అదే నీవు... అదే నేను  | Adi Shanka Vijayam Story Part 17 In Funday | Sakshi
Sakshi News home page

అదే నీవు... అదే నేను 

Published Sun, Oct 13 2019 8:58 AM | Last Updated on Sun, Oct 13 2019 8:58 AM

Adi Shanka Vijayam Story Part 17 In Funday - Sakshi

కనిపించే ఆ పర్వత శిఖరం పైనుంచి దూకి, చెక్కు చెదరకుండా వచ్చినవారి మతమే గొప్పది –  అని మొండివాదంలోకి దిగాడు భట్టపాదుడు. ముందు తానే దూకుతానన్నాడు. పీడ విరగడవుతుందని అందరూ సంతోషించారు.పూర్వానుభవం వల్ల ఈసారి శాసనం సరిగ్గా చేశాడు భట్టపాదుడు. శిఖరం పైనుంచి కిందికి దూకినా అపాయం ఏదీ కలగలేదు. ఆయనతో  సమానంగా పైకెక్కి దూకడానికి మిగిలిన వారికి ధైర్యం చాలలేదు. అప్పుడు సుధన్వ మహారాజు ఒక మూతపెట్టిన కుండను తెప్పించాడు. ‘‘ఇందులో ఏముందో మీరందరూ విడివిడిగా వ్రాయండి. ఎవరు సరిగ్గా వ్రాస్తారో వారి మతమే సరైనదని అంగీకరిస్తాను’’ అని ప్రకటించాడు. 

అందరూ ఒక్కరోజు సమయం అడిగారు. ఆ రాత్రి మిగిలిన వారంతా ఏవేవో సమాలోచనలు చేశారు. రహస్యమార్గాల ద్వారా ఆ కుండలో ఏముందో తెలుసుకున్నారు. భట్టపాదునికి తప్ప మిగిలిన అందరికీ అందులో ఏముందో ముందే తెలిసిపోయింది.‘ఆ కుండలో పాముంది’ అని అందరూ సరిగ్గానే వ్రాశారు.భట్టపాదుడు మాత్రం, ‘అందులో శేషశాయి విగ్రహం ఉంది’ అని వ్రాశాడు. చివరకు మూత విప్పి కుండలో నుంచి విగ్రహాన్ని బయటకు తీశాడు సుధన్వుడు. తానే పెట్టిన వస్తువు సైతం మారిపోయి కనిపించడం అతణ్ణి ఆశ్చర్యానికి గురిచేసింది. భట్టపాదుణ్ణి ఎదిరించిన ఇరవై ఒక్కమతాల వారూ శిక్షార్హులని తీర్పునిచ్చాడు. 

‘అందరినీ వరుసగా నిల్చోబెట్టి తలకాయలు నరికేయండి’ అని ఆజ్ఞ జారీ చేశాడు.
కత్తి చేతపట్టి తలారి వచ్చాడు. 
‘బాబూ! అటునుంచి నరుక్కురా’ అని కేకపెట్టాడు వరుసలో మొదటివాడు. 
‘ఎందుకు?’ అని ప్రశ్నించిన మా గురువు వద్దకు నడిచి వచ్చాడా వ్యక్తి. 
‘‘స్వామీ! నేనిప్పుడొక గ్రంథం రచిస్తున్నాను. అది పూర్తయ్యే వరకు బ్రతకాలని నా ఆశ’’ అంటూ ఆ గ్రంథాన్ని మా గురువు ముందు పెట్టాడు. 
ఆ వ్యక్తి పేరు అమరసింహుడు. ఆయన రచించిన మహాగ్రంథమే అమరకోశం. సంస్కృత భాషా అధ్యయనం చేసేవారికి అత్యవసరమైన గొప్ప నిఘంటువు. గ్రంథాన్ని పరిశీలించిన మా గురువు అతడికి ప్రాణభిక్ష పెట్టారు. ‘‘అమరసింహా! మీ నిఘంటు రచనతో సంస్కృతభాషకు మకుటాయమానమైన సేవ చేస్తున్నారు’’ అని ప్రోత్సహించాడు... అదీ జరిగింది.  
...  ప్రభాకరుడు చెబుతున్న కథను అందరూ చెవులప్పగించి విన్నారు. కొద్దిసేపటి నిశ్శబ్దం తరువాత తిరిగి ప్రభాకరుడే ప్రశ్నించాడు.
‘‘స్వామీ! మీ అభిమతం ఏమిటో చెప్పండి. కర్మమార్గం అవశ్యం అనుసరణీయమే కదా!’’
దానికి శంకరుడిచ్చిన సమాధానమిది...
ప్రత్యక్‌ ప్రవణతామ్‌ బుద్ధేః కర్మా ణ్యుత్పాద్య శక్తితః
కృతార్థా న్యస్తమాయాంతి ప్రావృడంతే ఘనా ఇవ

స్వశక్తిని అనుసరించి చేసిన కర్మలు మానవుని బుద్ధికి ప్రత్యగాత్మయందు ఆసక్తిని కలిగిస్తాయి. కృతార్థములవుతాయి. వర్షకాలం చివర మేఘాల వలె కడకు మాయమై పోతాయి. ప్రత్యగాత్మపై ఆసక్తిని పెంచుకున్న మానవుడు తత్త్వమసి వంటి వాక్యములను గురువులచే ఉపదేశం పొందాలి. అటువంటి వారికి బ్రహ్మజిజ్ఞాస కలుగుతుంది. ఆత్మజ్ఞానం కరతలామలకం అవుతుంది. శంకరుడు ఈ ఉపదేశం పూర్తి చేసే సమయానికి వారు కూర్చున్న దిశగా ఒక బాలుడు నడిచి వస్తున్నాడు. పదమూడేళ్లలోపు వయస్సున్న ఆ బాలుడి చేతిలో ఉసిరికాయలున్నాయి.

‘‘ఇతడు నా కుమారుడు. పేరు పృథ్వీధరుడు. వట్టి జడుడు. పుట్టింది మొదలు మాటా పలుకూ లేనివాడు. మొదట మూగవాడేమో అనుకున్నాం. కాదు కానీ దేనికీ ఏ విధమైన స్పందనా లేనివాడు. తోటివారితో ఆటపాటలెరుగడు. కావలసింది అడిగి తినడం తెలియదు. మంచి దుస్తులు కట్టుకోడు. బొమ్మలాడుకోడు. ఉపనయనం చేస్తే అయినా బాగుపడతాడేమో అనుకున్నాను. జడభరతుడి విషయంలో తండ్రి చేసిన ప్రయత్నాల్లా నా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. సంతోషము, దుఃఖము వంటి మానవ సహజ స్పందనలేవీ లేని వట్టి నిస్పృహుడు. ప్రారబ్ధవశాన నా కడుపున పుట్టాడు. వీడిని మీరే ఉద్ధరించాలి స్వామీ!’’ అన్నాడు ప్రభాకరుడు.

చేతిలోని ఉసిరికాయలను తనకు సమర్పించి, నమస్కరించి నిలబడిన పృథ్వీధరుని వంక ఆదరంగా చూశాడు శంకరుడు.
‘‘ఏం బాబూ! నీ పేరేమిటి? నువ్వెవరు?’’ అని ప్రశ్నించాడు. కుడిచేతిని పైకెత్తి పృథ్వీధరుని శిరస్సుపై ఉంచాడు. అప్పటివరకూ మాటాపలుకూ ఎరగడని, ఎవరితోనూ పన్నెత్తి మాట్లాడడని పేరుపడ్డ పృథ్వీధరుడు అప్పుడు ఆ క్షణంలోనే తొలిసారిగా ఆచార్య శంకరుని ప్రశ్నకు స్పందించాడు.

నిమిత్తం మనశ్చక్షురాది ప్రవృత్తౌ నిరస్తాఖిలోపాధిరాకాశ కల్పః
రవిర్లోక చేష్టా నిమిత్తం యథా య స్స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా
మనస్సు, నేత్రాలు వంటి ఇంద్రియాలు చేసే చేష్టలన్నింటినీ... సూర్యునిలా సాక్షీభూతంగా నిమిత్త మాత్రంగా చూస్తూ ఉండేదే ఆత్మ. అఖిల ఉపాధులూ ఆ ఆత్మయే పొందుతోంది. అయినప్పటికీ దేనికీ చెందకుండా ఉండిపోతుంది. నిత్యసచ్చిత్‌ స్వరూపమైన ఆ ఆత్మనే నేను. 

ముట్టుకుంటే కాల్చివేయడం అగ్నికి సహజం. తన గురించి తెలుసుకునే వారికి నిరంతరాయంగా కొత్త విషయాలేవో బోధిస్తూనే ఉండడం ఆత్మకు లక్షణం. మనస్సు, కన్నుల వంటి జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునే సంగతుల కంటే ఆత్మబోధ ఎక్కువ విలువైనది. నిత్యజ్ఞానానంద మయమైనది.అద్దంలో చూసుకుంటే మన ముఖం మనకు కనిపిస్తుంది. అలాగే చిత్తంలోకి చూసుకునే జీవులందరికీ పరమాత్మ కనిపిస్తున్నాడు. ఆ కనిపిస్తున్న ప్రతిబింబం పరమాత్మదే. సంశయం లేదు. అద్దాన్ని పక్కన పెట్టినా, ప్రతిబింబం మాయమవుతుంది కానీ, ముఖమే లేకుండా పోదు కదా! అలాగే మానవుడు తన బుద్ధిబలం చేత పరమాత్మను తెలుసుకోలేక పోయినా ఆయన లేడనలేం. నిజానికి పరమాత్మ కంటే భిన్నమైనది కూడా ఏదీ లేదు. అద్దంలో చూస్తున్నప్పుడు ఆభాసగానో, పక్కన పెట్టినప్పుడు నిరాభాసగానో మూడుకాలాల్లోనూ ఉన్నది పరమాత్మ మాత్రమే.

పరమాత్మ రూపగుణ రహితం, విలక్షణం. ఇంద్రియాల చేత ఆయనను దర్శించడం సాధ్యం కాదు. ఒకే సూర్యుడు వేర్వేరు కుండల్లో అనేక సూర్యుళ్లలా కనిపించినట్లు ఒకే పరమాత్మ అనేక జీవుల రూపాల్లో వ్యక్తమవుతున్నాడు. జీవులందరిలోనూ ఉన్నది ఒకటే. సూర్యుడి వెలుగు ప్రసరించిన మేరకే మానవుని కన్ను చూడగలదు. బాహ్యపు వెలుగు చేరలేని తావుల్లో కూడా పరమాత్మ చైతన్యం ప్రసరించిన సమస్తాన్నీ దర్శించగలిగేది ఆత్మ మాత్రమే.చపలమైన బుద్ధి కలవారికి పరమాత్మ నానారూపిగా కనిపిస్తున్నాడు. బుద్ధి నిశ్చలమైన వాడికే ఈ ద్వైతభావన తొలగిపోతుంది. మబ్బులు కమ్మిన ఆకాశం సూర్యుణ్ణి కప్పేసినట్లు మూర్ఖుడి మనస్సు పరమాత్మ ప్రకాశాన్ని చూడనివ్వదు.

మణులను కట్టివుంచే సూత్రంలా ఈ సమస్తంలోనూ పరమాత్మ ఉండనే ఉన్నాడు. అయినప్పటికీ దేనినీ స్పృశించకుండా, నిస్సంగునిగా ఉంటాడు. నదిలో నీరు కదలాడుతుంటే చందమామ కదిలి పోతోందని భ్రమపడతాం. అలాగే సర్వవ్యాపక పరమాత్మ ఉనికిని కూడా చంచలించే బుద్ధితో తెలుసుకోలేం. విచారించి చూస్తే పరమాత్మ నిశ్చలం, పరిశుద్ధం, పరిపూర్ణం, నిర్వికారం, స్వయం ప్రకాశం, శివం ... నిత్యబోధా స్వరూపం. ఆ పరమాత్మయే నేను. 

ఒక్క అర్భకుడైన బాలుడు... అది కూడా వట్టి జడుడు అని అందరిచేతా ముద్ర వేయించుకున్న వాడు బ్రహ్మతత్త్వాన్ని కవిత్వధాటితో వివరించడం అక్కడున్న అందరిలోనూ ఆశ్చర్యాన్ని నింపింది. పృథ్వీధరుని శిరస్సు పైనుంచి తన చేతిని వెనక్కు తీసుకున్నాడు శంకరుడు. అంతటితో ఆ బాలుని వాగ్ధాటి కట్టుబడింది. లేచి నిలబడి దూరంగా వినయంగా నిల్చున్నాడు.
‘‘ప్రభాకరాచార్యా! నీ పుత్రునిలో వాయుదేవుని అంశ కనిపిస్తూ ఉన్నది. ఇతడికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. ఆ కారణం చేతనే పుట్టింది మొదలు ఇహలోక విషయాలతో సంగత్వం ఏర్పరుచుకోవడం ఇష్టంలేక నిర్వికల్ప సమాధిలోనే గడుపుతున్నాడు. మీ కంటికి స్పందనలే లేని వట్టి జడపదార్థంగా కనిపిస్తున్నాడు’’ అన్నాడు శంకరుడు.

‘‘మహాతపస్వులైన ఋషులు ఎంతో సాధన చేస్తే కానీ తెలియని స్వీయజన్మ రహస్యాలు ఈ బాలుడికి పుట్టుకతోనే తెలియడం వింత కదా! కొందరిలోనే ఇలా ఎందుకు జరుగుతుంది?’’ ప్రశ్నించాడు ప్రభాకరుడు.
‘‘జగత్తుకు కారణమైన నిరతిశయ సూక్ష్మపదార్థానికే సత్‌ అని పేరు. అదే ఆత్మ. జీవులందరూ అక్కడినుంచి వచ్చినవారే. ఈ ఎరుక కొందరిలోనే ఉంటుంది. అయినప్పటికీ ప్రతివారూ నిత్యమూ ఈ సత్తును చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజూ దానిలో లీనమవుతూ, దూరమవుతూనే ఉన్నారు. జీవుడు తన స్వరూపమునందు విలీనమయ్యేది గాఢనిద్ర తప్ప మరేమీ కాదని బ్రహ్మవేత్తల అభిప్రాయం. నిద్రిస్తున్న వ్యక్తి – స్వమ్‌ అపీతః భవతి – తనదైన స్వరూపమును పొందుతున్నాడు అని చెబుతారు. స్వస్వరూపంలో నిలిచివుండడం వల్లనే అతడిలోని అలసట తొలగిపోతోంది. హాయిగా నిద్రించిన వ్యక్తికి అలసట తొలగిపోవడం, రోగాలు కుదురుకోవడమే ఇందుకు తార్కాణం. ఇది దైనందిన చర్య. కాగా అంత్యదశలో దేహం శిధిలం అయినప్పుడు, అజ్ఞాని అయినవాడు మరో దేహాన్ని వెతుక్కుంటాడు. నిద్ర నుంచి మేల్కొన్నట్లే మళ్లీ జన్మిస్తాడు. అతడికి పూర్వస్మృతి ఉన్నందువల్లనే పుట్టిన వెంటనే ఆహారం కోసం ఏడుస్తున్నాడు. తల్లిపాలు అందగానే తాగుతున్నాడు. భయం వేస్తే ఆశ్రయం పొందాలని, అలసట వస్తే నిద్రపోవాలని ఏ జీవికీ ఒకరు చెప్పాల్సిన పనిలేదు. పుట్టుకతోనే అది తెలుసు’’ వివరించి చెప్పాడు శంకరుడు.

‘‘అయితే నిద్ర, మరణం ఒక్కలాంటివే అంటారా?’’ అడిగాడు ప్రభాకరుడు.
‘‘మీగడ చిలుకుతుంటే దానిలోని సూక్ష్మధాతువు వెన్నగా పైకి తేలుతుంది. నెయ్యిగా మారుతుంది. అలాగే మనం తినే అన్నంలోని సూక్ష్మధాతువు పైకి తేలి మనసుగా మారుతుంది. తాగుతున్న నీటిలోని సూక్ష్మధాతువు ప్రాణం అవుతుంది. మనం స్వీకరిస్తున్న తేజోద్రవ్యంలోని సూక్ష్మధాతువు వాక్కు అవుతోంది. ఆహారం తీసుకుంటేనే మనస్సు పనిచేస్తుంది. తీసుకున్న ఆహారంలోని సూక్ష్మతమ ధాతువు మనస్సులో శక్తి నింపుతోంది. ఆ మనశ్శక్తియే మనిషిలో పదహారు కళలుగా మారుతుందని వేదం చెబుతోంది. ఆహారంలోని సూక్ష్మధాతువులు మనస్సు, ప్రాణం, వాక్కు అనే అంతరింద్రియాలను వర్ధిల్ల చేస్తాయి. ఇదంతా జీవించి ఉన్నప్పటి సంగతి...’’ అని ఆగాడు శంకరుడు.

‘‘మరి మరణావస్థలో ఏం జరుగుతుంది?’’ అనుబంధ ప్రశ్న వచ్చింది.
‘‘మరణిస్తూ ఉన్న మనిషిలోని వాగింద్రియం మనస్సులోనికి ఉపసంహరింప బడుతుంది. అప్పుడు పలుకు ఉండదు. మనస్సు కేవలం సంకల్ప వికల్ప రూపమైన చలనంతో మాత్రమే నిలిచి ఉంటుంది. ఈ ఉపసంహారం రెండో దశలో మనస్సు కూడా నిద్రావస్థలో మాదిరిగానే ప్రాణంలో విలీనమవుతుంది. పక్కనే ఉన్నవారు ఇతడికి స్మృతి తప్పినది అంటారు. అప్పుడు బాహ్యేంద్రియాలను తనలో ఇముడ్చుకున్న ప్రాణం శ్వాసతో పాటు పైకి ఎగదన్నుతుంది. చేతులు కాళ్లవంటి అవయవాలు కొట్టుకుంటుండగా మర్మస్థానాలను పెరికివేస్తోందా అన్నట్లు ప్రాణం ఉపసంహరింపబడి తేజస్సులో కలిసిపోతుంది. దేహంలోని వెచ్చదనం మాయమై మరణాన్ని పరులకు తెలియ చెబుతుంది. ప్రాణధారణకు చిహ్నమైన తేజస్సు సత్‌ అనే పరదేవతలో విలీనమై చల్లారిపోతుంది. ఆత్మతత్త్వంలో సత్యమైన నిష్ఠలేని జీవుడు ఏ మూలం నుంచి మేలుకొని ఒక దేహంలో ప్రవేశించాడో, అలాగే మరో దేహంలోనూ ప్రవేశిస్తాడు. అంటే పునర్జన్మ ఎత్తుతాడు’’ చెప్పాడు శంకరుడు.

‘‘జన్మ వెంట జన్మ రాదు కదా. వ్యవధానం ఉంటుంది కదా!’’ ప్రభాకరుని తదుపరి ప్రశ్న. ‘‘జీవుణ్ణి అంటిపెట్టుకున్న విషయవాసనలే జన్మపరంపరలకు కారణమవుతాయి. ఒకసారి ఉత్పన్నమైన విషయవాసన ఫలాన్ని అందించకుండా వేయికోట్ల యుగాల తర్వాత కూడా నశించదు. జ్ఞాని అయినవాడు తప్ప ఈ మానస వాసనలను అతిక్రమించలేడు. జ్ఞానికైనా, అజ్ఞానికైనా వాక్కు, మనస్సు, తేజస్సులు వరుసగా సత్‌ అనే పరదేవతలో లీనమయ్యే క్రమం ఒక్కటే. వారు తిరిగిరారు... వీరు తిరిగి వస్తారు. యోగి అయినవాడు అభయాన్ని పొందాడు. సామాన్యుడింకా భయంతో కూడిన జన్మ పరంపరలనే పరుగులు తీస్తూనే ఉన్నాడు. అదీ తేడా!’’

‘‘కొందరు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని, ఆదిత్యమండలం ద్వారా సత్తును చేరుకుంటారని... వారు కోరుకున్న జన్మ పొందుతారని....’’
‘‘అది తప్పు. జ్ఞాని అయినవాడికి సర్వకామనలు ఇక్కడే విలీనమైపోతాయి. దేశ, కాల, కారణ కార్యాలు, కర్మఫలాలు వంటి మి«థ్యా విషయాల్లో జ్ఞాని అయినవాడు సత్యత్వ భావన పెంచుకోడు...’’ ఇంకా ఏదో చెప్పబోయాడు శంకరుడు. 

అంతలోనే  అప్పటివరకూ మౌనంగా ఉన్న çపృథ్వీధరుడు అందుకుని, ‘‘సత్యజ్ఞానానికి మి«థ్యాభినివేశం ఉండదు. సత్‌ సాక్షాత్కారం కాగానే సర్వకామనలూ అగ్నిలో వలే దగ్ధమైపోతాయి.  అటువంటి వారికి పునరావృత్తి ఉండదు అని ఆచార్య శంకరులే తమ ఛాందోగ్యోపనిషత్‌ భాష్యంలో చెప్పారు’’ అన్నాడు.శంకరుడు అతడి వంక ఆదరంగా చూశాడు. ప్రభాకరుని వైపు తిరిగి, ‘‘ఆచార్యా! గృహస్థులైన మీకు ఇటువంటి కుమారుని వల్ల ప్రయోజనం ఉండదు. మాలో ఒకనిగా ఇతడిని పంపించండి. తప్పక రాణిస్తాడు. సన్యాసి అయినవాడి వంశంలో వెనుకటి ఏడు తరాలు తరిస్తాయని పెద్దలమాట’’ అన్నాడు. 

ప్రభాకరుడు ఆ ప్రతిపాదనకు ఆనందంగా అంగీకరించాడు. తల్లిదండ్రుల అనుమతితో గంగాతీరంలో పృథ్వీధరునికి క్రమసన్యాసాన్ని అనుగ్రహించాడు శంకరుడు. తన వద్దకు చేతిలోని ఉసిరికాయలతో వచ్చి, ఆత్మతత్త్వాన్ని కరతలామలాకంగా వివరించిన çపృథ్వీధరునికి హస్తామలకాచార్యుడు అనే యోగనామాన్ని ఇచ్చాడు. ప్రణవదీక్ష తరువాత, ఛాందోగ్యోపనిషత్తు ప్రబోధించిన తత్త్వమసి మహావాక్యాన్ని బోధించాడు.
స య ఏషోణిమై తదాత్మ్య మిదం సర్వం తత్‌ సత్యం స ఆత్మా తత్త్వమసి...
– అణురూపమైన ఆత్మకే సత్‌ అని పేరు. దానివల్లనే జగత్తంతా ఆత్మతో కూడినది అయింది. జగత్తుకు అసలు రూపం ఆ ఆత్మే. ఆ సత్‌ రూపం నువ్వే అవుతున్నావు అని చెప్పాడు. 
తంతు ముగిసింది. ప్రభాకరుని వద్ద సెలవు తీసుకునే ముందు శంకరుడు అడిగాడు.
‘‘ఆచార్యా! తమ గురుదేవులైన భట్టపాదులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?’’ అని.
‘‘త్వరలో వారు ప్రయాగకు రావచ్చని తెలుస్తోంది స్వామీ! మీరు కోరుకుంటే అప్పటివరకూ...’’
‘‘ఇక్కడ ఉండడం సాధ్యం కాదు. గురువుల ఆదేశం మేరకు మేము సత్వరమే వారణాసికి చేరుకోవాలి. భట్టపాదులు వచ్చారని తెలిసిన వెంటనే వచ్చి వారి దర్శనం చేసుకుంటాం’’ అంటూ శంకరయతి

శిష్యసమేతంగా వారణాసికి ప్రయాణం కట్టాడు. 
ప్రయాణమంతా శిష్యులకు ‘తత్త్వమసి’ మహావాక్య విచారణతోనే సరిపోయింది.
‘‘సరే.... మనమంతా సత్‌ నుంచి వచ్చాం. మళ్లీ అందులోనే విలీనమైపోతున్నాం. ప్రతిరోజూ నిద్రా సమయంలో సత్తును కలుస్తూనే ఉన్నాం. కానీ దానినెందుకు తెలుసుకోలేకపోతున్నాం?’’  
‘‘తేనెటీగలు రకరకాల చెట్ల పువ్వుల నుంచి తేనె సేకరించి ఒకచోట పోగు చేస్తాయి. ఆ పోగులో ఏ రసభాగం ఏ చెట్టుదో చెప్పలేం. స్వయంగా ఆ రసాలు కూడా తెలుసుకోలేవు. అలాగే మనుషులు కూడా సత్పదార్థాన్ని చేరుకున్న తర్వాత తాము కూడా అదే అవుతారు. అందులో కలిసిపోయామని కూడా ఎరుగలేరు.’’

‘‘రసాంశాలన్నింటినీ తనలో కలిపేసుకునే సత్పదార్థం చాలా పెద్దది కదా... అయినా తెలుసుకోలేమా?’’
‘‘కాదు. అది చాలా సూక్ష్మమైనదని ముందే చెప్పుకున్నాం. సముద్రంలో కలిసిపోయిన మహానదుల్లా మనందరం అతి సూక్ష్మమైన సత్పదార్థంలో విలీనమైపోతాం. అక్కడినుంచే వచ్చామని, అక్కడే కలిసిపోయామని తెలుసుకోలేం.’’‘‘అయితే ఆ సత్తులో కలిసిపోవడానికి మరణం కోసం ఎదురుచూడడమే జన్మకు లక్ష్యమా?’’

‘‘కాదు... జీవమున్నంత కాలం జీవించడమే పరమార్థం. ఒక జీవవంతమైన చెట్టును మూలంలో కొట్టినా, మధ్యలో కొట్టినా, కొనకొమ్మ మీద కొట్టినా రసం కారుతుంది కానీ చచ్చిపోదు. ఏదో చీడపట్టి ఒక కొమ్మనుంచి జీవం పోతే ఆ కొమ్మ మాత్రమే ఎండిపోతుంది. జీవం ఉన్నదేదైనా చావదు. జీవశక్తి ఉన్నంతకాలం దేహం నిలిచి ఉంటుంది. శరీరం నిశ్చయంగా మరణిస్తుంది. కానీ జీవం ఎన్నటికీ చావదు. విత్తనంలో దాగివున్న మర్రిచెట్టులా జీవం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. సూక్ష్మమైన జీవమే సత్‌. అదే మనం. నీటిలో ఉప్పు కరిగిపోయిన తరువాత ఉప్పుకణికలను మనం చూడలేం. రుచిద్వారా తెలుసుకోగలం. ఇంద్రియాలకు కనిపించక పోయినా, ఉప్పులాంటి ఆ సత్పదార్థం కరిగి జగత్తంతా ఉంది. దాన్ని యోగంతోనూ, గురూపదేశంతోనూ మాత్రమే కనుక్కోగలం.’’
‘‘గురువు కూడా మనలాంటివాడే కదా! నిజంగా దారి చూపగలడా?’’

‘‘ఒకడికి కళ్లకు గంతలు కట్టి వేరే దేశానికి తీసుకువచ్చి ఒక అడవిలో వదిలేశామనుకో. తిరిగి తన దేశానికి వెళ్లే దారి తెలియక గోలపెడతాడు కదా! అలాగే పరమాత్మ ఇంటినుంచి మనమంతా మోహమనే గంతలు కట్టుకుని ఈ లోకంలోకి వచ్చిపడ్డాం. ఎవరో మహాత్ముడు మళ్లీ మనకు వెనక్కు వెళ్లే దారి చెప్పాలి. మధ్యమధ్యలో కనిపించిన వారిని కనుక్కుంటూ పట్టు విడవకుండా ప్రయాణించాలి. సత్పదార్థాన్ని ఎరిగిన మహాకారుణికుడైన గురువే కనుక లేకపోతే, మనం నడుస్తున్న దారిలోని సాంకేతిక దోషాలను ఎత్తి చూపకపోతే సత్‌ అనే అసలు చోటికి దారి తెలియనే తెలియదు. గురూపదేశంతో జ్ఞానదీపాన్ని వెలిగించుకున్న వాడు  మాత్రమే బ్రహ్మములో ప్రవేశించి అక్కడే ఉండిపోతాడు. అతడే మరోసారి కళ్లకు గంతలతో తన ప్రమేయం లేకుండానే ఎక్కడెక్కడికో తీసుకుపోబడడు.’’ 

యతిబృందం వారణాసిలో ప్రవేశించింది. ఆరోజు కలియుగాది 2,609 శ్రీకీలక నామ సంవత్సరంలోని (క్రీ.శ. 492) చైత్ర శుద్ధ అష్టమి. శంకరునికి పదహేడో ఏడు ప్రవేశించబోతోంది. శంకరుని అసలు ఆయుర్దాయం పదహారేళ్లే అని అగస్త్యుడు చెప్పిన గడువు అప్పటికి ఇరవై ఏడు రోజుల్లో ముగియబోతోంది. శంకరుడు అప్పుడు కాలభైరవ స్వామి సన్నిధిలో ఉన్నాడు.  – సశేషం 
- నేతి సూర్యనారాయణ శర్మ   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement