిరికి సమీపంలోని కింపురుష లోకంలో సౌగంధికవనం ఉంది. అక్కడ వంద యోజనాల పొడవు, ఏడువందల యోజనాల వెడల్పు కలిగిన వటవృక్షం ఉంది. దానికి ఏడాది పొడవునా మాణిక్యాల్లా మెరిసే పళ్లు కాస్తాయి. ఆ మహావటవృక్ష విస్తీర్ణం వల్ల ఏ పొద్దులోనూ నీడ తిరగదు. సమశీతోష్ణ స్థితి ఉంటుంది. ఆ వటమూలంలో శాంతవిగ్రహుడు, లోకమంగళదాయకుడైన శివుడు దక్షిణామూర్తిగా నిత్యయవ్వనునిగా కొలువుతీరి ఉంటాడు. జ్ఞానముద్ర పట్టి మౌనవ్యాఖ్య చేత అందరి సందేహాలనూ తొలగించే ఆదిగురువు ఆయనే. సనాతనుడు, బ్రహ్మమయుడైన ఆ స్వామిని యోగులు, ఋషులు, సిద్ధులు, కుబేరాది యక్షులు, కింపురుషులు ఎల్లవేళలా సేవిస్తూ ఉంటారు. జగద్గురూ! రేపటి పౌర్ణమినాడు ఆ దక్షిణామూర్తి సన్నిధిలో అఖిల మునిగణాలూ సమావేశం కానున్నాయి. ఈసారి నీతో కలిసి నన్నూ అక్కడికి రమ్మని గురువుల ఆదేశం’’ అన్నారు గోవింద భగవత్పాదులు.

వెంటనే దండకమండలాలు చేతబట్టి ప్రయాణానికి సిద్ధపడ్డాడు శంకరుడు. 
గోవిందులు మాత్రం కూర్చున్న చోటినుంచి కదలకుండా, ‘‘జగద్గురూ! ఈవేళ చలి ఎక్కువగా ఉన్నట్లుంది కదూ... ఇప్పటివరకూ స్నానం చేయడమే పడలేదు’’ అన్నారు చిరునవ్వు నవ్వుతూ.
ఒక్కక్షణం విస్మయంగా గురువు వంక చూశాడు శంకరుడు. చివాలున అక్కడి నుంచి లేచివెళ్లాడు. కొద్దిదూరంలో మంచును తవ్వి స్నానకుండాన్ని ఏర్పాటు చేశాడు. సలసల కాగిపోతూ, పొగలు కక్కుతున్న నీటితో నిండిపోయిందా కుండం. 
‘‘జగద్గురూ! నీ గురుభక్తికి ఇది గొప్ప ప్రతీక’’ అంటూ ఆ తప్తకుండంలో గోవింద భగవత్పాదులు స్నానం పూర్తి చేశారు. బదరీ నారాయణుణ్ణి అర్చించారు.
గురుశిష్యులిద్దరూ కైలాసాచలానికి ప్రయాణమయ్యారు. శంకర శిష్యులు కూడా బయలుదేరబోయారు కానీ, వారెవరికీ అనుమతి లేదని గోవిందులు చెప్పడం వల్ల అందరూ బదరికాశ్రమంలోనే ఉండిపోవలసి వచ్చింది.

గురుశిష్యుల ప్రయాణం వాయువేగ మనోవేగాల మీద సాగింది. కైలాస పర్వతం సమీపంలో మానవ నేత్రాలకు అగోచరం అయిన దారుల్లో నడుస్తూ ముందుకు వెళ్లారు వారిద్దరూ. అక్కడ వటవృక్షం దర్శనమిచ్చింది. అశేషసంఖ్యలోని మునిగణం ఆ నీడలో పరివేష్ఠించి ఉంది. బదరికాశ్రమం నుంచి అక్కడివరకూ సాగిన ప్రయాణం ఒక ఎత్తు... అక్కడి నుంచి లోనికి సాగుతున్న ప్రయాణం ఒక ఎత్తుగా ఉంది. ఆదిగురువును చేరుకోబోతున్న జగద్గురు శంకరుని మానసం స్తోత్రమై పరిమళించింది. ఒక చేతితో జ్ఞానముద్రను, మరోచేతిలో గొడ్డలిని, వేరొక చేతిలో లేడిని ధరించిన వాడై నాలుగో చేతిని మోకాలిపై పెట్టుకుని కూర్చుని ఉన్న గురుశిరోమణి నాకు ప్రత్యక్షమగును గాక! అన్నాడు శంకరుడు. అతడి అభీష్ఠం వెనువెంటనే నెరవేరింది. మర్రిచెట్టు క్రింద చిరునవ్వు మోముతో, మహామునుల సందేహాలను కేవలం మౌనంతో తొలగిస్తున్న దయానిధి అయిన తొలిగురువును నేటికి కనుగొన్నాను.

కాముని కాల్చిన బూడిదను ఒంటికి రాసుకుని, పెద్దపులి తోలు ధరించి, అజ్ఞానమనే సముద్రానికి బడబాగ్నిగా వెలుగొందుతున్న గురువర్యుని నా భాగ్యవశాన చూడగలుగుతున్నాను అన్నాడు శంకరుడు పరవశంతో. చంద్రుని కళలన్నింటినీ కరిగించి పోతపోసినట్లున్న మేను గలవాడు, ముత్యాలతో నిలువెల్లా పొదిగినట్లున్నవాడు, అజ్ఞానపు చీకటికి ప్రభాతకాలం వంటివాడైన గురువర్యుని చూస్తున్నాను. ఆయన కుడిమోకాలుపై ఎడమ కాలు పెట్టి యోగపట్టంలో కూర్చుని ఉన్నాడు. ధ్యానసమయంలో స్మృతి తొలగడం వల్ల మోకాలిపై ఉన్న పాదం తొడమీదికి చేరింది. వయసులో చిన్నవాడిగా కనిపిస్తున్నా శిష్యులై తనను చేరిన మునులకు తత్త్వార్థం ఉపదేశించ డానికి ఆయనే సమర్ధుడు. ఆశ్చర్యకరమైన గుణాలకు అధిష్టానమైన ఆ గురువర్యునికి నా వెనుకటి పుణ్యబలం వల్ల నమస్కరించ గలుగుతున్నాను అంటూ వందనం చేశాడు.

అక్కడ ఉన్న మహర్షులందరినీ శంకరునికి పరిచయం చేశారు గోవిందులు. వారిలో శంకరగురు పరంపరలోని గౌడపాదాచార్యులు, శుకమహర్షి, వ్యాసభగవానులు కూడా ఉన్నారు. ధన్యత్వ çస్పృహతో వారందరికీ వందనం చేశాడు శంకరుడు.
శుకమహర్షి ముందుకు వచ్చి, ‘‘జగద్గురూ! ఏ గురువు సన్నిధిలో మాటలు లేకుండా కేవలం మౌనంతోనే సందేహాలన్నీ పటాపంచలవుతాయో ఆ మహాగురువు ఈ దక్షిణామూర్తి. ఈయనను నువ్వేమైనా కోరవచ్చు’’ అని పలికాడు.
‘‘అంతు లేని కారుణ్యమనే అమృత తరంగాలు ఆయన కన్నులలో నిండి ఉన్నాయి. తన కడగంటి చూపులతో మునులకు మార్గోపదేశం చేసే గురువులకే మూలగురువు అయిన స్వామికి నమస్కారం. ఆయన నాకిప్పుడే బ్రహ్మవిద్యను ఉపదేశించు గాక!’’ అని కోరుకున్నాడు శంకరుడు.
దక్షిణామూర్తి ముఖమండలం నుంచి ఓంకారనాదం వెలువడింది. శంకరునితో పాటు మునిగణమంతా ధన్యమైంది.
‘‘తమోరాశిని పారద్రోలే జ్ఞానముద్ర చేత మహాదేవుడు నీవే అది అని తెలిపే తత్త్వమసి మహావాక్యార్ధాన్ని నాకు బోధ చేయుగాక!’’ అన్నాడు శంకరుడు.

అందుకు బదులుగా దక్షిణామూర్తి చేతిలో ప్రత్యక్షమైన వీణనుంచి అనిర్వచనీయమైన దివ్యనాదం వెలువడింది. వింటూవుంటే యుగాలకాలం దొర్లిపోయినట్లు అనిపించింది కానీ ఆ వీణానాదం కేవలం కొద్దిసేపే కొనసాగింది. తెల్లని శరీరం లేని, లలాటంపై మూడోకన్ను లేని, శాంతమైన వేషం లేని, సర్పాభరణాలు లేని, జ్ఞానముద్ర లేని, నిద్రావిజయం లేని, సాధకుని కోరికను నెరవేర్చలేని దేవతలతో మాకేమి పని? ఎందరు దేవతలు లేరు! కానీ వారెవ్వరూ నా మనస్సుకు నచ్చరు. జడబుద్ధులైన భక్తులను అనుగ్రహించేందుకే దక్షిణ దిక్కుకు తిరిగిన అఘోరమూర్తియే ఉత్తమ దైవం. లోకమనే ఇంద్రజాలాన్ని ప్రదర్శించడానికి ఆయన తేజస్సే సమర్థమైనది. శుకుడు వంటి మునులు మమకారం, కోరికలు లేనివారై ఎవరిని ఉపాసిస్తున్నారో అటువంటి దక్షిణామూర్తి రూపి అయిన మహేశ్వరుని అజ్ఞానమనే పెనుబాధ తొలగిపోవడానికి ధ్యానిస్తున్నాను అని శంకరుడు స్తోత్రం చేశాడు. మహర్షులందరూ తలలు ఊపి అనుమోదాన్ని తెలిపారు.

‘‘స్వామీ! కలుషం లేనివారి చిత్తాల్లో నీవు జటాధారివై, చంద్రకళతో, చూపుగల నుదురుతో కూడిన ముఖబింబంతో వెలుగుతున్నావు. అది సరే కానీ దేవా! నాకు అమ్మను చూపవా’’ అడిగాడు శంకరుడు.
ఈసారి స్వామి నుంచి చిరునవ్వు తప్ప ఎటువంటి ప్రతిస్పందనా లేదు.
ఉపాసకానాం త్వముమాసహాయః పూర్ణేందుభావం ప్రకటీకరోషి
యదుద్యతే దర్శనమాత్రతో మే ద్రవత్యహో మానస చంద్రకాంతః
‘‘ఓ స్వామీ! ఉపాసకులకు నీలోనే పదిహేను కళలతో కూడిన అంబిక కూడా దర్శనమిస్తుంది. నీవు పూర్ణచంద్ర స్వభావాన్ని ప్రకటిస్తున్నావు. కాబట్టే నా మనస్సనే చంద్రకాంత శిల నీ దర్శనమైనంతలోనే ద్రవిస్తోంది’’ అని నమస్కరించాడు శంకరుడు.
కొద్దిసేపటి నిశ్శబ్దం తరువాత...
‘‘జగద్గురూ!’’ అనే సంబోధనతో వ్యాసభగవానుడు ఇలా ప్రసంగించాడు. ‘‘నీ కనకధారా ప్రభావాన్ని విన్నాను. శివానందలహరీ ప్రవాహాన్ని గమనించాను. కాశీపంచకాన్ని, మనీషాపంచకాన్ని గురించి తెలుసుకున్నాను. మోహముద్గరమనే భజగోవిందాన్ని ఎందరో పాడుకుంటూ ఉండగా చూశాను. ఉపనిషత్తులకు నీవు భాష్యాలు సమకూర్చుతున్నావని తెలిసి ఆనందించాను. అలకనందలో గీతాచార్యుడైన నారాయణ ఋషి నీకోసమే ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రేరణతో నీవు భగవద్గీతకు కూడా భాష్యరచన చేస్తున్నావని విన్నాను. ప్రస్థాన త్రయంలో చివరిదైన బ్రహ్మసూత్ర భాష్యాన్ని కూడా చేపట్టు’’ అన్నాడు.

‘‘ధన్యోహం’’ అని నమస్కరించాడు శంకరుడు.
‘‘జాగ్రత్త సుమా! నేను వచ్చి చూస్తాను. నిన్ను పరీక్షిస్తాను. నేను రచించిన బ్రహ్మసూత్రాలకు నీవు సరైన రీతిలో భాష్యం చెప్పావని అనిపిస్తేనే ఆమోదముద్ర వేస్తాను’’ అన్నాడు మళ్లీ వేదవ్యాసుడు. కన్నులవెంట ఆనంద బాష్పాలు చిందుతుండగా నమస్కార ముద్రలోనే నిలబడిపోయాడు శంకరుడు.
‘‘సమయం మాత్రం ఆట్టే లేదు మరి. అతి త్వరలోనే నీకు పదహారో ఏడు రాబోతోంది. ఆ లోపుగా నీ రచన సంపూర్ణమవ్వాలి. ఇది మహాదేవుని పక్షాన నీకు వచ్చిన ఆదేశం’’ అని దక్షిణామూర్తిని చూపుతూ చెప్పాడు వ్యాసుడు.
‘‘బాలచంద్రుణ్ణి ధరించిన నీ మూర్తిని ధ్యానించేవారికి ఐశ్వర్యం, దీర్ఘాయువు, జ్ఞానం లభించడమే కాకుండా ఉపనిషత్తులు వర్ణించిన మహారహస్యమైన స్థితికూడా చివరకు లభిస్తుంది. స్వామీ దక్షిణామూర్తీ! నీకివే మరల మరల నుతులు’’ అన్నాడు శంకరుడు.
సమావేశం చివరిలో గోవింద భగవత్పాదులు శిష్యసమేతులై అక్కడి నుంచి కదిలారు. మార్గమధ్యంలో... ‘‘జగద్గురూ! నేను మళ్లీ ఓంకార క్షేత్రానికి వెళ్లిపోతున్నాను. నీవు బదరికాశ్రమం చేరి త్వరలోనే భాష్యరచన పూర్తిచేయి. వచ్చిన దారివెంటే మళ్లీ కాశీవిశ్వనాథుని సన్నిధికి చేరుకో. తదుపరి ఆదేశం అక్కడే లభిస్తుంది’’ అన్నారు గోవిందులు.

నిజగురువుకు మొక్కి వీడ్కోలు పలికాడు శంకరుడు. శీఘ్రంగా బదరికి వచ్చి శిష్యులను కలుసుకున్నాడు. గురువు ప్రయాణ విశేషాలను శిష్యులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. 
శంకరుడు శిష్యవాత్సల్యం చేత జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అందరూ మైమరచి వింటూ ఉండిపోయారు. పై స్తోత్రాన్ని లిఖించి, భద్రపరిచే బాధ్యత యధాప్రకారం విష్ణుశర్మ నిర్వహించాడు. 
చివరిగా ఆనందగిరి చేతులు జోడించి, ‘‘స్వామీ! తత్త్వమసి మహావాక్యార్థాన్ని బోధించమని మీరు అడిగారు. అప్పుడు వీణానాదం వెలువడింది అన్నారు కదా! ఇంతకూ మీకేం వినిపించినట్లు?! ఆయనేం చెప్పినట్లు?!’’ అని అడిగాడు.
మళ్లీ దక్షిణామూర్తి స్తోత్రాన్నే నేపథ్యంగా తీసుకుని శంకరుడు ఆ మహారహస్యాన్ని ఇలా ఆవిష్కరించాడు...
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్య న్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా
యః సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మాన మేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే
ఈ విశ్వమంతా మనలోనే ఉంది. మనం చూస్తున్నట్లుగానే ఉంది. ఎలా ఉందంటే... అద్దంలో కనిపించే నగరంలా ఉంది. కానీ ఈ జగత్తు మనలో కాక బయటెక్కడో ఉందని భావిస్తూ ఉంటాం. దానికి కారణం మాయ. కలగంటూ ఉన్నంతసేపు అది నిజమే అనిపిస్తుంది. కానీ మెలుకవ రాగానే వాస్తవం ఏదో తెలుస్తుంది. అలాగే మాయచేత కనుగొనలేక ఆత్మ స్వరూపాన్ని బయటెక్కడో వెతుక్కుంటున్నవాడికి దానికి, నీకు భేదం లేదని తన ప్రబోధం చేత ఎరుకపరిచిన గురువైన శ్రీదక్షిణామూర్తికి నమస్కారం. సృష్టికి పూర్వం విత్తనంలో చెట్టులా ఈ జగత్తు మొత్తం ఆయనలోనే ఉంది. గుణమయమైన దైవశక్తిచేత దేశకాల నేపథ్యాలతో ఈ సృష్టిని ఆయనే ఒక గారడివానిలా కల్పిస్తాడు. యోగిలా దీనికి స్వేచ్ఛ కల్పించి పెరగనిస్తాడు.

కొంచెం ఇంచుమించు ఆయనలాగే కనిపించే ఈ సమస్తంలోనూ ఆయన ప్రకాశమే నిండివుంది. ఆ చిదాత్మ ప్రకాశమే నీవు అనే వేదవాక్కుకు ఆయనే ఆధారం. దానిని తెలుసుకున్న జీవాత్మకే పునరావృత్తి రాహిత్యం ఏర్పడుతుంది. చిల్లుల కుండ లోపలి దీపకాంతిలా నాలోనే ఆత్మజ్యోతి వెలుగుతోంది. కన్ను, ముక్కు, చెవుల వంటి ఇంద్రియాల చిల్లుల ద్వారా జ్ఞానమనే వెలుగు అలాగే బయటకు ప్రసరిస్తోంది. తీరాచూస్తే లోపల వెలుగుతున్నది, బయట కనిపిస్తున్నది ఒక్కటే. ఆ వెలుగే నేనై ఉన్నానని తెలిపే స్వరూపమే దక్షిణామూర్తి.

దేహ, ప్రాణ, ఇంద్రియాలకు అతీతమై, బుద్ధికి అగోచరమై, లింగభేదం లేని ఆత్మ ఒకటి ఉన్నది అంటే అది శూన్యమా.. జడమా... కంటికి కనబడదేం అంటూ వృథాతర్కంలో దేహాత్మవాదులు చెడిపోతుంటారు. అటువంటివారిలోని మహావ్యామోహాన్ని కూడా తన మాయాశక్తిచేత పోగొట్టేది ఆయనే. 
స్వయంప్రకాశ శక్తి కలిగిన ఆత్మను గుర్తించలేని మానవుడు గ్రహణవేళ సూర్యచంద్రుల్లా మాయచేత ఆవరింపబడి ఉన్నాడు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి దశల్లో వేర్వేరు అనుభవాలతో గందరగోళంలో పడుతున్నాడు. అవస్థా భేదాలన్నింటిలోనూ, సర్వ ఉపాధులలోనూ ఎడతెగకుండా ఏకరూపంతో ‘నేను నేను’ అనే అహంస్ఫురణతో సాగిపోతున్న మానవుడికి కుడిచేతి బొటనవేలిని, తర్జనిని కలిపి పట్టుకున్న జ్ఞానముద్రతో అజ్ఞానాన్ని తొలగిస్తున్న దక్షిణామూర్తికి నమస్కారం. 
ఈ చరాచరాత్మక సృష్టి అంతటా ఈశ్వరుని ఎనిమిది శరీరాలే ప్రతిఫలిస్తున్నాయి. ఆత్మవిచారణలో మునిగిన వారికి ఆయనకంటే వేరైనదేదీ ఇక్కడ కనబడదు. గురుముఖతః దీనిని తెలుసుకుని మననము, ధారణము చేసినవాడిని సిద్ధిరూపమైన అష్టైశ్వర్యాలు వద్దన్నా విడవకుండా వెంటబడి వస్తాయి – అన్నాడు శంకరుడు. కలియుగంలోని 2608, శ్రీప్లవంగ నామ సంవత్సరం (క్రీ.పూ. 493) ప్రవేశించింది.

శంకరుని బ్రహ్మసూత్ర భాష్యరచన దాదాపుగా పూర్తి కావచ్చింది. శిష్యులందరినీ పూర్వపక్షంలో ఉంచి, వారి వాదనలను ఖండిస్తూ తన సిద్ధాంతాన్ని చెబుతూ శంకరుడు భాష్యరచన కొనసాగించాడు. కానీ శిష్యులే పూర్వపక్షం వహించడంలో కొంత సమస్య ఉంది. గురువుపై గౌరవంతో మొండివాదనకు దిగలేరు వారు. సమర్థులైన విమర్శకులు లేనిదే రచన రాణించదు. అటువంటి వారిని రచనలో భాగస్వాములుగా చేయడం కోసమే శంకరుడు ఉన్నత హిమాలయ సానువులనుంచి మళ్లీ మైదానాలకు బయలుదేరాడు. 
‘‘అగ్నీ! ఇకనుంచి శీతకాలంలో బదరీనాథునికి కాస్త సెలవురోజులుండేలా చూడు. మళ్లీ నేను వచ్చేసరికి కొడుకుని ఎత్తుకుని కనిపించు’’ అన్నాడు శంకరుడు.
అగ్నిశర్మ సాగిలపడి మొక్కాడు. చూస్తుండగానే యతిబృందం అంతా అగ్నిశర్మను బదరిలోనే వదిలి ముందుకు సాగి కనుమరుగైంది. సేతువు నుంచి శీతాచలం వరకు నాలుగుసార్లు భారతదేశాన్ని చుట్టివచ్చిన ఆచార్య శంకరుని జీవన ప్రయాణంలోని తొలియాత్ర పూర్తయింది. రెండోవిడత ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది.
 – సశేషం
- నేతి సూర్యనారాయణ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement